Monday, June 14, 2010

'ఆట' కట్టు: ఆట-5 రియాల్టీ షోను తక్షణమే నిలిపివేయాలి

అన్ని చానళ్లలో అసభ్య షోలనూ నిషేధించాల్సిందే
రాష్ట్రంలో ప్రసారమవుతున్న జాతీయ చానళ్లపైనా నిషేధం
రియాల్టీ షోలపై ప్రజాభిప్రాయ సేకరణ జూలై3న
హక్కుల కమిషన్ చారిత్రక తీర్పు


హైదరాబాద్, జూన్ 12: ఎట్టకేలకు 'ఆట'కట్టయింది. రియాల్టీ షోలలోని క్రూయల్టీకి చెక్ పడింది. పిల్లల జీవితాలతో ఆటలొద్దని హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. అసభ్య ప్రకటనలపైనా ఉక్కుపాదం మోపింది. తీవ్ర వివాదాస్పదమైన 'ఆట' రియాల్టీ షోపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ శనివారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.

ఆట-5 పేరిట జీ-తెలుగు చానల్‌లో ప్రసారమవుతున్న రియాల్టీ షోపై నిషేధం విధించింది. ఆయా కార్యక్రమాల విరామ సమయంలో ప్రసారమవుతున్న అసభ్య ప్రకటనలనూ నిలిపి వేయాలని నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిషేధాజ్ఞలను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది. కమిషన్ ఆదేశాలపై తీసుకున్న చర్యలను సోమవారం ఉదయం 10.30 గంటలకు వివరించాలని ఆయనను ఆదేశించింది. జీ-తెలుగు చానల్‌లో ప్రసారమవుతున్న ఆట-5 రియాల్టీ షోపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఆట-5 రియాల్టీ షోను స్వయంగా వీక్షించిన తర్వాతే ఈ తీర్పు చెబుతున్నట్టు కమిషన్ చైర్మన్ జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి తెలిపారు. పిల్లల హక్కులను హరించేలా ఇటువంటి రియాల్టీ షోలు ఏ చానల్‌లో ప్రసారమైనా వాటిపై నిషేధం అమలు చేయాల్సిందేనన్నారు. ఈ నిషేధం జాతీయ చానళ్లలో ప్రసారమవుతున్న రియాల్టీ షోలకూ వర్తిస్తుందని, వాటి ప్రసారాలను రాష్ట్రంలో నిలిపివేయాలని స్పష్టం చేశారు.

వీటిని ప్రసారం చేయడం.. బాలల హక్కుల కోసం రాజ్యాంగంలో పొందుపరచిన 39(ఇ),(ఎఫ్), 45, 46 ఆర్టికల్స్‌ను పూర్తిగా దుర్వినియోగం చేయడమేనని తేల్చి చెప్పారు. ఇటువంటి ప్రసారాలు కేబుల్ టెలివిజన్ రెగ్యులేటింగ్ యాక్టు, జువైనల్ జస్టిస్ యాక్టు-2000, యంగ్ పర్సన్స్ (హార్మ్‌ఫుల్ పబ్లికేషన్స్) యాక్టు-1956లకు విరుద్ధమని స్పష్టం చేశారు.

కేబుల్ టీవీ రెగ్యులేటింగ్ యాక్ట్‌లోని సెక్షన్ 19, 20 ప్రకారం జుగుప్సాకర ప్రసారాలను నిలిపివేసే అధికారం పోలీసు కమిషనర్‌కు ఉంటుందన్నారు. గంటపాటు ప్రసారమయ్యే ఈ రియాల్టీ షో వెనక కఠోర శ్రమ ఉంటుందని, అందుకు పిల్లలు ప్రతిరోజూ గంటల తరబడి రిహార్సల్స్ చేయడం, పరిమితికి మించిన మ్యూజికల్ సౌండ్స్, హై వోల్టేజీ లైట్ల ముందు ఉండడం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.

14 ఏళ్లలోపు చిన్నారులు బడిలో ఉండాలని, వారి వారి స్థాయులను బట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను బడుల్లో చేర్పించాలని సూచించారు. లేకపోతే.. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ప్రభుత్వమే వారిని పాఠశాలల్లో చేర్చాల్సి ఉంటుందన్నారు. అసభ్యకర రియాల్టీ షోలపై నిషేధం విధించినంత మాత్రాన కళలకు, కళాకారులకు కమిషన్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

ఫిర్యాదులు వచ్చిన రియాల్టీ షోపైనే ప్రస్తుతానికి నిషేధం విధిస్తున్నామని, మిగిలిన చానళ్లలో వస్తున్న షోలపై జూలై 3న ఉదయం 11 గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని, ఆరోజు ప్రేక్షకులు, కార్యక్రమాల నిర్మాతలు, కళాకారులు, కొరియోగ్రాఫర్లు, సంబంధిత టీవీ చానళ్ల ఉద్యోగులు అభిప్రాయాలను వెల్లడించవచ్చంటూ విచారణను అదే రోజుకు వాయిదా వేశారు.

నిషేధంపై మహిళా సంఘాల ఐక్య వేదిక హర్షం
హక్కుల కమిషన్ తీర్పుపై మహిళా సంఘాల ఐక్య వేదిక హర్షం వ్యక్తం చేసింది. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నాడు ఈ తీర్పు వెలువడడం చరిత్రాత్మక సంచలనంగా శనివారం ఓ ప్రకటనలో అభివర్ణించింది.

Source: andhrajyothy.com

No comments:

Post a Comment