Tuesday, March 1, 2011

బుల్లితెరపై హృతిక్ హవా

బుల్లితెరపై అత్యధిక పారితోషకం పొందిన సినీ నటుడుగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నిలిచాడు. ఒక టివీ ఛానల్‌లో ప్రసారం కానున్న డ్యాన్స్ రియాల్టీ షోకు అతడు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు.

స్టార్ ప్లస్ టివీ ఛానల్ 'జస్ట్ డ్యాన్స్' రియాల్టీ షోను రూపొందిస్తున్నది. రియాల్టీ షో షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఆ రియాల్టీ షోలో పాల్గోనే పోటీదారుల నాట్య సామర్థ్యాన్ని అంచనావేసే బాధ్యతను బాలోవుడ్ నృత్యదర్శకులు ఫరాఖాన్, వైభవీ మర్చంట్‌లతో 37 సంవత్సరాల హృతిక్ పంచుకుంటాడు.

హృతిక్ ఈమధ్య కాలంలో నటించగా విడుదలైన 'కైట్స్', 'గుజారిష్' చిత్రాలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో బుల్లితెరపై విజయవంతమైన ఇన్నింగ్స్‌ను అతడు ప్రారంభించాడు.

"భారీ వైఫల్యాల తర్వాతనే భారీ విజయం వరిస్తుంది" అని గత మాసం డ్యాన్స్ రియాల్టీ షో ఆవిష్కరణ కార్యక్రమంలో హృతిక్ వ్యాఖ్యానించాడు. రియాల్టీ షోలో నటించే ప్రతి ఎపిసోడ్‌కు దాదాపు రూ. రెండు కోట్లను కార్యక్రమ నిర్వాహకులు ఆయనకు చెల్లిస్తారనే వార్తలపై హృతిక్ స్పందిస్తూ "నాకు తగిన పారితొషకం ఇస్తున్నారనే అనుకుంటున్నాను" అని అన్నాడు.

కానీ బుల్లితెరపై నటించే బాలీవుడ్ నటుల్లో అత్యధిక పారితోషకాన్ని హృతిక్ రోషన్ పొందుతున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. "ప్రతి ఎపిసోడ్‌కు ఆయనకు రూ. రెండు కోట్లు చెల్లిస్తారు. సల్మాన్ ఖాన్ ఒక టివీ షో కోసం కేవలం వారాంతాల్లోనే నటిస్తున్నాడు. ఒక్క రోజులో రెండు ఎపిసోడ్లలో నటించినందుకుగాను సల్మాన్‌కు రూ. 2.5 కోట్లు ముట్ట చెప్పారు" అని వర్గాలు తెలిపాయి.

Source: www.apweekly.com

ఎయిర్‌టెల్ డిజిటల్‌లో టీవీ5 న్యూస్


సాక్షి రెండవ వార్షికోత్సవం ప్రోమో వీడియో

మీడియాపై కసిగా వర్మ సినిమా?

ఓ తెలుగు  టీవీ చానెల్‌పై గుర్రుగా ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత రామ్‌గోపాల్ వర్మ మీడియాపై తన కసి తీర్చుకోనున్నట్లు సమాచారం. ఆ టీవీ చానెల్ తనను అవమానపరిచిందంటూ వర్మ గగ్గోలు పెడుతున్నారు. అందరినీ తన సినిమాలతో ఏకి పారేసే వర్మ ఓ టీవీ చానెల్ తనను ఏకేయడంతో బిత్తరపోయినట్లే కనిపిస్తున్నారు. బెజవాడ రౌడీలు సినిమా కూడా రూపు దిద్దుకుంటోంది. ఇది కల్పిత వాస్తవ కథ కాదట, పూర్తిగా కల్పిత గాథనే అని ఆయన అంటున్నారు. విజయవాడకు చెందిన పలువురు రాజకీయ నాయకులు బెజవాడ రౌడీలు టైటిల్‌ను వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన రక్త చరిత్ర లాగా కల్పిత వాస్తవ గాథ అని కాకుండా పూర్తిగా కల్పిత కథ అని ముందు నుంచే చెప్పుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే, ఆయన మీడియాపై తీయబోయే సినిమా కల్పిత కథనో, వాస్తవ కథనో తెలియదు. దీనికి సంబంధించి వర్మ ఆలోచన చేస్తున్నప్పటికీ చేస్తారో, లేదో కూడా తెలియదు.

Source: thatstelugu.oneindia.in

నో.. ముద్దు..

మికా సింగ్ ఎవరో తెలుసా? రాఖీ సావంత్‌ని పట్టపగలు పార్టీలో నిర్మొహమాటంగా ముద్దిడిన మగానుభావుడు. ఆ తర్వాత మికా సింగ్‌పై రాఖీ కేసు వేయటం.. అతగాడు కోర్టు మెట్లెక్కడం - కావల్సినంత పబ్లిసిటీ స్టంట్ జరగటం అన్నీ ముగిసింత్తర్వాత - మళ్లీ మికాసింగ్ తెర మీదికి రావటానికి కారణం - ఒక వీడియో ఆల్బమ్‌కి గాను కంగనా రనౌట్‌ని ‘ముద్దు’ కి ప్రపోజ్ చేశాట్ట. దాంతో మండిపడి అరిచి గోల చేసింది కంగనా. ఇదంతా నటనలో భాగమేనని అంటున్నప్పటికీ ఛస్తే ఒప్పుకోనని తెగేసి చెప్పిందిట. మరి ‘పబ్లిసిటీ’ అవసరం లేదనుకుందేమో?!

Source: www.andhrabhoomi.net

‘టెర్రస్’ ప్రేమ కథ

ప్రేమ కథలన్నీ - ఏ బస్టాప్‌ల్లోనో.. వీధి మలుపుల్లోనో.. కాలేజీ వరండాల్లోనో జరుగుతాయన్నది యుగాల నుంచీ వస్తున్న సంప్రదాయం. కానీ ‘టెర్రస్’ మీద కూడా ప్రేమ కథలు పుడతాయిట. రొమాన్స్‌కి ‘మేనర్స్’ లేనట్టే.. కథ ఎక్కడ మొదలైతే ఏమిటి? మా కథ టెర్రస్ మీద మొదలవుతుంది అంటున్నారు ‘ఛజ్జే ఛజ్జే కా ప్యార్’ నిర్వాహకులు. రొమాన్స్, కామెడీ, ట్రాజెడీ కలబోతగా నిర్మితమవబోతున్న ఈ ‘టెర్రస్’ కథకి గాను పాత ఢిల్లీలో అందమైన సెట్స్ వేశారు. రియాలిటీ షోలకు పెట్టింది పేరైన మేజర్ ఎండెమోల్ ఇండియా ఆధ్వర్యంలో మహేష్ పాండే ఈ కథని రాశాడు. ఇదేదో పెద్దింటి కథ కాదు. పేదింటి కథ. ఒక అమ్మాయికి - ఒక అబ్బాయికి ‘కామన్’గా వాడుకునే టెర్రస్ మీద పరిచయం. ఆ కథ టెర్రస్ మీద ఎనె్నన్ని మలుపులు తిరిగిందో? చూడాలంటే కొన్ని నెలలు ఆగాలి. షూటింగ్ నిర్విఘ్నంగా కొనసాగుతూ ప్రైమ్ టైమ్ కోసం నిరీక్షిస్తున్నట్టు భోగట్టా.

Source: www.andhrabhoomi.net

వీక్షకుల తీర్పు

‘తీర్థయాత్ర’
ఈటీవీ-2లో ప్రసారమవుతోన్న ‘తీర్థయాత్ర’ చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. కెమెరా అమ్మవారి ముఖం మాత్రం చూపించి, పాదాలనూ పీఠాన్నీ చూపించదు. అలాగే శివలింగం మీదున్న ధారా పాత్రనూ, లింగం మీది దళాలనూ చూపిస్తూ ఠక్కున భక్తురాళ్లని చూపిస్తుంది. లేదా సముద్రాన్ని చూపిస్తుంది. ఇలాగే ఎన్నెన్నో. సోమనాథాలయంలోని అమ్మవారి ముఖం పూర్తిగా చీకట్లో కలిసిపోయి ఉండటం మేం చూశాం. గతంలో ఉజ్జయిని ఆలయంలోకి కిందికి దిగి వెళ్లే మెట్లను కెమెరా పదేపదే చూపించింది. దిగి వెళ్తే కోనేరు వస్తుంది. కుడి పక్కన మహాకాళేశ్వర లింగమూ కనిపిస్తుంది. ఈ రెండూ చూపకుండా కెమెరా తిన్నగా లింగంపై భాగాన్ని మాత్రం చూపించింది. ఆ వెంటనే ఆలయ శిఖరాన్ని చూపించారు. ఇలా ప్రతి ఎపిసోడ్‌లనూ సగం సగం చూపటమే జరుగుతోంది. భక్తుల మనోభావాల పట్ల అంత నిర్లక్ష్యం కూడదు. స్క్రిప్ట్ విషయంలోనూ ఇలాగే. దర్శనీయమైన ప్రత్యేక అంశాలను అందించాలని రైటర్ తెలుసుకోవాలి. ఉదాహరణకు ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడికి జరిగే భస్మ హారతిని చూడటం జన్మ ఎత్తినందుకు ఒక సార్థకత. దాన్ని చూపాలి. ఇంకా మహాకాళేశ్వరుడికి జరిగే అలంకారాలు అద్భుతాలు వాటిని చూపాలి. తలపాగా మీసాల్తో ఉన్న ఒక మహారాజట! భిక్షువుట! కోపం ముఖంతో ఉన్న స్మరహరుడట!.. ఎన్ని రకాల అలంకారాలో! అక్కడ దొరికే ఫొటోలనైనా చూపించవచ్చు కదా. అలాగే సోమనాథాలయం పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఎంతో సాహసవంతంగా నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను వివరంగా చూపించలేదేమి? అసలాయన్ని గురించి చెప్పలేదేమి? అక్కడకు దగ్గర్లో వున్న కృష్ణుడి నిర్యాణం సమాధిని చూపించనక్కర్లేదా?

‘అగస్త్యుల వారు ఇక్కడికి వచ్చారని ఇక్కడి వారి నమ్మకం’ వంటి వాక్యాలు (అన్ని ఎపిసోడ్‌లలోనూ ఉంటున్నవి) రైటర్‌కున్న అవగాహనలోని అసంపూర్ణత్వాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఆ నమ్మకం ‘అక్కడి వారికేనా’? అందరు హిందువులకు లేదా? ఉండదా? ‘వచ్చారు’ అని చెప్పలేరా?


యాంకర్ వైదేహిగారు ‘శంఖరుడు’ ‘ఖాళీమాత’ వగైరా అపభ్రంశపు ఉచ్చారణలను మానాలి. మొత్తం మీద ‘తీర్థయాత్ర’ను గత కొన్నాళ్లుగా చూస్తున్న వాళ్లకు భక్త్భివం పెరగటం దేవుడెరుగు, ముందు విసుగు కలుగుతోంది.
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు,
ఏలూరు


సిఐడి
రాత్రి 10 గంటలకు మాటీవీ వారు కొన్ని నేరాలు - హత్యలు అవి చేసిన వారి నేరాలను ఏ ‘క్లూ’తో కనుగొనవచ్చునో చూపుతున్నారు. ఫలానా ఆవిడ గుడ్ ‌నైట్ చెబుతూ, లిప్‌స్టిక్ పూసిన పెదవులతో తను చంపిన వ్యక్తికి ముద్దు ఇస్తుంది. అందువల్ల ఆ ముద్దు గుర్తును బట్టి ఆ లిప్‌స్టిక్ ముద్దు గుర్తును క్లూగా తీసుకుని ఆవిడే హంతకురాలు అని తెలుస్తుంది. ఇలాంటి ‘క్లూస్’ ఈ సిఐడి కార్యక్రమాలు తెలుపుతున్నాయి. ఈ తెలివిని ఉపయోగించి క్లూస్‌ను దొరకనీయకండి అని నేరస్థులకు పాఠాలు చెబుతున్నట్టా?
-శ్రీమతి ఈషికాదేవి (మల్కాజ్‌గిరి)


పసుపు-కుంకుమ

జీ తెలుగు ‘పసుపు-కుంకుమ’ సీరియల్‌లో దిష్టి తీసే సీనొకటి చూపారు. వయసులో చిన్నవారు తమకంటె పెద్దవారికి దిష్టి తీయకూడదు. ఆ అమ్మాయి ఇంట్లో పెద్దవారికి విషయం చెప్పి వారితో దిష్టి తీయించినట్లు చూపించి ఉంటే బాగుండేది.
-ఆర్.ఘంటప్ప (తాడిపత్రి)


ఘోరాతి ఘోరం
11.2.2011 ఘంటసాల వర్థంతి సందర్భంగా జీ తెలుగు ఛానెల్‌లో ‘చిరంజీవులు’ పేరిట ఘంటసాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసి ఘంటసాల 46 చిత్రాల్లో పాడినట్లు 52 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినట్లు స్క్రోలింగ్ వేశారు. ఇది పరమ దారుణం. ఘంటసాల 650 చిత్రాలకు పైగా పాటలు పాడారు. వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. నిజానిజాలను తెలుసుకోకుండా వీక్షకులకు తప్పుడు సమాచారం ఇవ్వటం ఘోరం. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరక్కుండా చూసుకోవటం మంచిది.
-ఎస్.వి.రామారావు
హైదరాబాద్


నల చరిత్రయా? నాలా చరిత్రయా?
ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో (ముంబైలో కాబోలు) సాంస్కృతిక కార్యక్రమాలు చూపించారు. ఒక నృత్య కళాకారిణి ‘నల చరిత్ర’ (నల దమయంతి గాథ)లో భాగాలను నృత్యం చేసి చూపారు. కాని ఆ కార్యక్రమాన్ని పరిచయం చేసే యాంకర్ ‘ఫ్రం నాలా చరిత్ర’ అంది ఆంగ్లంలో. నాలాలకు నలులకు వ్యత్యాసం ఎంతో కదా. మరో తెలుగు యాంకర్ ‘శారీ’ (చీర) అనేందుకు బదులు ప్రతిసారి ‘సారీ’ అంటోంది. సారీకి శారీకి ఎంతో దూరం కదా.
-శ్రీమతి సుజాత నాగరాజారావు, కావలి


ఇవేం సీరియల్స్?
ఈ మధ్య హిందీ తెలుగు సీరియల్స్‌ని వివిధ ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి. ముగింపు లేని సీరియళ్లను అనవసరంగా పొడిగిస్తూ పోతూ ప్రేక్షకులు బోర్ చెందుతున్నారని గ్రహించి ఈ మధ్య ఏక్తాకపూర్ సీరియల్స్‌లోనూ, ఇతర సీరియల్స్‌లోనూ ప్రేమ దృశ్యాలు, కౌగిలింతలు, ముద్దు సీన్లు చిత్రీకరిస్తున్నారు. ‘సంగిని’ ‘దిల్ సే దియా వచన్’ లాంటి సీరియల్స్‌లో లవ్ సీన్లు మితిమీరిపోతున్నాయి. సినిమాల కంటే సీరియల్స్‌లో కూడా లవ్ దృశ్యాలు, కౌగిలింతలు, ఒకరిపై ఒకరు పడుతూ చూపిస్తున్న దృశ్యాలు ఇంట్లో కూర్చుని కుటుంబంతో కలిసి చూట్టానికి ఇబ్బంది పడుతున్నారు. టీవీ సీరియల్స్‌కు కూడా సెన్సార్ అవసరం.
-మహ్మద్ యూసుఫ్, కాజీపేట
 

చంద్రముఖి
ద్వేషాలు, మోసాలు, రోషాలు చూపించి/ బీభత్సములతోడ భీతి గొలుపు/ ఒకరితో ప్రేమ వేరొకరితో పెళ్లికి/ సిగ్గు విడిచి తాము సిద్ధపడుచు/ కిడ్నాపు డ్రామాలు కీలక దృశ్యాలు/ హింసించు టెంతయు హేయవౌను/ మనసులో ఒక రీతి మసలు పద్ధతి వేరు/ దొంగ నాటకమాడు దుష్టులగుచు/ పెక్కు ఎపిసోడ్లు పొడిగించి పెంచుచుండ/ చంద్రముఖి సీరియల్ గాంచి చకితులగుచు/ జిడ్డు సీరియలిదనుచు ఛీత్కరింప/ ఎపుడు ముగియింప జూతురో ఎరుక గాదు.
-కరణం రాజేశ్వరరావు, హిందూపురం
 

క్రికెట్ పండుగ
వచ్చేసింది.. వచ్చేసింది క్రికెట్ పండుగ. ఆనందమే ఆనందం. ఇక సీరియళ్ల బెడద ఉండదు. ఇడియట్ బాక్స్ నుంచీ అసందర్భపు సీన్లు, డైలాగులు, నిర్వాకాలు, జనాల్ని ఇబ్బంది పెట్టే వెర్రిమొర్రి వేషాలు, దరిద్రపు సీరియల్స్‌కు ఇక చెక్ పెట్టేయ్యొచ్చు.
-కొంగర ఉమామహేశ్వరరావు, తెనాలి


పునర్జన్మ
మాటీవీలో ప్రసారమవుతున్న ‘గత జన్మ రహస్యం’లో - ఒకామె ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి తాను లంబాడీల ఇంట్లో పుట్టి బాధలనుభవించి ఓ కొడుక్కి తల్లయి ఆఖరికి చనిపోయినట్టు.. ఆ కొడుకే మరుజన్మలో భర్త అయినట్లు చెప్పారు. ఆమె జీవిత చరిత్ర తెలుసుకోగలిగాం. కాని ఆ కొడుకే భర్త (ఈ జన్మలో) అయినట్టు తెలుసుకునేందుకు దాఖలాలేవీ? ఈ కార్యక్రమంలో ఇటువంటి సందేహ నివృత్తి చేస్తే ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది.
-శివాని, శృంగవరపుకోట


చిన్నారి పెళ్లికూతురు
మా టీవీలో రాత్రి 7 గంటలకు ప్రసారమవుతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’ అద్భుతంగా ఉంది. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను చూపుతూ రాజస్థానీ నేపథ్యంలో నిర్మించిన ఈ సీరియల్ చూసి మన సీరియల్ నిర్మాతలు, దర్శకులు నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది.
-శుభ, కాకినాడ


Source: www.andhrabhoomi.net

ఎల్లలెరుగని నృత్యం

ఇది వరకైతే సినిమా వాళ్ళు టీవీల్లోకి వస్తే ‘అక్కడ కనుమరుగవుతుంటే ఇక్కడ ప్రత్యక్షమవుతున్నార’నే అపవాదొకటి ఆర్టిస్టులకొచ్చేవి. కానీ నేడు పరిస్థితి మారింది. సినిమాతో సమాంతరంగా చిన్న తెర రాజ్యమేలుతోంది. కొన్నికొన్ని సందర్భాలలో నటీనటుల సుదీర్ఘ చలనచిత్ర కాలంలో రానంత పేరు టీవీల్లో వారు పాల్గొనే ఒకటో, రెండో షోలకు వచ్చేస్తోంది. అందుకెన్నో ఉదాహరణలు. ఇప్పుడా మాదిరి ప్రయత్నాన్ని నటుడు హృతిక్ రోషన్ స్టార్ టీవీలో రానున్న ‘జస్ట్ డాన్స్’ నృత్య కార్యక్రమం ద్వారా చేయనున్నారు. ‘జస్ట్ డాన్స్’ కార్యక్రమానికి న్యాయనిర్ణేతల్లో ఒకరుగా హృతిక్ వ్యవహరిస్తున్నారు. ఈ కొత్త అవతారపు అనుభవాలు ఆయన మాటల్లోనే..

ఎందుకొప్పుకున్నానంటే..

ఒక ఆర్టిస్టుగా నిరంతరం నవ్యత కోసం అన్వేషిస్తూ వుంటా. ఆ అన్వేషణలో భాగంగానే స్టార్ చానల్ వారు ‘జస్ట్ డాన్స్’ కాన్సెప్ట్‌ని నా ముందుంచి నన్ను కూడా సహకరించమన్నప్పుడు ఇంకో ఆలోచన లేకుండా యస్ చెప్పేశా.

నేనేం పెద్ద గొప్ప డాన్సర్‌ని కాను
చాలామంది అంటున్నారు. నాకు డాన్స్‌పట్ల ఉన్న ఇష్టం వల్లే ఈ షో ఒప్పుకున్నానని. కానీ నా దృష్టిలో నేనేం పెద్ద నెంబర్ వన్ డాన్సర్నేం కాదు. నిజానికి నా కన్నా అనేక మంది ఉత్తమోత్తమ డాన్సర్లు ఉన్నారు. నన్నడిగితే పాత తరం నటుడు షమీకపూర్ బెస్ట్ డాన్సర్. ఇప్పుడు తరచు మనం అనుకునే ‘గాడ్ ఆఫ్ డాన్స్’ పదానికి సరిపోతారు. ఆయన నృత్యం చేస్తే హృదయం నుంచి ఆవిష్కరించుకుని నృత్యం చేసినట్లు ఉంటుంది. ఇంక ఈ కార్యక్రమం విషయానికొస్తే బెస్ట్ డాన్సర్‌ని గుర్తించే ప్రక్రియలో ఇదో భాగం. ఒక్కమాటలో చెప్పాలంటే నృత్యానికి ఎల్లలు లేవు. ఎంత నేర్చుకున్నా, చేసినా ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది.

అందరూ స్ఫూర్తిదాయకులే!

నాకీ ప్రోగ్రాం చేయడానికి అంటే.. న్యాయనిర్ణేతగా, సంధానకర్తగా.. ఉండడానికి ప్రత్యేకించి ఫలానా వారు స్ఫూర్తి అని వర్గీకరించలేను కానీ, చాలా షోలు చూసిన నేపథ్యంలో అందరూ నాకు మార్గదర్శకులే అని మాత్రం చెప్పగలను. ఎక్కువగా నేను అమితాబ్ షోలు టీవీలో చూశాను. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం మరొకటుంది. నాకెక్కువ ఇష్టమైన డాన్స్‌లో నాకు గురువుల తగ్గ ఫర్హాఖాన్, వైభవీ మర్చెంట్‌తో పాటు నేనూ జడ్జ్‌గా ఈ షోకు వ్యవహరిస్తున్నాను.

వైఫల్యం వెనుకే విజయం

ఇటీవల నేను నటించిన రెండు చిత్రాలూ అంతగా విజయం పొందలేదు. అంత మాత్రాన దిగులు లేదు. ఎప్పుడూ చీకటి వెంట వెలుగున్నట్లే, ఫెయిల్యూర్‌ల వెన్నంటే సక్సెస్ కాచుకుని ఉంటుందని నేను నమ్ముతాను. ఆ తీరులోనే వాటి వెనుక వచ్చే ‘జస్ట్ డాన్స్’ తప్పక అందరి ఆదరణా పొందుతుంది’ అంటాడు హృతిక్.

Source: www.andhrabhoomi.net

ఎక్కడికెళ్తున్నాం మనం?

టీవీ అనేది ఏదో రోజంతా చేసిన శ్రమకు లేదా చికాకు, అన్య మనస్కత పోయి తిరిగి రీఛార్జ్ చేసుకోడానికి అనే రోజులు రాన్రాను పోతున్నాయనిపిస్తోంది. అలా అనడానికి బలమైన ఉదాహరణ ఎంటీవీలో ప్రతి శని, ఆదివారాలు రాత్రి 7 గంటలకు వస్తున్న ‘రోడీస్’ కార్యక్రమం అని చెప్పడానికి బాధగా ఉన్నా అనివార్యమే అనిపిస్తోంది. ఏ కార్యక్రమం చూసినా ఓ రకమైన ఆహ్లాదం, ఉత్సాహం వచ్చి కొత్త ఆలోచనలకు ఉపకరించాలి తప్ప ఇలా భావోద్వేగాలనో, భాషతో ఏ రకంగా మరొకరిని కించపరచవచ్చో అన్నది తెలియని వారికి సైతం లేని ఆలోచనలు వచ్చేలా చేసే ఈ ధోరణి వల్ల ఒక్కసారిగా సదాలోచనా పరులందరికీ ‘ఎక్కడికెళ్తున్నాం మనం’ అన్న భావన తప్పక కలుగుతుంది.

ప్రశ్నల ధోరణి ఇలాగా?
ఇప్పటి వరకూ ఏడు సీజన్ల కార్యక్రమం పూర్తి చేసుకున్న ‘రోడీస్’ ఎనిమిదవ సీజన్ ప్రోగ్రామ్స్ ఇటీవల ఆరంభమయ్యాయి. బెంగుళూరులో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అర్హత సంపాదించే వ్యక్తుల ఎంపిక పోటీలు గత శనివారం, ఆదివారాలలో ప్రసారం చేశారు. ఇందులో అభ్యర్థులుగా అర్హత పొందగోరే వారిని అడిగే ప్రశ్నల విషయంలో ఏమి ఆశించి వాటిని అడిగారో అన్నది కాస్త ప్రశ్నార్థకంగా మారింది. ‘వివాహానికి పూర్వమే శారీరక సంబంధం అన్న దానిపై నీ అభిప్రాయం’ అన్న ప్రశ్నను సంధించారు. వారు దానికి ఎలా స్పందించారో అన్నది పక్కన పెడితే ఈ ప్రశ్న ఔచిత్యం లేదా ఏ స్థాయికిది సంకేతమో తెలియాలి. ఇందులో పాల్గొంటున్న వారంతా దాదాపు యవ్వన దశలో ఉన్నవారు కనుక అలా అడిగారా? లేదా ఈ తరం ఆలోచించేది ఇదేనని కార్యక్రమ నిర్వాహకులు డిసైడై పోయారా? అన్నది ఆలోచించాలి. ఈ ప్రశ్నకు సమాధానంగా ‘ఇద్దరికీ ఇష్టమైతే ఓకే.. అని ఒకరంటే, ఏది సక్రమం కాదో దానిలో మజా అనుభవిస్తాడు మనిషి అని మరొకరు సమాధానమిస్తారు. ఈ సమాధానాలకు ప్రమాణాలు దిగజారిపోతున్న పరిసరాలు అనుకోవాలి. అసలింతకంటే మంచి ప్రశ్నలు తట్టలేదా అన్న ఆవేదనా చూపరులకు కలిగింది.

రెచ్చగొట్టడమే లక్ష్యమా?..
 
ఇక ప్రశ్నల సంగతి అలా ఉంటే, ప్రశ్నల అడిగే వారి ధోరణీ కాస్త తేడాగానే ఉంది. అంతగా సంబంధిత అంశంలో అడిగిన దానికి అవగాహనా లోపమో, మరే కారణం వల్లో కొద్దిగా ఉద్రేకానికి లోనయినా, దాన్ని తగ్గించేలా చేయాల్సిన అవసరం నిర్వాహక పీఠంపై కూర్చున్న ప్రశ్నలడిగే పానెల్ సభ్యులపై ఉంది. ఈ కనీస ధర్మాన్ని సైతం విస్మరించి వారూ పెద్దగా అరవడం, అనవసర పదజాలం (ఇది మనకు వినిపించదనుకోండి!) ఉపయోగించడం వంటివి చూసి విస్తుపోవడం మన వంతైంది. అయితే ఇదంతా ప్రోగ్రామ్ డిజైనింగ్‌లో భాగం, దాని అంతరార్థం వేరు అని చెప్పే ప్రయత్నం తర్వాత చేసినా దీని దుష్ప్రభావం పోదు. ఇదెలా ఉందంటే సినిమాలో మొత్తం ఏవైతే చూపకూడదో అవి చూపించి చిత్రాంతాన ఇది తప్పు అని ఏకవాక్య సంభాషణతో శుభం కార్డు వేసినట్లుంది.

దీన్ని అతిశయోక్తి అనచ్చా?
ఇందులో పాల్గొనే క్యాండిడేట్స్ దీనిపై చూపే స్పందన, అనుభవాలూ పరిశీలిద్దాం. ఒక అభ్యర్థైతే నేను ఇంతవరకూ ఇందులో ఆరుసార్లు పాల్గొన్నా. ఇది ఏడోసారి అంటూ నా జీవిత లక్ష్యం అన్న టైప్‌లో మాట్లాడాడు. అలాగే తక్కినవారు. నేనిందులో పాల్గోడానికి ఎంతైనా కష్టపడతా. ఇష్టపడతా అన్న తరహాలో ఈ వాక్పటిమ సాగిపోయింది. అయితే అలా నా జీవితేచ్ఛ అని చెప్పిన వ్యక్తి రోడీస్‌లో ఎంపికయ్యారు. ఎంపిక చేస్తూ వ్యాఖ్యాత్రి చెప్పిన వ్యాఖ్యానం (నిన్నింక ఆడిషన్ చేసే అదృష్టం మాకు లేదు - అంటే ప్రస్తుత సీజన్‌లో ఆ వ్యక్తి సెలెక్ట్ అయినట్లు..) బాగుంది.

సూత్రాలు ఏవైనా..
మనిషిలో తెగింపు నేర్పడానికీ, భయాన్ని పారద్రోలడానికీ, జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోడానికీ ఈ మాదిరి షోలు ప్రేరకాలు అవుతాయని ఎంతగా సూత్రీకరించినా, అందుకు అనువైన ఆహ్లాదమైన, అపాయకర ధోరణిలోకి తీసుకువెళ్లని పంథాలో ‘రోడీస్’ని డిజైన్ చేస్తే బాగుంటుంది. లేకుంటే ఈ కార్యక్రమానికి ఉపనామంగా (షార్ట్ కట్ టు హెల్) పెట్టినది పదేపదే గుర్తుకొచ్చేలా ఉంది.

Source: www.andhrabhoomi.net

క్రికెట్ ఫీవర్

క్రికెట్ మాటేమోగానీ - కొన్నాళ్ల క్రితం ‘మందిర’ తన ‘స్ట్రాప్’ అందాలతో జనాన్ని ఉర్రూతలూగించి ‘సెంచరీ’ చేసేసి ఆనక బోలెడన్ని ప్రశంసలూ కొట్టేసింది. వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఛానెళ్లూ క్రికెట్ అనుభవజ్ఞుల చేత చర్చాగోష్ఠులు నిర్వహించటం షరా మామూలే. ఫలానా ‘సచ్చినోడు’ సెంచరీ కొట్టేస్తాడా? పిచ్ బాగుంటే ఎన్ని బౌన్సర్లు పడతాయి? లేకుంటే ఎన్ని సిక్సర్లు పేల్తాయి? లాంటి చచ్చు ప్రశ్నలతో జనాన్ని ఠీవీకి కట్టి పడేయటం తెలిసిందే. ఐతే - ఆ పంథాని ఎంచక్కా మార్చేసి దేనికైనా ‘కమర్షియల్’ కిక్ లేందే జనానికి నచ్చదన్న సిద్ధాంతాన్ని వొంటబట్టించుకున్న ఇండియా టీవీ సరికొత్త తరహాలో ‘క్రికెట్’ చర్చాగోష్ఠినీ, వరల్డ్ కప్ వండర్లనూ తెర కెక్కించేందుకు ఐటెం గర్ల్ అలియాస్ హాట్‌హాట్ గర్ల్ రాఖీ సావంత్‌నీ, ‘బిగ్ బాస్’తో బోలెడంత క్రేజ్‌ని దక్కించుకున్న పాకిస్తానీ నటి వీణా మాలిక్‌లను ఆహ్వానించింది.

అంతేకాదు - ఆసక్తికరమైన బహుమతులూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో 12 మంది అభ్యర్థులు రెండు గ్రూపులుగా విడిపోతారు. తమ తమ అభిమాన క్రీడాకారులు ఎన్ని పరుగులు తీస్తారు? ఎన్ని క్యాచ్‌లు పడతారు? క్యాచ్‌లు మిస్ చేస్తారు? ఇత్యాది పలు అంశాలపై ‘బెట్’ కట్టవచ్చు. దీంట్లో మాగ్జిమమ్ పాయింట్స్‌ని స్కోర్ చేస్తే ‘హోండా కారు’ గెలుచుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో రాఖీ సావంత్, వీణా మాలిక్‌లే కాదు - యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్, గాయకులు శంకర్ షెహనాయ్, అశోక్ మస్తీ, బ్యూటీషియన్లు సిల్వియా, ఆర్.జె.సిమ్రాన్.. కూడా కనిపిస్తారు.

Source: www.andhrabhoomi.net