నందమూరి తారక రామారావు... తెలుగు వారు మరిచిపోలేని పేరు. తెలుగు సినిమా రంగంపై విశేషమైన ప్రభావం చూపించిన ఏకైక నటుడు. అంతేకాదు.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తన నటన విశేష ఖ్యాతిని దక్కించుకున్న అరుదైన నటుడు ఎన్టీఆర్. అసలు ఎన్టీఆర్.. తెలుగు సినిమాల్లో ఎవరికీ రానంత పేరు ప్రఖ్యాతులు ఎన్టీఆర్‌కు ఎలా వచ్చాయి..
దేవతల ప్రతిరూపాలను రాజారవివర్మ చిత్రాలుగా మలిస్తే.. వారిని సజీవరూపంలో తెలుగు వారి ముందు సాక్షాత్కరింపజేశారు.. నందమూరి తారక రామారావు. తెలుగు వెండితెరపై.. దేవుళ్ల పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసి.. ప్రేక్షకులను మైమరిపించిన ఏకైక నటుడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే రూపం చిలిపి కృష్ణుడిదే. మువ్వగోపాలుడిలా ఎన్టీఆర్ మెప్పించినంతగా మరొకరు ఇంతవరకూ నటించలేకపోయారంటే.. ఆ పాత్రలో ఆయన ఎంతలా జీవించారో అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడి పాత్రలో చిలిపిదనాన్ని పండించినా.. సత్యభామతో సరసాలాడినా.. రుక్మిణి దగ్గర పరిపూర్ణపతిగా దర్శనమిచ్చినా.. అది ఎన్టీఆర్‌కు మాత్రమే చెల్లింది. సన్నివేశానికి తగ్గట్లుగా హావభావాలను పండించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. కళ్లల్లో తేజస్సుతో.. ప్రశాంత వదనంతో శ్రీకృష్ణ పాత్రలో కనిపించడం ఎన్టీఆర్ ప్రత్యేకత
మాయాబజార్ సినిమాతో మొదలైన ఎన్టీఆర్ శ్రీకృష్ణ మాయ మరెన్నో సినిమాల్లో కొనసాగింది. శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణపాండవీయం, శ్రీకృష్ణ తులాభారం, దానవీర శూర కర్ణ.. ఇలా అప్రతిహతంగా సాగింది. ఎన్ని సినిమాల్లో కృష్ణుడిగా నటించినా ఒకే పాత్రను చూస్తున్నామన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలగదు. అదే ఎన్టీఆర్ మహత్యం. శ్రీకృష్ణ పాత్రలో అత్యంత అలవోకగా నటించి అందరినీ మెప్పించారు రామారావు. ఈ పాత్ర పోషించడానికి ముందే.. శ్రీకృష్ణుడు గురించి చాలా అధ్యయనం చేశారట ఎన్టీఆర్. అందుకే కాబోలు.. అసలైన కృష్ణుడు ఎన్టీఆర్‌లానే ఉంటాడేమో అన్నంతగా తెలుగు వారిపై ముద్ర వేయగలిగారు.
కృష్ణుడు మాత్రమే కాదు.. రాముడన్నా ఎన్టీఆరే. లవకుశలో రాముడిగా ఎన్టీఆర్ ప్రదర్శించిన నటన అమోఘం, అద్వితీయం. నవరసాలనూ అత్యద్భుతంగా పండించారు. రాముడిగా ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు.
జీరోలను హీరోలు చేసిన ఎన్టీఆర్
చరిత్రలో కొంతమంది చెడ్డవాళ్లుగా.. దుష్టులుగా ముద్రపడ్డారు. అలాంటి వారిలో ముందుండేది మహాభారతంలో ధుర్యోధనుడు. మహాభారతం ఆధారంగా రూపొందిన చాలా సినిమాల్లో ధుర్యోధనుడే ప్రధాన ప్రతినాయకుడు. ఎంత దుర్మార్గంగా చూపించాలో అంతలా అందరూ చూపించారు. కానీ.. ఎన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించి నిర్మించిన దానవీరశూర కర్ణ సినిమా విషయం మాత్రం వేరు. స్నేహానికి ప్రాణమిచ్చిన మహాన్నత వ్యక్తిగా ధుర్యోధనుడిని ఈ పాత్రలో చూపించారు ఎన్టీఆర్. ధీరత్వంతో పాటు.. రాజసం ఉట్టిపడేలా ధుర్యోధన పాత్రలో ఎన్టీఆర్ నటించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఎన్టీఆర్ దెబ్బకు.. అఖిలాంధ్ర ప్రేక్షకులు కూడా ధుర్యోధనుడిని హీరోగానే చూశారు.. దానవీర శూరకర్ణను సూపర్ హిట్ చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా వెలుగుతున్న కాలంలోనే ఈ సాహాసానికి పూనుకున్నారు ఎన్టీఆర్. ధుర్యోధనుడిలాంటి ప్రతినాయక ఛాయలున్న క్యారెక్టర్లో నటించడమే కాదు.. ఆ పాత్రకు హీరోయిజాన్ని అద్దాలంటే ఎంత ధైర్యం కావాలి. అంతటి తెగువ ఉంది కాబట్టే ఈ సినిమాను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. అప్పటివరకూ విలన్‌గానే చూసిన ధుర్యోధనుడిని హీరోగా ప్రేక్షుకులు అంగీకరిస్తారా అన్న అనుమానం ఉన్నప్పటికీ తన నటనతో దాన్ని అధిగమించగలిగారు ఎన్టీఆర్. పైగా.. తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద సినిమా ఇది. అయినా.. ఎక్కడా బిగువు తగ్గదు. అంతేకాదు.. ధుర్యోధనుడికీ మనుసుందని, అతనూ రసికుడేనంటూ.. పాటలనూ చిత్రీకరించారు. అదే ఎన్టీఆర్ గొప్పదనం.
ఓ వైపు ధుర్యోధనుడిగా రాజసం వలికిస్తూనే.. కర్ణుడిగానూ తన ప్రత్యేకతను చాటుకున్నారు ఎన్టీఆర్. కర్ణుడుగా.. ధుర్యోధనుడిగా ఒకే ఫ్రేంలో కనిపించినా.. రెండు పాత్రలకూ భిన్నమైన నటనతో అలరించారు. ఇక ఇదే సినిమాలో శ్రీకృష్ణుడిగానూ కనిపించి.. ప్రేక్షకులను మైమరిపించారు. ఒకే సినిమాలో మూడు పాత్రలకూ.. మూడు రకాల హావభావాలతో తన నటనా కౌశలాన్ని చాటి చెప్పారు. అందుకే.. ఎన్టీఆర్ అంటే.. ఎన్టీఆరే.
రావణబ్రహ్మ
రాముడంటే ఎన్టీఆరే.. అంతేకాదు.. రావణుడన్నా ఎన్టీఆరే. రాముడి పాత్రలో ఎంతగా మెప్పించారో.. అంతలా రావణుడిగానూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు ఎన్టీఆర్. రాముడి పాత్రలో ఎంత అద్భుతంగా నటించారో.. అదే తరహాలో రావణుడి పాత్రలోనూ జీవించారు. పరస్పర విరుద్ధమైన ఈ పాత్రలను అవలీలగా పోషించగలిగారు ఎన్టీఆర్.
రావణుడు రాక్షసుడు. పైగా సీతను అపహరించుకువెళ్లిన దుష్టుడు. రామాయణం తెలిసిన ప్రతీ ఒక్కరికీ రావణుడు విలనే. సినిమాలో రావణుడుది చిన్న క్యారెక్టరే అయితే పోషించడానికి పెద్దగా ఇబ్బంది లేదు కానీ.. పూర్తి నిడివి ఉన్న పాత్రను చేయడానికి ఎన్టీఆర్ లాంటి హీరోకి సాహసమే అనుకోవాలి. కానీ, అలాంటి సవాళ్లను ఎదుర్కోవడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే... రావణుడిగానూ వెండితెరపై ప్రత్యక్షమయ్యారు. రావణుడిలోని మానవతా కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు. రావణుడి పాత్రలో కంటతడి పెట్టి.. ప్రేక్షకుల గుండెలు బరువెక్కించారు.
ఏదో ఓ సినిమాలోనే కాదు.. సీతారామకళ్యాణం, భూకైలాష్, సీతారామవనవాసం, శ్రీకృష్ణ సత్య, శ్రీరామ పట్టాభిషేకం సినిమాల్లో ఎన్టీఆర్ రావణుడిగా కనిపిస్తారు. ఇందులో.. సీతారామకళ్యాణం, భూకైలాష్‌లో ఎన్టీఆర్ నటన అజరామరమనే చెప్పాలి. దైవమాయలో రావణుడు ఎలా చిక్కుకుపోయాడో.. భూకైలాష్, సీతారామకళ్యాణం సినిమాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ సినిమాలు చూస్తే.. అతి భయంకరుడైన రావణుడిపైనా మనకు సాఫ్ట్ కార్నర్ కలగకమానదు. ఆ ఫీల్ వచ్చిందంటే.. కచ్చితంగా అది ఎన్టీఆర్ మాయే.
పాత్రలతో ప్రయోగాలు
నటించడం అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. రకరకాల పాత్రలో నటించడమంటే మరీ ఇష్టం. అంతేకాదు.. పాత్రలతో ప్రయోగాలు చేయడంలో ఎన్టీఆర్‌ను మించిన వారు లేరు. అందుకే.. తెలుగు సినిమాల్లో ఆయన చేసినన్ని పాత్రలు.. వేసినన్ని వేషాలు మరొకరు వేయలేకపోయారు. అందుకే.. ఆయన అవతార పురుషుడయ్యాడు.
ఇటు పౌరాణిక చిత్రాల్లోనూ .. అటు సాంఘిక సినిమాల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా రాణిస్తున్న సమయంలో పోషించిన పాత్ర ఇది. హీరోగా గంభీరమైన పాత్రల్లో కనిపించే ఎన్టీఆర్ ఒక్కసారిగా బృహన్నల పాత్రలో హొయలు పోవడం చూసి.. సినీ ప్రపంచం విస్తుపోయింది. పాత్ర ఏదైనా దానికి జీవం పోయడం ఎన్టీఆర్‌కు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అందుకే.. నర్తనశాలలో బృహన్నల పాత్రకు అంతలా పేరొచ్చింది. ఇలాంటి క్యారెక్టర్లు ఎన్టీఆర్ నట జీవితంలో ఎన్నో ఉన్నాయి. డీగ్లామర్ పాత్రల విషయానికి వస్తే.. హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తున్న సమయంలోనే.. అంటే 1972లో బడిపంతులులో నటించారు ఎన్టీఆర్. ఇందులో వృద్ధ తండ్రి పాత్రను పోషించారు. పిల్లలు సరిగ్గా పట్టించుకోకపోతే.. తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడతారో ఈ సినిమాలో చూపించారు.
కన్యాశుల్కంలో గొప్పలు చెప్పుకునే గిరీశం పాత్ర వేసినా.. రాజు-పేదలో బిచ్చగాడిగా నటించినా.. తిక్క శంకరయ్యలో పిచ్చోడిగా కనిపించినా.. గుడిగంటలు సినిమాలో యాంటీ హీరోగా చేసినా.. అది రామారావుకే సాధ్యమయ్యింది. ఇక విప్లవాత్మక భావాలు పలికించే పాత్రల్లోనూ ఎన్టీఆర్ జీవించారు. సర్దార్ పాపారాయుడు, బెబ్బులి పులి సినిమాల్లో ఎన్టీఆర్ నటన ఎప్పటికీ మరిచిపోలేం. డైలాగ్ డెలివరీలో, ఎక్స్‌ప్రెషన్స్‌లో తనకు మరెవరూ సాటిలేరని ఈ సినిమాలతో నిరూపించారాయన. అంతేకాదు.. తెలుగు సినీ పరిశ్రమలో పవర్‌ఫుల్ యాక్టింగ్‌కు మారుపేరుగా నిలిచారు.
శివాజీగా, కట్ట బ్రహ్మనగా, అల్లూరి సీతారామరాజుగా, సుభాష్ చంద్రబోస్‌గా ఒకే పాటలో దర్శనమిచ్చిన ఎన్టీఆర్‌కు.. కొత్త కొత్త అవతారాలెత్తడం అంటే మహా సరదా. అందుకే తన నటజీవితంలో మరెవరూ చేయలేనన్ని పాత్రలను పోషించారు ఎన్టీఆర్. చారిత్రక, పౌరాణికాల్లో గొప్ప గొప్ప వ్యక్తులందరినీ తనలో తెలుగు ప్రేక్షకులకు చూపించారు ఎన్టీఆర్. శివుడిగా తన నటవిశ్వరూపం చూపించినా... భీష్ముడిగా ప్రతిజ్ఞ చేసినా.. అక్భర్‌గా సలీం అనార్కలీ ప్రేమకథను తిరస్కరించినా.. అలెగ్జాండర్‌ను ఎదిరించిన చంద్రగుప్తునిగా కనిపించినా అది ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమయ్యింది. పలనాటి బ్రహ్మనాయుడుగానూ ఎన్టీఆర్ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ వైవిధ్యభరితమైన పాత్రలు వేశారు. ముఖ్యంగా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాలో విభిన్నమైన పాత్రలను ఎన్టీఆర్ పోషించారు. బ్రహ్మేంద్రస్వామిగా కనిపించడంతో పాటు.. యోగి వేమనగా, గౌతమ బుద్దునిగానూ కనిపిస్తారు. వీరబ్రహ్మంగా తన నటనాఅనుభవాన్ని రంగరించి పాత్రకు ప్రాణం పోశారు. వీర బ్రహ్మేంద్రస్వామి ఎలా ఉంటారో తెలియని వారందరికీ.. ఆయనపేరు చెప్పగానే ఎన్టీఆరే గుర్తుకు వస్తారు.
భారత ఇతిహాస, చారిత్రక పాత్రల్లో ఎవరూ పోషించనన్ని పాత్రలను వెండితెరపై ఆవిష్కరించారు నందమూరి తారకరామారావు. బహుశా ఆయన పోషించని పాత్రలు వేళ్లపైనే లెక్కపెట్టవచ్చు. సాంఘిక చిత్రాల్లోనూ సినిమా సినిమాకు తన వేషధారణలో మార్పును చూపెట్టేవారు. ఇంకా చెప్పాలంటే సినిమాకో అవతారం ఎత్తేవారు. అందుకే.. ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో సుస్థిరస్థానం ఏర్పాటు చేసుకున్నారని చెప్పవచ్చు.
Source: www.24gantalu.co.cc
No comments:
Post a Comment