Tuesday, February 22, 2011

‘ఉల్టా’ సింగర్!

సౌరభి డెబ్బరామా - తన లేలేత సొగసులతో.. చక్కటి చూపులతోపాటు - తీయటి గళ మాధుర్యంతో ‘ఇండియన్ ఐడల్’ ఫిమేల్ విన్నర్‌గా గెలిచిన అంశం జ్ఞాపకం ఉండే ఉంటుంది. ప్రస్తుతం ఈ ‘త్రిపుర’ సుందరి ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లోకి ఎక్కబోతోంది. న్యూజిలాండ్‌కి చెందిన ఓ గాయని ‘అప్‌సైడ్ డౌన్’ ప్రక్రియ ద్వారా మూడు నిమిషాల 25 సెకన్ల పాటు పాట పాడి రికార్డు సృష్టించింది. తాజాగా ‘సౌరభి’ ఆ రికార్డుని బద్దలు కొట్టి ఏకంగా నాలుగు నిమిషాలపాటు ఆలపించింది. ‘కలర్స్’ ఛానెల్‌లో కొన్ని నెలల్లో ఈ ‘ఫిట్’ ప్రసారం కానుంది. మేని విరుపుల్లోనే కాదు - పాట విరుపుల్లోనూ సరికొత్త పంథాని ప్రవేశపెట్టిన ‘ఇండియన్ ఐడల్’ సౌరభిని అభినందిద్దాం.

Source: www.andhrabhoomi.net

మార్పు మంచిదే!

ఏ సీరియల్ అయినా మొదలైందంటే - సుమారు ఏడాది గ్యారంటీ అన్న సిద్ధాంతం ఉండనే ఉంది. ఐతే - షూటింగ్‌ల్లో గొడవ వల్లనో.. లేదా మరే ఇతర కారణాల వల్లనో ఆయా సీరియళ్లలోని పాత్రధారులు మారిపోవటం సర్వసాధారణంగా జరిగే అంశం. చూస్తూ చూస్తూండగానే - ఫలానా కేరెక్టర్‌ని మార్చి ఈ ఫలానా కేరెక్టర్‌ని ప్రవేశపెడుతున్నాం అని స్క్రీన్ మీద ‘చిన్న’ కాప్షన్ కనిపిస్తుంది. ఆ హీరోయిన్ అయితేనే - బావుండేది. మధ్యలో దీన్ని తెచ్చి పెట్టారు? అంటూ సణుక్కున్నా.. చచ్చినట్టు చూడాల్సిందే. సరిగ్గా అదే పరిస్థితి ‘రిస్తోం సే బడీ ప్రతా’లో వచ్చింది. షాలినా చంద్రన్‌ని తీసేసి ‘బిడాయ్’ ఫేమ్ పరుల్ చౌహాన్‌ని తెచ్చి పెట్టారు. ఇప్పటికే ఆ ‘సురభి’ పాత్రతో జనాన్ని మైమరపింపజేసిన షాలిని నిష్క్రమించడం జనాన్ని తికమక పెట్టింది. కానీ - ఆమె సెట్స్‌పై ప్రదర్శించిన ‘అన్ ప్రొఫెషనల్ బిహేవియర్’ నిష్క్రమణకు కారణమని భోగట్టా. ‘కామెడీ సర్కస్’తో జనం దృష్టిలోనూ యూనిట్ దృష్టిలోనూ పడిన పరుల్ ఈ పాత్రకి న్యాయం చేస్తుందంటున్నారు. మరోవైపు - నేను ప్రొఫెషనల్ యాక్టర్‌ని. ఇంట్లో కూర్చుని ఆలోచించను. మళ్లీ సెట్స్‌పై కనిపిస్తానంటూ సవాల్ విసురుతోంది షాలిని. ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని వదులుకుని ‘ప్రతా’కై పాకులాడానని చెబుతోంది కూడా.

Source: www.andhrabhoomi.net

రియల్ రిలేషన్

సెట్స్‌లోనే ఒకటై పోవటం - ఈ మధ్య తరచూ జరుగుతోంది. గంటల తరబడి షూటింగ్‌లూ.. బిజీ షెడ్యూల్స్‌తో ఎప్పుడూ ఒకరిని ఒకరు అంటిపెట్టుకుని ఉండటంతో ‘ప్రేమ’ (?) ఆటోమేటిక్‌గా చిగురిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎన్నో జంటలు ఈ విధంగానే కలుసుకున్నాయి. పెళ్లిళ్లు చేసుకున్నాయి. ఆనక విడిపోయాయి కూడా. తాజాగా ‘ఉత్తరాన్’లో వీర్ (నందీష్ సంధూ) - తపస్య (రష్మీ దేశాయ్) కూడా ఇదే పంథాలో పెళ్లి చేసుకున్నారు. సీరియల్‌లో కేరెక్టర్లు కాదు.. రియల్ లైఫ్‌లోనే. కానీ - ఇదంతా గుట్టుచప్పుడు కాకండా జరిగిన వ్యవహారం. ‘ఆన్ స్క్రీన్ రిలేషన్’ని ‘రియల్ లైఫ్’లో నిజం చేసుకున్నారని ఆ నోటా ఈ నోటా మాట. ఇటీవల విజయనగరంలోని ఒక దేవాలయంలో పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత అటు నుంచటే ఘజియాబాద్ ‘తెహ్‌సిల్’ రిజిస్ట్రార్‌ని కలిసి మ్యారేజ్ సర్ట్ఫికెట్ కూడా తీసుకున్నార్ట. ‘ఉత్తరాన్’ సెట్స్‌లోనే డేటింగ్ చేసిన వీరిద్దరూ పలు అవార్డు ఫంక్షన్లకు జంటగా రావటంతో అప్పటి వరకూ అనుకున్న ‘రూమర్స్’ కాస్తా నిజాలయ్యాయి.

Source: www.andhrabhoomi.net

మరో 24/7 వంటల ఛానెల్!

మధ్యాహ్నం పూట - భోజనం చేసి కాస్తంత రిలీఫ్ కోసం... రిమోట్ ఆన్ చేశామా? ఇక అంతే. ‘వంట’ తాలూకు ఘుమఘుమలూ.. మసాలా ఘాటు.. వేడివేడి రుచులూ.. దేశ విదేశాల సరిహద్దులను దాటి - హాల్లోనే తిష్ఠ వేస్తాయి. అప్పటికే కడుపు నిండి ఉంది బాబోయ్ అన్నా.. ఛస్తే రిమోట్ మన మాట వినదు. పోనీ అలాగని - మరో ఛానెల్.. లేదూ మరో ఛానెల్.. ఇలా ఏ ఛానెల్ తిరగేసినా ఆ ‘టైం’కి వంటింటి హడావిడి అత్తగారి రూపంలోనో.. నల భీముల రూపంలోనో.. అత్తాకోడళ్ల రుసరుసల్లోనో కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే.. జనాన్ని తికమక పెట్టేసి ఆ వంటలన్నీ తినిపించేయాలన్న ఆత్రుత. సరిగ్గా ఇటువంటి సందిగ్ధావస్థనే పోదున్నే ‘టెలీ షాపింగ్’తో మొదలవుతుంది. ఆనక- ఏ సీరియల్‌లోకో వెళ్లిపోయినా.. యాడ్‌ల బాదరబందీ వెన్నాడు తుంది. ఆ మాటటుంచి - తాజాగా ఛానెళ్ల వంటింట్లోకి ప్రవేశిస్తే - ఇప్పటికే తన ‘వంటకాల’తో జనాలను చవులూరించిన చెఫ్ సంజీవ్ కపూర్ 24 గంటల ఫుడ్ ఛానెల్ ‘ఫుడ్ ఫుడ్’ని ఆస్ట్రో ఆల్ ఏషియా నెట్‌వర్క్ సహకారంతో ప్రారంభించాడు. అన్నీ భారతీయ వంటకాల రుచుల్నే పరిచయం చేస్తామంటూ చెప్పుకొచ్చినా, ఆ మాటని సరిహద్దులు దాటించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటికే పలు ఛానెళ్లలో పలు వంట కార్యక్రమాలతో చిరపరిచితుడైన ‘సంజీవ్’ తన సంజీవ్ కపూర్స్ కిచెన్, ఫిరంగి తడ్కా, సిర్ఫ్ 30 మినిట్, చెఫ్ కా ముఖాబ్‌లా, రెడీ స్టడీ కుక్, సదరన్ స్పైస్, ఫిల్మీ డబ్బా అండ్ టర్బన్ తడ్కా...తో మరింత చేరువయ్యాడు. వీటిలో ‘ఫిరంగి తడ్కా’నే తీసుకుంటే - అంతర్జాతీయ వంటకాల సమాహారం. ఏదో ఇంత అన్నం.. పప్పు పులుసు, గోంగూర పచ్చడితో సరిపెట్టుకునే మధ్య తరగతి సైతం ఆయా వంటకాల పట్ల మక్కువ చూపటంతో ఈ కార్యక్రమం జనాదరణ పొందింది. స్థానికంగా మార్కెట్‌లో దొరికే ఆహార పదార్థాలతోటి.. దినుసులతోటి ఆ వంటకాలను ఎంత రుచికరంగా చేయవచ్చో విశ్లేషిస్తూ చెప్పటంతో సహజంగానే జనం ఆ వైపు మొగ్గు చూపిన మాట వాస్తవం. సోమవారం మొదలుకొని గురువారం వరకూ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఇంతగా ప్రాచుర్యం పొందటంతో తదుపరి ‘ఫిల్మీ డబ్బా’ కూడా అంతే ఆదరణకు నోచుకుంది. ఈ షోలో బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా పాల్గొనటం.. మధ్యమధ్య సినీ క్లిప్పింగ్స్ సైతం చోటు చేసుకోవటంతో జనం తిండి కూడా మానేసి చూట్టం మొదలు పెట్టారు. ప్రతి కార్యక్రమంలోనూ వంటలతో పాటు ఆరోగ్య పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించటంతో - ఇప్పుడు జనం సాధారణ నూనె అని అడక్కండా ‘ఆలివ్’ ఆయిల్ అని అడగటం చెప్పుకోదగ్గ మార్పు అంటాడు సంజీవ్ కపూర్.

ఇక ‘చెఫ్ కా ముఖాబ్‌లా’లో ప్రొఫెషనల్ చెఫ్ ప్రతిరోజూ తమ అనుభవాలతోనూ పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించటం వెనుక కమర్షియల్ లాజిక్ ఉందంటాడు కూడా. సంజీవ్ తన ‘వంటల’ కార్యక్రమంలో ఒక్కో ప్రాంతంలోని వంటకాన్ని పరిచయం చేయటం మరో విశేషం. వీటన్నింటి అనుభవ సారాన్ని రంగరించి 24 గంటల ‘ఫుడ్ ఛానెల్’ని ప్రసారం చేస్తున్నాడు సంజీవ్. ఈ కార్యక్రమానికి లైఫ్ స్టైల్ అంబాసిడర్‌గా మాధురీ దీక్షిత్ వ్యవహరించటంతో మరింత క్రేజ్ పెరిగింది. జనవరి 24, జీ నెట్‌వర్క్ లో 24/7 ఫుడ్ ఛానెల్‌లో ‘జీ ఖానా ఖజానా’తో పాటు అల్వా బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మరిన్ని ‘లైఫ్ స్టైల్’ ఛానెల్స్‌ను నెలకొల్పేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి. ‘జీ ఖానా ఖజానా’లో ఇప్పటికే ‘ఏన్ ఇటాలియన్ ఇన్ మెక్సికో’లో జినో డి’అకాంపో, బ్రిటీష్ సెలెబ్రిటీ చెఫ్ జేమ్స్ మార్టిన్ లాంటి ప్రముఖులు పరిచయమవుతూ కొత్తకొత్త వంటకాలను ‘రుచి’ చూపించనున్నార్ట.

Source: www.andhrabhoomi.net

వైవిధ్యమా? వెర్రితనమా?

ఛానల్స్ మధ్య పోటీ తత్వం - వైవిధ్యం కోసం పడుతున్న పాట్లు తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 14 నుంచి జీ తెలుగు ఛానల్‌లో రాత్రి 9 గంటలకు ఆరంభమైన ‘కొండవీటి రాజా - కోటలో రాణి’ కార్యక్రమం చూస్తే సరిపోతుంది. గతంలో టీవీ అంటే సీరియల్స్, పోటీ, కథల్లో కొత్తదనం కోసం చేసే ఫీట్స్ పరిశీలకులకు గుర్తొచ్చేవి. కానీ సీరియల్స్ వాటి మానాన అవి నడుస్తున్నా రియాలిటీ షోల హవా ఇప్పుడు జాతీయ, ప్రాంతీయ ఛానల్స్‌లో నడుస్తోంది. ఆ ప్రయత్నంలో, పరంపరలో భాగమే ఈ అపోగ్రాం. కార్యక్రమ వ్యాఖ్యాత చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం పది మంది అందమైన అమ్మాయిలు (నగర నేపథ్యం కలవారు) ఇంకో పదిమంది ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన యువకుల్ని ఎలా నగర వాసులతో దీటుగా నాగరికా రీతులు అలవరచుకునేలా చేశారో అన్నది. ఇది అరవై రోజుల వ్యవధిలో జరిగే షో అని మాటిమాటికి చెప్పడం ‘మీరంతా (పాల్గొంటున్న వాళ్లు) రెండు నెలలు మీవారందర్నీ వదిలి ఉండాలి’ అనడం మొదలైనవి, దీనికి ఇటీవల హిందీ ఛానల్స్‌లో ఓ ఊపు ఊపేసిన ‘బిగ్‌బాస్’ స్ఫూర్తా అని ప్రేక్షకులకు కలిగితే అది వారు తప్పు కాదు. అయితే ఆ పంథా, ఈ పంథా వేరని స్పష్టమవుతున్నా, దీర్ఘకాల వ్యవధిని పదేపదే వ్యాఖ్యాత గుర్తు చేయడంతో ఈ గొడవంతా మైండ్‌లో రీళ్లరీళ్లలా తిరుగుతోంది.

ఈ మాదిరి డాన్సులెందుకు?
ఇప్పటివరకూ జరిగినది షో ప్రారంభ ఉపోద్ఘాతమే కనుక అసలు విషయాన్ని గూర్చి వ్యాఖ్యానించే అవకాశం లేదు. అయినా అన్నం అంతు తెలుసుకోవడం కోసం, అది మొత్తం అయ్యేవరకూ వుండనక్కర్లేదు. కేవలం ఒక మెతుకు పట్టుకుని చూస్తే సరిపోతుందంటారు. ఆ లైన్స్‌లో ఈ ప్రోగ్రామ్‌ని చూద్దాం. కొండవీటి రాజాలను మార్చే కోటలో రాణులను పరిచయంచేసే ఎపిసోడ్స్ ఇంతవరకూ వచ్చాయి. అలా వారిని మార్చే వారు ఇలా ఇందులో చేసినట్లు డాన్సులు ఆ స్థాయిలో చేయాలా? లేదా నాగరికతకు చిహ్నం ఈ మాదిరి నృత్యాలా అన్న ధర్మ సంకటం చూసే ప్రేక్షకునిలో కల్గింది. పోనీ అమ్మాయి ప్రతిభకు, మరో మనిషిని తీర్చిదిద్దేందుకు హై స్పీడ్ స్టెప్పులే సహకరిస్తాయా అన్నది అర్థం కాలేదు. అలా కాదు.. షోకు ఓ జోష్ ఇవ్వడానికి చూపరుల ఆసక్తి బిల్డప్ చేయడానికి ఈ టైప్ నృత్యాలను మినహాయించే మార్గం లేదా అన్నది డిసైడ్ చేయాలి. అలా అని నిర్ణయానికొస్తే ఇప్పుడు ఛానల్స్‌లో వస్తున్న పుంఖానుపుంఖాల డాన్స్ రియాలిటీ షోలకీ వీటికీ తేడా ఏమిటి? అప్పుడు ఈ ప్రోగ్రాం టైటిల్‌కి ట్యాగ్‌లైన్‌గా పెట్టిన ‘ది ఫస్ట్ ఎవ్వర్ రియాలిటీ షో’ అన్న దానికి న్యాయం ఎలా జరుగుతుంది? అన్నవి వీక్షకుణ్ణి వేధిస్తున్న ప్రశ్నలు ఇక ఇందాకా చెప్పినట్లు అభ్యర్థినికి అయిన వారితో మీ డాటర్‌ని వదిలి అరవై దినాలలు ఎలా ఉంటారు? అని ప్రశ్నించడం వగైరా లేనిపోని ఉత్కంఠతకు గురి చేస్తోంది. ఎందుకంటే ఓ ప్రోగ్రాం నియమ నిబంధనలు తెలిసే వారందులోకి వస్తారు కదా? మరి అలాంటి వాటికి ఇంతంత సమయాన్ని వృధా చేయాలా?

అన్నీ వారికీ తెలుసు..
ఇక ఏజెన్సీ ప్రాంతం వారు నగర జీవనానికీ, శైలికీ చాలా దూరం అన్నట్లు ఈ ప్రోగ్రాంలో చెప్పుకొచ్చారు. ఆ పరిస్థితి గతంలో ఉందేమోగానీ ఇప్పుడది లేదు. ఎలాగంటే వారంతా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నా, పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచం గుప్పిట్లో కొచ్చేసిన తరుణంలో దూరాలు చెరిగిపోయాయి. విషయాలు అందరికీ అవగతమవుతున్నాయి. ఈ తరుణంలో వాళ్లు నగర సంస్కృతికి దూరం అని అనడంలో అంత వాస్తవం కాదు. ఉదాహరణకు ఈ కార్యక్రమంలో వచ్చిన ఓ కొండవీటి రాజాని ఓ పాట పాడమని అడిగితే ఆ మధ్య వచ్చిన ‘రాజా’ చిత్రంలో ‘ఏదో ఒక రాగం...’ పాటను సునాయాసంగా ఆలపించేశాడు. దీన్నిబట్టి వర్తమాన అంశాలతో వారూ మమేకమవుతున్న తీరు స్పష్టమవుతోంది. అదీ కాకుండా వారి జీవనభృతి కోసం చేసే వస్తువులను, వగైరా అమ్మకాల నిమిత్తమైనా వారుండే ప్రాంతాలకు దగ్గరగా వున్న నగరాలకు వస్తూనే ఉంటారు.

భాషపై దృష్టి పెట్టాలి
కార్యక్రమంలో పాల్గొనే క్యాండిడేట్స్ వివిధ నేపథ్యాల నుంచి వస్తారు కనుక వారి వారి భాష, యాసల్ని నియంత్రించలేం. కానీ ప్రోగ్రాం మూల స్తంభంగా ఉండే యాంకర్ సైతం భాష విషయంలో శ్రద్ధ వహించకపోవడం ధర్మం కాదు. కానీ ఇందులో కొన్నిచోట్ల భాషోచ్ఛారణ విషయంలో అస్సలు దృష్టి పెట్టలేదు. దాని పర్యవసానమే కొన్నిచోట్ల వీక్షకుల్ని ఇబ్బంది పెట్టాయి.

పరిచయ సీన్లు శృతిమించాయి
మామూలుగా పార్టిస్పేట్ చేసే అభ్యర్థినుల్ని అలా మామూలుగా ఇంట్రడక్షన్ చేస్తే ఎలా అని కాబోలు, కొన్నిచోట్ల శృతి మించి చూపారు. ఇలాంటివి చూసే ‘చానళ్ల స్వీయ నియంత్రణ’ అనే చర్చ పదేపదే వస్తోంది. అందునా ఇలాంటివి తెలుగు టీవీకి అసలు శ్రేయస్కరం కాదు.

ఓ కొత్త తరహా ప్రోగ్రామ్‌ని ప్రెజెంట్ చేద్దామనే ఆలోచన అభినందనీయమైనా అందుకు ఎంచుకున్న ప్రాతిపదికల సాధికారికతను ధృవీకరించుకుని ‘కొండవీటి రాజా - కోటలో రాణి’ ముందుకెళ్తే మంచిది.

Source: www.andhrabhoomi.net

Monday, February 21, 2011

ఆఫర్ల మీద ఆఫర్లు

ఐసిసి ప్రపంచ క్రికెట్ పుణ్యమా అని వివిధ ఎలక్ట్రానిక్ సంస్థలు కస్టమర్లకు ఆఫర్‌లమీద ఆఫర్లు ఇస్తున్నాయి. ఎల్‍జి ఇండియా, శ్యాంసంగ్, వీడియోకాన్, తోషిబా, ఒనిడా లాంటి సంస్థలన్నీ ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా, పరోక్షంగా క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. తాము మ్యాచ్‌లను హైడెఫినిషన్ ఫార్మాట్‍లో ప్రసారం చేస్తామని ఎల్‍జి ఇండియా వర్గాలు చెబుతున్నాయి. తమ త్రీడి ఎల్‍ఇడి టివిని కొనుగోలు చేసినవారికి ఉచితంగా బ్లూరే ప్లేయర్‌ను అందజేస్తామని, కస్టమర్ 11 శాతం డౌన్ పేమెంట్ చేస్తే – మిగతా మొత్తాన్ని వడ్డీ లేకుండా 11 వాయిదాల్లో చెల్లించవచ్చని ఈ వర్గాలు తెలిపాయి. అలాగే శ్యాంసంగ్ తమ ఫ్లాట్ పానెల్ టివిని కొనుగోలు చేసేవారు మొదట 1999 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని అంటోంది. ప్రాసెసింగ్ ఫీజుగానీ, వడ్డీగానీ లేకుండా మిగతా మొత్తాన్ని 17 వాయిదాల్లో చెల్లించవచ్చని అంటోంది.

వీడియోకాన్ వారు ‘గోల్డ్‌కప్’ స్కీమ్‌ను ప్రవేశ పెట్టారు. తమ ఎల్‍సిడిని కొంటే – 22 క్యారెట్ల ప్యూర్‌గోల్డ్ కానుక లభించే స్క్రాచ్‌కార్డ్ సౌకర్యం ఉంటుందని వీడియోకాన్ అంటోంది. ఇంకా 8 వేల రూపాయల వరకు క్యాష్ ప్రైజులు కూడా ఉంటాయని ఈ సంస్థ ఊరిస్తోంది.

Source: medianx.tv

‘స్టార్ వరల్డ్’లో హారర్ సీరియల్

వీకెండ్స్‌లో హారర్ సీరియల్ ప్రసారంపై ‘స్టార్ వరల్డ్’ దృష్టిపెట్టింది. ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు “వాకింగ్ డెడ్” పేరిట హారర్ సీరియల్ ప్రసారమవుతుంది. కామిక్ బుక్ సిరీస్‌నుంచి టివి దర్శకుడు ఫ్రాంక్ డెరబోంట్ ఈ హారర్ సీరియల్‍ను నిర్మించారు. వలస వెళ్తున్న కొంతమంది దారిమధ్యలో భయంకర అనుభవాలను ఎదుర్కొంటారు. ఆ భయంకర శక్తులనుంచి తమను తాము రక్షించుకునేందుకు వారు పడిన పాట్లు ఇందులో చూపారు. “వాకింగ్ డెడ్” టైటిలే ‘డెడ్లీ’గా ఉంది కదూ!!!

Source: medianx.tv

ప్రాంతీయ భాషల్లో “ఫాక్స్” ప్రసారాలు

ఫాక్స్ ఇంటర్నేషనల్ ఛానల్ ఇక ప్రాంతీయ భాషల్లో తన ప్రసారాలను ప్రారంభించనుంది. ‘ఫాక్స్’ ఆధ్వర్యంలో వస్తున్న నేషనల్ జియొగ్రాఫిక్ ఛానల్ అరుదైన జంతుజాల విశేషాలను చూపుతోంది. హిందీ, తెలుగు, బెంగాలీ భాషల్లో వస్తున్న నేషనల్ జియొగ్రాఫిక్‌తో బాటు ‘నేషనల్ జియో అడ్వెంచర్’ అనే మరోకొత్త ఛానల్‍ను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, మలేసియాలలో వస్తున్న ఈ ఛానెల్ ప్రసారాలు త్వరలో భారత్‌లోనూ దర్శనమివ్వనున్నాయి. కేవలం అరుదైన జీవజాల విశేషాలనే కాక ఈ జీవజాలం అంతరించి పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావిస్తారు.

నేషనల్ జియొగ్రాఫిక్ ఛానల్ ప్రపంచ వ్యాప్తంగా 120 గంటల పాటు వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఈ ఛానల్‍కు ఓ వెబ్‍సైట్ కూడా ఉంది. భారత్‌లోని అరణ్యాలు, పర్వత ప్రాంతాలు, అరుదైన వన్య ప్రాణుల విశేషాలతో త్వరలో “నేషనల్ జియో వైల్డ్” ఛానల్ పిల్లలను, పెద్దలను అందరినీ అలరించనుంది.

Source: medianx.tv

కలైణర్ టివి కార్యాలయంపై సిబిఐ దాడులు

డిఎంకె ఆధ్వర్యంలోని కలైణర్ టివి కార్యాలయంపై సిబిఐ ముమ్మరంగా దాడులు జరిపింది. ఇందులో డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు సిఎం కరుణానిధి భార్య ఎం.కె. దాయాలు, కుమార్తె, ఎంపీకూడా అయిన కళిమొని భారీ షేర్‌హోల్డర్లుగా ఉన్నారు. 2 జిస్పెక్ట్రం కేసులో నిందితుడు, స్వాన్ టెలికామ్ ప్రమోటర్ అయిన షాహిద్ ఉస్మాన్ బల్వా – కలైణర్ టివిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని వార్తలు వచ్చాయి. ఆయనను ఇటీవలే సిబిఐ అరెస్ట్ చేసింది. టెలికాం మాజీమంత్రి రాజా నుంచి లబ్ది పొందిన వారిలో బల్వాకూడా ఒకరు. అయితే – తమ ఛానల్‍కు, ఈ కుంభకోణానికి సంబంధంలేదని కళిమొని అంటున్నారు. ‘గొప్పవారి గోత్రాలు ఎవరికెరుక’..!

Source: medianx.tv

కమర్షియల్స్ లేకుండా…

క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా టీవీల్లో మ్యాచ్‍లు చూస్తున్నప్పుడు- బ్రేక్‌లు వచ్చి అడ్వర్‌టైజ్‍మెంట్లు స్టార్ట్ కాగానే వారి అసహనానికి అంతుండదు. ఎప్పుడెప్పుడు అవి అయి‍పోతాయా అని ఎదురు చూస్తుంటారు. ఇక ఇప్పుడు వారికి ఆ బాధలేదు. ఛానెల్ ప్యాకేజీల కింద డిటిహెచ్ జెయింట్ టాటాస్కై‍ వారు- కమర్షియల్స్ లేని ప్రసారాలను మొదటిసారిగా అందించనున్నారు. ఇందు కోసం క్రికెట్ ప్రేమికులు 3999 రూపాయలు చెల్లించి అత్యాధునిక సెట్‍టాప్ బాక్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 625 గంటలపాటు రికార్డింగ్ కెపాసిటీ ఇందులో ఉంటుంది. అలాగే డిష్‌టీవీ కూడా 2390 రూపాయలకు హెచ్‌డి బాక్స్‌ను అందజేస్తుంది. ఇందులో 30 హెడి ఛానల్స్ సౌకర్యం కూడా ఉంటుంది. టాటాస్కై వారు అందించే ప్యాకేజీలో- క్రికెట్ ప్రేమికులు అవసరమైతే- క్రికెట్ కామెంటరీలను తమకు ఇష్టమైన భాషలో వినవచ్చు.
 
Source: medianx.tv