జర్నలిజం.... ఇదో గౌరవ ప్రదమైన వృత్తి. జర్నలిస్టు ... ఇతనో సామాజిక బాధ్యతగల వ్యక్తి. ఆకర్షణ, హోదా, సామాజిక స్పృహ, సద్భావన, సదవకాశాలు కలగలసిన రంగమేదైనా ఉందంటే అదే మీడియా. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరుగ వచ్చునో.. మన కళ్లకు కట్టినట్లు చూపించేదీ, వివరించేదీ, విశ్లేశించేదీ, వివరణ ఇచ్చేదీ.. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలే! ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా.. అత్యంత అవసరమైన సమాచార స్రవంతిగా వెలుగొందుతోంది. నిత్యం ప్రజల జీవన విధానంతో విడదీయలేని అనుబంధంగా ఇమిడిపోతోంది. రోజురోజుకూ పత్రికలకూ, ముఖ్యంగా ఛానళ్లకూ పెరుగుతున్న క్రేజ్ ఇందుకు చక్కటి ఉదాహరణ.
టీవీ మీడియా ప్రభావం
ప్రజా జీవితంపై టీవీ మీడియా ప్రభావం... అపారమైంది. అలాంటిదాన్ని సక్రమంగా నడిపించడంలో వార్తాహరులు సృజనకారులు, సాంకేతిక నిపుణుల పాత్ర.. ఎంతో బాధ్యతాయుతమైంది. రెండూ సమాచార రంగానికి సంబంధించినవే అయినా, పత్రికలలో పనికి- టీవీలో పనికి చాలా తేడా వుంటుంది. అదే సమయంలో సంబంధం కూడా చాలా వుంటుంది. పత్రికలు చూశాక టీవీల నడక మొదలవుతుంది. టీవీలు చూపించిన దాని ప్రభావంతో పత్రికల కథనాలు కొనసాగుతాయి. పత్రికలతో పోలిస్తే టీవీల ప్రభావం.. తక్షణంగానూ- ప్రత్యక్షంగానూ వుంటుంది. జరిగిన దాన్ని నివేదించేవి పత్రికలైతే.. జరుగుతున్నదాన్ని చూపించి, జరగబోయేదాన్ని నిర్దేశించగల శక్తి టీవీలకు ఎక్కువగా వుంటుంది. ఏడాదికి లక్షల కొద్దీ వార్తాకథనాలు, వేలాది కార్యక్రమాలతో సహా.. సంక్షిప్త సమచారాలు, సినిమా- వ్యాపారం- భక్తి - వగైరా రకరకాల విభాగాలకు చెందిన అంశాలు.. నిర్విరామంగా ప్రత్యక్ష ప్రసారమవుతుంటే.. జనం కళ్లప్పగించి చూస్తూ వుండి పోతున్న తీరు విధితమే.
కొత్తగా ఈ రంగంలో అడుగుపెట్టాలనుకున్న వారికి సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది టెలివిజన్ మీడియా.
Source: www.televisionmedia.webs.com
No comments:
Post a Comment