పెళ్లెప్పుడు బాబూ-అని ప్రశ్నిస్తూ ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. వరుణ్‌గాంధీ పెళ్లి కబురు వచ్చేసరికి రాహుల్‌గాంధీకి పెళ్లి కాలేదని మన తెలుగు చానళ్లకు తెలిసివచ్చింది. అంతే సదరు విషయంపై కార్యక్రమం సిద్ధమై, తెలుగునాట వాలిపోయింది.చానళ్లకు జ్ఞాపకశక్తి అతి కురచ అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం!
సరిగా సంవత్సరం క్రితం మన రాష్ట్రాన్ని వరదలు కుదిపేశాయి. మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాలు తల్లడిల్లిపోయాయి. తెలుగు చానళ్లు ఈ వార్తలతో మహావరదలుగా మారిపోయాయి. టీవీ-9 దీనిమీద ఊరూరా ర్యాలీలుపెట్టి విరాళాలు సేకరించింది కూడా! నిజానికి ఇలా విరాళాలు సేకరించడంపై మరో చానల్ ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించబోయి చివరకు ఆ అంశం తప్ప మిగతా విషయాలతో కార్యక్రమాన్ని నింపింది. సరే! టీవీ-9 ఇంతవరకు అలా సేకరించిన విరాళం ఎలా వ్యయం చేసిందో టీవీ చానళ్లను తక్కువగా వీక్షించే భవదీయ కాలమిస్టుకు ఇంతవరకు కంటకానీ, చెవినగానీ పడలేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళం కనుక, వారికి తెలుసుకొనే హక్కు లేదని ఏలే చానళ్ల ‘ఆధునిక నీతి నియమం’ కావచ్చుకాక! కానీ సంవత్సరం తిరగలేదు, ఏ చానల్‌కైనా 2009 అక్టోబర్ వరదలు గుర్తుకు వచ్చాయా? ఏదో పొరపాటున మహాటీవీ వారికి మాత్రం గుర్తు వచ్చినట్టుంది. వారు మాత్రం అరగంట కార్యక్రమం చేసినట్టు మాత్రమే మా కంటబడింది.
* * *
చానళ్లకు పేర్లు మారడం తెలుగులో బాగా పెరిగిందా? తేజ న్యూస్, అల్ఫా తెలుగు, ఆదిత్య, సంస్కృతి, తేజ, నవ్వులు, ఖుషీ వీటిపేర్లు మారిపోయాయి. అక్టోబర్ ఒకటవ తేదీనుంచి ‘తేజ’ జెమిని మూవీస్‌గా మారింది. అలాగే నవ్వులు, ఖుషీ కూడా అదే త్రోవలో నడిచాయి. అంటే సన్ నెట్‌వర్క్ చానళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఏదోరకంగా జెమినీ అనే అక్షరాలను తప్పక కలిగి ఉంటాయి. అలాగే కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో వరసగా ఉదయ, సూర్య, సన్ అనే పేర్లను కచ్చితంగా కలిగి ఉంటాయి. ఇది యాజమాన్యపరంగా అనుకూలించే విషయం. అంతకుమించి జాతీయస్థాయిలో ప్రకటనలు ఆకర్షించడానికి కొంత వెసులుబాటు అదనంగా ఉంటుంది.
* * *
ఈసారి వినాయకచవితి అవాంఛనీయ సంఘటనలు లేకుండా గడిచిపోయింది. నిమజ్జనంతోపాటు అయోధ్య తీర్పు అనే హడావుడి వార్తలు జనాలను బెదరగొట్టాయి. తర్వాత తీర్పు 28 అనీ ప్రచారం మొదలైంది. చివరికి సెప్టెంబర్ 30గా ఖరారు అయింది. తీర్పు కూడా భయాందోళనలు లేని రీతిలో రావడం దేశం ఊపిరి పీల్చుకుంది.
వినాయక చవితి సమయంలో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ప్రేలుడు సంభవించింది అని చానళ్లు హంగామా చేశాయి. కానీ చానళ్లు భయపెట్టినంత స్థాయిలో సంఘటన లేదు కానీ ఒకవైపు వినాయకచవితి ఉత్సవాలు, మరోవైపు బాబ్రీ మసీదు తీర్పు అని సంశయ పడుతున్న వేళ ఇటువంటి వార్తలకు అటువంటి స్థాయిలో సంచలనం సృష్టించాలనుకోవడం మన తెలుగు చానళ్ల స్థాయికే చెల్లింది.
టెక్నాలజీ బాగా పెరిగితే, బుర్ర మరీ నేలబారిపోతోందా? నిమజ్జనంరోజున ఒకేసారి పలు దృశ్యాలను చూపాలని నాలుగు కాదు, ఏడెనిమిది దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంగా చూపాలని తాపత్రయపడ్డారు. ఈ దృశ్యాలు ఎంత చిన్నగా మారాయంటే ఒక్కోసారి సదరు చానల్ లోగో ఒక దృశ్యాన్ని మింగేసేటంత! అదే సమయంలో లైవ్ అంటూ మాటలు రాని రిపోర్టర్ చేత వ్యాఖ్యానం ఇప్పించాలని ప్రయత్నించడం మరో విషయం. ఈ రిపోర్టర్‌లు అంతా నాయకుల తగవులను బాగా అందివ్వగలరు గానీ ఇటువంటి సంఘటనలను కాదు. టీవీ-9 వ్యాఖ్యాత తొమ్మిది ప్రాధాన్యతను చెబుతూ టీవీ-9ను సంకీర్తన లంకించుకోవడం ఎంతో ఎబ్బెట్టుగా ఉంది. వినాయక చవితి నిమజ్జనం వ్యాఖ్యానం విషయంలో దూరదర్శన్ పైచేయి అని రుజువు చేసుకుంది. మిగతా చానళ్లు ఏమాత్రం శ్రమ, ఖర్చు లేకుండా రేటింగులు రాలాలని ప్రయత్నించాయి. కానీ బాలాపూర్ లడ్డు వేలం వివాద విషయాన్ని ప్రత్యక్ష ప్రసారంగా మలచిన చానళ్లు కూడా రెండు ఉన్నాయి. దానికేశ్రమ అక్కరలేదు. ప్రచారం కావాలనుకున్నవారు, వారే సొంత వాహనం మీద పారితోషికం ఆశించకుండా స్టుడియోలో వాలుతారు. అదీ కిటుకు!
* * *
టీవీ చానళ్లు చూస్తుంటే ఎవరి గోల వారిది అనే సామెత పదే పదే గుర్తుకువస్తుంది. సాక్షి చూస్తే జగనన్న యాత్ర పదేపదే చూపుతారు కదా అని స్టుడియో ఎన్‌వైపు వెళ్లాను. రాత్రి పదిగంటలకు ఒన్‌మినిట్ అని అరగంటలో ముప్పయి వార్తలు ఇచ్చే కార్యక్రమం అది. కానీ ఆ కార్యక్రమం ఎవరికీ చెప్పకుండా రద్దయిపోయింది. అంతేకాదు చంద్రబాబు యాత్రతో చానల్ సాగిపోయింది. అది అరగంటో, గంటో-మనకు తెలియదు. ఎందుకంటే పరీక్షగా చూసే ఓపిక లేదు కనుక. చమక్కు: ఓరు‘ఘల్లు’, విశాఖ తీరాన, కృష్ణాతీరం...ఇవి ఎన్‌టీవీలో ప్రాంతాలవారీ వార్తాకదంబాలకు చేసిన నామకరణాలు. ఇంగ్లీషు శీర్షికల ఎడారిలో తెలుగు ఒయాసిస్సులా ఇవి వినపడుతున్నాయి. *
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment