Monday, October 4, 2010

తేజా టీవీ… మనకిక లేదు

తెలుగు టీవీ చరిత్ర నుంచి “తేజా” కనుమరుగైంది. అక్టోబర్ 1 నుంచి అది జెమిని మూవీస్ గా పేరుమార్చుకుంది. జెమిని బ్రాండ్ తోనే నడపాలనుకోవటం, సినిమాల చానల్ గా పేరులోనే  గుర్తింపు ఇవ్వాలని సన్ నెట్‍వర్క్ భావించటం ఇందుకు ప్రధానమైన కారణాలుగా చెబుతున్నారు. తెలుగులో తొలి మ్యూజిక్ చానల్ కూడా మొదలుపెట్టిన సన్ నెట్‍వర్క్ ఇప్పటిదాకా తేజా టీవీని  అధికారికంగా మూవీ చానల్ గా ప్రకటించలేదు.  మా టీవీ నెట్‍వర్క్ ఇప్పుడు  ’ మా మూవీస్ ’ పేరుతో ఒక చానల్ ప్రారంభిస్తుండటంతో ఇలా పేరుమార్చాలని నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతోంది. అయితే ఈ మార్పును నిశితంగా గమనిస్తే ఇదేమీ ఆషామాషీ నిర్ణయం కాకపోవచ్చునని కూడా అనిపిస్తుంది. ట్రాయ్ నియమాల ప్రకారం పాత చానల్స్ ఏవీ పే చానల్ టారిఫ్ పెంచటానికి వీల్లేదు. కొత్త చానల్స్ అయితే కొత్త రేట్లు నిర్ణయించుకోవచ్చు. అందుకే టెక్నికల్ గా దీన్ని కొత్త చానల్ గా చూపించే ప్రయత్నంలో భాగంగా పేరు మార్చి ఉండవచ్చు. అనుక్షణం కమర్షియల్ ఆలోచనలకే పెద్దపీటవేసే సన్ నెట్‍వర్క్ ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటుందని ఎలా ఊహించగలం ? కాలం  గడిచే కొద్దీ అసలు వ్యూహాలు అర్థమవుతాయి.
తేజా టీవీ ప్రస్థానాన్ని నెమరువేసుకుంటే,  ఎన్నో సందర్భాలలో అది తన ప్రత్యేకతను చాటుకున్న సంగతి గుర్తుకొస్తుంది. తేజ టీవీ స్థాపించటానికి దారితీసిన పరిస్థితులు మొదలుకొని అది సాధించిన విజయాలను ఒక్కసారి మననం చేసుకోవటం అవసరం. తెలుగులో జెమిని తొలి శాటిలైట్ చానల్. దాదాపు ఆరునెలల తరువాత మొదలైన ఈటీవీ త్వరత్వరగా అడుగులు ముందుకేసింది. ఈనాడు నెట్‍వర్క్ సాయం, ధనబలం కూడా ఈటీవీ మనుగడకు దోహదం చేశాయి. కార్యక్రమాలు బాగున్నా, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న జెమిని తప్పనిసరి పరిస్థితుల్లో సగం వాటాను సన్ నెట్‍వర్క్ కు అమ్ముకుంది. ఆర్థిక లావాదేవీల నియంత్రణ లాంటి కీలకమైన అంశాలను సన్ నెట్‍వర్క్ వ్యూహాత్మకంగా దక్కించుకోవటం ద్వారా క్రమేపీ జెమినీ మీద పెత్తనం చెలాయించే స్థితికి చేరుకోవటం తెలిసిందే. అయితే, జెమిని ప్రమోటర్లు వ్యక్తిగతంగా చానల్ పట్ల ఉండే ప్రేమను ధారాదత్తం చేసినందుకు బాధపడ్డారే  తప్ప ఒక సంస్థగా దాని ఎదుగుదల అప్రతిహతంగా సాగటం మాత్రం వారికి ఆనందం కలిగించింది. మొత్తం మీద ఈ నాటికీ నెంబర్ వన్ స్థానం నుండి దానిని ఎవరూ కదిలించలేకపోయారు. అలా జెమినీ పుంజుకోవటం మొదలైన తరువాత ఒక దశలో జెమినీ మార్కెట్ షేర్, ఈటీవీకి రెట్టింపయింది.  నెంబర్ వన్, నెంబర్ టూ చానల్స్ మధ్య అంతరం ఇంతగా పెరిగిపోతున్నసమయంలో  “అసలైన నెంబర్ టూ స్థానం ఖాళీగా ఉంది, అందుకే ఆ స్థానాన్ని భర్తీ చేయటం కోసం మరో తెలుగు చానల్ ప్రారంభిస్తున్నామ”ని అప్పటి జెమినీ ఎమ్ డీ శరద్ కుమార్ ఒక ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.
ఆ విధంగా 1999 మే 19 న తేజా టీవీ ఆవిర్భవించింది. కేవలం పాటలతో మొదలైంది. వినోదకార్యక్రమాలకే పరిమితం చేయాలా, న్యూస్ చానల్ చేయాలా అని కొంతకాలం తర్జనభర్జనలు జరిగాయి. అలా సాగుతుండగానే న్యూస్ స్క్రోల్ ఇవ్వాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. పాటలు చూస్తూ ముఖ్యమైన వార్తల స్క్రోలింగ్ చూడటానికి జనం బాగానే అలవాటు పడ్దారు. ఆ విధంగా తెలుగులో న్యూస్  స్క్రోల్ ఇచ్చిన మొదటి చానల్ తేజ టీవీ. అప్పట్లో చాలా మంది  తమ వార్త స్క్రోల్ లో వచ్చినా చాలుననుకునేవారు. దాదాపు సంవత్సరం గడిచాక న్యూస్ బులిటెన్స్ జెమినీ నుంచి తేజా కు మార్చాలని నిర్ణయించారు. అప్పటికి జెమిని టీవీకున్నఆదరణతో పోల్చుకుంటే తేజా ఆదరణ చాలా తక్కువ. అందుకే అలా మార్చటం న్యూస్ లో ఎవరికీ ఇష్టం లేదు. కానీ యాజమాన్యం ఆలోచన మరోలా ఉంది. ఆ సమయాన్ని సీరియల్స్ కు కేటాయిస్తే వచ్చే ఆదాయం చాలా ఎక్కువ కాబట్టి న్యూస్ ను అలా తేజా కు మార్చటమే మంచిదన్నారు. పైగా,  ”తేజా ను ఒక న్యూస్ చానల్ గా మార్చే ఆలోచన ఉన్నప్పుడు ఇప్పటినుంచే బులిటెన్స్ అందులో ఇవ్వటంలో తప్పేముంది” అని అడిగారు. ఆ విధంగా 2000 సంవత్సరం ఆగస్టు 10  నుంచి జెమినీవార్తలు తేజావార్తలయ్యాయి.
అప్పటికీ తేజాటీవీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. వార్తలు మార్చి మూడు వారాలు గడిచేలోపు జరిగిన ఒక సంఘటన తేజాటీవీకి రాష్ట్రప్రజలందరి అభిమానాన్ని సంపాదించిపెట్టింది. ఆగస్టు 28నాటి బషీర్‍బాగ్ కాల్పుల ఘటనతో  రాష్ట్రమంతా తేజాటీవీ పేరు మారుమోగింది. బషీర్‍బాగ్ లో పోలీసు కాల్పులు జరుగుతున్నప్పుడు తేజా టీవీ కెమెరామెన్ తీసిన వీడియో ఫీడ్ చెన్నై కార్యాలయానికి పంపినప్పుడు ఆ దృశ్యాలను వరుసగా తేజా టీవీలో ప్రసారం చెయ్యాలని నిర్ణయించడమే అందుకు కారణం. అందిన ప్రతి కాసెట్ యథాతథంగా  ప్లే చెయ్యాలని హైదరాబాద్ కార్యాలయానికి చెప్పడంతో వేరు వేరు స్థానాల్లో ఉండి తీసిన కాసెట్స్ ఒక క్రమపద్ధతంటూ లేకుండా ప్రసారమయ్యాయి. (అది చూసిన సన్ టీవీ అధిపతి కళానిధి మారన్  తమిళ చానల్ లో కూడా ప్రసారం చేయించారు). చాలా మంది ఇదంతా  ప్రత్యక్షప్రసారమని అనుకుంటారు కాని అది నిజం కాదు. కనీసం 45 నిమిషాల తేడా ఉంది. పైగా ఏది ముందు జరిగిందో, ఏది తరువాత జరిగిందో కూడా తెలియదు.. గుర్తుపట్టటం కూడా చాలా కష్టం. ఆ సంగతలా ఉంచితే, రాష్ట్ర ప్రజలకు ఒళ్ళుగగుర్పాటు కలిగించే అనుభూతి. కాల్పులఘట్టాన్ని నేరుగా చూస్తున్నట్టే అనిపించింది. ఈ విషయం తెలిసినవారు పరుగుపరుగున ఇళ్ళకువెళ్ళి టీవీలకు అతుక్కుపోయారు. ఏ నోట విన్నా తేజా టీవీ మాటే. అది ప్రత్యక్షప్రసారం కాకపోయినా ఒక ప్రత్యేకప్రసారమే.ఆ రోజునుంచి తేజా టీవీ తిరుగులేని ప్రజాభిమానం సంపాదించుకుంది.  తేజాటీవీ వార్తలకు ఆదరణ పెరిగింది.
తేజా టీవీ ని న్యూస్ చానల్ గా మార్చాలని డైరెక్టర్ పి. కిరణ్ చాలాసార్లు ప్రతిపాదించారు. ఎన్నో విధాలుగా నచ్చజెప్పబోయారు. అయినాసరే, ఆయన ప్రతిపాదనలేవీ కార్యరూపంలోకి రాలేదు. అదే జరిగి ఉంటే, తొలి తెలుగు చానల్ ఘనతతోబాటు తొలి న్యూస్ చానల్ ఘనత కూడా జెమినీ కి దక్కి ఉండేది. తెలుగు ప్రేక్షకులకు వినోదం తప్ప ఏమీ పట్టదని, డబ్బింగ్ సీరియల్స్ అయినా సరే బాగా చూస్తారని, పే చానల్ చేసినా కిమ్మనకుండా డబ్బు కడతారని సన్ నెట్‍వర్క్ కి కొన్ని నిశ్చితాభిప్రాయాలుండేవి. పైగా, ఎంటర్‍టైన్‍మెంట్ లో ఈటీవీ ని సవాలు చేయగలిగాం తప్ప న్యూస్ లో గట్టి నెట్‍వర్క్ ఉన్న రామోజీరావుతో పోటీ పడటం కష్టమని అనుకునేవారు. దీనికి తోడు సొంత అనుభవం ఉండనే ఉంది. స్టార్ టీవీ హిందీ, ఇంగ్లిష్ బులిటెన్లు మార్చి మార్చి ప్రసారం చేసినట్టు తమిళ, ఇంగ్లిష్ బులిటెన్స్ తో మొదలుపెట్టిన 24 గంటల సన్ న్యూస్ చానల్ చతికిలబడింది. ఇలాంటి కారణాలన్నిటి దృష్ట్యా తేజా టీవీ ఐదారు బులిటెన్స్ కే పరిమితమవుతూ వచ్చింది. అయితే, శుభోదయం లాంటి డెయిలీ షో తోబాటు  ఎన్‍కౌంటర్ (ఈ కార్యక్రమంతో తెలుగునాట పేరుతెచ్చుకున్న రవిప్రకాశ్ ఆ తరువాత కాలంలో టీవీ 9 ప్రారంభించటం తెలిసిందే), విశ్వదర్శనం, ఇదండీ సంగతి, ఇండియా రౌండప్, ఎపి రౌండప్ లాంటి వీక్లీ కార్యక్రమాలు కూడా ప్రసారమయ్యేవి. దక్కన్ క్రానికల్ ముందు పవన్ కళ్యాణ్ ధర్నాలాంటి ఘట్టాలను కూడా యథాతథంగా ప్రసారం చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం తేజాటీవీకే చెల్లింది. ప్రత్యక్షప్రసారాలు అలవోకగా అందించటం కూడా తేజాటీవీ ఘనతగానే చెప్పుకోవాలి. సన్ టీవీతో కలిసి ప్రత్యక్ష ప్రసారం చేసిన శబరిమల మకరదర్శనం, సంపూర్ణ సూర్యగ్రహణం, వేలాంకణీమాత ఉత్సవాల లాంటివి పక్కనబెట్టినా, శాసనసభాకార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం చేసిన తొలితెలుగు శాటిలైట్ చానల్ గా తేజాటీవీ  ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతుంది. రాజ్ భవన్ నుంచి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని రాష్ట్రప్రజలకు తొలిసారిగా ప్రత్యక్షప్రసారం ద్వారా చూపిన ఘనతకూడా తేజాటీవీ సొంతమే. నంది అవార్డుల బహుకరణ, క్లింటన్ పర్యటన సహా అనేక చారిత్రకఘట్టాలకు సామాన్య ప్రజలను ప్రత్యక్ష సాక్షుల్ని చేసిన అనుభవం అసాధారణం.
అయితే ఆ తరువాత కాలంలో రాష్ట్రంలో న్యూస్ చానల్స్ శకం మొదలై, అవి సాధించిన తొలివిజయాలు చూశాక న్యూస్ చానల్ పెట్టాలన్న ఆలోచన కార్యరూపం దాల్చింది. అప్పటికే ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ గా నిలదొక్కుకున్న తేజా టీవీని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించుకోవటంతో జెమినీ న్యూస్ పేరిట 24గంటల న్యూస్ చానల్ మొదలుపెట్టారు. దాని మంచిచెడ్డల ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం. న్యూస్ చానల్ ఉండటం వలన తేజాటీవీలో బులిటెన్స్ తగ్గిపోయాయి. అది సినిమాల చానల్ గా మారిపోయింది. నామమాత్రంగా రాత్రి ఎనిమిదిన్నర గంటల బులిటెన్ కొనసాగుతూ వచ్చినా అదీ లేదు .ఏ లక్ష్యం కోసం మొదలైందో ఆ లక్ష్యాన్ని సాధించిందనేందుకు సాక్ష్యంగా అది కనుమరుగయ్యేనాటికీ రెండో స్థానంలోనే ఉంది. ఇప్పుడిక తేజాటీవీ లేదు. జెమినీ మ్యూజిక్ మాత్రమే కనిపిస్తుంది. ఒకప్పటి తేజా టీవీ ఇలా పేరుమార్చుకుందన్న విషయమైనా కొత్తతరం గుర్తిస్తే అదేపదివేలనుకుంటూ హుందాగా తప్పుకుంది. పదకొండు సంవత్సరాలపాటు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్న ఆ పేరు  ’’ కార్పొరేట్ బ్రాండ్ బిల్డింగ్  ”  అనే కమర్షియల్ రథచక్రాల కింద నలిగిపోయింది. చరిత్ర సృష్టించిన చానల్ అదే చరిత్రలో కలిసిపోయింది.  దాన్ని హృదయాలకు హత్తుకొని పెంచిపోషించిన వందలాదిమంది సిబ్బందికి, కోట్లాది వీక్షకులకు తీపిగుర్తుల్ని మాత్రం మిగిల్చిపోయింది.

Source: bhavanarayana.co.tv

No comments:

Post a Comment