Tuesday, January 4, 2011

రియాలిటీ షోలలో ‘స్టార్ పవర్’

గత సంవత్సరం ఛానెళ్లలో ‘రియల్’ విజేతలెవరంటే - రియాలిటీ షోలతో రాజ్యానే్నలుతున్న బాలీవుడ్ స్టార్లేనని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఎవరు ఎనె్నన్నిసార్లు ఎన్ని ఛానెళ్లు మారినా - వారివారి ‘హవా’ని బట్టి క్రేజ్‌నిబట్టి ముందుకు దూసుకెళుతూనే ఉన్నారు. అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్.. ఒక్కొక్కరు ఒక్కో ఛానెల్‌లో ప్రభంజనం సృష్టించినవారే. ప్రియాంక చోప్రా కూడా అదే బాటన నడిచి 2010ని తన సొంతం చేసుకుంది. సినీ పరిశ్రమ క్రేజ్‌ని కాదని ఇలా ఛానెళ్ల వెంట పడటానికి కారణం ఏమిటని శోధిస్తే వచ్చే సమాధానం ఛానెళ్లలోనూ అత్యధిక పారితోషికాలు ముట్టడమే. మరీ తక్కువ అంటే ఒక్కో ఎపిసోడ్‌కి 80 లక్షలు మొదలుకొని 1.5 కోటి వరకూ గిట్టుబాటవుతోంది. ఇక సెకండ్ గ్రేడ్ సెలబ్రిటీలకు 25 -50 లక్షలు. ప్రియాంక చోప్రా ఒక్కో ఎపిసోడ్‌కి 40-50 లక్షలు డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే - ఛానెళ్లు ‘స్టార్ పవర్’ మీద ఆధారపడటమే.

Source: www.andhrabhoomi.net

600 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ‘అభిషేకం’

సౌభాగ్య మీడియా పతాకంపై దాసరి నారాయణరావు నిర్మిస్తున్న ‘అభిషేకం’ (ఈటీవీ) డైలీ సీరియల్ ఇటీవల 600 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ - టీవీ అంటే చాలా మందికి చిన్నచూపు ఉంది. సినిమాలు రాకపోతే టీవీ సీరియల్స్‌లోకి వెళ్లాలని నటీనటులు అనుకుంటారు. ఆ అభిప్రాయం తప్పు. ప్రపంచ వినోద చరిత్రలో ఉన్నత స్థానం టీవీదే. టీవీలో కనిపించే ఆర్టిస్టులను జనం ఎక్కువగా గుర్తు పడతారు. తెలుగు వారిలో చిన్నతెరకు ముందుగా వచ్చింది నేనే. 1988లో ‘విశ్వామిత్ర’ సీరియల్ చేశాను. మొట్టమొదటిసారిగా బీటాకామ్ వాడాం. తర్వాతి కాలంలో నేను బిజీగా ఉండటంతో చేయలేక పోయాను. నా సతీమణి పద్మకు సీరియల్స్ అంటే చాలా ఇష్టం. సీరియల్ అనేది చిన్న విషయం కాదు. ప్రారంభించటం మన చేతుల్లో ఉంటుంది. ముగింపు మన చేతుల్లో ఉండదు. ఈ సీరియల్ ప్రారంభమై మూడు సంవత్సరాలయింది. డబ్బుల కోసం కాకుండా మంచి సీరియల్ తీయాలన్న ఉద్దేశంతో ఈ సీరియల్‌ని చేయటం జరిగింది. ఇదే కాకుండా ‘తూర్పు - పడమర’ ‘శివరంజని’ సీరియల్స్ నిర్మిస్తున్నాను. వీటివల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. ఈ సీరియల్‌కు ‘ప్రేమాభిషేకం’ సిల్వర్ జూబ్లీ చేసినట్టు 1000 ఎపిసోడ్లు పూర్తయిన తర్వాత పెద్దఎత్తున ఫంక్షన్ చేస్తాను. నా శిష్యుడు కొమ్మనాపల్లి గణపతిరావు ప్రతిభావంతుడు. ఈ సీరియల్ విజయం దీనికి పనిచేస్తున్న యూనిట్‌దేనంటూ వివరించారు.

Source: www.andhrabhoomi.net

వివాహ వ్యవస్థకి అద్దం పట్టే ‘రాధాకళ్యాణం’

భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో మహోన్నతమైనది. సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే వివాహ వ్యవస్థ ఎంతో ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. అగ్నిసాక్షిగా వేసే మూడు మూళ్లు.. ఏడడుగులే నూరేళ్ల జీవితాన్ని పండిస్తాయన్న బలమైన నమ్మకమే మన వివాహ వ్యవస్థకు ఉన్నతమైన ఉదాహరణ. అలాంటి వివాహ వ్యవస్థకి పసుపు తాడుతో పరిచయమైన ఓ పడుచు పిల్లే రాధ. వివాహం ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందనే ఆసక్తికరమైన కథాంశంతో అశేష ప్రేక్షకులకు అరుదైన కానుకగా జీ తెలుగు అందిస్తున్న ‘రాధా కళ్యాణం’ జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైంది.ఈ ధారావాహిక సోమవారం నుంచి శుక్రవారం వరకు రా.8.30 గంటలకు ప్రసారమవుతుంది. రాధ.. ఓ పేదింటి అమ్మాయి. అందం, అమాయకత్వమే ఆమెకు అలంకారాలు. అందరి అమ్మాయిల్లాగే ఆమె కూడా కన్నవాళ్ల కష్టాలు తీర్చాలనుకుంటుంది. వాళ్ల కన్నీళ్లు తుడవాలనుకుంటుంది. బాగా చదువుకుని వాళ్లకు అన్నీ తానై అండగా నిలవాలని కోరుకుంటుంది. అయితే రాధ ఆశలను, ఆశయాలను ఏ మాత్రం పట్టించుకోని తల్లిదండ్రులు.. ఆమెకి సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసి సాగనంపాలని నిర్ణయించుకుంటారు.అలాంటి పరిస్థితుల్లో రాధ ఏం చేస్తుంది? ఆమె కలలు ఫలిస్తాయా? ఆమె ఆశయం నెరవేరుతుందా?ఆమె పెళ్లికి తల్లిదండ్రులు అంతగా కంగారు పడటానికి గల కారణాలేంటి? వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలా శాసిస్తుంది? ఇలా ఎన్నో అనూహ్యమైన మలుపులతో ఆశ్చర్యచకితులను చేసే సన్నివేశాలతో ఆద్యంతం హృద్యంగా సాగిపోయే అపురూప ధారావాహిక ‘రాధా కళ్యాణం’.

Source: www.andhrabhoomi.net

Monday, January 3, 2011

సినిమా ఆఫ్ ది సెంచరీ??

 

Source: telugu.greatandhra.com

బుల్లితెర బుల్లి బులపాటం

బాలీవుడ్‌ హీరోయిన్‌గా ఎక్కువమందికి తెలియకపోయినా బుల్లితెర ప్రేక్షకులు మాత్రం ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు ఆమే శ్వేతసాల్వే. ముంబాయి సోఫియా కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన శ్వేత మోడలింగ్‌లో అడుగుపెట్టిపెట్టగానే ఆమెకు ముందుగా టీవీ సీరియల్స్‌లో నటించాల్సిందిగా ఆఫర్లు వెల్లువెత్తాయి. 1998లో జీ టీవీలో ప్రసారమైన హిప్‌హిప్‌ హుర్రే సీరియల్‌తో తన కెరీర్‌గ్రాఫ్‌ను ఆరంభించింది శ్వేత. ఆ తర్వాత స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘కాహిన్‌ కిసీ రోజ్‌’లో నటించింది. 2002లో మళ్లీ జీ టీవీలో ప్రసారమైన ‘లిప్‌స్టిక్‌’తో మంచి పేరు తెచ్చుకుంది. 2009లో వచ్చిన ‘కత్రోంకీ కిలాడీ’ రియాలిటీ షోలో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. 1999లో ‘ప్యార్‌మీన్‌ కభీకభీ’ అనే చిత్రంలో నటించింది. ఇటీవల కొన్ని ఆంగ్ల మేగజైన్లకు బికినీలతో ఫోజులిచ్చిన ఈ భామ ఏకంగా గోవా బీచ్‌ సమీపాన ఓ మంచి బిజినెస్‌ స్టాల్‌ను ఓపెన్‌ చేసింది. అక్కడ బీచ్‌లో జలకాలాడేందుకు వచ్చే జంటలలో అమ్మాయిలకు బికినీలు, స్విమ్‌సూట్లు, కళ్లజోళ్లు వగైరాలన్నీ దగ్గరుండి మరీ అమ్మిస్తోందట. ఇంకేముంది ఇక ఆమె అమ్మే బికినీల కోసం మగరాయుళ్లు క్యూకడుతున్నారట.

Source: www.suryaa.com

త్యాగరాయగాణ సభలో ఆరాధణ అవార్స్‌

ఆరాధణ టీవీ న్యూస్ రీడర్స్‌ అవార్డ్‌ ప్రదానోత్సవం త్యాగరాయగాణ సభలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చేనేత, జౌలీశాఖ మంత్రి శంకర్‌రావు ముఖ్య అథిదిగా హాజరయ్యారు. అన్నీ న్యూస్ చానల్స్‌కు చెందిన సీనియర్ న్యూస్‌రీడర్స్‌కి అవార్డులు అందించారు. టీవీఫైవ్‌ తరుపున విజితకు న్యూస్‌ రీడర్ అవార్డ్‌, కళ్యాణికి సీనియర్ విశిష్ట స్వర్ణపతక పురస్కారం దక్కింది. అవార్డ్‌ దక్కటంపట్ల న్యూస్ రీడర్లు ఆనందం వ్యక్తం చేశారు.

 

Source: www.tv5news.in

కర్నూల్లో మరోసారి "కేబుల్' వార్

కర్నూలు(ఇఎన్‌ఎస్): టిడిపి నేత కె.ఇ.కృష్ణమూర్తి, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రి టి.జి.వెంకటేష్ నడుమ తీవ్రమైన కేబుల్ వార్ మరోసారి మొదలైంది. ఒక దశాబ్దం క్రితం కె.ఇ.కృష్ణమూర్తి, వెంకటేష్ ఇద్దరు టిడిపి ఉన్న సమయంలో  కేబుల్ వార్ మొదలైంది. చివరకు కే ఈ కుటుంబం దాన్ని వెంకటేష్‌కు వదులుకోవటంతో సమరం ముగిసింది. ఒకవైపు స్థానిక సంస్థలకు ముంచుకోస్తుండగా, మరోవైపు మధ్యంతర ఎన్నికలు వస్తాయనే భయం పెనుభూతం కావటంతో స్వంతంగా ఎలాంటి కేబుల్ నెట్‌వర్క్‌ లేని కె.ఇ.కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఒక నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తున్నారు. జనవరి ఒకటవ తేదిన ఒక కేబుల్ కంట్రోల్ రూమ్‌ను ఇక్కడ లాంఛనంగా ప్రారంభించారు.

రెండు దశాబ్దాల క్రితం కేబుల్ టీవీ నెట్‌వర్క్‌ కనెక్షన్లలో కె.ఇ.కృష్ణమూర్తి ఇష్టారాజ్యం సాగేది. కె.ఇ. కుటుంబానికి చెందిన మహాలక్ష్మీ కమ్యూనికేషన్స్ 2002 సంవత్సరం దాకా 10 ఏళ్ళపాటు ఆ వ్యాపారాన్ని ఏక చత్రాధిపత్యంగా ఏలింది. కేఈ నుంచి విడిపోయిన వెంకటేష్ స్వంతంగా ఒక నెట్‌వర్క్‌ ప్రారంభించారు. ఒక కేబుల్ కనెక్షన్‌కు నెలకు రూ.100గా ఉన్న కాలంలో రూ.10కి కనెక్షన్ ఇవ్వటం ద్వారా 2003 సంవత్సరంలో వెంకటేష్ కె.ఇ.కృష్ణమూర్తి వ్యాపారాన్ని చావుదెబ్బ తీసారు. అంత తక్కువ ధరకే కనెక్షన్ వస్తుండటంతో ప్రజలు  అతిస్వల్ప కాలంలోనే టి.జి.వెంకటేష్ నెట్‌వర్క్‌కు మారిపోయారు. మెరుపుదాడికి నిలబడలేకపోయిన కేఈ సోదరులు పత్తికొండ ఎమ్మెల్యే ఎస్వీ.సుబ్బారెడ్డికి వారి కంపెనీని విక్రయించారు. శ్రీసాయి కమ్యూనికేషన్స్ పేరిట నెట్‌వర్క్‌ను తిరిగి ప్రారంభించిన సుబ్బారెడ్డి... అందులో వెంకటేష్‌ను భాగస్వామిగా చేసుకున్నారు. ఎస్వీ.సుబ్బారెడ్డి, టిజి ఉభయులు కూడా వారి కార్యకలాపాల ప్రచారం కోసం కేబుల్‌ను వాడుకోసాగారు. నగరంలో వారి కంపెనీకి దాదాపు ఒక లక్ష కనెక్షన్లు ఉన్నాయి.

వారి రాయకీయ ప్రోయోజనాలను కాపాడుకునేందుకు ఒక కేబుల్ నెట్‌వర్క్‌ అవసరాన్ని గుర్తించిన కేఈ సోదరులు వారి స్వంత నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తున్నారు.

ఇదిలా ఉండగా కేఈ నెట్‌వర్క్‌ ఇన్ ఛార్జ్ కేఈ సత్యనారాయణ మాట్లాడుతూ నెల రోజుల్లోగా కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ఆపరేటర్లకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న రేటు కన్నా రూ.20 తక్కువకు ఖాతాదారులకు కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు.

తక్కువ ధరకు కేబుల్ కనెక్షన్ దొరకటంతో పాటుగా, వైరి పక్షాల నడుమ పోరు ప్రజలకు లబ్ది చేకూరుస్తుందనే ఆనందంలో నగర ప్రజలున్నారు.

Source: www.apweekly.com

కంచికెళ్లనున్న 'పావలా కథ'

* 25 పైసలకు టాటా చెప్పనున్నRBI

పావలా కథ కంచికెళ్లనుంది. జూన్‌ నెలాఖరు నుంచి పావలా చెలామణీని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. విపణిలో చారాణాలపై నిషేధం ఖరారవడంతో.. దానిపై అప్పుడే జనానికి చిన్న చూపొచ్చేసింది. చెల్లనికాసుగా తీసి పారేయడం మొదలైంది. ఒకప్పుడు పవర్‌ఫుల్‌ కాయిన్‌గా పేరున్న పావలా బిళ్ల మన నుంచి భారంగా వీడ్కోలు తీసుకుంటోంది.


అణాపైసాలు రెండు జనరేషన్ల క్రితమే కనుమరుగయ్యాయి. తర్వాత.. ఐదుపైసలు.. పదిపైసలు, ఇరవై పైసలు.. ఒక్కటొక్కటిగా అన్నీ చెల్లని కాసులుగా మారిపోయాయి. ఇప్పుడు పావలా వంతొచ్చింది. ఇప్పటికే నల్లపూసలైపోయి.. ఉనికి తగ్గిపోయిన పావలా బిళ్లలు.. ఆర్నెల్ల తర్వాత అస్సలు కనిపించకుండా పోనున్నాయి. ఇక మ్యూజియానికి, కాయిన్ కలెక్షన్లకు మినహా.. చారాణాలు మరెందుకూ పనికిరావు.


సో.. పావలా పని అయిపోయినట్లే లెక్క. జూన్ 30 నుంచి అత్యంత చిన్న నాణెంగా అర్థరూపాయిని మాత్రమే పరిగణిస్తామన్న కేంద్ర ఆర్థికశాఖ.. పావలాను లెక్కలోంచి తీసిపారేసింది. ఎవరిదగ్గరైనా పావలా బిళ్లలుంటే వీలైనంత త్వరగా.. వదిలించుకోవాలని ఆదేశాలిచ్చింది. బ్యాంకులు, ప్రభుత్వ రవాణా సంస్థల్లో ఆర్నెల్ల వరకు పావలాలను అంగీకరించకుంటే.. దాన్ని నేరంగా పరిగణిస్తారు.


మూడేళ్ల క్రితమే ముద్రణ ఆగిపోవడంతో.. పావలా బిళ్లల ఉనికి దాదాపుగా తగ్గిపోయినట్లే లెక్క. అధికారికంగా చెల్లుబాటులో వున్న ఐదురూపాయల నోటునే ఎవరూ తీసుకోవడం లేదు. ప్రభుత్వమే కాదన్న పావలా బిళ్లలను ఎలా మార్చుకునేది..? అందుకే.. చేతిలోని చారాణాలను పక్కకు పెట్టేస్తున్నారు జనం. ఇప్పుడు ఎవరికీ కాకుండా పోయిన పావలాబిళ్ల ఒకప్పుడు ఎంత పవర్‌ఫుల్లో మన పూర్వీకులను అడిగితే తెలుస్తుంది.


నైన్టీన్ ఫిఫ్టీస్‌లో పావలా ఖర్చుపెడితే కిలో కూరగాయలొచ్చేవి. దీపావళికి అరడబ్బా నిండుగా బాణాసంచా దొరికేది. నలభై కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చెయ్యగలిగేవాళ్లు. నేలటిక్కెట్‌తో ఓ పసందైన సినిమా చూసేవాళ్లు. ఆలిండియా కాంగ్రెస్‌లో సభ్యత్వ రుసుము కూడా ఒక్క పావలాబిళ్లతో సరిపొయ్యేది. పదేళ్ల తర్వాత అదే పావలా బాగా పలచనైపోయింది.


సమోసా కొండానికో.. కాలేజి క్యాంటీన్‌లో ఓ కప్పు టీ తాగడానికో పావలా బిళ్ల బైటికి తీసేవాళ్లు. 1980 తర్వాత ద్రవ్యోల్బణం ధాటికి పావలా బిళ్లకున్న కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. ఓ చిన్న అరటిపండు కూడా కొనలేని సత్తుబిళ్లగా పావలా సెటిలైపోయింది. పిల్లవాడికి పిప్పర్‌మెంట్ కూడా కొనిపించలేని నిస్సహాయత పావలాబిళ్లది. బిచ్చగాడినుంచి కూడా పావలాకు తిరస్కారమే. పావలాకుండే విలువ కంటే.. ఆ పావలా కాయిన్ తయారీకే ఎక్కువ ఖర్చవుతుందని ఆర్బీఐ వాపోతోంది.


వందరూపాయలకు సమానమైన పావలాబిళ్లల తయారీకి.. 160 రూపాయలు వ్యయం చేయాల్సి రావడం ఓ ట్రాజెడీ. మెటల్ ధరలు మండుతుండడమే దీనికి కారణమట. అందుకే.. చెల్లుబాటవని ఇలాంటి నాణేలు.. కరిగించుకుని అదనపు ప్రయోజనం పొందుతున్నారు జనం. బ్రిటిష్ కాలంనాటి వెండి రూపాయి బిళ్ల.. ఆ తర్వాత ఆడాళ్లకు ఆభరణాలుగా మారిపోయాయి.


పసిడిరంగులో మెరిసే 20 పైసల బిళ్లలు పేద మహిళలకు అలంకారప్రాయాలయ్యాయి. ఇప్పుడు మిగిలిపోయిన పావలాబిళ్లలదీ అదే పరిస్థితి. కాయిన్‌గా కంటే.. కరిగించడం వల్లే ఇది సొమ్మవుతుంది.

Source: www.tv5news.in 

బొబ్బిలిలో మాటీవీ యాంకర్‌ శ్యామల హల్‌చల్‌

బొబ్బిలిరూరల్‌, మేజర్‌న్యూస్‌:- గురువారం పట్టణంలో మాటీవి యాంకర్‌, ప్రముఖ టివి ఆర్టిస్ట్‌ శ్యామల సందడి చేశారు. ఆమె మన ఊరు వంట కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న సందర్భంలో పట్టణానికి చెందిన రత్నాల కాశీవిశ్వనాధచౌదరి ఇంట్లో మాటీవి యూనిట్‌ పుణ్యవతమ్మ గృహిణి తయారు చేసిన జున్నుతో కక్రాలు అనే కార్యక్రమాన్ని చిత్రీకరించారు. ఈ విషయం తెలిసిన యువకులు, మహిళలు ఆమెను ఎగబడ్డారు. కాలేజీ రోడ్డంతా జనాలతో నిండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆమె మేజర్‌న్యూస్‌తో మాట్లాడుతూ ప్రస్తుతం మాటీవిలో మాఊరి వంట యాంకర్‌గా పని చేస్తున్నానని అదే విధంగా గోరింటాకు సీరియల్‌ ప్రస్తుతం జెమిని ఛానల్‌లో ప్రసారం అవుతుందని, దానిలో తన పాత్రకు మంచిపేరు వచ్చిందన్నారు. ఆకాశగంగ, అపరంజి, మొదలగు సీరియల్స్‌లో నటిస్తున్నానని ఇంకా నాలుగైదు సీరియల్స్‌లో నటించేందుకు అంగీకరించినట్లు ఆమె తెలిపారు. అయితే మావూరి వంట కార్యక్రమం ద్వారా మంచి ప్రాచుర్యం లభించినట్లు ఆమె తెలిపారు. 

Source: www.suryaa.com

నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలుగు టెలివిజన్ మీడియా బ్లాగు వీక్షకులుకు అందరికి నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఇట్లు
జయంత్ కుమార్