హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్ కు బయ్యారం గనులతో ఉన్న సంబంధాన్ని బయటపెడుతూ రామోజీ నేతృత్వంలోని ఈనాడు దినపత్రిక ప్రచురించిన వార్తాకథనంపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక ఎదురుదాడికి దిగింది. రామోజీపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రాబబునాయుడిపై విరుచుకు పడింది. వారిద్దరికి మధ్య గల సంబంధాలపై, వారికి ఇతర పారిశ్రామికవేత్తలతో ఉన్న సంబంధాలపై వివరమైన వార్తాకథనాన్ని ప్రచురించింది. కోట్లు గోలేమిటి రామో...చంద్రా, మీ పెన్ను మెదడు చితికిందా అనే శీర్షిక కింద ఆ వార్తాకథాన్ని ప్రచురించింది. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో 2001లో డిబీర్స్ అనే సంస్థకు రాయలసీమలో వజ్రాల అన్వేషణకు పాతిక లక్షల ఎకరాలను కేటాయించినట్లు ఆరోపించింది. ఐఎంజి భూముల పాత్రధారి బిల్లీరావుతో చంద్రబాబు, బిజెపి నాయకుడు దత్తాత్రేయ దిగిన ఫోటోను ప్రచురించింది. తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో అధికారం ఎవరి బినామీ, రామోజీ - చంద్రబాబుల అనుబంధం అసలు కథ ఏమి అంటూ ఆ ఇద్దరు కరచాలనం చేసుకుంటున్న ఫొటోను ప్రచురించింది.
దొంగ నోట్ల కేసులో నిందితుడు రామకృష్ణ గౌడ్ తో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు దిగిన ఫొటోను ప్రచురించింది. దొంగెవరు, దొరెవరు అని వ్యాఖ్యానించింది. సుజనా చౌదరి, సిఎం రమేష్, నామా నాగేశ్వర రావులతో చంద్రబాబు ఫొటోను ప్రచురించి వారు ఎవరికి బినామీలంటూ ప్రశ్నించింది. వారికి ఎంపి సీట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేసింది. మంత్రులతో సమానంగా వారి సరసన ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు రామోజీరావుకు పీటం వేసిన విషయాన్ని ఫొటో ద్వారా గుర్తు చేసింది. రామోజీరావు పత్రికను నడుపుతున్నది ప్రజల కోసమా, పాలకులను శాసించడానికి అని సాక్షి దినపత్రిక తన వార్తాకథనంలో ప్రశ్నించింది. స్విస్ బ్యాంకులకు సంబంధించి, ఇతర వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సాక్షి ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది.
Source: thatstelugu.oneindia.in
No comments:
Post a Comment