Monday, September 13, 2010

రేటింగ్స్ : 29 ఆగస్టు – 4 సెప్టెంబర్

మూడో స్థానంలోకి సాక్షి
ఆగస్టు 29- సెప్టెంబర్ 4 వారంలో సాక్షి న్యూస్ చానల్ మార్కెట్ వాటా గణనీయంగా పెరిగింది. జగన్ ఓదార్పు యాత్ర జరిగిన ప్రతి సారీ ఆ చానల్ రేటింగ్ పెరగటం ఇంతకుముందు కూడా గమనించాం. ఈ సారి వై ఎస్ మొదటి వర్ధంతి సందర్భంగా వివిధ చానల్స్ లో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమాలకు కూడా ఆదరణ బాగా ఉన్నట్టు రేటింగ్స్ ను బట్టి అర్థమవుతోంది. అయితే ఈ సారి ప్రత్యేకంగా సాక్షిలో వై ఎస్ వర్ధంతి తో బాటు జగన్ యాత్ర కూడా కలసిరావడంతో రేటింగ్ సహజంగానే పెరిగింది.
పుంజుకున్న టీవీ5, ఐ న్యూస్
మూడు వారాలుగా తగ్గుతున్న టీవీ5 ఈ సారి కాస్త పుంజుకుంది. అయినప్పటికీ మొదటి స్థానంలో ఉన్న టీవీ 9 లో సగానికే పరిమితం కాక తప్పటం లేదు. టీవీ9 గత మూడు వారాలలో తగ్గుదల నమోదు చేసుకుంటున్నప్పటికీ ఇదే పరిస్థితి. దాాపుగా అన్ని చానల్స్ కొద్దో గొప్పో తగ్గుతున్నా టీవీ5, రాజ్ న్యూస్, ఐ న్యూస్ కొద్దిపాటి పెరుగుదలనే నమోదుచేసుకున్నాయి. వరుసగా రేటింగ్స్ పునరుద్ధరించుకోవటం ద్వారా ఐ న్యూస్ బాగానే కోలుకుంటోంది.
 పంపిణీ మీద దృష్టి పెట్టిన జెమినీ న్యూస్
ఎంటర్టైటన్మెంాట్ చానల్స్ లో నెంబర్ వన్ జెమిని టీవీ. న్యూస్ లో ఆఖరిస్థానం జెమిని న్యూస్. పే చానల్ గా జనం నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుండటంతో కేబుల్ ఆపరేటర్లు చచ్చినట్టు దీనికి కూడా డబ్బు చెల్లిస్తూ చానల్ ను ఎక్కడొ దూరంగా విసిరేస్తూ వచ్చారు. ఇప్పుడు జెమినీ యాజమాన్యం న్యూస్ చానల్ ను కూడా కాస్త ప్రముఖంగా చూపించాలని ఆపరేటర్లను పదే పదే కోరుతోంది. దాని ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. రేటింగ్స్ చార్టులో స్థానం ఇంకా మారకపోయినా కాస్త మెరుగుదల ఇప్పుడిప్పుడే మొదలైంది.
ఆగిన ఆర్టీవీ కి రేటింగ్స్ ఏలనో ?
 ఆ మధ్య అకస్మాత్తుగా శాటిలైట్ సమస్యతో దాదాపు నలభై చానల్స్ ఆగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలోనే జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభం కావటం, ఆగిన చానల్స్ లో సాక్షి కూడా ఉండటంతో నిజం తెలియని కొంతమంది దీని వెనుక కుట్రకోణం గురించి కూడా ఆలోచించారు. అది ప్రమాదవశాత్తూ జరిగిందేనని తరువాత తేలిందనుకోండి. ఆ సమయంలో సాక్షి టీవీ వెంటనే వనితలో ప్రసారమయ్యేలా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకున్నారనుకోండి. ఆ తరువాత కొద్దిరోజులకే ఇస్రో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అయితే, ఆర్టీవీ మాత్రం ప్రత్యామ్నాయానికి ఒప్పుకోలేదు. అలా ప్రసారాలు ఆపేసింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే, ఆపేసిన ఆర్టీవీ కి సైతం ఎంతో కొంత రేటింగ్ ఇవ్వాలని టామ్ భావించినట్లుంది. నాలుగు వారాలుగా ఇదే ధోరణి. కచ్చితత్వానిని తిరుగులేదని చెప్పుకునే టామ్ మరి గాల్లో లేని చానల్ కూ రేటింగ్ ఎలా ఇవ్వగలుగుతోందో ? టామ్ డొల్ల తనానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటుంటుందా ?

Source: bhavanarayana.co.tv

No comments:

Post a Comment