ఛానల్స్ మధ్య పోటీ తత్వం - వైవిధ్యం కోసం పడుతున్న పాట్లు తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 14 నుంచి జీ తెలుగు ఛానల్‌లో రాత్రి 9 గంటలకు ఆరంభమైన ‘కొండవీటి రాజా - కోటలో రాణి’ కార్యక్రమం చూస్తే సరిపోతుంది. గతంలో టీవీ అంటే సీరియల్స్, పోటీ, కథల్లో కొత్తదనం కోసం చేసే ఫీట్స్ పరిశీలకులకు గుర్తొచ్చేవి. కానీ సీరియల్స్ వాటి మానాన అవి నడుస్తున్నా రియాలిటీ షోల హవా ఇప్పుడు జాతీయ, ప్రాంతీయ ఛానల్స్‌లో నడుస్తోంది. ఆ ప్రయత్నంలో, పరంపరలో భాగమే ఈ అపోగ్రాం. కార్యక్రమ వ్యాఖ్యాత చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం పది మంది అందమైన అమ్మాయిలు (నగర నేపథ్యం కలవారు) ఇంకో పదిమంది ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన యువకుల్ని ఎలా నగర వాసులతో దీటుగా నాగరికా రీతులు అలవరచుకునేలా చేశారో అన్నది. ఇది అరవై రోజుల వ్యవధిలో జరిగే షో అని మాటిమాటికి చెప్పడం ‘మీరంతా (పాల్గొంటున్న వాళ్లు) రెండు నెలలు మీవారందర్నీ వదిలి ఉండాలి’ అనడం మొదలైనవి, దీనికి ఇటీవల హిందీ ఛానల్స్‌లో ఓ ఊపు ఊపేసిన ‘బిగ్‌బాస్’ స్ఫూర్తా అని ప్రేక్షకులకు కలిగితే అది వారు తప్పు కాదు. అయితే ఆ పంథా, ఈ పంథా వేరని స్పష్టమవుతున్నా, దీర్ఘకాల వ్యవధిని పదేపదే వ్యాఖ్యాత గుర్తు చేయడంతో ఈ గొడవంతా మైండ్‌లో రీళ్లరీళ్లలా తిరుగుతోంది.
ఈ మాదిరి డాన్సులెందుకు?
ఇప్పటివరకూ జరిగినది షో ప్రారంభ ఉపోద్ఘాతమే కనుక అసలు విషయాన్ని గూర్చి వ్యాఖ్యానించే అవకాశం లేదు. అయినా అన్నం అంతు తెలుసుకోవడం కోసం, అది మొత్తం అయ్యేవరకూ వుండనక్కర్లేదు. కేవలం ఒక మెతుకు పట్టుకుని చూస్తే సరిపోతుందంటారు. ఆ లైన్స్‌లో ఈ ప్రోగ్రామ్‌ని చూద్దాం. కొండవీటి రాజాలను మార్చే కోటలో రాణులను పరిచయంచేసే ఎపిసోడ్స్ ఇంతవరకూ వచ్చాయి. అలా వారిని మార్చే వారు ఇలా ఇందులో చేసినట్లు డాన్సులు ఆ స్థాయిలో చేయాలా? లేదా నాగరికతకు చిహ్నం ఈ మాదిరి నృత్యాలా అన్న ధర్మ సంకటం చూసే ప్రేక్షకునిలో కల్గింది. పోనీ అమ్మాయి ప్రతిభకు, మరో మనిషిని తీర్చిదిద్దేందుకు హై స్పీడ్ స్టెప్పులే సహకరిస్తాయా అన్నది అర్థం కాలేదు. అలా కాదు.. షోకు ఓ జోష్ ఇవ్వడానికి చూపరుల ఆసక్తి బిల్డప్ చేయడానికి ఈ టైప్ నృత్యాలను మినహాయించే మార్గం లేదా అన్నది డిసైడ్ చేయాలి. అలా అని నిర్ణయానికొస్తే ఇప్పుడు ఛానల్స్‌లో వస్తున్న పుంఖానుపుంఖాల డాన్స్ రియాలిటీ షోలకీ వీటికీ తేడా ఏమిటి? అప్పుడు ఈ ప్రోగ్రాం టైటిల్‌కి ట్యాగ్‌లైన్‌గా పెట్టిన ‘ది ఫస్ట్ ఎవ్వర్ రియాలిటీ షో’ అన్న దానికి న్యాయం ఎలా జరుగుతుంది? అన్నవి వీక్షకుణ్ణి వేధిస్తున్న ప్రశ్నలు ఇక ఇందాకా చెప్పినట్లు అభ్యర్థినికి అయిన వారితో మీ డాటర్‌ని వదిలి అరవై దినాలలు ఎలా ఉంటారు? అని ప్రశ్నించడం వగైరా లేనిపోని ఉత్కంఠతకు గురి చేస్తోంది. ఎందుకంటే ఓ ప్రోగ్రాం నియమ నిబంధనలు తెలిసే వారందులోకి వస్తారు కదా? మరి అలాంటి వాటికి ఇంతంత సమయాన్ని వృధా చేయాలా?
అన్నీ వారికీ తెలుసు..
ఇక ఏజెన్సీ ప్రాంతం వారు నగర జీవనానికీ, శైలికీ చాలా దూరం అన్నట్లు ఈ ప్రోగ్రాంలో చెప్పుకొచ్చారు. ఆ పరిస్థితి గతంలో ఉందేమోగానీ ఇప్పుడది లేదు. ఎలాగంటే వారంతా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నా, పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచం గుప్పిట్లో కొచ్చేసిన తరుణంలో దూరాలు చెరిగిపోయాయి. విషయాలు అందరికీ అవగతమవుతున్నాయి. ఈ తరుణంలో వాళ్లు నగర సంస్కృతికి దూరం అని అనడంలో అంత వాస్తవం కాదు. ఉదాహరణకు ఈ కార్యక్రమంలో వచ్చిన ఓ కొండవీటి రాజాని ఓ పాట పాడమని అడిగితే ఆ మధ్య వచ్చిన ‘రాజా’ చిత్రంలో ‘ఏదో ఒక రాగం...’ పాటను సునాయాసంగా ఆలపించేశాడు. దీన్నిబట్టి వర్తమాన అంశాలతో వారూ మమేకమవుతున్న తీరు స్పష్టమవుతోంది. అదీ కాకుండా వారి జీవనభృతి కోసం చేసే వస్తువులను, వగైరా అమ్మకాల నిమిత్తమైనా వారుండే ప్రాంతాలకు దగ్గరగా వున్న నగరాలకు వస్తూనే ఉంటారు.
భాషపై దృష్టి పెట్టాలి
కార్యక్రమంలో పాల్గొనే క్యాండిడేట్స్ వివిధ నేపథ్యాల నుంచి వస్తారు కనుక వారి వారి భాష, యాసల్ని నియంత్రించలేం. కానీ ప్రోగ్రాం మూల స్తంభంగా ఉండే యాంకర్ సైతం భాష విషయంలో శ్రద్ధ వహించకపోవడం ధర్మం కాదు. కానీ ఇందులో కొన్నిచోట్ల భాషోచ్ఛారణ విషయంలో అస్సలు దృష్టి పెట్టలేదు. దాని పర్యవసానమే కొన్నిచోట్ల వీక్షకుల్ని ఇబ్బంది పెట్టాయి.
పరిచయ సీన్లు శృతిమించాయి
మామూలుగా పార్టిస్పేట్ చేసే అభ్యర్థినుల్ని అలా మామూలుగా ఇంట్రడక్షన్ చేస్తే ఎలా అని కాబోలు, కొన్నిచోట్ల శృతి మించి చూపారు. ఇలాంటివి చూసే ‘చానళ్ల స్వీయ నియంత్రణ’ అనే చర్చ పదేపదే వస్తోంది. అందునా ఇలాంటివి తెలుగు టీవీకి అసలు శ్రేయస్కరం కాదు.
ఓ కొత్త తరహా ప్రోగ్రామ్‌ని ప్రెజెంట్ చేద్దామనే ఆలోచన అభినందనీయమైనా అందుకు ఎంచుకున్న ప్రాతిపదికల సాధికారికతను ధృవీకరించుకుని ‘కొండవీటి రాజా - కోటలో రాణి’ ముందుకెళ్తే మంచిది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment