Tuesday, May 10, 2011

నారా లోకేష్‌కు చెక్, స్టూడియోఎన్‌ టీవీ చానెల్‌పై జూనియర్ ఎన్టీఆర్ కన్ను?

హైదరాబాద్: ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెత్తనంలో ఉన్న స్టూడియో-ఎన్ ఛానల్ త్వరలో హరికృష్ణ చేతిలోకి మారనుందా! అంటే అవుననే కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఛానల్ చంద్రబాబు తనయుడు లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు వచ్చాయనే వాదనలు వినిపించిన సమయంలో కూడా స్టూడియో-ఎన్ ఛానల్లో బాబుకు అనుకూలంగా వార్తలు వచ్చాయి. విజయవాడ విభేదాల విషయంలో సైతం వల్లభనేని వంశీని తప్పు పడుతూ దేవినేని ఉమా మహేశ్వరరావును సమర్థించిన వార్తలు వచ్చాయి. అయితే లోకేష్ ఆధ్వర్యంలో ఉన్న ఆ ఛానల్ త్వరలో జూ.ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లడం ఖాయమని వినిపిస్తోంది.

స్టూడియో-ఎన్ ఛానల్ నార్నె శ్రీనివాసరావుది. నార్నె కూతురు లక్ష్మీ ప్రణతిని ఇటీవలే జూ.ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. చంద్రబాబుతో ఎంత బాంధవ్యం ఉన్నప్పటికీ, ఎన్నేళ్ల అనుబంధం ఉన్నప్పటికీ నార్నెకు జూ.ఎన్టీఆర్ అల్లుడు అయినందున ఆయనకే ప్రాధాన్యత ఇస్తాడు. అయితే మరో ముఖ్య విషయం ఏమంటే జూ.ఎన్టీఆర్ నార్నె అల్లుడు కావడానికి ప్రముఖ పాత్ర వహించింది చంద్రబాబే. పెళ్లికి ప్రముఖ పాత్ర వహించిన బాబుకే ఇప్పుడు మామ - అల్లుళ్లు ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. అంటే ఇన్నాళ్లూ లోకేష్ కుమార్ చేతిలో ఉన్న స్టూడియో-ఎన్ ఛానల్ పగ్గాలను ఎన్టీఆర్‌కు అప్పగించే అవకాశం తప్పనిసరి. జూ.ఎన్టీఆర్ చేతిలోకి ఛానల్ రాగానే ఇప్పటికే చంద్రబాబును ఢీకొడుతున్న హరికృష్ణ బాబు ఇమేజ్ తగ్గించే అంశానికే ప్రాధాన్యత ఇస్తాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో రాజకీయ సమీకరణాల కోసం బాలకృష్ణ కూతురును చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. బాలకృష్ణ కూతురును కోడలుగా చేసుకొని బాలకృష్ణను ఆధిపత్య పోరు నుండి తొలగించాడు. అసలే గొడవలు అంటే పడని బాలకృష్ణ ఇప్పుడు మరింత మిన్నకుండి పోయారు. రాజకీయ సమీకరణాల కోసం బాబు ఏ ప్లాన్ అయితే వేశాడో ఇప్పుడు హరికృష్ణ కూడా చంద్రబాబు నుండి ఆధిపత్యాన్ని నందమూరి కుటుంబం వైపుకు తీసుకు రావడానికి నార్నె ఇంటికి తన తనయుడిని అల్లుడిగా చేసి చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తున్నాడు. మొత్తానికి నందమూరి - నారా కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లను కలిచి వేస్తోంది.

Source: thatstelugu.oneindia.in

సొంత డబ్బా కొంత మానుకుంటే...

ప్రసిద్ధ నటుల పార్ట్‌టైమ్ వ్యాపకం టీవీ షోలకి వ్యాఖ్యాతలుగా ఉండడం కూడా అని మరోసారి ప్రముఖ గుణ చిత్రనటుడు (కేరెక్టర్ ఆర్టిస్టు) ప్రకాష్‌రాజ్ ‘ఇట్స్ మై షో’ (మాటీవీలో సోమ, మంగళ వారాల్లో రాత్రి 9 గంటలకు వస్తున్నది) ద్వారా విశదమైంది. తన ఇమేజ్‌కి తగ్గట్లే ప్రకాష్‌రాజ్ తన షోను చాకచక్యంగా నిర్వహించడానికే ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఉన్న గంట సమయం మరింతగా సద్వినియోగమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదో వైవిధ్యం..
సాధారణంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకి పాల్గొనే అభ్యర్థి సమాధానం చెప్పడం జరుగుతుంది. వారు చెప్పలేకపోతే, షోలో ఉండే ముఖ్య అతిథులు సమాధానం చెప్పడం లేదా మరొక స్నేహితుని సహకారం తీసుకోవడం గతంలో అమితాబ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణకు నోచుకున్న ‘కౌన్ బనేగా..’ నుంచి చూస్తున్న విషయమే. కానీ ఇందులో అడిగిన ప్రశ్నలకి సమాధానాలు షోలో అభ్యర్థులెంచుకున్న ముఖ్య అతిథుల్లోని ఒకరు సమాధానాలిస్తారు. దానిని క్యాండిడేట్స్ ఒప్పుకోవడమో లేదా తప్పులో చెప్పాలి. రైటైన సమాధానం చెప్పాలి. ఇది ట్రెండ్‌లో కొంత వెరైటీయే. అయితే దీన్లో అంతర్లీనంగా దాగి వున్న సంగతేమిటంటే ఒక ప్రశ్నకు సమాధానం మనకి కచ్చితంగా తెలిస్తేనే గానీ, సదరు ప్రముఖుడు చెప్పింది తప్పో, ఒప్పో తెలుస్తుంది. అంటే అడిగిన ప్రశ్నకి ఏదో గెస్సింగ్ విధానంలో కాక ప్రాథమిక అవగాహన వుంటే కానీ ముందుకు వెళ్లలేం. ఆ రకంగా పాల్గొనబోయే అభ్యర్థులు కొంత కసరత్తు ముందుగా చేయాల్సి ఉంటుంది.

సినిమాల ప్రశ్నలకే మొగ్గా?
సరే.. ప్రశ్నలంటే అన్ని విభాగాలకు చెందిన ప్రశ్నలుండాలన్న ఆకాంక్ష జనరల్ వీక్షకులకున్నా, సినిమాకు చెందిన ప్రశ్నలే అధికంగా ఇప్పుడొచ్చే టీవీ షోల్లో వున్నట్లే ఇందులోనూ ఉన్నాయి. ‘కృష్ణ, రజనీకాంత్ కలిసి నటించిన చిత్రం పేరు’ ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి’ చిత్ర నిర్మాత ఎవరు?’ ‘మణిరత్నం దర్శకత్వంలో తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం?’ ఇలా ఇలా ఈ కోవలో సాగుతుంది. అయితే ఇందులోనూ కాస్త వెసులుబాటు కావాలంటూ పాల్గొన్న ఓ అభ్యర్థిని అడగడం గమనార్హం. అదెలాగంటే ‘జగదీకవీరుడు - అతిలోక వీరుడు’ చిత్ర నిర్మాత పేరు చెప్పమని కార్యక్రమ నిర్వాహకుడు ప్రకాష్‌రాజ్ అడిగితే - ‘అదేమిటండీ అందులో హీరో హీరోయిన్ల పేరు చెప్పమంటే ఓకే గానీ అలా నిర్మాత పేరడిగితే ఎలా?’ అంటూ క్యాండిడేట్ అడిగారు. దీన్నిబట్టి ప్రశ్నలకు ఎలాంటి ఫోకస్‌ను ఆశిస్తున్నారో తెలుస్తోంది. కానీ విషయ విస్తరణకు అన్ని కోణాలూ స్పృశించడం అవసరమని షో గుర్తించడం అభినందనీయం.

ఒక సెలబ్రిటీకే డిమాండా?
సెలబ్రిటీ (ప్రముఖ వ్యక్తి (ముఖ్య అతిథి)లను నిర్ణయించుకోడం తదితరాలు షో నిర్వాహకులు అప్పటి సమయంలో వారి అందుబాటుతనం వగైరాలపై ఆధారపడినా రప్పించే ఇద్దరూ ప్రజాకర్షణలో దగ్గర దగ్గరగా వుండే వారినే ఎంచుకుంటే బావుంటుంది. ఉదాహరణకు మే 2,3 తేదీల్లో ఇలా అభ్యర్థులను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి వారెంచుకునే అతిథులుగా దర్శకుడు శేఖర్ కమ్ముల, మరో రంగంలో నిష్ణాతుడైన ఇంకో వ్యక్తినీ ప్రవేశపెట్టారు. ఇలాంటి సందర్భాలలో పాల్గొనే కేండిడేట్స్ అందరూ సహజంగా శేఖర్ కమ్ములనే తమకు సమాధానాలు చెప్పే అతిథిగా ఎంచుకుంటారు. ఇందులోనూ అదే జరిగింది. ఈ డిమాండు చూసే ప్రకాష్‌రాజ్ ‘శేఖర్‌కి చాలా డిమాండుంది’ అంటూ ఓ చమత్కార వ్యాఖ్య చేశారు. వాస్తవానికి శేఖర్‌తోపాటు పాల్గొన్న మరో వ్యక్తీ సినీ రంగంలో కాకపోయినా వారు కృషి చేసిన సంబంధిత రంగంలో ఎన్నతగిన ప్రమాణాలు అందుకున్నవారే. కానీ సినీ రంగం పట్ల ఉన్న గ్లామర్ వల్ల ఇది సంభవించింది.

అనుభవాల వివరణా ఓకె!
ఏ కార్యక్రమానికైనా ఇలా సెలబ్రిటీల్ని తీసుకురావడం, ప్రముఖుల్ని వ్యాఖ్యతలుగా వ్యవహరింపజేయడంలో ఆంతర్యం స్థూలంగా ఒకటే. అది వారికుండే అపార అనుభవంలో ఎదుర్కొన్న ఆణిముత్యాల్లాంటి సంఘటనల సారాన్ని తెలియజేస్తారనే. అదే పరంపరనీ ఇందులో శేఖర్ కమ్ముల, ప్రకాష్‌రాజ్ కొనసాగించారు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ తాను కాలేజీలో చదువుతున్నప్పుడు తాను లేందే నాటకం జరగదన్న అభిప్రాయంతో ఉంటే, అది తప్పు, ఈ ప్రపంచంలో ఎవరున్నా ఎవరు లేకున్నా జరిగేవి, జరుగుతూనే ఉంటాయి అని తెలియపర్చిన వారి లెక్చరర్ ఉదంతాన్ని చెప్పారు. దీనివల్ల ‘మనమే అందరికన్నా అధికులం..’ అన్న భావం వుండకూడదన్న సంగతి తెలుపుతోంది.

ఇవి అవసరమా?
ఇక తప్పనిసరిగా పరిహరించాల్సిన అంశాలు ఇందులో కొన్ని ఉన్నాయి. ప్రకాష్‌రాజ్ ఇప్పటికే తెలుగు, తమిళ తదితర భాషా చిత్రాల ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు. అలాంటి నటుడ్ని ప్రత్యేకంగా, ఇదీ తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొన్న అభ్యర్థి, అభ్యర్థినుల ద్వారా ప్రశంసింపజేయడం (ఆస్కార్‌కి ఆస్కారమున్న వ్యక్తివి నీవు అంటూ ఒకరు, మరొకరు ప్రకాష్‌రాజ్ నటించిన చిత్రాల కూర్పుతో పొగడ్తల జల్లు కురిపించారు) ఎంతవరకూ అవసరం? కనక ఇలాంటివి తప్పక పరిహరింపజేయాలి. అలాగే ఇంకో అభ్యర్థి, ప్రకాష్‌రాజ్ ద్వారా బహుమానం అందుకుంటూ ఇలా నేనో ప్రొడ్యూసర్ ద్వారా (ప్రకాష్‌రాజ్ తెలుగులో ఇటీవల నాగార్జున నాయకుడిగా వచ్చిన ‘గగనం’ తమిళ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు) అందుకోవడం ఆనందంగా ఉందంటాడు. ఇవన్నీ కార్యక్రమ నిర్దేశిత లక్ష్యానికి సంబంధించినవి కావు. ప్రశ్నల విభాగాల విస్తరణతోనూ, అనవసరపు అంశాల ప్రస్తావన తగ్గించడం ద్వారానూ ‘ఇట్స్ మై షో’ను అందరి షోగానూ మార్చవచ్చు.

Source: www.andhrabhoomi.net

జీటీవీలో వినోద ప్రభంజనం

ఒకేరోజు ముచ్చటగా మూడు సరికొత్త కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది జీ తెలుగు. మే 9 సా-6.30 గంటలకు ప్రసారమైన ‘కలవారి కోడళ్లు’ మెగా సీరియల్‌లో - అత్తగారి దర్పానికి దర్పణంగా, అహంకారాన్ని అలంకారంగా చేసుకున్న కోటీశ్వరురాలైన జగదీశ్వరికి అణకువ కలిగి అణిగిమణిగి ఉండే కోడలు తన కనుసన్నలలో నిలవాలన్న కోరిక. అందుకు తగ్గట్టే తన కొడుకు శ్రీరామ్‌కి ఓ మధ్యతరగతిలో పుట్టిన రేఖతో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది. అయితే, రేఖకి తలపొగరు అని గ్రహించి ఆమె సోదరి, అమాయకురాలైన లేఖని కోడలుగా తెచ్చుకుంటుంది. మొదట్లో జగదీశ్వరి దర్పాన్ని చూసి ఏవగించుకున్న రేఖ ఆ తర్వాత లేఖని చూసి అసూయ పడుతుంది. తల్లిదండ్రులతో కలిసి లేఖ అన్యాయం చేసిందని భావిస్తుంది. ఆ జమీందారీ కుటుంబానికి తనూ కోడలుగా వెళ్లాలని ఎత్తులు వేస్తుంది. రేఖ పథకాల్లో ఆమె సోదరి లేఖ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది? జగదీశ్వరీ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంది? అన్నది ప్రధాన కథాంశం.

రా.9.00 గంటలకు ‘కన్యాదానం’ మరో మెగా సీరియల్ కథాంశం. మగువ జీవితంలో మధురమైన స్మృతిగా మిగిలిపోయే కన్యాదానానికి పురాణకాలం నుంచే ఎంతో ప్రత్యేకత, ప్రాధాన్యత ఉన్నాయి. ఆడపిల్ల కలిగిన తల్లిదండ్రులు ఆ కన్యాదాన ఘట్టం కోసం, అపూర్వమైన ఆ ఘడియల కోసం ఆశగా, ఆతృతగా ఎదురు చూస్తూంటారు. తమ కూతురిని లక్ష్మీదేవిగా, కాబోయే అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి ఆమెని అతడికి అప్పగించే మహోన్నతమైన ఘట్టం ‘కన్యాదానం’.
 
ఇక - రా.9.30 సోమ, మంగళ వారాల్లో టాలెంట్‌తో ప్రేక్షకులను మైమరపింపచేయడానికి ‘అద్భుతం మల్టీ టాలెంట్ రియాలిటీ షో’. హీరోగా, కేరెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు చిరపరిచితులైన యాక్షన్ హీరో భానుచందర్ ‘అద్భుతం’ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. జీ తెలుగు ‘ఆట’ కార్యక్రమంతో ప్రేక్షకుల మన్ననలు పొందిన శ్రీవిద్య ఈ కార్యక్రమంతో మరోసారి మెంటర్‌గా ముందుకు రాబోతోంది.

Source: www.andhrabhoomi.net

తానా అంటే ఎన్టీవీకి పడదా.?

తానా మీద ఎన్టీవీ దాడి ప్రారంభించింది. తానా కులసంఘమంటూ..ప్రచారం మొదలెట్టింది. ఇందులో నిజమెంత..? అబద్ధమెంత..? అనేది పక్కన పెడితే.. అసలు  ఎన్టీవీ ఎందుకు ఈ కథనం ప్రసారం చేసింది…? ఎందుకు తానాపై ఇంతగా కక్ష కట్టింది..? ఇదంతా పక్కా పథకంతో చేసిందా….? ఇలాంటి అనుమానాలు కచ్చితంగా వస్తాయి. ప్రవాసాంధ్రులు కులాలుగా విడిపోతున్నారని చెప్పుకొచ్చిన  ఎన్టీవీ కథనం వెనుక ఉన్న అసలు సత్యలేమిటి..? ఎందుకు అది తానాను  టార్గెట్ చేసింది అంటే దీని వెనుక సవాలక్ష కారణాలున్నాయంటున్నారు తానా సభ్యులు.. అందులో ప్రధానమైనవి కొన్నింటిని తెలుగుశక్తి మీ ముందుకు తెస్తోంది.
 

ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణకు ఆహ్వానం

ఎన్టీవీ నరేంద్రనాథ్ చౌదరికి , ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో ఎన్టీవీ, ఎబీఎన్ ఒక ఛానల్ పై మరొక ఛానల్ దుమ్మెత్తి పోసుకున్న సంగతి జనాలు ఇప్పటికి మరిచిపోలేదు.. ప్రస్తుతం తానా రాథాక్రిష్ణను తానా సమావేశాలకు ఆహ్వనించింది. మరీ తన శత్రువు  రాధాక్రిష్ణను తానా సభలకు ఆహ్వనించి.. అతిధి మర్యాదలు చేయాలనుకోవడం.. సహాజంగానే ఎన్టీవీ యాజమాన్యానికి నచ్చని పరిణామం.. అలాంటప్పుడు డైరక్ట్ గా తానాను దెబ్బకొడితే.. తానాలోని చిన్న చిన్న మనస్పర్థలను వినియోగించుకుని తానాకు ఉన్న క్రెడిబిలిటిని దెబ్బ తీస్తే… శత్రువును, శత్రువుకు స్వాగతం పలుకుతున్న తానాకు షాక్ ఇచ్చినట్టు అవుతుందని ఎన్టీవీ భావించి ఉండొచ్చని తానా సభ్యులు విశ్లేషిస్తున్నారు.
 
టీవీ9కు ప్రాధాన్యం ఇస్తారా..?
తానాకు టీవీ9 తో సత్సంబంధాలు ఉన్నాయి. టీవీ 9 యూఎస్ లో దూసుకుపోతుంది. తానా..టీవీ9 కలిసి థింతానా అనే కార్యక్రమం చేస్తోంది. టీవీ9 ప్రత్యేకంగా అక్కడ ఛానల్ పెట్టి… ఎన్ ఆర్ ఐ వార్తలు కవర్ చేస్తుంది.   అయితే ఇక్కడ నెగిటివ్, కాంట్రావర్షల్ వార్తలు ఎక్కువగా ప్రసారం చేసే టీవీ9 .. అమెరికాలో  ఎన్ ఆర్ ఐ లను ఏకం చేసే దిశగా కథనాలు అందిస్తోంది. ఏచిన్న వార్తనయినా కవర్ చేస్తుంది. టీవీ9 రవిప్రకాష్ ను తానా సభలకు గెస్ట్ గా పిలిచింది. ఇది కూడా ఎన్టీవీ యాజమాన్యానికి చిర్రెత్తుకొచ్చింది. అయితే మన రాష్ట్రంలో టీవీ9 కు ఎన్టీవీకి మధ్య కూడా పోటీ ఉంది. ఎన్టీవీని యూఎస్ లో పెద్దగా చూసే వారు తక్కువ..  అయితే అమెరికాలో ఎన్టీవీకి పాపులారిటి రావాలంటే…నెగిటివ్ వార్తలు ఇస్తే వస్తుందని భావించి.. తానా మీద నెగిటివ్ ప్రచారం చేస్తుందని తానా ఫ్యాన్స్ అంటున్నారు.
 

తానా ఎన్ని కులాలను పిలిచిందో తెలుసా..?

తానా కేవలం కమ్మ కులానికే చెందిదనేది ప్రచారం చేసి… తానాను దెబ్బతీయాలనే వ్యూహాంతోనే ఈ కథనం అల్లినట్టు..ఆ కథనాన్ని చూసిన వారెవరికైనా అర్థమవుతోంది. తానా గురించే ఎక్కువ సమయం కేటాయించిన ఎన్టీవీ.. తానా ఓ కులానికి ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు చూపించింది. తానాకు ప్రతియేటా వచ్చే విశిష్ట అతిథుల్లో కేవలం కమ్మ కులం వాళ్లే క్యూ కట్టడం లేదనేది ఎందుకు విస్మరిస్తోంది. తానా అనేది అమెరికాలోనే అతి పెద్ద సంఘం దీనిని దెబ్బ తీసి.. అన్ని కులాలను ఏకం చేస్తూ సాగుతున్న దాని ప్రస్థానాన్ని అడ్డుకోవాలనే దుగ్థతో ఎన్టీవీ ఈ కథనాన్ని ప్రసారం చేసినట్టు ఉంది. ఈసారి తానా సమావేశాలకు వచ్చే గ్రంధి మల్లికార్జునరావు.. జీఎమ్ ఆర్ వ్యవస్థాపకుడు కమ్మవాళ్లా..? పల్లం రాజు ది ఏ కులమో.. ఎన్టీవీ ఎందుకు చూడలేదు.. కే విశ్వనాథ్  ఏ కులమో తెలియదా..? ఇదంతా కేవలం తానా  ఎన్టీవీ యాజమాన్యాన్ని సభలకు ప్రత్యేకంగా ఆహ్వనించలేదనే కసితో చేస్తున్నదే తప్ప మిగతాది కాదని తానాకు అభిమానులు అంటున్నారు.
 

తానాకు పార్టీలు ఉన్నాయా..?

తానా తెలుగుదేశంకు కొమ్ము కాస్తుందని ఎన్టీవీ కథనాన్ని వడ్డి వార్చింది. తానా సభ్యులందరూ కలిసి తెలుగుదేశానికే ఓటు వేయాలంటే.. ఇండియాలో వినేవాళ్లు ఉంటారా..?  అసలు  ఎన్టీవీ ఎవరికి కొమ్ము కాస్తుందో.. ఎవరికి భాజా కొడుతోందో.. జనానికి తెలియదనుకోవటం ఆ ఛానల్ పిచ్చి భ్రమ అంటున్నారు..తెలుగు సంఘాల ప్రతినిధులు..తానాలో సభ్యులు కావచ్చు. ఆటాలో సభ్యులు కావచ్చు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. అంత మాత్రాన ప్రవాసాంధ్రులకు కులపిచ్చి ఉన్నట్టు చూపించడం ..ఎంతవరకు సమంజసమని వాదించే వారు లేకపోలేదు. అసలు ఆటా అంటే పూర్తిగా రెడ్లదేనా..? తానా అంటే పూర్తిగా కమ్మవాళ్లదేనా..? మరీ అదే ఆటాలో.. తానాలో సామాన్య సభ్యులుగా చందాలు కట్టిన బ్రహ్మణులు,కాపులు, ఇతర  కులాల సంగతి ఏమిటి..? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు చురుకైనా పాత్ర పోషించవచ్చు. అంత మాత్రాన తెలుగు సంఘాలకు కులముద్రలు వేసి ప్రచారం చేయడం మాత్రం భావ్యం కాదనేది తెలుగు సంఘాలు అంటున్నాయి. తానా అసోషియేషన్ లో రెడ్లు ఉన్నారు. ఆటా అసోషియేషన్ లో కమ్మవాళ్లు ఉన్నారు. ఎవరికి వారు తమకు చేతనైన స్థాయిలో ప్రవాసాంధ్రులకు ఉపయోగపడుతున్నారు. కలిసి ఉంటున్న వారి మధ్య కూడా చిచ్చు పెట్టాలని చూడటం పద్దతి కాదనే వాదన వినిపిస్తోంది. ఎన్టీవీ తాను ప్రసారం చేసిన కథనంలో ఉత్తర అమెరికాలో మరో సంఘం రాబోతుంది.. తానాకు వ్యతిరేకంగా ఉన్నవారు.. అందులో కలుస్తారంటూ.. తన మనసులోని దురుద్దేశాన్ని బయటపెట్టింది. అంటే దాని లక్ష్యం తానాను చీల్చటం.. తెలుగు సంఘాలను చిన్నాభిన్నం చేయడం.. ఇదేనా  తెలుగువారి ఛానల్ చేసే ఘనకార్యం… తానా చేసిన సేవా కార్యక్రమాలను ఎందుకు ఎన్టీవీకి ఎందుకు కనిపించలేదో.. వారి సేవా కార్యక్రమాల గురించి అసలు ఎందుకు ప్రస్తావించలేదు.. అమెరికాలో తెలుగు సంఘాలన్నీ..కులాల వారీగా విడిపోతున్నాయని ఎన్టీవీ కథనం తెలుగువారి సమైక్యతను దెబ్బతీసేలా కథనం ప్రసారం చేసింది.  తెలుగువారి ఐక్యతకు పాటు పడాల్సిన తెలుగుమీడియానే తెలుగు సంఘాలను దెబ్బతీసేలా కులబురద పూయడం ఎంతమాత్రం సహేతుకం కాదని తెలుగు సంఘాలు మండిపడుతున్నాయి.
 
Source: telugushakthi.com

Thursday, May 5, 2011

తమిళంలో ఎస్.వి.బి.సి ఛానల్

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ను (ఎస్.వి.బి.సి) తమిళంలో కూడా తీసుకురావాలని తిరుపతి,తిరుమల దేవస్థానం ప్రతిపాదిస్తోంది. త్వరలో ఈ తమిళ ఛానల్ ప్రారంభం అవుతుందని టిడిడి కార్యనిర్వహణాధికారి ఐ.వై.ఆర్.కృష్ణారవు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో మాత్రమే నడుస్తున్న ఈ ఛానల్ ను తమిళంలో కూడా తీసుకు రావడం ద్వారా తమిళనాడుకు కూడా విస్తరించవచ్చని ఆయన అంటున్నారు. తమిళనాడు నుంచి ముప్పై ఐదు శాతం మంది భక్తులు వస్తుంటారని కూడా, దానిని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి విశేషాలను, ఆలయ కార్యక్రమాలను ఆంద్రప్రదేశ్, తమిళనాడులలో ప్రతి గ్రామానికి కూడా చేరాలన్నది తమ ఉద్దేశ్యం అని అన్నారు. తెలుగు ఎస్.వి.బి.సి ఛానల్ ఆరంభంలో, తర్వాత కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. అలాంటివేమీ లేకుండా ఈ ఛానల్ ప్రారంభమవుతుందని ఆశిద్దాం. 

Source: kommineni.info

Tuesday, May 3, 2011

డిష్ టీవిలో మా మూవీస్, మా మ్యూజిక్, మా జూనియర్ చానల్స్



ఛానల్ నెం.
904. మా మూవీస్
905. మా మ్యూజిక్ 
906. మా జూనియర్ 

Maa Movies, Maa Music, Maa Junior added in Dish Tv!!



These channels added On Dish Tv. channel no's

904. MAA MOVIES
905. MAA MUSIC
906. MAA JUNIOR

మా సీరియల్‌ బంగారం

బాలాజీ టెలిఫిలింస్‌ పతాకంపై జెమినీ టీవీలో ప్రతిరోజు ప్రసారం చేస్తున్న 'కొత్త బంగారం' సీరియల్‌ 300 ఎపిసోడ్స్‌ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బాలాజీ టెలిఫిలిం సౌత్‌ హెడ్‌ సెమికర్ణ మాట్లాడుతూ... 'సన్‌ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జెమినీ టీవీ హెడ్‌ సంజరురెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సీరియల్‌ క్రియేటివ్‌ హెడ్‌ ఉప్పలపాటి నారాయణరావు సహకారంతో ఈ సీరియల్‌ను తీర్చిదిద్దాం. ఈ సీరియల్‌ విజయవంతమయింది. దానికి కారణం మంచి కథ, కథనం. నాణ్యత రీత్యా సీరియల్‌ను తీర్చిదిద్దాం. బాలీవుడ్‌లోనైనా టాలీవుడ్‌లోనైనా నేటివిటీ కొంచెం మార్పు రీత్యా కథలు ఒకేలా ఉంటాయి. మన దేశ సంప్రదాయాలు, మన సంస్కృతులు ప్రధానంగా స్టోరీ ఉండేట్టు చూసుకుంటాం. భాషలు వేరైనా జీవన విధానం ఒక్కటే. కాబట్టి సీరియల్‌ ఏ భాషలో తీసినా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకముంది' అని చెప్పారు.


ఉప్పలపాటి నారాయణరావు మాట్లాడుతూ...'మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. 300వ ఎపిసోడ్‌ వరకు కార్తీక్‌ దర్శకుడిగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ దర్శకుడిగా చేస్తున్నాడు. మధుశ్రీ స్క్రీన్‌ప్లే సహకారం బాగుంది' అని అన్నారు. రచయిత మధుశ్రీ మాట్లాడుతూ...'180 ఎపిసోడ్స్‌ వరకు సంభాషణలు రాశాను. టెలిప్లేకు కూడా సహకరిస్తున్నాను. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు సీరియల్స్‌లలో చోటు సంపాదించటం ఆనందంగా ఉంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు ప్రభాకర్‌, ప్రేమ తదితరులు మాట్లాడారు. 
Source: www.prajasakti.com

బ్రాండ్‌ని పెంచుకోవడానికే సరికొత్త ఛానళ్లు ....?!

ప్రతి ఏడాది పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్న ఛానెళ్లు వీక్షకులను ఎంత వరకు సక్సెస్‌గా చేరగలుగుతున్నాయనేది ప్రశే్న. చాలా ప్రాంతాల్లో కొన్ని ఛానళ్లు అసలు వున్నాయా? అనిపించే విధంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. వందకు పైబడి రిమోట్‌లో ఛానళ్లు ఫిట్ అవుతున్నా వీక్షకులు చూసేవి మాత్రం వేళ్ల మీదే ఉంటాయన్నది సత్యం. పురుషులు, పిల్లలు అయితే ఛానెళ్ల అనే్వషణతో రిమోట్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అదే మహిళలయితే సింగిల్ డిజిట్‌తోనే ఛానళ్లు చూడటంతో సరిపెట్టుకుంటారు. ఎందుకంటే మహిళల్లో ఎక్కువ శాతం సీరియళ్లని ఫాలో అవుతూ ఉండటమే. అలాంటప్పుడు కొత్త ఛానళ్లు ఎన్ని పుట్టుకొచ్చినా అంత త్వరగా ఎట్రాక్ట్ కారు. అందుకే కొత్త ఛానళ్లు స్త్రీలను ఆకర్షించటానికి బంగారం, పట్టుచీరలు వంటి వారికిష్టమైన బహుమతులను ఎరవేసి వారివైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ స్ర్తిలు అంత త్వరగా ఛానల్ మార్పుని కోరుకోవడం జరగదు.

కొత్తగా పుట్టుకొచ్చే ఛానళ్లు పురుషులను, పిల్లలను ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుంది. అందుకే మూవీ ఛానెళ్లు, మ్యూజిక్ ఛానెళ్లు, చిల్డ్రన్ ఛానళ్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. నేషనల్ ఛానళ్లు సైతం పిల్లల కోసం రీజినల్ లాంగ్వేజ్‌లో తమ ప్రసారాలను కొనసాగిస్తూ పిల్లలను ఆకర్షిస్తున్నాయి. ఈ పరంపరలో కార్టూన్ నెట్‌వర్క్, పోగో ముందున్నాయి. ఈ ఛానళ్లని వీక్షించడంలో పెద్దలు సైతం ఆసక్తి చూపుతారు. ఎందుకంటే లేనిపోని ఛానల్ కథనాల బాధలను వొంటికి పూసుకునే కంటే మనసుకు హాయిగొలిపే కార్టూన్లు, మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయడం బెటరని ఎక్కువమంది భావించడం వల్ల తెలుగు ఛానళ్లు సైతం రెండు మూడు రకాల ప్రత్యేక ఛానళ్లని లాంచ్ చేస్తున్నాయి.

ఛానళ్లు అధికంగా పుట్టుకొచ్చినా తంటాయే. ఎందుకంటే ఒక కుటుంబంలో వారందరూ ఒకే సమయంలో వివిధ ఛానళ్లని చూడలేరు. అలాంటప్పుడు ఛానల్ ప్రసారాలు నిరుపయోగమే అవుతుంది. కాని ఒక ఛానల్ కుటుంబంలోని స్త్రీలకు, పిల్లలకు, పురుషులకు వివిధ రకాల ఛానళ్లు పెట్టడంవల్ల ఎవరు ఏది చూసినా ఆ ఛానల్ బ్రాండ్‌ని దాటిపోలేరు. కాబట్టి ఆ ఛానెల్‌కి రేటింగ్ కూడా టోటల్‌గా బావుంటుందనే భావన. అయితే క్వాలిటీ ప్రసారాలు ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. క్రమేపీ ఇంటిలో టీవీ సంఖ్య పెరిగే అవకాశాలు కూడా రానున్నాయి. 

పేరు మోసిన, రేటింగ్ ఉన్న ఛానళ్లు సబ్ ఛానళ్లని పెట్టడం వల్ల ఆ ఛానెల్ ఖాతాలోకి వీక్షకులు చూసినా చూడకపోయినా కేబుల్ ఆపరేటర్ లెక్క ప్రకారం లెక్కలోకి వచ్చేస్తారు. రేటింగ్ ఛానళ్లు, ప్రముఖ ఛానళ్ల సబ్ ఛానళ్లని పెట్టినపుడు కేబుల్ ఆపరేటర్ వాటిని తప్పనిసరిగా ప్యాకేజ్ సిస్టమ్‌లో తీసుకోక తప్పదు. అలా ఒప్పుకోని పరిస్థితుల్లో మొదట పాపులర్ ఛానల్‌ని కోల్పోవలసి వస్తుంది. దీనివల్ల ప్రేక్షకుల వత్తిడి ఎదుర్కోక తప్పదు. ఛానళ్ల సంఖ్య ఎక్కువగా వున్నప్పుడు ఛానళ్ల వారు ప్రత్యేక నెట్‌వర్క్ ప్యాకేజీ ద్వారా కూడా వీక్షకులను ఎట్రాక్ట్ చేసుకోడానికి ఎక్కువగా వీలుంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీలో సన్‌నెట్ వర్క్ ఉండనే ఉంది.  

తెలుగు ఛానళ్ల విషయానికి వస్తే ఈటీవీ ఛానల్ ఈటీవీ-2ని కలిగి ఉంది. జీ తెలుగు జీ 24 గంటలనే వార్తా ఛానల్, జీ ఛానెల్‌కి నేషనల్ సబ్ ఛానళ్లు చాలానే ఉన్నాయి. ఎన్‌టీవీ ఏకంగా వనిత అంటూ ప్రత్యేకంగా స్త్రీల కోసం, భక్తి అంటూ భక్తుల కోసం ప్రత్యేకంగా నెలకొల్పడం విశేషం. జెమిని వారు జెమినీ మూవీస్, జెమినీ కామెడీ, జెమినీ మ్యూజిక్, జెమిని అంటూ ఏకంగా నాలుగు ఛానళ్లతో హవా కొనసాగిస్తోంది. మాటీవీ ఈ మధ్యనే ‘మా’ మ్యూజిక్‌తోపాటు మా జూనియర్స్, మా మూవీస్‌ని ప్రారంభించారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లకి ఏ మాత్రం తీసిపోని విధంగా టీవీ-9 వారు టీవీ 1ని నడుపుతున్నారు. ఇవికాక ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, మహా, హెచ్‌ఎం, ఐ న్యూస్, రాజ్, టిటిడి, టీవీ-5, విస్సా, లోకల్ వంటి ఎన్నో ఛానళ్లు నగరాల్లో హల్‌చల్ చేస్తున్నా పట్టణ గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి ప్రధానమైనవే కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు, మూలంగా సప్తగిరి కూడా ఉన్నాననిపిస్తుంది.

ఇన్ని ఛానళ్లు తెలుగులో హల్‌చల్ చేస్తున్నా ప్రేక్షకులు, డిస్కవరీ, ఎంటివి, ఎన్‌డిటివి, కలర్స్, స్టార్‌ప్లస్ అంటూ నేషనల్ ఛానళ్ల వైపు ఓ లుక్ వేయడం జరుగుతుంది. ఛానళ్లు ఎన్ని పెట్టినా సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను కట్టి పడేయగలిగితేనే ఎడ్వర్‌టైజ్‌మెంట్లని శ్లాట్స్ లెక్క ప్రసారం చేసి కోట్లు కొల్లగొట్టవచ్చునన్నది సత్యం. లేకపోతే కేబుల్ ఆపరేటర్ చెప్పే లెక్కలపైన ఆధారపడే ఛానల్‌ని నడపాల్సి ఉంటుంది. ఈ పరంపరలో నెగ్గుకురాలేని చాలా ఛానళ్లు మూత పడిన సందర్భాలు కూడా లేకపోలేదు. భక్తి ప్రచారం కోసం కూడా అనేక ఛానళ్లు తమ ప్రసారాలను ప్రసారం చేస్తూ నడుస్తున్నా అవి భారంగానే నడుస్తున్నాయన్నది ఒప్పుకోక తప్పని సత్యం. నిత్యం పుట్టుకొస్తున్న ఛానళ్ల వల్ల ఉద్యోగావకాశాల రేటు పెరిగిందనే చెప్పాలి. అంతేకాక ఛానల్‌లో యాంకర్, రిపోర్టర్, రీడర్ వంటి వగైరా పాత్రల్లో స్పెషాలిటీని చూపగలిగితే ఆఫర్లతో వారిని లాక్కునే అవకాశాలు కూడా లేకపోలేదు. పెరుగుతున్న ఛానళ్లు ఎంతవరకు ఉపయోగకరం అనేది ప్రేక్షకుడి రిమోట్ చెబుతుంది.

Source: www.andhrabhoomi.net

టాలెంట్‌కి తగ్గవేదిక ‘అదుర్స్’

లోగడయితే కళాకారుడిలో ఉన్న ప్రతిభ చూపడానికి ఓ స్పష్టమైన వేదిక లేక నానా ఇబ్బందులూ పడేవాడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మనలో ఓ మాదిరి సృజనాత్మకత ఉన్నా దాన్ని బహిర్గతపరచుకోడానికి ఛానెళ్ల రూపంలో ఉన్న ప్లాట్‌ఫారాలెన్నో. అలాంటి ప్రతిభాశాలులకు మరో విలువైన వేదిక ‘అదుర్స్’ (ప్రతి బుధవారం ఈటీవీలో రాత్రి 9.30కి వస్తున్నది)

వైవిధ్యం..
ఈ శీర్షిక పేరులో (అదుర్స్) ఉన్న పరాకాష్ఠ తత్వమే, ఇందులో చూపబోయే అంశాలూ ఆ దిశలోనే ఉంటాయన్న సంకేతాన్ని సామాన్య ప్రేక్షకులకు కలుగుతోంది. ఆ తలంపునకు తగ్గట్లే ఇందులో చూసే ఐటెమ్స్ అన్నీ ఓ మాదిరి కృషి చేస్తే ప్రదర్శించే బాపతు కానే కావు. నిరంతర అభ్యాసం, మొక్కవోని దీక్ష సమ్మేళనపరిస్తేనే కానీ సంభవించే అవకాశం లేదు. మిగతా టాలెంట్ షోల్లో ఇంతవరకూ ఎక్కువగా ఆట (డాన్స్) పాట తప్పితే మిమిక్రీ తరహావి ఎక్కువ కన్పడితే ఇందులో సాహస విన్యాసాలూ వగైరా కూడా దర్శనమివ్వడం వెరైటీ. అయితే ఈ కార్యక్రమం ‘కలర్స్’ ఛానెల్‌లో వచ్చిన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ స్ఫూర్తితో తయారైనదిగానూ అనిపిస్తోంది.

సకలాంగులకే సాధ్యం కానిది..
అన్ని అవయవాలూ ఉన్నా, దీక్షాలేమితోనో, మరో రకపు లోపభూయిష్టపు చర్యల వల్లో ప్రదర్శించే కళలో పరిపూర్ణత కనపర్చడం ప్రతీ సందర్భాలలోనూ జరిగే వ్యవహారం కాదు. కానీ ‘అదుర్స్’లో ప్రదర్శితమైన తొలి అంశంగా ‘ఎబిలిటీ అన్ లిమిటెడ్’ (అపరిమిత సామర్థ్యం) గ్రూప్ - ఢిల్లీ వారు ప్రదర్శించిన నృత్యం వచ్చింది. ఇందులో పాల్గొన్న నృత్య కళాకారులు వికలాంగులు. వీరు వీల్‌ఛైర్‌లో కూర్చిన నృత్య భంగిమలు చూపారు. వీరి వెనుక నర్తించిన నృత్య కళాకారిణులు వినికిడి, మాట్లాడే శక్తిలేనివారు. అలా వెనుక వినిపించే సంగీతం వినిపించకపోయినా సాధనతో అంచనా వేసి అనుగుణంగా నర్తించే సామర్థ్యం వీరి పరమైంది. ఇది నిజంగా దైవదత్తమైన అమూల్యాంశం. అందుకే వీరి ప్రదర్శన అనంతరం కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వచ్చిన తరుణ్ మాస్టర్ (డాన్స్ మాస్టర్), మహేశ్వరి (నటి), నందినీరెడ్డి (‘అలా.. మొదలైంది’ చిత్ర దర్శకురాలు) అద్భుత ఆనంద పరవశంతో వారుంటున్న ప్రదే శం నుంచి డయాస్  మీదికి వచ్చి కళాకారుల్నీ, వారికి ఆ స్థాయి ప్రదర్శనను నేర్పిన గురువునీ సాదరంగా ప్రశంసించారు. తర్వాత ప్రదర్శనలుగా ఫిక్టేసియస్ గ్రూప్ రెప్పపాటు కాలంలో ఒక చోట నుంచి మరో చోటకి ఎగరడం పనులూ, ఇల్యూమినేటింగ్ దళం (రెండు గ్రూపులూ ముంబై నుంచి వచ్చాయి) మెరుపుల నేపథ్యంలో విన్యాసాలూ చేశారు. అన్నింటికంటె ఎక్కువ ఆకర్షించినది కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చిన బంజారా డాన్స్ గ్రూప్ ద్వారా చిన్నారులు ప్రదర్శించిన జానపద నృత్యం. ఈ ఐటెమ్‌లో ఉన్న ప్రత్యేకతేమిటంటే, లైవ్ మ్యూజిక్‌తో నృత్యం చేయడం. ఇప్పుడు నృత్యాలు ఎక్కువగా ఏవో ముందుగా రికార్డయిన వాటితోనే జరుగుతున్నాయి. ఆ శైలికి భిన్నంగా ప్రత్యక్ష ప్రసారంలా.. అప్పటికప్పుడు వినిపిస్తున్న పాట, సంగీతానికి అనుగుణంగా నృత్యం చేయడం. ఇలా చేయాలంటే ఈ ముగ్గురి (పాట, ఆట, సంగీతం) మధ్య కచ్చితమైన సమన్వయం ఉండాలి. అది బాగా కుదిరిందిందులో.

ఆశ్చర్యపరచిన గ్వాలియర్ గ్రూప్.. 
ఇక తొంభై కేజీల చొప్పునున్న పెద్దపెద్ద బండరాళ్లని బంతుల్లా ఆటలాడేసి.. ఏమిటీ టాలెంట్ అని సగటు ప్రేక్షకుణ్ణి విస్మయపరిచారు గ్వాలియర్ దళం వారు. అంతటి భారీ బరువు వున్న రాళ్లని కావడి రూపంలో ఓ కర్రకేసుకుని అటూ ఇటూ అవలీలగా ఊపడమే కాక పైన తనంత బరువున్న మరో వ్యక్తిని భుజాలపై నిలబెట్టుకోడం, గుండె మీద ఆ బరువుల్ని మోయడం వంటి ప్రమాదకర విన్యాసాల్నీ ఇందులోని ఓ వ్యక్తి చేశాడు. ఇవి చూసి ‘అమ్మో...’ అన్న భయాందోళనా భావాల్ని జడ్జెస్ స్థానాల్లో ఉన్నవారు చూపారు. దాదాపు అవే భావాలు ప్రేక్షకులకీ కలిగాయి.

..ఇది భావ్యం కాదు 
ఇక ప్రదర్శనల నంతరం ఏది బావుందో అన్న న్యాయనిర్ణేతల ప్రకటన అన్నిట్లోనూ ఉన్నట్లే ఇందులోనూ ఉంది. సరే... ఎవరికి ఫస్ట్ ఇచ్చారు? ఎవరిని సెమీ ఫైనల్స్‌కు ఎంపిక చేశారు అన్నది ప్రమాణాల్ని పరిశీలించి న్యాయనిర్ణేతలు నిర్ణయించే విషయం కనక దానిపై వ్యాఖ్యలనవసరం. కానీ బావున్న కేటగిరీలో గ్వాలియర్ గ్రూప్ ప్రదర్శించి అత్యంత సాహసోపేత ప్రదర్శన (రాళ్లను మోయడం) చేర్చకపోతే పోయే, కనీసం వారిలా ప్రమాదకర విన్యాసాన్ని విజయవంతంగా ప్రదర్శించడాన్ని ప్రస్తావించకపోవడం సరిగా అనిపించలేదు. అది పోగా ఎందుకివి చేయడం అన్నట్లు జడ్జెస్ ముగ్గురూ మాట్లాడడమూ కొంత బాధ కలిగించే అంశం. కళారూపాలు అన్నీ సున్నితంగానే ఉండవు. కొన్ని ఇలా ప్రమాదభరితంగానూ ఉంటాయి. అలా అయితే సర్కస్ కళలోని కొన్ని అంశాలూ ప్రమాదభరితమైనవి (పులి నోట్లో తల పెట్టడం..తదితరాలు) అయితే వాటిలో కూడా తమ ప్రతిభ చూపించే సాహసవంతులూ మనకున్నారు. మీరిలాంటి కళ నెందుకెంచుకున్నారు అని ఓ న్యాయనిర్ణేత అడిగిన ప్రశ్నకు, ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి వారభినయించి ప్రశంసలు పొందినది కనుక, ఆ సంస్కృతినీ, వారసత్వాన్నీ కొనసాగించడానికి మేం దీన్ని ఎంచుకున్నాం అని వారిలో ఒకరు చెప్పిన సమాధానం సముచితంగా ఉంది. బహుశా న్యాయనిర్ణేతలు ఈ అంశం పట్ల అంతగా దృష్టి పెట్టి ఆలోచించక పోడానికి కారణం ఆ ముగ్గురిలో ఎవరికీ ఈ తరహా వాటి పట్ల అంతగా పరిచయం లేకపోవడం కావచ్చు. కనుక మల్టీ టాలెంటెడ్ షోగా దీన్ని చెప్పుకొస్తున్నారు కనుక కేవలం నృత్య, అభినయ, గాన రంగాల్లో పరిణితి చెందిన వారిని ఎంపిక చేసే సిద్ధహస్తుల్నే కాక ఇతర రంగాల్లోని కళాకారుల నిగ్గు తేల్చగల సామర్థ్యం ఉన్న వారినీ జతపరిస్తే బావుంటుంది.

Source: www.andhrabhoomi.net