Tuesday, September 3, 2013

టీవీక్షణం: వెండితెర వయా బుల్లితెర!

టీవీ ఆర్టిస్టులు సినిమాల్లో సక్సెస్ కావడం కష్టం... చాలా తేలికగా అనేస్తారీ మాటని. కానీ అలా అనేముందు గుర్తు తెచ్చుకోవాల్సిన వాళ్లు కొందరున్నారు. వారు తమ కెరీర్‌కి పునాదిని బుల్లితెర మీదే వేసుకున్నారు. అక్కడ పని చేస్తూనే వెండితెర మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆటుపోట్లకు తట్టుకుని నిలబడ్డారు. ఈరోజు స్టార్‌‌సగా వెలుగొందుతున్నారు.

 షారుఖ్ ఖాన్... బాలీవుడ్ బాద్‌షా అని పిలుచుకునే ఈ సూపర్‌స్టార్ తన తొలి అడుగు టెలివిజన్ రంగుంలోనే వేశాడు. ఫౌజీ, దిల్ దరియా వంటి సీరియల్స్‌లో నటించాడు. ‘సర్కస్’ సీరియల్ అతడిని అందరి దృష్టిలో పడేలా చేసింది. సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కట్‌చేస్తే... బాలీవుడ్‌లో తిరుగులేని నటుడయ్యారు షారుఖ్. జాతీయ అవార్డునందుకున్న నటి విద్యాబాలన్ కూడా టీవీలోనే ఓనమాలు దిద్దుకుంది. ‘హమ్ పాంచ్’ సీరియల్‌లో నటించిన విద్య ప్రతిభ ఆమెను సినిమాల్లోకి లాక్కెళ్లింది. తొలి సినిమా ‘పరిణీత’ సూపర్ హిట్. ‘లగేరహో మున్నాభాయ్’ డూపర్ హిట్. ‘డర్టీ పిక్చర్’ బంపర్ హిట్. ‘కహానీ’ సెన్సేషనల్ హిట్. ఆమె కోసం ఇప్పుడు ప్రత్యేకంగా కథలు రాస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు... ఆమె రేంజ్ ఏమిటో!

 హిందీ సీరియల్స్ నుంచి సినిమాల దాకా ప్రయాణించిన మరో నటి హన్సిక. చిన్నతనంలో ‘షకలక బూమ్‌బూమ్’ అనే కార్యక్రమంలో తొలిసారి తెరమీద మెరిసిన హన్సిక, ఆ తర్వాత ‘దేశ్‌మే నిక్‌లా హోగా చాంద్’ సీరియల్‌లో నటించింది. మరి ఇప్పుడు ఆమె ఏ స్థాయి నటి అయ్యిందో చూస్తున్నాం కదా! ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతున్న ప్రాచీ దేశాయ్ కూడా టీవీ నటే. సినిమాలను వద్దనుకుని, క్రికెట్ కామెంటేటర్‌గా సెన్సేషన్ సృష్టించిన మందిరాబేడీ కూడా సీరియల్ నటే.

 ఇక మన ప్రకాశ్‌రాజ్. ఆయన తెలుగువారు కాదు. అయినా ఆ విషయాన్ని మనం నమ్మం. అంతగా టాలీవుడ్‌లో పాతుకుపోయారు. ఆయన కూడా మొదట్లో సీరియల్ నటుడే. ‘గుప్పెడు మనసు’ సీరియల్ గుర్తుంది కదా! బాలచందర్ దర్శకత్వం వహించి, గీత లీడ్ రోల్ చేసిన ఈ సీరియల్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అందులో ప్రకాశ్‌రాజ్‌ను చూసి చాలామంది అమ్మాయిలు అలాంటి భర్త కావాలని కోరుకున్నారు.

 అతడే ఆ తర్వాత విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో ప్రత్యక్షమవుతాడని, తిరుగులేని నటుడవుతారని ఎవరూ ఊహించలేదు. ఇక స్వాతి గురించి చెప్పాల్సిన పని లేదు. ‘కలర్స్’ ప్రోగాములో ఆమె యాంకరింగుకు అందరూ ఫిదా అయిపోయారు. యువకులు అయితే ఆమె కోసమే ఆ కార్యక్రమాన్ని చూశారు. ఇప్పుడామె సినిమాల్లో బిజీ అయిపోయింది.

 వీళ్లే కాదు. టెలివిజన్ తెర మీద మెరిసి, ఆ తర్వాత వెండితెరపై వెలిగిన నటీనటులు ఎందరో ఉన్నారు. మహా సముద్రం లాంటి సినీ పరిశ్రమ వైపు నడిపించే నావ టెలివిజన్. అందుకే నటనను లక్ష్యంగా ఎంచుకున్నవారి ప్రయాణం ఆ నావలోనే మొదలవు తోంది. కచ్చితంగా ఏదో ఒక తీరానికి చేరుస్తుందని, మధ్యలో మాత్రం ముంచేయదని దాని మీద అందరికీ అంత నమ్మకం మరి!

Source: www.sakshi.com

No comments:

Post a Comment