Monday, September 20, 2010

చానల్ పెట్టాలనుకుంటున్నారా ?

ఒక చానల్ పెడితే ఎలా ఉంటుంది ? చాలా మందికి చాలా సందర్భాల్లో ఇలాంటి ఆలోచన వచ్చే ఉంటుంది. చానల్ పెట్టాలంటే ఎంతవుతుందేంటి ? అని అడిగేవాళ్లకు కొదవే లేదు. చానల్ ఆలోచన మంచిదే కావచ్చుగాని ఏదో ఒక చానల్ అనుకోవటం మాత్రం పొరపాటు. ముందుగా ఎలాంటి చానల్ అనే విషయంలో స్పష్టత అవసరం. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ పెట్టాలనుకుంటున్నారా, 24 గంటలన్యూస్  చానల్ గురించి ఆలోచిస్తున్నారా, ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ లోనే న్యూస్ బులిటెన్స్ ఉండాలనుకుంటూన్నారా, ఇవేవీ కాకుండా బిజినెస్, మ్యూజిక్, ఆధ్యాత్మికం, కామెడీ,  పిల్లలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం లాంటి ఏ ఒక్క అంశం గాని కొన్నిటిని కలిపి గాని చానల్ తీసుకురావాలనుకుంటున్నారా ? ఒక స్పష్టమైన అవగాహన లేకుండా చానల్ కోసమే చానల్ అనే ఆలోచన మాత్రం మంచిది కాదు. డబ్బున్న వాళ్ళు చాలా మంది వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా చానల్ లో ఒక వార్త వచ్చిందంటే చాలు.. సొంతగా చానల్ పెట్టెయ్యాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళు కొంత హడావిడి చేసి ఆ వేడి చల్లారగానే మళ్ళీ చానల్ ఊసెత్తరు. నిజంగానే చానల్ పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంటే మాత్రం అధ్యయనం చెయ్యాలి.
ముందుగా టీవీ పరిశ్రమ గురించి స్థూలంగానైనా తెలుసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచిస్తున్న తరహా చానల్ కి అవకాశం ఉందా ? దీన్నే Need Gap Analysis అంటారు. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ పెట్టాలనుకుంటే ఇప్పుడున్న చానల్స్ ఆర్థిక పరిస్థితి ఏమిటి, అవి ఎందుకు విజయం సాధించాయి, లేదా, ఎందుకు విఫలమయ్యాయి ? దేని మార్కెట్ వాటా ఎంత ? వాటి ప్రత్యేకతలేమిటి ? వాటికంటే భిన్నంగా ప్రేక్షకులకు ఎలాంటి చానల్ ఇచ్చి ఆకట్టుకోగలం ? ఎంత ఖర్చవుతుంది ? పెట్టుబడి ఎంత? నెలవారీ ఖర్చెంత ? ఆదాయమార్గాలేమిటి ? లాభనష్టాలులేని స్థితి ఎన్నాళ్ళకు వస్తుంది ? ఇలాంటి విషయాలన్నీ పరిశీలించాలి. సినిమా హక్కులు కొనకుండా ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ కష్టం. ఎన్ని సినిమాలు మార్కెట్లో ఉన్నాయి ? వాటికోసం పోటీపడితే ఎంత ఖర్చవుతుంది ? ఇలాంటివన్నీ ముందుగానే తెలుసుకోవాలి. న్యూస్ బులిటెన్స్ కూడా ఉండాలంటే ముందుగానే న్యూస్ చానల్ లైసెన్స్ తీసుకోవాలి. న్యూస్ చానల్ పెట్టాలనుకున్నా మార్కెట్ సర్వే తప్పనిసరి. ఇప్పుడున్న చానల్స్ ఎన్ని ? వాటికంటే భిన్నంగా ఎలా తీసుకురాగలం ? ప్రేక్షకుడు ఈ చానల్ నే చూడాలని ఎందుకు అనుకుంటాడో స్పష్టమైన అవగాహన ఉండాలి. కాస్త భిన్నంగా ఉంటేనే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చుననో, ఫలానా చానల్ అయితే ఎక్కువ ప్రకటనలు వస్తాయనో, పొరుగు రాష్ట్రంలో అది క్లిక్ అయిందనో ఆలోచించినా పరవాలేదు. లాభాలకంటే నష్టాలగురించి బాగా ఆలోచించి గట్టిగా నిలబడగలమనే నమ్మకం కుదిరితే చానల్ యజమాని కావడానికి సిద్ధమైపోవచ్చు.
చానల్ పెట్టాలని నిర్ణయించుకున్న తరువాత కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించాలి. పెట్టాలనుకునే చానల్ ను బట్టి ఆ కంపెనీ నికర ఆస్తుల విలువ ఉండాలి. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారమైతే, న్యూస్ చానల్ కు 3 కోట్లు, నాన్-న్యూస్ చానల్ అయితే 1.5 కోట్లు ఉండాలి. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ అయితే విదేశీ పెట్టుబడుల విషయంలో ప్రత్యేకమైన నియమాలేవీ లేవుగాని న్యూస్ చానల్ అయితే 26 శాతానికి మించి ఉండకూడదు. కంపెనీ రిజిస్ట్రేషన్ తో బాటుగా బ్రాండ్ పేరు.. అంటే చానల్ పేరు కూడా ఖరారు చేసి రిజిస్టర్ చేయించాలి. న్యూస్ చానల్ అయితే విదేశీ డైరెక్టర్ల ఎంపికలోనూ, కీలకమైన ఉద్యోగుల విషయంలోను కొన్ని నిబంధనలున్నాయి. డైరెక్టర్లకు ఎలాంటి నేరచరిత్రా ఉండకూడదు. ఫెరా (విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం) నిబంధనల ఉల్లంఘన లాంటి ఆర్థికసంబంధమైన అవకతవకలకు పాల్పడి ఉండకూడదు.  ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని నమోదు చేయించాలి. సాధారణంగా ఆడిటర్లు ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటారు.
రిజిస్ట్రేషన్ దగ్గర నుండీ చానల్ ఏర్పాట్లు చురుగ్గా మొదలవుతాయి. శాటిలైట్  ట్రాన్స్ పాండర్ లో బాండ్‍విడ్త్ బుకింగ్ ఇందులో మొదటి దశ. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో ) వారి మార్కెటింగ్ విభాగం బాండ్‍విడ్త్ లీజు ఒప్పందాలు చేసుకుంటుంది. మూడునెలల అద్దె అడ్వాన్సుగా తీసుకుని బాండ్‍విడ్త్ ఒప్పంద పత్రం మీద సంతకాలు చేస్తుంది. వాస్తవంగా బాండ్‍విడ్త్ ఉపయోగించుకున్నప్పటినుండే లీజు మొత్తాన్ని వసూలు చేస్తారు. అందుకే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఎప్పుడు చానల్ మొదలుపెట్టబోతున్నారో కనీసం ఒక నెల ముందుగా ఇస్రో అధికారులకు తెలియజేస్తే తగిన ఏర్పాట్లు చేస్తారు. ఒప్పందం కుదుర్చుకున్నాం కదా అని అన్ని ఏర్పాట్లూ చేసుకుని చానల్ మొదలెడదామనుకుంటే ఇస్రో చేతులెత్తేయవచ్చు. బాండ్‍విడ్త్ ఇప్పటికిప్పుడు లేదని చెప్పవచ్చు. ఒప్పందంలో ” అందుబాటులో ఉంటే ” ( subject to availability ) అని ఒక వాక్యం ఉండనే ఉంటుంది. 20-25 పేజీలుండే ఆ ఒప్పందంలో ఈ చిన్న పాయింట్ చూసీ చూడకుండా వదిలేస్తే ఆ తరువాత ఇబ్బందులు రావచ్చు. అందుకే, చానల్ ప్రారంభించబోయే ముందే ఆ తేదీని ఇస్రో కు తెలియజేసి అప్పటికి బాండ్‍విడ్త్ సిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
బాండ్‍విడ్త్ ఒప్పందం తరువాత చానల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో బాటు ఈ ఒప్పందం ప్రతిని జతచేయాలి. అదేవిధంగా కంపెనీ రిజిస్ట్రేషన్ పత్రాలు, డైరెక్టర్ల వివరాలు, వారి వాటాల వివరాలు పొందుపరచాలి. ఒరిజినల్ దరఖాస్తుతో బాటు మరో నాలుగు ప్రతులు సమర్పించాల్సి ఉంటుంది. వివిధ విభాగాల అనుమతుల అనంతరమే లైసెన్స్ ఇస్తారుగనుక ఆయా విభాగాలకు పంపడం కోసమే ఇలా మొత్తం ఐదు ప్రతులు అందజేయాలి. అది న్యూస్ చానలా, నాన్ న్యూస్ చానలా అనేది దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. దరఖాస్తుతోబాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ జతచేయాలి. పెట్టబోయే చానల్ మీద ఏ మేరకు అధ్యయనం జరిగిందో, లాభాలు సంపాదించేందుకు ఏ మేరకు అవకాశం ఉందో ప్రాజెక్ట్ రిపోర్ట్ లో వివరించాలి. పెట్టుబడి వనరులు, ఆదాయ అవకాశాలు, లాభాల్లోకి వచ్చేవరకు తట్టుకోగలిగే శక్తి, బాంకులు తదితర ఆర్థిక సంస్థల నుండి రుణాలు పొందేందుకు కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజుగా పదివేల రూపాయలు చెల్లించి సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలి. ఈ వ్యవహారాలన్నీ చూసుకోవటానికి కొంతమంది కన్సల్టెంట్లు కూడా ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళను తాము ప్రోత్సహించటంలేదని సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ తేల్చిచెప్పింది. దరఖాస్తునింపడం మొదలుకొని చాలా విషయాలు తెలియకపోవటం వల్లనే చాలామంది కన్సల్టెంట్లను ఆశ్రయిస్తుంటారు. ప్రతినెల మొదటివారంలో దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించటానికి ఈ మధ్యనే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దరఖాస్తు ఏ స్థాయిలో ఉంది, ఏవైనా లోపాలున్నాయా, ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది లాంటి విషయాలన్నిటికీ ఆ సమావేశంలో సమాధానాలు దొరుకుతాయి. ఒక దరఖాస్తు పూర్తి స్థాయిలో ఆమోదం పొంది లైసెన్స్ రావటానికి మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది.
ఒక వైపు దరఖాస్తు ప్రాసెసింగ్ జరుగుతుండగానే మరో వైపు చానల్ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన పనులు చురుగ్గా సాగాలి. కీలక సిబ్బంది నియామకం జరగాలి. న్యూస్ చానల్ అయితే న్యూస్ లో కనీసం పదేళ్ళ మీడియా అనుభవం ఉన్న వారు ఆ విభాగ నిర్వహణ బాధ్యతలు చూస్తారని దరఖాస్తులోనే చెప్పి ఉండటం వలన అటువంటి వాళ్ళను నియమించుకోవాలి. మిగిలిన వనరుల సమీకరణ కూడా చురుగ్గా సాగాల్సిన సమయమిది. వివిధ విభాగాల అధిపతులను నియమించటం పూర్తయ్యాక జూనియర్ ( ట్రెయినీ ) ఉద్యోగుల ఎంపిక , శిక్షణ మొదలవుతాయి. కార్యాలయానికి అన్ని హంగులు సమకూర్చుకోవటం కూడా ఈ దశలోనే సాగుతుంది. టెక్నికల్, మార్కెటింగ్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ తదితర విభాగాల అధిపతులు సమన్వయంతో పురోగతిని సమీక్షించుకుంటూ ముందుకు సాగుతారు. ప్రొడక్షన్ సొంత వనరులతో చేపట్టాలా, ఔట్‍సోర్సింగ్ చెయ్యాలా, రెండు పద్ధతులూ తగిన నిష్పత్తిలో పాటించాలా అనేది నిర్ణయించి అమలు ప్రారంభించాలి. ఎంటర్‍టైన్‌మెంట్ చానల్ అయితే సినిమాల ప్రసార హక్కుల కొనుగోలు లాంటి అంశాలమీద దృష్టి సారించాలి.
ఆ తరువాత ప్రధానమైన అంశం సామగ్రి కొనుగోలు. విదేశాలనుంచి దిగుమతిచేసుకోవలసిన అవసరం ఉండటం వలన ఇందుకు తగినంత సమయం అవసరం. కన్సల్టెంట్లను నియమించుకునే పక్షంలో ఆయా పరికరాల అమ్మకందారులను వారే తీసుకువస్తారు. ముందుగా చానల్ కు తగిన పరికరాలు ఎంచుకోవాలి. అప్పటికే ఇతర చానల్స్ ఏయే సామగ్రి వినియోగిస్తున్నాయి, ఆ సామగ్రి ఎంత బాగా పనిచేస్తోంది అనే అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అమ్మకాల తరువాత ఆయా సంస్థలు అందించే సేవలు ఎలా ఉంటాయి, ధరలు అనే విషయాలు ప్రధానంగా పరిశీలిస్తారు. సామగ్రి ఎంపిక జరిగిన తరువాత ఆ సామగ్రి ని ఆర్డర్ చెయ్యాలి. సాధారణంగా  బాంక్ గ్యారంటీ/ఎల్ సీ లాంటి తతంగాలు పూర్తయ్యాక ఆరు వారాల్లో సామగ్రి చేరుతుంది. వాటిని తగిన విధంగా అమర్చుకోవటానికి కనీసం పదిరోజుల సమయం పడుతుంది. ఈ లోపు స్టుడియో, దాని అనుబంధ విభాగాల నిర్మాణం, లైటింగ్, ఎయిర్ కండిషనింగ్, ఇంటీరియర్స్ లాంటి ఏర్పాట్లు పూర్తవుతాయి.
ఈ లోపు పంపిణీ , మార్కెటింగ్ వ్యూహాలు రూపొందించుకుంటారు. చానల్ ను గాలిలోకి పంపటం ఒక ఎత్తు, దాన్ని అందుకొని ప్రేక్షకులకు అందించటం ఒక ఎత్తు. అందుకే కేబుల్ ఆపరేటర్ చాలా కీలకమైన వ్యక్తి అయ్యాడు. ప్రతి ఆపరేటర్ ఈ చానల్ సిగ్నల్స్ అందుకొని ప్రేక్షకులకు చూపించగలిగితే దాని సామర్థ్యాన్ని బట్టి అది నిలదొక్కుకోగలుగుతుంది. అందువలన ముందుగా చానల్ అందరికీ అందుబాటులోకి రావాలి. కనుక పంపిణీ అనేది చానల్ కు అత్యంత కీలకమైనది. చాలా సందర్భాలలో ముఖ్యమైన ఆపరేటర్లకు కారేజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చానల్ బడ్జెట్ లో కూడా ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాటు ఉండాలి. రెండో ప్రధానమైన అంశం మార్కెటింగ్. సొంత వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటమా, ఔట్‍సోర్సింగ్ మంచిదా అనేది నిర్ణయించుకోవాలి. స్లాట్స్ అమ్మటం, కార్యక్రమాల తయారీ మాత్రమే బయటివాళ్ళకిచ్చి సొంతగా మార్కెట్ చేసుకోవటం, సొంతగా కార్యక్రమాలు రూపొందించి స్పాన్సర్లను రాబట్టటం లాంటి పద్ధతులమీద చర్చించి, లాభదాయకమైన మార్గాన్ని నిర్ణయించుకుంటారు. ఈ సమయానికి చానల్ లైసెన్స్ వచ్చి, టెక్నికల్ గా కూడా సిద్ధంగా ఉంటుంది గనుక అంతా సజావుగా ఉందో, లేదో సరిచూసుకునేందుకు ట్రయల్ రన్ మొదలవుతుంది.   సాంకేతికమైన అంశాలతో బాటు కార్యక్రమాల సన్నద్ధత కూడా సరిచూసుకునేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది. కనీసం 15 రోజులపాటు టెస్ట్ సిగ్నల్ పేరుతో ట్రయల్ రన్ నడిచిన తరువాతనే చానల్ లాంచ్ చేయడం సర్వ సాధారణం.

Source: bhavanarayana.co.tv

No comments:

Post a Comment