Friday, December 28, 2018

ఛానళ్ల ఎంపికకు నెల గడువు

దిల్లీ: టెలివిజన్‌ ప్రేక్షకులు చెల్లింపు ఛానళ్లను ఎంపిక చేసుకునేందుకు మరో నెల గడువు పొడిగించారు. ప్రసారాలు, కేబుల్‌ సర్వీసులపై రూపొందించిన కొత్త విధివిధానాల అమలులో భాగంగా ఇష్టమైన ఛానళ్లనే ఎంపిక చేసుకునేందుకు జనవరి 31 దాకా గడువు పొడిగిస్తున్నట్లు భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) ప్రకటించింది. గురువారం ప్రసార సంస్థలు, డీటీహెచ్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో సమావేశమయిన తర్వాత ట్రాయ్‌ కార్యదర్శి ఎస్‌కే గుప్తా ఈ విషయాన్ని తెలిపారు. కొత్త విధివిధానాలను అమలు చేసేందుకు అందరూ సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. ఈ ప్రక్రియ సాఫీగా, అంతరాయాలు    తలెత్తకుండా మార్పిడి జరిగేందుకు మరికొంత సమయం కావాలని వారంతా విన్నవించారన్నారు. వినియోగదారుల నుంచి ఐచ్ఛికాలు తీసుకునేందుకు పంపిణీ ఆపరేటర్లకు జనవరి 31దాకా అవవకాశం కల్పించినట్లు తెలిపారు.
తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం
కొత్త విధివిధానాల వల్ల వినియోగదారులు తాము చూడాలనుకునే ఛానళ్లనే ఎంపిక చేసుకొని, వాటికే చెల్లింపు చేయొచ్చు. టీవీ ప్రసార సంస్థలు ప్రతి ఛానల్‌కు, ప్యాకేజీకి గరిష్ఠ చిల్లర ధరను వెల్లడించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలతో టీవీ ప్రేక్షకులపై ధరల భారం తక్కువగా ఉంటుందని ట్రాయ్‌ గతంలోనే స్పష్టం చేసింది. వినియోగదారుల్లో అనవసర ఆందోళనను పెంచేలా కొంతమంది తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేశారంటూ మండిపడింది. ట్రాయ్‌ కొత్త విధివిధానాలను, టారిఫ్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇంతకుముందే కొట్టివేసింది.


No comments:

Post a Comment