`1` సినిమా రూ.15 కోట్లకు అమ్ముడుపోయిందట
అత్తారింటికి దారేది కి రూ. 12 కోట్లు వచ్చాయట!
నాగార్జున సినిమా ఆరున్నర కోట్లా..?
అత్తారింటికి దారేది కి రూ. 12 కోట్లు వచ్చాయట!
నాగార్జున సినిమా ఆరున్నర కోట్లా..?
ఇవేం కాకి లెక్కలు కాదు. టీవీ లెక్కలు. నిజం… సినీ మార్కెట్ ముఖ చిత్రం
నాటినాటికీ మారిపోతోంది. సినిమా అనే వస్తువుని అమ్ముకోవడానికి ఎన్నో
మార్గాలు! అందులో శాటిలైట్ మార్కెట్ ఒకటి. పెద్ద సినిమాలకు ఎలాగూ
శాటిలైట్ మార్కెట్ ఉంటుంది. మహేష్‌బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్,
రామ్‌చరణ్ – వీళ్లవన్నీ కోట్లలో వ్యవహారాలు. అయితే ఇటీవల చిన్న
సినిమాలూ శాటిలైట్ హక్కుల రూపేణా అంతో ఇంతో సొమ్ము చేసుకొంటున్నాయి.
కొంతమంది నిర్మాతలు తమ సినిమాలకు కనీసం శాటిలైట్ హక్కులొస్తే చాలు –
గట్టెక్కేయొచ్చు అనుకొంటారు. ఆ మాట కూడా అక్షరాలా నిజమే. చిన్నా చితకా
సినిమాలు శాటిలైట్ హక్కుల రూపేణా 50 – 70% పెట్టుబడిని తిరిగి
దక్కించుకొంటున్నాయి. ఇంతకంటే.. చిన్న సినిమాకు వరం ఏముంటుంది? కాకపోతే
అన్నిసార్లూ శాటిలైట్ మంత్రం పనిచేయదు. ఎందుంకంటే ఛానళ్లుకూడా తెలివి
మీరిపోయాయి. ఎవరి సినిమాలకు బుల్లి తెర వీక్షకుల ఆదరణ బాగుంటుందో
వారికీ అర్థమైంది. అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమా హక్కుల్ని కొనడం
లేదు. దాంతో.. వందల సినిమాలకు శాటిలైట్ మార్కెట్ దక్కకుండా పోయింది. ఇది
మరో కోణం.
టీఆర్‌పీ రేటింగ్స్‌పైనే చిన్న టీవీ ఛానళ్లు మనుగడ
సాగిస్తున్నాయనేది నిర్వివాద అంశం. ముఖ్యంగా ఎంటర్‌టైన్ మొంట్
ఛానళ్లవారికి సినిమాలే దిక్కు. జెమినీ, జెమినీ మూవీస్, మాటీవీ, మా
మూవీస్, జీ తెలుగు – సినిమాలపై ఆధారపడి నడుస్తున్న ఛానళ్లు.
అఫ్‌కోర్స్ ధారావాహికలూ వస్తాయనుకోండి. కాకపోతే సినిమాలైతే
ఇంటిల్లిపాదీ చూస్తారు కదా? పైగా శని, ఆదివారాల్లోనూ సీరియళ్లే చూడడం
బోరింగ్. కాబట్టి సినిమాల్ని కొనడం తప్ప ఎంటర్‌టైన్ మెంట్ ఛానళ్లకు
వేరే ఆప్షన్ లేదు. కాబట్టి నిర్మాతలు రాజ్యం చలాయించారు. ఛానళ్ల మధ్య
పోటీ కూడా వారికి బాగా కలిసొచ్చింది. శాటిలైట్ హక్కుల రూపంలో కోట్లు
వెనకేసుకొచ్చారు. సినిమాల్ని సేఫ్ జోన్‌లో పడేశారు. అంతెందుకు
తారకరత్న, తనీష్ లాంటి వాళ్లకు మార్కెట్ లేదు. వారి సినిమాలకూ
శాటిలైట్ హక్కుల రూపేణా బాగానే ముట్టేవి. దాంతో నిర్మాతలు వీరితో
సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపించారు. ఉదయ్‌కిరణ్, శ్రీకాంత్,
జగపతిబాబు, వరుణ్ సందేశ్ వీళ్లంతా శాటిలైట్ హీరోలే. సగం బడ్జెట్‌ని
టీవీ హక్కుల రూపేణా వెనక్కి తెచ్చుకొనేవారు. సినిమా ఆడిందా, నిర్మాతకు
లాభాలొచ్చేవి. పోయినా.. పెద్దగా నష్టపోయేవాడు కాదు.
అయితే ఇప్పుడు టీవీ ఛానల్లు కూడా బుర్ర ఉపయోగిస్తున్నాయి. ఈటీవీ అసలు
సినిమాలే కొనడం లేదు. తమ దగ్గర పాత సినిమాల కలెక్షన్ చాలా ఉంది.
వాటినే తిప్పి తిప్పి చూపిస్తూ కాలక్షేపం చేస్తోంది. ఇక జెమినీ, మా, జీ
అయితే కొన్ని సినిమాల్ని కొనడం లేదు. ముఖ్యంగా జగపతిబాబు, రాజశేఖర్,
జేడీ చక్రవర్తి లాంటి హీరోల్ని బ్లాక్ లిస్టులో పెట్టింది. అంటే.. వీరి
సినిమాల్ని ఎప్పటికీ కొనదన్నమాట. మరీ బాగుంటే అది వేరే విషయం.
ఇది వరకు అల్లరి నరేష్ సినిమాలంటే ఆడిందే ఆట, పాడిందే పాట. టీఆర్‌పీ
రేటింగ్స్ బాగుండేవి. సుడిగాడు వరకూ.. నరేష్ సుడి బాగా తిరిగింది.
శాటిలైట్ హక్కుల రేపేణా దాదాపు రూ.2.5 నుంచి 3 కోట్ల వరకూ దక్కేది. అయితే
వరుస ఫ్లాపుల వల్ల నరేష్ శాటిలైట్ మార్కెట్ కూడా బాగా డ్రాప్ అయ్యింది.
యాక్షన్ త్రీడీ సినిమా ఎవరూ కొనలేదట. దాంతో 1 సినిమాతో పాటు యాక్షన్
త్రీడీని ఉచితంగా ఇచ్చేశారని ప్రచారం కూడా జరిగింది. నరేష్‌లాంటి హీరోల
పరిస్థితే ఇలా ఉంటే చిన్న హీరోలేం కానూ..? శ్రీకాంత్, వరుణ్ సందేశ్
లాంటి ఓ మాదిరి హీరోలతో సినిమాలు తీసేముందు నిర్మాతలు ఒకటికి నాలుగు
సార్లు ఆలోచించుకొంటున్నారు. ఎందుకంటే వారి శాటిలైట్ మార్కెట్ ఏమాత్రం
ఆశాజనకంగా లేదు. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలుకూ మంచి మార్కెట్
జరిగింది. ఆ తరవాత సుకుమారుడు ఫ్లాప్ అవ్వడంతో ఆది మార్కెట్ కూడా డల్
అయ్యింది. రఫ్ సినిమాపై ఎవరూ ఆసక్తి చూపించడం లేదని టాక్. సాయిరామ్
శంకర్ పరిస్థితీ ఇంతే. తేజ నానా బిల్డప్పులు ఇవ్వడం మూలంగా 1000
అబద్దాలు సినిమా రూ. 2 కోట్లపై చిలుకుకు అమ్ముడుపోయింది. రేపు కూడా ఇదే
రేటు వస్తుందా? అంటే చెప్పలేం.
ఇవన్నీ చిన్న నిర్మాతలు దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉంది.
కేవలం శాటిలైట్ హక్కుల్ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీస్తే… తమ గోతి
తామే తవ్వుకొన్నట్టే. మంచి కథ, మంచి దర్శకుడు, మెరుగైన ప్లానింగ్ ఇవి
మాత్రమే నిర్మాతలకు రక్షిస్తాయి. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి త్రీడీ
ఎఫెక్టుల కాలం వరకూ ఎవరూ మరచిపోకూడని సూత్రం ఇదే.
Source: telugumirchi.com
No comments:
Post a Comment