Friday, December 28, 2018

ఛానళ్ల ఎంపికకు నెల గడువు

దిల్లీ: టెలివిజన్‌ ప్రేక్షకులు చెల్లింపు ఛానళ్లను ఎంపిక చేసుకునేందుకు మరో నెల గడువు పొడిగించారు. ప్రసారాలు, కేబుల్‌ సర్వీసులపై రూపొందించిన కొత్త విధివిధానాల అమలులో భాగంగా ఇష్టమైన ఛానళ్లనే ఎంపిక చేసుకునేందుకు జనవరి 31 దాకా గడువు పొడిగిస్తున్నట్లు భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) ప్రకటించింది. గురువారం ప్రసార సంస్థలు, డీటీహెచ్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో సమావేశమయిన తర్వాత ట్రాయ్‌ కార్యదర్శి ఎస్‌కే గుప్తా ఈ విషయాన్ని తెలిపారు. కొత్త విధివిధానాలను అమలు చేసేందుకు అందరూ సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. ఈ ప్రక్రియ సాఫీగా, అంతరాయాలు    తలెత్తకుండా మార్పిడి జరిగేందుకు మరికొంత సమయం కావాలని వారంతా విన్నవించారన్నారు. వినియోగదారుల నుంచి ఐచ్ఛికాలు తీసుకునేందుకు పంపిణీ ఆపరేటర్లకు జనవరి 31దాకా అవవకాశం కల్పించినట్లు తెలిపారు.
తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం
కొత్త విధివిధానాల వల్ల వినియోగదారులు తాము చూడాలనుకునే ఛానళ్లనే ఎంపిక చేసుకొని, వాటికే చెల్లింపు చేయొచ్చు. టీవీ ప్రసార సంస్థలు ప్రతి ఛానల్‌కు, ప్యాకేజీకి గరిష్ఠ చిల్లర ధరను వెల్లడించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలతో టీవీ ప్రేక్షకులపై ధరల భారం తక్కువగా ఉంటుందని ట్రాయ్‌ గతంలోనే స్పష్టం చేసింది. వినియోగదారుల్లో అనవసర ఆందోళనను పెంచేలా కొంతమంది తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేశారంటూ మండిపడింది. ట్రాయ్‌ కొత్త విధివిధానాలను, టారిఫ్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇంతకుముందే కొట్టివేసింది.


Wednesday, December 26, 2018

చూడాలనుకునే ఛానళ్లకే చెల్లింపు


నెలకు రూ.130తో 100 ఉచిత ఛానళ్లు
ఆపై ఎంచుకునే వాటికే చెల్లించాలి..
ఛానళ్ల వారీగా వేర్వేరు ధరలు
టీవీ ముందు కూర్చుని రిమోట్‌ నొక్కుతూ ఉంటే వందల కొద్దీ ఛానళ్లు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. అందులో ఓ పదీ ఇరవై తప్ప మిగతావన్నీ మనకి పరిచయం లేనివి, ఆసక్తి అంతకన్నా లేనివే వస్తుంటాయి. పరాయి భాషల్లో రకరకాల ఛానళ్లు వస్తుంటాయి. ఒక్కరోజూ నిమిషంపాటు వాటిని చూసే అవసరం రాదు. చాలాభాగం కుటుంబ సభ్యుల్లో ఎవరూ చూడనివే. కొత్త కేబుల్‌ ఛానళ్ల విధానంతో ఈ పద్ధతి మారనుంది. ఇష్టమైన ఛానళ్లకే డబ్బు చెల్లించి వాటిని వీక్షించే అవకాశం వినియోగదారులకు దక్కనుంది. ఈ నెల 29 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానంలో వంద దాకా ఉచిత ఛానళ్లకుతోడు, మనం డబ్బులు చెల్లించిన ఛానళ్లే ప్రసారమవుతాయి. ఇందులో కుటుంబ సభ్యుల అభిరుచి, ఇష్టాయిష్టాలను బట్టి ఎంచుకొని చూసే అవకాశం ఉంది.


ఇకపై టెలివిజన్‌ ప్రేక్షకులు తాము ఏయే ఛానళ్లు చూడాలనుకుంటున్నారో వాటికి మాత్రమే డబ్బులు చెల్లించే సరికొత్త విధానాన్ని భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్‌) అమల్లోకి తీసుకొస్తోంది. ఈ కొత్త విధానం ఈనెల 29 నుంచి (శనివారం) ప్రారంభం కానుంది. దీని ప్రకారం వినియోగదారుడు నెలకు రూ.130 (పన్నులు అదనం) చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 100 ఉచిత ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా చెల్లింపు ఛానళ్ల కోసం వినియోగదారులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సినిమాలు, క్రీడలు, వార్తలు, ఇతర వినోద ఛానళ్లను చెల్లింపు విభాగంలోకి వస్తాయి. వాటికి చందాదారులుగా మారితేనే వీక్షించే అవకాశం ఉంటుంది. చెల్లింపు ఛానళ్లకు ఒక్కోదానికి ఒక్కోధర ఉంది. ఏ ఛానల్‌ కావాలని కోరుకుంటే, వాటికి మాత్రమే డబ్బులు చెల్లించి చూడొచ్చు. చెల్లింపు టీవీ ఛానళ్లకు గరిష్ఠ చిల్లర ధర ఎంతనేది తెలుసుకునేందుకు ట్రాయ్‌ వెబ్‌సైట్‌ ‌www.trai.gov.in లో పరిశీలించుకోవచ్చు. లేదా ఇప్పటికే పలు ఛానళ్లలో ధరల వివరాల్ని ప్రసారం చేస్తుండటాన్ని గమనించవచ్చు. డిసెంబర్‌ 28 అర్ధరాత్రి తర్వాత ఉచిత ఛానళ్లు మాత్రమే ప్రసారమవుతాయి. దేశవ్యాప్తంగా డీటీహెచ్‌, కేబుల్‌ కనెక్షన్లు అన్నింటికీ ఈనెల 28వ తేదీయే తుది గడువు. 28వ తేదీతో ఛానళ్ల ప్రసారం ఆగిపోవద్దనుకుంటే వీక్షించాలనుకుంటున్న చెల్లింపు ఛానళ్లకు సంబంధించిన జాబితాను స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పద్ధతి వల్ల సగటు వినియోగదారుడు ప్రస్తుతం తాను చెల్లిస్తున్నదానికన్నా రెట్టింపు వ్యయం చేయాల్సి వస్తుందనేది కేబుల్‌ ఆపరేటర్ల వాదన. అయితే, ప్రస్తుత కేబుల్‌ వ్యవస్థ ద్వారా ప్రసారమయ్యే వందకుపైగా ఛానళ్లలో వీక్షకులు అనునిత్యం చూసేవి కొన్నే ఉంటాయని, మిగతావన్నీ వృథాయేనని, ఇకపై అవసరమైన వాటిని మాత్రమే ఎంచుకుని చూసే అవకాశం దక్కుతుందని పలువురు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
 ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం మంది ప్రేక్షకులు తెలుగు ఛానళ్లు మాత్రమే వీక్షిస్తారని, కేబుల్‌ టీవీలో వచ్చే ఇతర ఛానళ్లన్నీ ఇతర భాషలకు, అంశాలకు సంబంధించినవేనని, వాటిని చూసే అవసరం ఎప్పుడో తప్ప రాదని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో పిల్లలు, వృద్ధులు, యుక్తవయస్కులకు అభిరుచుల వారీగా అవసరమైన ఛానళ్లనే ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త విధానంలో వందదాకా ఉచిత ఛానళ్లు ప్రసారమవుతూనే, అదనపు చెల్లింపుతో అవసరమైన చెల్లింపు ఛానళ్లు మాత్రమే రావడం వల్ల అనవసరపు ఖర్చుల భారం ఉండదనే అభిప్రాయాలూ ఉన్నాయి.
  Source: https://www.eenadu.net