Thursday, June 2, 2011

డిస్నీ చానల్ అదరహో!

నేటి బాలలే రేపటి పౌరులు.. భావి భాగ్య విధాతలు.. అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలే తప్ప వాళ్ల కోసం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలేం ప్రముఖంగా కన్పడటం లేదు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా వారి మనోభావాల కనుగుణంగా రూపొందించిన కార్యక్రమాల శాతమూ తక్కువే. అలా కాకుండా కేవలం పిల్లల కోసం, వారితోపాటు ఆరోగ్యకర హాస్యాన్ని, ఉత్సుకత మేళవింపులనీ సహృదయంతో ఆస్వాదించే పెద్దల కోసమూ గణనీయ కాలంగా డిస్నీ నెట్‌వర్క్ ఛానల్స్ కృషి చేస్తున్నాయి. ఆ కృషికి గుర్తింపే ఈ వారం దేశంలోని టీవీ వీక్షకుల్లో 45 శాతం మంది డిస్నీ ఛానల్స్ చూడటం. తామరతంపరగా ఛానల్స్ రోజుకోటి పుట్టుకొస్తున్న ఈ కాలంలో ఓ ఛానల్ కార్యక్రమాలకీ ఇలా 45 శాతం కట్టుబడటం మామూలు మాటేం కాదు.

మొదటి స్థానం కొట్టేసిన బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ
ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు డిస్నీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ’ వ్యూయర్ షిప్‌లో మొదటి స్థానాన్ని కొనసాగించుకుంటోంది. 2005 నుంచి ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం బాలల ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. అలాగే హిందీ ప్రాంతాల్లో 4 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లల్ని డిస్నీ ఛానల్ అమోఘంగా ఆకర్షిస్తోంది. అలాగే ఈ ఛానల్ ఇటీవల ఆరంభించిన ఒరిజినల్ ఏనిమేషన్ షో ‘్ఫష్ హూక్స్’. (ప్రతి శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారమయ్యేవి కూడా చిట్టి చిన్నారులను టీవీ ముందు నుంచి లేవకుండా చేస్తోంది.

మున్ముందు కూడా..
ఇలా వీక్షకాదరణలో అగ్రస్థానం పొందిన డిస్నీ ఛానల్ యాజమాన్యం రాబోయే కాలంలో కూడా ప్రేక్షకాదరణే.. అందులోనూ బాలల మనోవికాసమే ఆలంబనగా, అనేకానేక ప్రోగ్రాముల రూపకల్పనలో నిమగ్నమైందని చెప్తున్నారు. వీటిల్లో డిస్నీ మూవీస్, సిటీ కామ్స్, కుటుంబ కథలు, సాహస కార్యాల కదంబాలు.. ఓహ్ ఒకటేమిటి ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలేవైతే చూడాలని కోరుకుంటారో, అవన్నీ సమీకరించి సాక్షాత్కరింపజేసే పనిలో వాల్ట్‌డిస్నీ టెలివిజన్ ఇంటర్నేషనల్ ఇండియా బిజీగా ఉంది.. సో.. ఇక వాటిని ఆస్వాదించడమే ఆలస్యం.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment