Friday, July 9, 2010

దొరస్వామిరాజు..'మహాభారతం'

''తింటే గారెలే తినాలి. వింటే మహాభారతమే వినాలి'' అంటారు. పంచమవేదంగా ప్రసిద్ధిపొందిన మహాభారతాన్ని ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు తెరపై చూసినా తనివితీరదని చెబుతుంటారు. లోగడ హిందీలో వచ్చిన 'మహాభారత్‌' సీరియల్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. ఇప్పుడు వి.యం.సి. దొరస్వామిరాజు తెలుగులో 'మహాభారతం' సీరియల్‌ నిర్మాణానికి పూనుకున్నారు. వివిధ సాంఘిక చిత్రాలతో పాటు 'అన్నమయ్య', 'వెంగమాంబ' వంటి చిత్రాల నిర్మాతగా దొరస్వామిరాజుకు మంచిపేరుంది. కాగా బుల్లితెర ద్వారా ఆయన సంధించబోతున్న ఈ సీరియల్‌కు ఉదయభాస్కర్‌ దర్శకుడు. ఈ తరహా సీరియల్స్‌కు దర్శకుడిగా ఆయన పెట్టిందిపేరు. శ్రీకృష్ణుడిగా సాయికిరణ్‌, అర్జునుడిగా అశోక్‌కుమార్‌, ద్రౌపదిగా సన ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత దొరస్వామిరాజు మాట్లాడుతూ, 'గతంలో హిందీలో బి.ఆర్‌.చోప్రా తీసిన 'మహాభారత్‌' సీరియల్‌ను భాష తెలియకపోయినా అందరూ ఎంతోబాగా చూశారు. ఒక యజ్ఞంగా భావించి ఈ సీరియల్‌ను తీస్తున్నాం. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా, లాభనష్టాల గురించి ఆలోచించకుండా నిర్మాణం జరుపుతున్నాం. ఏ టీవీ ఛానల్‌లో దీనిని ప్రసారం చేయాలన్నది అనుకోలేదు' అని అన్నారు.

దర్శకుడు ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ, 'భారతీయుల రక్తంలో కలసిపోయిన కథ మహాభారతం అందుకే ఈ సీరియల్‌కు శ్రీకారం చుట్టాం. ఇందులో పద్యాలు కూడా ఉంటాయి ' అని అన్నారు.

సాయికిరణ్‌ మాట్లాడుతూ, 'నిజజీవితంలో మహాభారతం నాకు మార్గ దర్శకం. నేను సమస్యల్లో ఉన్నప్పుడు నాకు మహాభారతమే దిక్సూచి అయ్యింది. కృష్ణుడి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నాను' అని చెప్పారు. అశోక్‌కుమార్‌, సన తదితరులు ఈ సీరియల్‌లో నటించడం ఆనందదాయకమని అన్నారు. ఈ సీరియల్‌కు సంగీతం: అర్జున్‌, నిర్మాణ నిర్వహణ: విజయ్‌కుమార్‌వర్మ, దర్శకత్వం: ఉదయభాస్కర్‌, పి.వాగ్ధేవి.

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment