దూరదర్శన్ ఎందుకు వెనుకబడిందో అధికారులకు తెలియక కాదు.. దాన్ని ముందుకునడిపించాలనే చిత్తశుద్ధిలేకనే అది వెనుకబడింది. ఒకరో, ఇద్దరో అధికారులు నిజంగా ప్రయత్నించినా అడ్డుకునే రాజకీయనాయకులు ఎలాగూ ఉండనే ఉన్నారు. కర్ణుడి చావుకు కారణాలలాగానే దూరదర్శన్ దుస్థితికీ చాలా కారణాలున్నాయి. ( Doordarshan Days పేరుతో భాస్కర్ ఘోష్ రాసిన పుస్తకంలో చాలా విషయాలున్నాయి. ఇప్పుడు మార్కెట్లో లేదు కాబట్టి చదవాలనుకున్నా కుదరదు. అందుకే మరో సందర్భంలో ఆ పుస్తకాన్ని సమీక్షిద్దాం.) ఇప్పుడు అకస్మాత్తుగా దూరదర్శన్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ప్రసారభారతి కోసం 1540 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డబ్బుతో డిజిటలైజేషన్ చేపట్టి ప్రసార నాణ్యత పెంచుతారట. ప్రసారాల నాణ్యతకూ, ప్రసారనాణ్యతకూ తేడా గుర్తించకపోవటం వలన మరో సారి జరుగుతున్న భారీ దుబారా ఇది. ఇటీవలే యాభై ఏళ్లు పూర్తిచేసుకున్న దూరదర్శన్ ఈ సందర్భంగా తగిన విధంగా ఆత్మ విమర్శ కూడా చేసుకోలేదనటానికి ఇదొక నిదర్శనం. ఇప్పటికే పరికరాలు, మౌలికవసతులమీద వేలకోట్లు ఖర్చుపెట్టి, కార్యక్రమాల నాణ్యతను గాలికొదిలేసిన దూరదర్శన్ అదే తప్పు కొనసాగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నా, ప్రసారభారతి పరిధిలోకి చేర్చినా మౌలికంగా దూరదర్శన్ లో రావలసిన మార్పులు రాలేదని గత యాభై ఏళ్ల చరిత్ర మనకు చాటి చెబుతూనే ఉంది.
దూరదర్శన్ మనదేశంలోకి అనుకోని అతిథిగానే వచ్చింది. ఫిలిప్స్ కంపెనీ ఒక ఎగ్జిబిషన్ ముగించుకుని వెళ్ళేముందు 21 టీవీసెట్లు బహుమతిగా వదిలి వెళితే, ఆకాశవాణి ఆధ్వర్యంలో బొమ్మలు జోడించి పరిచయమైంది టీవీ. వారానికి రెండు సార్లు గంట చొప్పున జరిగిన ప్రసారాలనే గుంపులు గుంపులుగా సంభ్రమాశ్చర్యాలతో చూసిన క్షణాలవి. ట్రాఫిక్ మర్యాద, ఆహార పదార్థాల్లో కల్తీ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ వంటి విషయాలు చర్చిస్తూ సాగిన డీడీ నడక మీద ఆసక్తి తప్ప అసహనం కలగని రోజులవి.
నెహ్రూ హయాంలో టీవీని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన చనిపోయేనాటికి ( టీవీ వచ్చిన ఐదేళ్ళకు ) దేశంలో టీవీ సెట్లు 58 మాత్రమే. ఆ తరువాత మరో ఐదేళ్లకు గాని దేశంలో తొలి టీవీ ఫాక్టరీ ఏర్పాటై ఏడాదికి 1250 సెట్లు తయారుచేయడం మొదలుపెట్టలేదు. ఇందిరాగాంధీ వచ్చిన తరువాతే ఈ మార్పులన్నీ. టీవీ శక్తిని గుర్తించడంలోనూ, దుర్వినియోగం చేయడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకోగలిగారామె. ప్రముఖ పాత్రికేయురాలు సెవంతీ నైనన్ ఒక సందర్భంలో ” నెహ్రూ ఒక విజనరీ, ఇందిరాగాంధీ మాత్రం టెలివిజనరీ” అని వ్యాఖ్యానించారు. సమాచార శాఖామంత్రిగా ఉన్నరోజుల్లోనే ఆమే ఏర్పాటుచేసిన చందా కమిటీ ఆమె ప్రధాని అయ్యాక నివేదిక సమర్పించినా, టీవీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడమనేది ఇందిరాగాంధీకి నచ్చలేదు. లైసెన్స్ ఫీజు వసూలు తప్ప ఆదాయమార్గంలేని టీవీని వాణిజ్యపరంగా తీర్చిదిద్దటానికి అభ్యంతరం చెప్పలేదుగాని, ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేయించారు. బీబీసీ తరహాలో స్వతంత్ర సంస్థగా నడపాలన్న సూచనలను ఆమె చివరిదాకా వ్యతిరేకిస్తూనే వచ్చారు.
ఎదురుదాడికీ, ఆత్మరక్షణకూ టీవీ ఎంత అవసరమో గుర్తించిన ఏకైక వ్యక్తి ఇందిరాగాంధీ. అందుకే ఎమర్జెన్సీలో టీవీని ఎడాపెడా వాడుకున్నారు. టీవీ విస్తృతి పెరిగింది.13 ఏళ్లపాటు ఢిల్లీకే పరిమితమైన ప్రసారాలు ముంబయ్ కి విస్తరింపజే్శారు. వెనువెంటనే మిగిలిన నగరాలూ ఆ జాబితాలో చేరాయి. 1976 లో ఆకాశవాణి నుంచి విడిపోయి దూరదర్శన్ ఏర్పడటం, ఆ తరువాత వాణిజ్యపరంగా ఆదాయ వనరులు వెతుక్కోవడం ఆమె హయాంలోనే జరిగాయి. అయితే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ఆమె దూరదర్శన్ ను విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారు. ఏ అధికార హోదా లేకపోయినా ఆమె పుత్రరత్నం సంజయ్ గాంధీ రోజూ బుల్లితెరమీద ప్రత్యక్షమైన రోజులవి. గిట్టని వాళ్ళను అణచివేయడానికి దూరదర్శన్ ఇందిరాగాంధీకి ఒక ఆయుధమైంది. 1977 లో ప్రతిపక్షాల భారీ ర్యాలీకి జనం రాకుండా చూసేందుకు ఆ రోజుల్లో బ్లాక్‍బస్టర్ గా పేరుపొందిన బాలీవుడ్ చిత్రం ’బాబీ’ ని ప్రసారం చేయాల్సిందిగా ఢిల్లీ దూరదర్శన్ కేంద్రాన్ని ఘనత ఆమెది. అయినా జనం రావటం, సభ సక్సెస్ కావటం, ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓడిపోవటం తెలిసిన విషయాలే. ఎమర్జెన్సీ లో సెన్సార్‍షిప్ ఫలితంగా ఇబ్బందులెదుర్కున్న జనతాపార్టీ, ఆ తరువాత అధికారం చేపట్టినప్పుడు సంస్కరణల మార్గంలో వర్ఘీస్ కమిటీని ఏర్పాటుచేసినా ఫలితం కనిపించలేదు. ఆ సిఫార్సు ఆధారంగా ప్రవేశపెట్టిన ఆకాశ్ భారతి బిల్లు పార్లమెంట్‍లో ఆమోదం పొందకముందే జనతాప్రభుత్వం కూలిపోయింది, బిల్లు కాలపరిమితి ముగిసి కనుమరుగైంది. దూరదర్శన్ ప్రసారాలమీద ఇందిరాగాంధీ పట్టు మరింత పెరిగింది.
80లలో సాంకేతికంగానూ, వాణిజ్యపరంగానూ, వినోదాత్మకంగానూ దూరదర్శన్ ఎదుగుదలను తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. నేషనల్ నెట్‍వర్క్ ఏర్పడటం, రంగుల ప్రసారాలు, శాటిలైట్ విప్లవం.. అన్నీ వరుసగా టీవీని పరిపుష్టం చేస్తూ వచ్చాయి. అయితే నేషనల్ నెట్‍వర్క్ లో రాత్రి 8.30 నుంచి 11 వరకూ హిందీ కార్యక్రమాలు ప్రసారం చేయటం పట్ల తమిళనాడు, కర్నాటక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బలవంతంగా హిందీని రుద్దుతున్నారంటూ ఆక్షేపించాయి. “రాత్రి 8.30 కల్లా మా రాష్ట్రంలో ప్రజలు టీవీ కట్టేసి విద్యుత్ ఆదా చేసేలా చూస్తున్నందుకు కృతజ్నతలు” అంటూ కర్నాటక ముఖ్యమంత్రి అప్పటి దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కు వ్యంగ్యంగా లేఖ రాశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత ప్రాంతీయ ప్రసారాలు పెరగటం, ప్రాంతీయంగా డీడీ చానల్స్ మొదలుకావడం వేరే విషయాలు. కానీ నేషనల్ నెట్‍వర్క్ ఫలితంగా వాణిజ్య ప్రకటనలు పెరిగాయి. భారతీయ సంస్కృతిని పరిరక్షించటమనే పేరుతో రామాయణ, మహాభారతాలు సీరియల్స్ గా ప్రసారమయ్యాయి. ఆదివారం ఉదయం జనమంతా టీవీలకు దండలువేసి పూజలు చేసి భక్తితో ఆ సీరియల్స్ చూసిన రోజులవి. ఆ సమయంలో నిర్మానుష్యంగా కనిపించిన వీధులే ాఅ సీరియల్స్ విజయానికి నిదర్శనం. అయితే, హిందుత్వ భావనను ప్రేరేపిస్తూ రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి రామాయణం సీరియల్ కారణమంటూ ఆ తరువాత మేధావులు నిర్థారించారు. ” Politics after Television “ లో అరవింద్ రాజగోపాల్ ఈ అంశాన్ని విస్తృతంగా చర్చించారు.
టీవీ ప్రవాభాన్ని గుర్తించి, వాక్ స్వాతంత్రం టీవీ కార్యక్రమాలకు వర్తించదంటూ ప్రభుత్వం ఒక అడ్డగోలు వాదనకు తెరలేపింది. 1986 లో ముస్లిం మహిళల బిల్లు పార్లమెంటులో ఉండగా ఇందిరాజైసింగ్ అనే న్యాయవాది తన అభిప్రాయాలను దూరదర్శన్ ఇంటర్వ్యూ లో చెప్పారు. అయితే, ప్రసార సమయంలో కొన్ని వ్యాఖ్యలు తొలగించారు. రాజకీయ కారణాలతోనే ఇలా జరిగిందంటూ ఆమె కోర్టుకెళ్ళారు. వాక్ స్వాతంత్రం టీవీ కార్యక్రమాలకు వర్తించదనేది ప్రభుత్వ సమాధానం. అయితే బొంబాయి హైకోర్టు ఈ వాదనను త్రోసిపుచ్చింది. పూర్తి ఇంటర్వ్యూను యథాతథంగా ప్రసారం చేయాలని ఆదేశించింది. అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి కూడా అదేవిధంగా ఉండేది. ఆనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఒక సందర్భంలో “నేనేమన్నా కాంగ్రెస్ వాడినా , అబద్ధాలు చెప్పడానికి ?” అన్న మాటలు దూరదర్శన్ లో యథాతథంగా ప్రసారమైనందుకు డైరెక్టర్ జనరల్ ను ప్రధాన మంత్రి కార్యాలయానికి ( పీ ఎం ఓ కు ) పిలిపించి మరీ క్షమాపణలు చెప్పించటం రహస్యమేమీ కాదు. రాజీవ్ గాంధీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ’తగినంత’ కవరేజ్ ఇవ్వలేదంటూ అప్పటి న్యూస్ ఎడిటర్ నర్రావుల సుబ్బారావు గారి మీద చర్యలు తీసుకోవడమూ తెలిసిందే. ( టేపులు అందిన కొద్ది నిమిషాల్లోనే బులెటిన్ ప్రసారం కావలసి ఉండటంతో మొత్తం టేపులు చూడటం కుదరక ముఖ్యమైన విషయాలకు బదులు అప్రధానమైనవి ప్రసారం చేయాల్సి వచ్చిందని ఆయన సహచరుడొకరు నాతో చెప్పారు. తెలుగుదేశం వాళ్ళతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేదనే అక్కసుతోనే చర్యలు తీసుకున్నారని కూడా అప్పట్లో చెప్పుకున్నారు) .
90లలో సంస్కరణల ప్రభావం టీవీ రంగం మీద స్పష్టంగా పడింది. అదే సమయంలో ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ మొదలయ్యాయి. సహజంగానే దూరదర్శన్ మీద మొహం మొత్తింది. టీవీ మీద ప్రభుత్వ గుత్తాధిపత్యం పోయింది. 20 ఏళ్లలో 400 చానల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో దూరదర్శన్ కూడా 1993 ఆగస్టు 15న ఒకేసారి ఐదు శాటిలైట్ చానల్స్ ప్రారంభించింది. దూరదర్శన్ చూడకపోవడం జాతివ్యతిరేకమనే ప్రచారం చేసినా ఫలితం కనిపించలేదు. తగినన్ని కార్యక్రమాలు లేకుండానే హడావిడిగా మొదలైన చానల్స్ లో అంతా గందరగోళమే. స్పోర్ట్స్ చానల్ గా పేరుపెట్టుకుని ఒక పాత సినిమాను వరుసగా మూడు సార్లు ప్రసారం చేయటం చూసిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు వెంటనే వాటిని మూసివేయాలని ఆదేశించారు. ఆ విధంగా ఏడాదిలోపే వాటిని మూసివేస్తూ సమాచార ప్రసారాల శాఖామంత్రి కె పి సింగ్ దేవ్ పార్లమెంటులో ప్రకటన చేశారు.
ఒకవైపు ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ వినోద కార్యక్రమాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంటే మరోవైపు దూరదర్శన్ ప్రత్యేక రాయితీలతో ముందుకు సాగాలని ఆశపడింది. ప్రైవేట్ చానల్స్ మీద ప్రభుత్వ ఆంక్షలు కూడా పరోక్షంగా దూరదర్శన్ కు ఉపయోగపడ్డాయి. క్రికెట్ ప్రసారాల హక్కులు పొందిన చానల్ దూరదర్శన్ కు కూడా ఆ ఫీడ్ ఇవ్వాలని ప్రభుత్వం షరతు విధించింది. నిర్మాతలనుంచి సినిమా హక్కులు కొనుక్కునే విషయంలోనూ దూరదర్శన్ నియమాలు ప్రత్యేకం. కేబుల్ ఆపరేటర్లు తప్పని సరిగా ప్రైమ్ బాండ్ లో డీడీ చానల్స్ ప్రసారం చేయాలంటూ చట్టం చేసింది. ఇంకోవైపు ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ భారత భూభాగం నుండి అప్‍లింక్ చేయడానికి వీల్లేకుండా కొంతకాలం అడ్డుకుంది. ఆ విధంగా విదేశీ మారకద్రవ్యం కోల్పోవటం ఎంత అవివేకమో తెలుసుకుని ఆ తరువాత ఆంక్షలు తొలగించింది. అయితే దూరదర్శన్ మీద ప్రభుత్వ నియంత్రణ మాత్రం తగ్గలేదు. 2004 లో జయప్రకాశ్ నారాయణ్ మీద డాక్యుమెంటరీ ప్రసారాన్ని అడ్డుకుని సెన్సార్ చేసింది. జేపీ ఉద్యమానికి ప్రభావితుడై కాంగ్రెస్ నుంచి వెళ్లి జనతాపార్టీలో చేరిన జైపాల్ రెడ్డి 2004 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా సెన్సార్‍షిప్ ను అడ్డుకోలేకపోయారంటే ప్రభుత్వం దూరదర్శన్ ను ఎంతగా నియంత్రించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏదైనప్పటికీ తనకు వ్యతిరేకంగా వచ్చే వార్తల్ని అడ్డుకుంటుందనేందుకు చాలా ఉదాహరణలున్నాయి. అప్పట్లో అజిత్ జోగి తనకు ఇబ్బంది కలిగించే వార్తలు ప్రసారమవుతున్నట్టు తెలియగానే ప్రసారాలు నిలుపుదల చేయించేవారు. ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ ఉద్యమం జరిగినప్పుడు వామపక్షాల ప్రాబల్యం ఉన్న ఖమ్మం జిల్లాలో తేజాటీవీ ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా అక్కడి ఎస్పీ రాజారత్నం నాయుడు ఆదేశించారు. చానల్ చీఫ్ ఎడిటర్ గా నేను ఆయనకు ఫోన్ చేస్తే, ప్రభుత్వ ఆదేశాలమేరకే కేబుల్ ప్రసారాలు నిలిపివేసినట్టు స్వయంగా అంగీకరించారు. అది కూడా ప్రసారం చేసిన తరువాత ఆ విషయం ఇతర జిల్లాలకు తెలియడంతో ఒత్తిడి పెరిగి ప్రసారాలు పునరుద్ధరింపజేశారు.
మళ్ళీ దూరదర్శన్ దగ్గరికే వస్తే, ప్రైవెట్ చానల్స్ లాగా అనవసరమైన హడావిడి చేయనవసరం లేదుగాని, కనీస స్థాయిలో కూడా ప్రజల్లో విశ్వాసం పొందలేకపోవటం మాత్రం ఘోరమైన తప్పిదం. దూరదర్శన్ కు నిజమైన స్వయం ప్రతిపత్తి ఇవ్వలేని ప్రభుత్వం ఆదాయమార్గాలకోసం వెతుకుతోంది. వైఫల్యానికి అసలు కారణాల గురించి ఆలోచించకుండా హై డెఫినిషన్ పరికరాల కొనుగోలు మీద, దిజిటలైజేషన్ మీద దృష్టి సారిస్తోంది. ప్రసారాల నాణ్యతను గాలికొదిలి సాంకేతిక నాణ్యత సాధించటమే ధ్యేయంగా వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి సిద్ధమవుతోంది. పైగా టీవీ సెట్లకు లైసెన్స్ ఫీజు వసూలు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదంతా ఎవరిని మెప్పించడానికి ?ఎక్కువమందికి అందుబాటులో ఉన్న చానల్ గా చెప్పుకుంటూ కూడా వాళ్ళని ఎందుకు మెప్పించలేకపోతున్నామో ఆలోచించకపోతే ఎలా ? వ్యాధి నిర్థారించకుండా మందులు వాడాలనుకుంటున్న ధోరణి వలన బాగుపడేదెవరో అందరికీ తెలుసు. దూరదర్శన్ ను స్వయంగా చంపిన ప్రభుత్వమే ఇప్పుడు శవాలంకరణకు పూనుకుంటోంది. డిజిటల్ ట్రాన్స్‍మిటర్లు ఏర్పాటు చేస్తే దూరదర్శన్ బాగుపడుతుందా ? 1540 కోట్లు మాత్రం చాలామందిని వ్యక్తిగతంగా బాగుపరచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Source: bhavanarayana.co.tv