Tuesday, February 22, 2011

మరో 24/7 వంటల ఛానెల్!

మధ్యాహ్నం పూట - భోజనం చేసి కాస్తంత రిలీఫ్ కోసం... రిమోట్ ఆన్ చేశామా? ఇక అంతే. ‘వంట’ తాలూకు ఘుమఘుమలూ.. మసాలా ఘాటు.. వేడివేడి రుచులూ.. దేశ విదేశాల సరిహద్దులను దాటి - హాల్లోనే తిష్ఠ వేస్తాయి. అప్పటికే కడుపు నిండి ఉంది బాబోయ్ అన్నా.. ఛస్తే రిమోట్ మన మాట వినదు. పోనీ అలాగని - మరో ఛానెల్.. లేదూ మరో ఛానెల్.. ఇలా ఏ ఛానెల్ తిరగేసినా ఆ ‘టైం’కి వంటింటి హడావిడి అత్తగారి రూపంలోనో.. నల భీముల రూపంలోనో.. అత్తాకోడళ్ల రుసరుసల్లోనో కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే.. జనాన్ని తికమక పెట్టేసి ఆ వంటలన్నీ తినిపించేయాలన్న ఆత్రుత. సరిగ్గా ఇటువంటి సందిగ్ధావస్థనే పోదున్నే ‘టెలీ షాపింగ్’తో మొదలవుతుంది. ఆనక- ఏ సీరియల్‌లోకో వెళ్లిపోయినా.. యాడ్‌ల బాదరబందీ వెన్నాడు తుంది. ఆ మాటటుంచి - తాజాగా ఛానెళ్ల వంటింట్లోకి ప్రవేశిస్తే - ఇప్పటికే తన ‘వంటకాల’తో జనాలను చవులూరించిన చెఫ్ సంజీవ్ కపూర్ 24 గంటల ఫుడ్ ఛానెల్ ‘ఫుడ్ ఫుడ్’ని ఆస్ట్రో ఆల్ ఏషియా నెట్‌వర్క్ సహకారంతో ప్రారంభించాడు. అన్నీ భారతీయ వంటకాల రుచుల్నే పరిచయం చేస్తామంటూ చెప్పుకొచ్చినా, ఆ మాటని సరిహద్దులు దాటించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటికే పలు ఛానెళ్లలో పలు వంట కార్యక్రమాలతో చిరపరిచితుడైన ‘సంజీవ్’ తన సంజీవ్ కపూర్స్ కిచెన్, ఫిరంగి తడ్కా, సిర్ఫ్ 30 మినిట్, చెఫ్ కా ముఖాబ్‌లా, రెడీ స్టడీ కుక్, సదరన్ స్పైస్, ఫిల్మీ డబ్బా అండ్ టర్బన్ తడ్కా...తో మరింత చేరువయ్యాడు. వీటిలో ‘ఫిరంగి తడ్కా’నే తీసుకుంటే - అంతర్జాతీయ వంటకాల సమాహారం. ఏదో ఇంత అన్నం.. పప్పు పులుసు, గోంగూర పచ్చడితో సరిపెట్టుకునే మధ్య తరగతి సైతం ఆయా వంటకాల పట్ల మక్కువ చూపటంతో ఈ కార్యక్రమం జనాదరణ పొందింది. స్థానికంగా మార్కెట్‌లో దొరికే ఆహార పదార్థాలతోటి.. దినుసులతోటి ఆ వంటకాలను ఎంత రుచికరంగా చేయవచ్చో విశ్లేషిస్తూ చెప్పటంతో సహజంగానే జనం ఆ వైపు మొగ్గు చూపిన మాట వాస్తవం. సోమవారం మొదలుకొని గురువారం వరకూ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఇంతగా ప్రాచుర్యం పొందటంతో తదుపరి ‘ఫిల్మీ డబ్బా’ కూడా అంతే ఆదరణకు నోచుకుంది. ఈ షోలో బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా పాల్గొనటం.. మధ్యమధ్య సినీ క్లిప్పింగ్స్ సైతం చోటు చేసుకోవటంతో జనం తిండి కూడా మానేసి చూట్టం మొదలు పెట్టారు. ప్రతి కార్యక్రమంలోనూ వంటలతో పాటు ఆరోగ్య పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించటంతో - ఇప్పుడు జనం సాధారణ నూనె అని అడక్కండా ‘ఆలివ్’ ఆయిల్ అని అడగటం చెప్పుకోదగ్గ మార్పు అంటాడు సంజీవ్ కపూర్.

ఇక ‘చెఫ్ కా ముఖాబ్‌లా’లో ప్రొఫెషనల్ చెఫ్ ప్రతిరోజూ తమ అనుభవాలతోనూ పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించటం వెనుక కమర్షియల్ లాజిక్ ఉందంటాడు కూడా. సంజీవ్ తన ‘వంటల’ కార్యక్రమంలో ఒక్కో ప్రాంతంలోని వంటకాన్ని పరిచయం చేయటం మరో విశేషం. వీటన్నింటి అనుభవ సారాన్ని రంగరించి 24 గంటల ‘ఫుడ్ ఛానెల్’ని ప్రసారం చేస్తున్నాడు సంజీవ్. ఈ కార్యక్రమానికి లైఫ్ స్టైల్ అంబాసిడర్‌గా మాధురీ దీక్షిత్ వ్యవహరించటంతో మరింత క్రేజ్ పెరిగింది. జనవరి 24, జీ నెట్‌వర్క్ లో 24/7 ఫుడ్ ఛానెల్‌లో ‘జీ ఖానా ఖజానా’తో పాటు అల్వా బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మరిన్ని ‘లైఫ్ స్టైల్’ ఛానెల్స్‌ను నెలకొల్పేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి. ‘జీ ఖానా ఖజానా’లో ఇప్పటికే ‘ఏన్ ఇటాలియన్ ఇన్ మెక్సికో’లో జినో డి’అకాంపో, బ్రిటీష్ సెలెబ్రిటీ చెఫ్ జేమ్స్ మార్టిన్ లాంటి ప్రముఖులు పరిచయమవుతూ కొత్తకొత్త వంటకాలను ‘రుచి’ చూపించనున్నార్ట.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment