Monday, July 12, 2010

చానల్స్‌ ప్రచార ప్రభావం నిల్‌



  • జగన్‌ యాత్రా ప్రచారంపై కేంద్ర ఇంటిలిజెన్స్‌ నివేదిక
  • హైకమాండ్‌కు తొలగిన ఉత్కంఠ
  • బ్యాక డ్రాప్‌ సంగీతంతో యాత్రపై లైవ్‌, చర్చాగోష్ఠులపై వీక్షకుల అనాసక్తి
  • యాత్ర తొలి రోజు ఉత్కంఠ ఆపై ఆ చానళ్ల రేటింగ్‌లో మార్పు
  • న్యూస్‌ చానల్స్‌ కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్స్‌కే పెరిగిన రేటింగ్‌
  • రేటింగ్‌ ఆధారంగా నివేదికలు తయారు చేసిన ఇంటిలిజెన్స్‌ వర్గాలు

హైదరాబాద్‌, కాంగ్రెస్‌ అధిష్ఠానానికి జగన్‌ ఉత్కంఠ తొలగింది. ఓదార్పు యాత్ర స్పందన, మీడియా సృష్టిస్తున్న హైప్‌లను పరిశీలించిన పార్టీ హైకమాండ్‌ దీన్ని కాచి ఒడపోసేసింది. కేంద్ర ఇంటిలిజెన్స్‌ వర్గాలు అతి తేలిగ్గానే ప్రజల్లో యాత్ర ప్రభావాన్ని అంచనాలు కట్టేశాయి. ఓదార్పుయాత్ర, దీని ప్రభావంపై తెలుగువార్తా ఛానళ్ళన్నీ నిరంతరాయంగా ప్రసారాలు చేస్తున్నాయి. రెండోవిడత ఓదార్పు యాత్ర తొలిరోజు సాదాసీదాగా సాఫీగానే సాగిన ప్రసారాలు రెండోరోజు నుంచి ఊపందుకున్నాయి. యాత్రను అడుగడుగునా కవర్‌ చేయడంలో వార్తాఛానళ్ళు పోటీ పడుతున్నాయి. 'బ్యాక్‌డ్రాప్‌'లో హోరెత్తించే పాటలు, వాయిద్యాలతో జనాన్ని తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ పండితులు, సీనియర్‌ జర్నలిస్టులు, వివిధవర్గాలకు చెందినప్రముఖులను ఆహ్వానించి యాత్ర ప్రభావంపై చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నాయి. తద్వారా యాత్రకు మంచి హైప్‌ సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి. యాత్రకు విపరీత స్పందనున్నట్లుగా ప్రచారం చేసేందుకు జగన్‌ వర్గం చేస్తున్న ప్రయత్నాలే యాత్రపై ప్రజాభిప్రాయాన్ని ఖచ్చితంగా పసిగట్టేందుకు ఇంటిలిజెన్స్‌ వర్గాలకు దోహదపడ్డాయి.
గత మూడు రోజులుగా తెలుగు నిరంతర వార్తా ప్రసారాలందిస్తున్న ఛానళ్ళ రేటింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో యాత్రకు సంబంధించిన వార్తా కథనాలు, విశ్లేషణలకోసం పాఠకులు వార్తాపత్రికలపైనే ఎక్కువగా ఆధారపడుతున్న విషయం ఇంటిలిజెన్స్‌కు రూఢీ అయింది. దీన్నే ఇంటిలిజెన్స్‌ వర్గాలు రాష్ట్ర గవర్నర్‌తో పాటు కేంద్ర హోమ్‌శాఖకు కూడా నివేదికలుగా అందించాయి. గత మూడురోజుల్లో తెలుగువార్తా ఛానళ్ళ కంటే వినోద ప్రధాన ఛానళ్ళ రేటింగ్‌ పెరిగింది. ఇందుకు గల కారణాలను ఇంటిలిజెన్స్‌ పరిశీలించింది. ఒకే విషయాన్ని పదే పదే ప్రసారం చేస్తూ ప్రజల్లో హైప్‌ సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయని కూడా గుర్తించింది.
ప్రారంభ దశలో ఓదార్పు యాత్ర రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠకు తెరతీసింది. ఇదెలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లో నెలకొంది. అధిష్ఠానం జగన్‌ ఇమేజ్‌కు తలొగ్గుతుందా ? లేకుంటే జగన్‌ భవిష్యత్‌ ప్రణాళికలు ఎలాగుంటాయన్న చర్చ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాక జాతీయ స్థాయిలో చోటు చేసుకుంది. అధిష్ఠానం ఈ యాత్రపై అసహనంగా ఉందని, జగన్‌ తీరుపై ఆవేదన వ్యక్తంచేస్తోందని, జగన్‌ ఇలా ప్రవర్తించి ఉండాల్సిందికాదన్న ఒకేఒక్కవ్యాఖ్యతో ముఖ్యమంత్రి రోశయ్య కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులందరినీ యాత్రకెళ్ళకుండా కట్టడి చేయగలిగారు. శ్రీకాకుళం జిల్లాలో నాలుగురోజుల యాత్ర సాగినా ఒక్క ఎమ్‌పి లేదా ఎమ్మెల్యే ప్రత్యక్షంగా యాత్రలో పాల్గొనలేదు. కానీ సోమవారం నుంచి తూర్పుగోదావరిజిల్లాలో జరిగే యాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలంతా పాల్గొంటారని జగన్‌ వర్గం అంచనాలువేస్తోంది. జిల్లాలో యాత్ర సాగినన్నాళ్లూ వీరంతా తమవెంటే ఉంటారని ఆశిస్తోంది. ఈ
జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేల్లో పలువురు జగన్‌ సాయంతోనే టికెట్లుపొందారు. వైఎస్‌ కుటుంబ ఆర్ధిక సాయంతోనే ఎన్నికల్లో నెగ్గుకొచ్చారు. ఇప్పటికీ పలువురికి జగన్‌తో ఆర్ధిక లావాదేవీలు, వ్యాపార సంబంధాలున్నాయి. అయినా అధిష్ఠానం వీరిని కూడా కట్టడి చేస్తోందన్న ఆందోళన జగన్‌ శిబిరంలో నెలకొంది. ఈ కారణంగానే జగన్‌ ఆత్మవిశ్వాసం కోల్పోయి బేలగా అధిష్ఠానంపై విమర్శలకు పాల్పడుతున్నట్లు పరిశీలకులు గుర్తించారు. తన కోసం ప్రాణాలు పెట్టేందుకైనా సిద్ధంగా వున్న తూర్పు ఎమ్మెల్యేలు, మంత్రుల్ని అధిష్ఠానం కట్టడి చేస్తోందంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలకు ఇదే కారణంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో బలహీన నాయకత్వం ఉందంటూ రోశయ్యపై అసహనాన్ని వ్యక్తం చేయడం కూడా ఈ ఉక్రోషంతోనేనని అంచనాలువేస్తున్నారు. అయినా తూర్పులో ఓదార్పును ఘనవిజయం చేసేందుకు జగన్‌ వర్గం పక్కా ప్రణాళికలు రూపొందించింది. తన సాధనసంపత్తినంతా వినియోగించి ఇక్కడియాత్రను ముందుకు నడిపించనుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొన్నా లేకున్నా యాత్రకు మాత్రం ప్రజాస్పందన విపరీతంగా లభించే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment