Thursday, June 3, 2010

ఇంగ్లీషంటే ఎందుకంత దడ?

బి.ఎ., ఎం.ఎ., సి.ఎ., ఫార్మసీ, మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, మైక్రో బయాలజీ, గ్రాఫిక్స్‌, కంప్యూటర్స్‌, ఆర్టు, కల్చరు.. మనం ఎందులోనూ వెనకబడిలేం. ప్రతిదాంట్లో ప్రపంచ దేశాలతో పోటీపడ్తున్నాం. నిజానికి అభివృద్ధి చెందిన దేశాలకంటే అనేక విషయాలలో మనం అగ్రస్ఠానంలో ఉన్నాం. బ్రహ్మాండమైన స్కిల్‌ చూపిస్తున్నాం. విదేశీ కంపెనీలూ మనవాళ్ళకెె ఎక్కువ ప్రిఫరెన్సు ఇస్తాయి. తెలివిలో, నైపుణ్యంలో ఇంత పురోగతి సాధించిన మనం ఇంగ్లీషులో మాత్రం ఎందుకో చాలా వెనకబడి ఉన్నాం. నర్సరీ రైమ్స్‌తో మొదలుపెడితే స్కూలు, కాలేజీ ఎక్కడ చూసినా ఇంగ్లీషే. అన్ని సబ్జెక్టులూ ఇంగ్లీషులోనే చదువుతున్నాం. అయినా ఆ భాషలో మాట్లాడాలంటే బెదురు...ఎక్కడ లేని బెరుకు. పొఫెషనల్‌ కోర్సులు చేసిన స్టూడెంట్లు, ఉన్నతోద్యోగాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులు తమ సబ్జెక్టులో దిట్టలుగా వుండి కూడా ఇంగ్లీషులో మాట్లాడాల్సి వస్తే మట్టుకు హడలిపోతుంటారు. జి.కె. దగ్గర్నుంచి కరెంట్‌ ఎఫైర్స్‌ వరకూ అన్నీ క్షుణ్ణంగా తెలిసి కూడా ఇంటర్వ్యూ గనుక ఇంగ్లీషులో నిర్వహిస్తే తడుముకుంటూ, తడబడుతు ఏమీ రాని మొద్దుల్లా ఎలిమినేట్‌ అయిపోవడం ఎంత విషాదం?!

గొప్ప ప్రావీణ్యం వుండి కూడా ఆంగ్లంలో మాట్లాడే చొరవ, నేర్పు లేక ప్రమోషన్లు ఆగిపోవడం ఎంత అన్యాయం?! ఏ మిస్టరీ గురించో టీవీ ఛానల్‌తో రెండు ముక్కలు ఆంగ్లంలో మాట్లాడాల్సి వస్తే పోలీసాఫీసర్లు తడుముకోవడం, తప్పులు మాట్లాడ్డం ఎంత విడ్డూరం?! ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇంకా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు ఎందరో ఆంగ్లం మాట చెబితే ఒణికిపోతుంటారు. ఆఖరికి మిస్‌ యూనివర్స్‌ లాంటి అందాల పోటీల్లో పాల్గొనే భామలు కూడా తాము మాతృభాషలో మాట్లాడిందానికి మరొకరు ట్రాన్స్‌లేటర్‌ కావాల్సిరావడం, జర్నలిస్టుల్లాంటివాళ్ళకి రెండు వాక్యాలు ఇంగ్లీషు రాక, ఏ కలక్టర్లనో, ఎయిర్‌ హోస్టెస్‌లనో ఇంటర్వ్యూ చేయాల్సివస్తే ఒడ్డునపడ్డ చేపల్లా గిలగిలలాడటం, సాదాసీదా ఉద్యోగులు తమ చిన్నారులు ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలంటే కాన్వెంట్‌ టీచర్లతో ఆంగ్లమే మాట్లాడాలి గనుక ఖంగుతినడం... ఇవన్నీ అనేక సందర్భాల్లో అనేకసార్లుఎదురయ్యే సంఘటనలు, సన్నివేశాలు.

అసలింతకీ ఇంగ్లీషులో ఎందుకు వెనకబడ్తున్నాం? ప్రస్తుత ప్రభుత్వ స్కూళ్ళు కొందరు టీచర్లకు జీతభత్యాలు ఇచ్చి పోషించే ధర్మసంస్థలుగా ఉపయోగపడుతున్నాయని మనందరికీ తెలుసు. ఈ నిజాన్ని గుర్తించినందుకే ప్రభుత్వం కూడా ఇంగ్లీషు మీడియంలో సిబిఎస్‌ఇ కోర్సును తేవాలని తహతహలాడుతూ కొన్ని ప్రయత్నాలు చేసింది. ఇంగ్లీషులో నాలుగు ముక్కలు రాకుంటే ఎందుకూ పనికిరారని అట్టడుగు వర్గాలవాళ్ళు కూడా రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని కాన్వెంట్లలో చేరుస్తున్నారు. తమ చిన్నారులు చిలకపలుకుల్లా ఇంగ్లీషు వల్లిస్తుంటే వాళ్ళు పెద్దవాళ్ళవుతున్నారనే ధైర్యం..ఏదో తెలీని ఆనందం. చదవేయక ముందు కాకరకాయ చదవేశాకా కీకరకాయ అన్నాడన్నట్టు వాళ్ళు మాట్లాడేది బొట్లర్‌ ఇంగ్లీష్‌ అని తేలిపోతే అది నేర్పేవాళ్ళ తప్పా? నేర్చుకునేవాళ్ళ తప్పా? గ్రామర్‌ రాక ఇబ్బందా? ఒకాబులరీ లేక కష్టమా? నిజానికి ఆంగ్లభాష క్లిష్టమైన భాష కాదు. ఇంగ్లీషొస్తే ప్రపంచంలో ఏ మారుమూలైనా బ్రతికేయొచ్చు. అందునా, ఇంగ్లీషు మేడీజీ లాంటి పుస్తకాలు వందల కొద్దీ మార్కెట్లో దొరుకుతున్నాయి. స్పోకెన్‌ ఇంగ్లీషు కోసం ప్రత్యేకించి అనేక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. సిడిలలో వీడియో క్లాసులు దొరుకుతున్నాయి. పత్రికలు కూడా ఒక పేజీ కేటాయించి ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి.

మనచుట్టూ ఇంగ్లీషే వున్నా వంటబట్టకపోవడానికి అదేం పాదరసమా? ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకున్న వాళ్ళు కూడా ఆంగ్లంలో గడగడా మాట్లాడలేకపోవడం విచిత్రం కాదా? ఇంగ్లీష్‌ రాయగలిగేవాళ్ళు కూడా సంభాషించాలంటే సంశయి స్తారేం? తమకు ఇంగ్లీషు రాదేమోనన్న భయం, తప్పు మాట్లాడ్తామే మోనన్న వెరపు, తోటివాళ్ళు నవ్వుతారేమోనన్న సిగ్గు, వచ్చీరాని భాషతో అభాసు పాలవడం కంటే అసలే మాట్లాడకపోవడం మిన్న అనే ధోరణి. ఇవన్నీ కలిసి ఇంగ్లీష్‌లో మాట్లాడనీయకుండా చేస్తాయి. ఇక కొందరు ధైర్యం చేసి మాట్లాడే మాట వాస్తవమేగానీ అది కర్ణకఠోరమైన భాష. తెలుగుయాసలో కలిసిపోయి వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీషో తెలుగో అర్థంకాని విధంగా ఉంటుంది. వాళ్ళలోనూ అత్యధికం తప్పులు మాట్లాడేవాళ్ళే. ఈ మాట వింటే ఆంగ్లం మాట్లాడే సాహసవీరులు, వీరమ్మలు యమా చిరాగ్గా ''మాట్లాడలేదంటారు, మాట్లాడ్తేనేమో తప్పులంటూ వంకలు పెడ్తారు'' అని కసురుకోగలరు. మొన్నామధ్య వచ్చిన శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌ సినిమా గుర్తొస్తోంది కదూ.. అవును అందులో హీరో ''ముందుంది ముసళ్ళ పండగ'' లాంటి తెలుగు సామెతల్ని ''ఇన్‌ ఫ్రంట్‌ క్రోకోడైల్స్‌ ఫెస్టివల్‌'' అని అనువదించి ''ఏంటీ?!'' అని చిరాకుపడిన వ్యక్తితో ''నీకు అర్థం చేసుకునేపాటి తెలివి లేదులే'' అనేస్తాడు. అది సినిమా గనుక మనసారా నవ్వుకుంటాంసరే.. నిజ జీవితంలో సంగతేంటి? మక్కీకి మక్కీగా ''రెడ్‌ హ్యాండెడ్‌గా'' అంటే ''ఎర్రచేత్తో'' తరహా ట్రూ ట్రాన్స్‌లేషన్స్‌ చేస్తే కవి హృదయం అర్థం చేసుకోగలమా? బాటిల్‌కి, బ్యాటిల్‌కి తేడా లేకుండా ప్రొనౌన్స్‌ చేసేవాళ్ళను భరించగలమా?! ఇతర అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి ఎనభై పైన వచ్చి ఆంగ్లంలో మాత్రం అత్తెసరు మార్కులు వచ్చిన వాళ్ళు, మొదటికే మోసమై తప్పిపోయేవాళ్ళూ ఉన్నారు. అవతలి వ్యక్తితో ఆంగ్లంలోనే మాట్లాడాలంటే పెద్ద ముప్పు ముంచుకొచ్చినట్టుగా ముచ్చెమట్లు పట్టేవాళ్ళెందరో! దీనికి విరుగుడు ఏమిటి? ఈ విషయంలో పెద్దలు ఏమంటారో చూద్దాం.

విద్యాభ్యాసంలక్ష్యం మారింది

- విష్ణుశర్మ, ఇంగ్లీషు భాషావేత్త, హైదరాబాద్‌

ఉన్నత చదువులు కేవలం ఉద్యోగాల కోసమే అన్నచందంగా మారాయి. సైన్స్‌ తప్ప మరే సబ్జెక్ట్‌ చదివే పరిస్థితిలో విద్యార్థులు లేరు. దేశం అంటే అమెరికా, ఆట అంటే క్రికెట్‌, పరీక్ష అంటే ఎంసెట్‌ అన్న విధంగా తల్లిదండ్రులు , విద్యార్థులు ఆలోచిస్తున్నారు. భాష నేర్చుకోవడానికి తగిన వాతావరణం కల్పించడంలో

ఉపాధ్యాయులు విఫలం అవుతున్నారు. కేవలం క్రామింగ్‌ అండ్‌ వామిటింగ్‌ అన్న చందంగా నేటి విద్యాబోధన మారింది. సమాచారమార్పిడి కోసమే భాష అనుకుంటున్నారు. భాషాపరిజ్ఞానం వల్ల ఉపయోగం ఏమిటో నేటి తరానికి తెలియడం లేదు. ఇంగ్లీషు మాట్లాడ అవకాశం గాని సరైన వ్యాకరణం గాని చెప్పే ఉపాద్యాయులు లేరు. -స|శష| శషపుూఠ|స| షఠ| స|ష ూ శి| షశీ| -శస| ుౌ శిా శషపుూఠ|స| ష|ౌ’ అని వినోబాబావే అన్నారు. కాని నేడు ఆ పరిస్థితి లేదు. ఇది కేవలం ఉపాధ్యాయుల లోపం కాదు, తల్లిదండ్రుల బాధ్యతారహిత్యం కూడా ఉంది. ఎంతసేపు తమ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని కోరుకుంటున్నారు తప్ప వారు మాట్లాడే భాషను, వారి కున్న పరిజ్ఞానాన్ని గమనించడం లేదు. కమ్యూనికేషన్‌ కోసమే భాష అనుకుంటున్నారు. అందుకే నేటి తరం మాట్లాడే భాషలో గ్రామర్‌ లేదు, స్పష్టత లేదు. శెnగషశగ| షఠ| ు|ఠ-|, గసశపప|స షఠ| షఠnగ, ూఠ-ఠ ష షశసష nషు షఠ| పుషుn. అన్న

విషయం మర్చిపోతున్నారు.

'సన్నగిల్లిన సర్వీసు మాెెటో'

- సుబ్బలక్ష్మి, హెచ్‌.ఎం., శారదావిద్యాలయ్‌, హైదరాబాద్‌

గతంలో తెలుగుమీడియంలో చదివినప్పటికీ ఎంతో బాగా ఇంగ్లీషు మాట్లాడేవారు. కాని ఇప్పుడు తెలుగు, హిందీ తప్ప అన్నీ సబ్జెక్ట్స్‌ ఇంగ్లీషులో అభ్యసిస్తున్నా ఇంగ్లీషు భాష పై పట్టు రావడం లేదు. ఇందుకు కారణం భాష పై ఆసక్తి లేకపోవడం, ఉపాధ్యాయులలో సర్వీసుమాెెటో తగ్గిపోవడం. మా స్కూల్‌ తెలుగుమీడియం అయినప్పటికీ మొదటి తరగతి నుంచే ఇంగ్లీషును బోధిస్తున్నాం. ఐదవ తరగతికి వచ్చేసరికి విద్యార్థులకు కనీసం ఇంగ్లీషు అక్షరాలు, చిన్నచిన్న పదాలు చదవడం, స్పష్టంగా రాయడం నేర్పిస్తున్నాం. భాషపై ఉపాధ్యాయులకు ఆసక్తి ఉండాలి. విద్యార్థులకు నేర్పించాలన్న సేవాభావం రావాలి. అప్పుడే విద్యార్థులకు భాషపై పట్టు పెరుగుతుంది. కేవలం పరీక్షల్లో మార్కుల కోసం కాకుండా విజ్ఞానాన్ని పెంచేలా భాషను నేర్పాలి.

భయం పోగొట్టాలి

- డాక్టర్‌ రాంప్రసాద్‌, సైకాలజిస్ట్‌, పాలకొల్లు

ఇంగ్లీషు భాష అంటేనే విద్యార్థులకు భయం. 26 అక్షరాల భాషను నేర్చుకోవడానికి, పట్టు సాధించడానికి జంకుతారు. దాన్ని భూతంలాగా చూస్తారు. పరీక్షలో పాస్‌ అయితే చాలు అన్నట్లుగా భావిస్తారు. ఉపాధ్యాయులకు సరైన భాష నైపుణ్యం లేకపోవడం కూడా విద్యార్థుల అనాసక్తికి కారణం. గ్రామీణప్రాంతాల్లో విద్యార్థులకు ఇంగ్లీష్‌ పై అస్సలు అవగాహన లేదు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎంతసేవు రాయడం గురించి శ్రద్ధతీసుకుంటారు తప్ప విద్యార్థుల్లో స్పీకింగ్‌ స్కిల్స్‌ నేర్పించక పోవడం వల్ల ఇంగ్లీషులో మాట్లాడడానికి భయపడుతుంటారు.

పుస్తకాలు చదవకనే...!

- సీతాలత, పిజి లెక్చరర్‌, హైదరాబాద్‌

పదవతరగతి వరకు ప్రతిరోజు ఒక పిరియడ్‌గా ఉన్న భాషా కాస్లులు ఇంటర్‌ లోకి రాగానే వారానికి ఒక్క క్లాసుగా మారుతాయి. ఇంటర్‌లో ఇతర సబ్జెక్ట్‌లకు ఇచ్చిన విలువ ఇంగ్లీషుకు ఇవ్వడం లేదు. కేవలం పరీక్షల్లో పాస్‌ కావడానికి చదవాల్సిన సబ్జెక్‌గా చూస్తున్నారే తప్ప భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే విషయంగా భావించడం లేదు. వొకాబులరీ, గ్రామర్‌లను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ లోపం విద్యావ్యవస్థలోనే ఉంది. డిగ్రి, పిజిలలో అయితే ఇంగ్లీషుకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కాలేజీలలో ఇతర సబ్జెక్టులు ఇంగ్లీషులో చదివినా ఇంట్లో , స్నేహితులతో హిందీ, తెలుగు, ఇంగ్లీషు మూడు భాషలు కలిపి ఓ కొత్తభాషలో మాట్లాడుతున్నారు. ఏ భాష పైనా పట్టు సాధించడం లేదు. ఫలితంగా స్పష్టమైన భాషను ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడే పరిస్థితి కరువైంది.

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment