Monday, August 23, 2010

కొత్త చానల్స్ గురూ…!

ఆద్రి , మాయాబజార్… ఇవి సరికొత్త తెలుగు శాటిలైట్ చానళ్ల పేర్లు. మూతబడిన హెచ్ వై టీవీ, ఇప్పటిదాకా కేబుల్ కే పరిమితమైన ఆర్కే న్యూస్ త్వరలో పూర్తిస్థాయిలో 24 గంటల శాటిలైట్ చానల్స్ గా కనబడబోతున్నాయి. ఈ నాలుగే కాదు… మాటీవీ నుంచి మరో రెండు చానల్స్ రాబోతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ ఈ మధ్యనే తన చానల్ ఆలోచన బయటపెట్టడం, సీపీఎం కొంతకాలంగా  ఆ ఆలోచన నుంచి బయటపడలేకపోవటం గమనిస్తే ఇంకో రెండు న్యూస్ చానల్స్ ఖాయమనే అనుకోవాలి. నేషనల్ జాగ్రఫీ తెలుగు వెర్షన్ ,  ట్రావెల్ ట్రెండ్స్ పేరుతో సిద్ధమవుతున్న టూరిజం చానల్ త్వరలో మనజాబితాలో చేరబోతున్నాయి. ఇప్పటికే 30 దాటిన తెలుగు చానల్స్ కి ఇవి అదనం.  అంటే, ఇంకో ఏడాదిలో మనం 40 దాటతాం. “ఏమిటీ, తెలుగు చానల్స్ కి ఇంత డిమాండా  ? ” అని త్రివేణి వక్కపొడి ప్రకటన స్టయిల్లో ఆశ్చర్యపోకండి.  ఆర్ టీవీ బాటలో ఎవరూ వెనకడుగు వేయకపోతే మాత్రం ఇది నిజమవుతుంది,
” ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా ఉంటే, ఇన్ని చానల్స్ ఎవరు చూస్తారు ? ” ఇది సగటు ప్రేక్షకుడి ప్రశ్న. కానీ చానల్ పెట్టేవాళ్ళ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. మిగిలిన వాళ్లకు భిన్నంగా ఆకట్టుకోగలమనే ధీమా ఉంటుంది. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ విషయానికొస్తే, బాగా ధైర్యం చేసి డబ్బు ఖర్చుపెట్టి సినిమాలు కొని హడావిడి చేస్తే మార్కెట్లో నిలబడవచ్చునని మా టీవీ, జీ తెలుగు నిరూపించాయి. నేరుగా జెమినీ టీవీ కి పోటీ ఇవ్వలేకపోయినా, ఈటీవీకి, తేజా టీవీకి ఇవి గట్టిపోటీగా తయారయ్యాయి. ’ మనమూ అలా నిలబడగలం ’ అనే ధైర్యమే కొత్త వాళ్ళను ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ వైపు మళ్ళిస్తోంది. జెమిని, తేజ, ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు బాగానే లాభాలు గడిస్తున్నాయి. అందులో కొంత వాటా దక్కించుకుందామనే ఆలోచనే కొత్తవాళ్లకు ఊపిరి. చానల్ ఎలా నడపకూడదో తెలుసుకోవడానికి ఉదాహరణగా నిలిచిన సితార, ఆర్ టీవీ గురించి పట్టించుకోకుండా, లోపాలు విశ్లేషించకుండా ఆశావాదులు కొంతమంది ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.
ఒక్కో చానల్ వరుసగా పరిశీలిస్తే, ముంబై వాళ్ల చూపు కూడా తెలుగు మార్కెట్ మీద పడిందనటానికి నిదర్శనం ఆద్రి టీవీ. ఇది పూర్తి స్థాయి ఎంటర్‍టైన్‍మెంట్ చానల్. హైటెక్ సిటీ సమీపంలోని అయ్యప్పసొసైటీలో చాపకింద నీరులా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక రెండోది లోకల్ టీవీ వారి మాయాబజార్. ఇది కూడా మాదాపూర్ లో సరికొత్త భవనంలో సిద్ధమవుతోంది. రిథమ్ పేరుతో లైసెన్స్ తీసుకుని,  ఆ పేరువలన దాన్ని మ్యూజిక్ చానల్ అనుకుని చిన్నచూపు చూస్తారని అనుమానం వచ్చి, దక్షిణ్ అయితే బాగుంటుందేమోనని ఆలోచించి చివరికి మాయాబజార్ ఖాయం చేసుకున్నారు. పోయిన చోటనే వెతుక్కోవాలనే సూత్రం బాగా వంటబట్టించుకుని పట్టుదలతో శాటిలైట్ చానల్ తెస్తున్న ఈ సంస్థకి కార్యక్రమాల నిర్మాణంలో మంచి పట్టుంది.  సినీ సంబంధాలు ఎలాగూ ఉపయోగపడతాయి. ( మనలో మనమాట .. కేబుల్ కి ఎగరలేనమ్మ శాటిలైట్ కెగిరినట్టు అని గిట్టనివాళ్ళు కొత్త సామెత ప్రచారం చేస్తారేమో గాని మనం మాత్రం శుభం పలుకుదాం.. )
ఇక మాటీవీ విషయానికొస్తే, అతి త్వరలోనే రెండు చానల్స్ అందించటానికి సన్నాహాలు చేస్తోంది. మా మ్యూజిక్ మొదట్లో జెమినీ మ్యూజిక్ చానల్ ను గడగడలాడించినా, ఆ తరువాత బాగా వెనుకబడింది. అయినా సరే, ఖర్చు నామమాత్రం కనుక లాభదాయకమే. ఇప్పుడు అదే బాటలో పిల్లలకోసం మా జూనియర్స్, తేజ తరహాలో సినిమాల ప్రసారం కోసం మా మూవీస్ అనే రెండు చానల్స్ ప్రసారం చేయబోతోంది. ఇప్పుడు మా టీవీకి  సినిమాలే బలం కదా అనే అనుమానం రావచ్చు గాని అవే సినిమాలు ఇందులోనూ వేస్తారని మనకు తెలియదా ?! పోకిరి, అతడు, మల్లీశ్వరి లాంటి చాలా సినిమాలకు బుల్లితెర మీద కూడా శతదినోత్సవం జరిపిన ఘనతను ఎలా మరువగలం ? అన్నట్టు, ఈ మధ్య ఇంగ్లిష్ సినిమాలు కొని డబ్బింగ్ మొదలెట్టారు. తేజా టీవీ ని మరిపించే విధంగా చెన్నై సువాసనలతో విరాజిల్లే డబ్బింగ్ తెలుగు విని తరించే ప్రత్యేకసదుపాయం కలగబోతోందన్నమాట. ఏమైనప్పటికీ ఎన్ని ఎక్కువ చానల్స్ ఉంటే నెట్‍వర్క్ బలం అంతగా ఉంటుందనే నమ్మకంతో ఇలా ఈ రెండు కొత్త చానల్స్ కోసం పంజాగుట్టలోని పాత ఆఫీసులో పనులు సాగిస్తోంది. లైసెన్సులున్నా మొదలుపెట్టని మా పూజ, మా న్యూస్ గురించి మాత్రం ఇప్పట్లో పట్టించుకోకూడదని స్థిరమైన నిర్ణయం తీసుకున్నట్టుంది మా టీవీ యాజమాన్యం.
ఇప్పటికే 14 కు చేరిన న్యూస్ చానల్స్ జాబితాలో మరో రెండు కలవబోతున్నాయి. ఈశాన్య భారతానికి చెందిన ప్రమోటర్లు హైదరాబాద్ ప్రేక్షకులకోసం హెచ్ వై పేరుతో ఒక చానల్ మొదలెట్టి అంతర్గత సమస్యలతో పట్టించుకోవటం మానేసిన సంగతి తెలిసిందే. అన్ని మౌలిక వసతులూ ఉన్న ఆ చానల్ ని లీజుకు తీసుకుని  చానల్ 4 పేరుతో లాంచ్ చేయడానికి వాసిరెడ్డి శివరామ్ ప్రసాద్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో టీవీ5, స్టుడియో ఎన్ చానల్స్ కి ఆయన ఎమ్ డీ గా ఉన్న విషయం తెలిసిందే. మొదటి దశలో హైదరాబాద్ మీద దృష్టి పెట్టి అతి త్వరలో మిగిలిన నగరాలకు విస్తరించాలన్న వ్యూహంతో మెట్రో చానల్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలోఉన్నారు.  అందరూ మాట్లాడుకుంటున్న మరో చానల్ ఆర్ కె న్యూస్. కాంట్రాక్ట్ పద్ధతి మీద జెమినీ న్యూస్ నడిపిన అనుభవంతో సొంతగా కేబుల్ చానల్ కు శ్రీకారం చుట్టి, అగ్రి గోల్డ్ సంస్థను ఆకట్టుకుని శాటిలైట్  చానల్ గా ఎదగబోతున్న ఈ సంస్థ భారీగానే నియామకాల పనిలో ఉంది. మొత్తమ్మీద ఈ రెండు న్యూస్ చానల్స్ ఇప్పుడు మీడియాలో వార్తలుగా చెలామణి అవుతున్నాయి.
ప్రజారాజ్యం పార్టీ  ప్రచారం కోసం ఒక న్యూస్ చానల్ పెట్టబోతున్నట్టు ఆ పార్టీ నాయకుడు వేదవ్యాస్ పత్రికాముఖంగానే ప్రకటించారు. అది ఆచరణలో ఎంతవరకు వచ్చిందో తెలియదుగాని ఈ లోపు ఏ టీవీ లో చిరంజీవి వాటా తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. వార్తలు ప్రసారం చేయడానికి వీల్లేని నాన్ న్యూస్ చానల్ గా లైసెన్స్ ఉన్న ఏ టీవీ ని ఆయనేం చేసుకుంటారు ? కానీ ఏ టీవీ అధిపతి ఏదో సినిమా పనిమీద మాత్రమే చిరంజీవిని కలిసినట్టు ఆ తరువాత ఆయన సన్నిహితులు వివరణ ఇచ్చారు. ఇక ప్రజాశక్తి వారి చానల్ అనేది కొత్త వార్తేమీ కాదు. వాళ్ళకు చాలా కాలంగా ఉన్న ఆలోచనే అది. అంతమాత్రాన ఇప్పటికిప్పుడు తొందరే్మీ లేదన్న ధోరణిలోనే వారు వ్యవహరిస్తున్నారు.
తెలుగు సహా వివిధ భాషల్లో 18 ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ కోసం లైసెన్సులు తీసుకున్న రిలయెన్స్ విషయంలో నిజాలకంటే పుకార్లే ఎక్కువగా షికారు చేస్తున్నాయి.  కార్టూన్ నెట్‍వర్క్  తరహాలో నేషనల్ జాగ్రఫీ చానల్ కూడా తెలుగు వెర్షన్ మొదలుపెడుతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అనువాదం చెన్నై నుంచి దిగుమతి కాబోతోంది. దాదాపు ఏడాదిగా శ్రీనగర్ కాలనీ కార్యాలయం నుంచి పనిచేస్తున్న మరో చానల్ ట్రావెల్ ట్రెండ్స్ లైసెన్స్ కూడా తెచ్చుకుని త్వరలో ప్రసారాలు చేసేందుకు సిద్ధమవుతోంది. నాలుగైదు భాషల్లో తీసుకురావడం ద్వారా ఖర్చు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవాలన్నది  ఈ సంస్థ ఆలోచన. తెలుగులో కనీసం సగం చానల్స్ నష్టాల్లో ఉన్నప్పటికీ అవి ఏదో విధంగా కొనసాగుతున్నాయి. హెచ్ వై టీవీ లీజుకిచ్చి తప్పుకోగా, ఐ న్యూస్ యజమాని ఎన్ టీవీ కి అమ్ముకొని బయటపడ్డారు. ఆర్ టీవీ ప్రసారాలు ఆగిపోయాయి. త్వరలో రీలాంచ్ చేస్తామని చెప్పుకుంటోంది. ఆర్థికంగా కష్టాలు పూర్తిగా తొలగకపోయినా కొత్త చానల్ పెట్టాలన్న ఆలోచనలు చాలామంది ఇన్వెస్టర్ల మదిలో సజీవంగా ఉండటం మాత్రం మీడియా ఉద్యోగులలో ఆశలు చిగురింపజేస్తున్నాయి.

Source: bhavanarayana.co.tv

No comments:

Post a Comment