నిన్నమొన్నటివరకూ ఎంటర్ టైన్ మెంట్ రంగంలో తెలుగులో జెమిని టివి నెంబర్
వన్.. బాగా ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈటీవీకూడా తర్వాతి స్థానంలోనే
ఉండేది. చాలా ఏళ్లుగా జెమినీ టీవీ ఓ రకంగా ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని
ఏలిందనే చెప్పాలి. కానీ.. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. జెమిని రెండో
స్థానానికి జారిపోయింది.
మీ టీవీ ఈ టీవీ అంటూ నిజంగానే ప్రేక్షకుల ఆదరాన్ని చూరగొనే రీతిలో మంచి
కార్యక్రమాలను ప్రసారం చేస్తూ వచ్చిన ఈటీవీ ఈ మధ్య కాలంలో.. ముఖ్యంగా ఓ
ఆరునెలలనుంచి విపరీతమైన స్థాయిలో వీక్షకులకు బాగా చేరువవుతూ వచ్చింది.
ప్రస్తుతం అన్ని ఛానెళ్లనూ వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానాన్ని
సంపాదించింది.
జులై 27 తో ముగిసిన వారానికి టామ్ ఇచ్చిన రేటింగుల లెక్కల ప్రకారం
జెమిని మార్కెట్ వాటా తగ్గిపోయింది. రెండు వారాలుగా నేలచూపులు చూస్తున్న
జెమిని రేటింగులు ఈ వారంలో ఆ ఛానెల్ కి రెండో స్థానాన్ని కట్టబెట్టాయి.
వాస్తవానికి తొలితెలుగు శాటిలైట్ ఛానెల్ జెమిని టీవీయే.. కానీ.. ఈ టీవీ
వచ్చాక కొంతకాలంపాటు రెండో స్థానానికి పరిమితం కాక తప్పలేదు. సన్ నెట్వర్క్
ఆధ్వర్యంలోకి వచ్చాక అనూహ్యంగా జెమినీకి వ్యూయర్ షిప్ పెరిగిపోయింది.
క్రమంగా ఎదుగుతూ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
ఒక దశలో జెమిని ఈటీవీతో పోలిస్తే 200 శాతం ఎక్కువ మార్కెట్ వాటాని
సాధించిన రోజులుకూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే తెలుగు టీవీ ఛానెళ్లలో
దాదాపు 40 శాతం మార్కెట్ వాటాని దక్కించుకున్న ఘనత ఒక్క జెమిని ఛానెల్ కే
దక్కుతుంది.
తర్వాత జెమిని టీవీ.. తేజ టీవీని ప్రారంభించింది. చాలా వేగంగా ఎదుగుతూ
అది రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈటీవీని కిందికి నెట్టేసింది. కానీ..
తర్వాత తేజ ఛానెల్ ని ఇరవై నాలుగ్గంటల సినిమా ఛానెల్ గా మార్చిన తర్వాత
మెల్లమెల్లగా దాని రేటింగులు తగ్గుతూ వచ్చాయి. ఒకటిన్నర దశాబ్దం తర్వాత
జెమినీ మేల్కొంది. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. ఈటీవీ మొదటి
స్థానాన్ని కైవసం చేసుకుంది.
జెమినీ టీవీని రేటింగుల రేసులో ముందంజంలో ఉంచిన ప్రైమ్ టైమ్ సీరియల్ మొగలిరేకులు తారా స్థాయిలో ప్రేక్షకాదరణను సంపాదించుకుంది. తర్వాత వచ్చిన శ్రావణ సమీరాలు అనే సీరియల్ మీదకూడా జనం అదే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. కానీ.. అది జనం అంచనాలను రీచ్ కాలేకపోయింది.
మంచి మంచి సినిమాల్ని మూవీ ఛానెల్లో వేయాల్సి రావడం జెమినీకి మరో మైనస్
పాయింట్. ఈ ఛానెల్లో బోల్ బేబీ బోల్ తప్ప చెప్పుకోదగిన స్థాయిలో ఆదరణ
పొందిన గేమ్ షోస్ లేకపోవడం కూడా మరో అంశం.. ఈటీవీ మంచి మంచి గేమ్ షోలను
నడుపుతూ విపరీతంగా ప్రేక్షకాదరణను సంపాదించుకుంది. దీంతో ఈటీవీ నెంబర్ వన్
స్థానానికి చేరి జెమినీ నెంబర్ టూ ప్లేస్ కి నెట్టేసింది.
Source: telugumediastudent.com
No comments:
Post a Comment