Monday, June 14, 2010

ఆట-5 జూనియర్స్‌పై నిషేధం: డాక్టర్ సుభాషణ్ రెడ్డి

ముక్కు పచ్చలారని పిల్లలతో "ఆట"లా... ఆపేయండి

రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ డాక్టర్ సభాషణ్ రెడ్డి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ జీ తెలుగులో ప్రతివారం ప్రసారమయ్యే ఆట-5 జూనియర్స్‌పై నిషేధం విధించారు. ఇందులో ముక్కు పచ్చలారని చిన్నారులతో అసభ్య నృత్యప్రదర్శనలు చేయించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. అందువల్లే వీటిపై నిషేధం విధించినట్టు తెలిపారు.

రియల్టీ షోలలో చిన్నారులను అసభ్యకరంగా చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి షోల నిర్వహణకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. అలాగే, టీవీలలో ప్రసారమయ్యే కొన్ని అసభ్యకర ప్రకటనలపైనా దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. రియాల్టీషోలను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధిక ఓల్టేజీ కింద ప్రాక్టీసులు చేయడం, డ్యాన్సులు వేయడం వల్ల పిల్లల ఆరోగ్యంతో పాటు.. చదువులు కూడా దెబ్బతింటాయన్నారు. అందువల్లే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. తాము తీసుకున్న ఈ కీలక నిర్ణయం పలువురిని ఆర్థికంగా ఇబ్బందులు గురి చేసినప్పటికీ మరోమార్గం లేదన్నారు. రియాల్టీ షోలపై వచ్చే నెల మూడో తేదీన ప్రజాభిప్రాయసేకరణ జరుపుతామన్నారు.

ఇందులో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చన్నారు. అంతేకాకుండా, చిన్నారుల తల్లిదండ్రులకు కూడా ఆయన కొన్ని హెచ్చరికలు చేశారు. తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా మసలుకోవాలన్నారు. అలాగే, ఈ తీర్పును తాను వ్యక్తిగతంగా ఇవ్వలేదన్నారు. 1989 ఐక్యరాజ్య సమితి చట్టంలో కూడా ఈ తరహా చట్టం ఉందని, దీన్ని మన దేశం కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.

అలాగే, ఒక్క ఆట-5 రియాల్టీ షోపైనే కాకుండా, ఇతర టీవీలలో ప్రసారమయ్యే షోలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాసినట్టు డాక్టర్ సుభాషణ్ రెడ్డి తెలిపారు. 

Source: telugu.webdunia.com

No comments:

Post a Comment