Tuesday, March 1, 2011

వీక్షకుల తీర్పు

‘తీర్థయాత్ర’
ఈటీవీ-2లో ప్రసారమవుతోన్న ‘తీర్థయాత్ర’ చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. కెమెరా అమ్మవారి ముఖం మాత్రం చూపించి, పాదాలనూ పీఠాన్నీ చూపించదు. అలాగే శివలింగం మీదున్న ధారా పాత్రనూ, లింగం మీది దళాలనూ చూపిస్తూ ఠక్కున భక్తురాళ్లని చూపిస్తుంది. లేదా సముద్రాన్ని చూపిస్తుంది. ఇలాగే ఎన్నెన్నో. సోమనాథాలయంలోని అమ్మవారి ముఖం పూర్తిగా చీకట్లో కలిసిపోయి ఉండటం మేం చూశాం. గతంలో ఉజ్జయిని ఆలయంలోకి కిందికి దిగి వెళ్లే మెట్లను కెమెరా పదేపదే చూపించింది. దిగి వెళ్తే కోనేరు వస్తుంది. కుడి పక్కన మహాకాళేశ్వర లింగమూ కనిపిస్తుంది. ఈ రెండూ చూపకుండా కెమెరా తిన్నగా లింగంపై భాగాన్ని మాత్రం చూపించింది. ఆ వెంటనే ఆలయ శిఖరాన్ని చూపించారు. ఇలా ప్రతి ఎపిసోడ్‌లనూ సగం సగం చూపటమే జరుగుతోంది. భక్తుల మనోభావాల పట్ల అంత నిర్లక్ష్యం కూడదు. స్క్రిప్ట్ విషయంలోనూ ఇలాగే. దర్శనీయమైన ప్రత్యేక అంశాలను అందించాలని రైటర్ తెలుసుకోవాలి. ఉదాహరణకు ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడికి జరిగే భస్మ హారతిని చూడటం జన్మ ఎత్తినందుకు ఒక సార్థకత. దాన్ని చూపాలి. ఇంకా మహాకాళేశ్వరుడికి జరిగే అలంకారాలు అద్భుతాలు వాటిని చూపాలి. తలపాగా మీసాల్తో ఉన్న ఒక మహారాజట! భిక్షువుట! కోపం ముఖంతో ఉన్న స్మరహరుడట!.. ఎన్ని రకాల అలంకారాలో! అక్కడ దొరికే ఫొటోలనైనా చూపించవచ్చు కదా. అలాగే సోమనాథాలయం పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఎంతో సాహసవంతంగా నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను వివరంగా చూపించలేదేమి? అసలాయన్ని గురించి చెప్పలేదేమి? అక్కడకు దగ్గర్లో వున్న కృష్ణుడి నిర్యాణం సమాధిని చూపించనక్కర్లేదా?

‘అగస్త్యుల వారు ఇక్కడికి వచ్చారని ఇక్కడి వారి నమ్మకం’ వంటి వాక్యాలు (అన్ని ఎపిసోడ్‌లలోనూ ఉంటున్నవి) రైటర్‌కున్న అవగాహనలోని అసంపూర్ణత్వాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఆ నమ్మకం ‘అక్కడి వారికేనా’? అందరు హిందువులకు లేదా? ఉండదా? ‘వచ్చారు’ అని చెప్పలేరా?


యాంకర్ వైదేహిగారు ‘శంఖరుడు’ ‘ఖాళీమాత’ వగైరా అపభ్రంశపు ఉచ్చారణలను మానాలి. మొత్తం మీద ‘తీర్థయాత్ర’ను గత కొన్నాళ్లుగా చూస్తున్న వాళ్లకు భక్త్భివం పెరగటం దేవుడెరుగు, ముందు విసుగు కలుగుతోంది.
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు,
ఏలూరు


సిఐడి
రాత్రి 10 గంటలకు మాటీవీ వారు కొన్ని నేరాలు - హత్యలు అవి చేసిన వారి నేరాలను ఏ ‘క్లూ’తో కనుగొనవచ్చునో చూపుతున్నారు. ఫలానా ఆవిడ గుడ్ ‌నైట్ చెబుతూ, లిప్‌స్టిక్ పూసిన పెదవులతో తను చంపిన వ్యక్తికి ముద్దు ఇస్తుంది. అందువల్ల ఆ ముద్దు గుర్తును బట్టి ఆ లిప్‌స్టిక్ ముద్దు గుర్తును క్లూగా తీసుకుని ఆవిడే హంతకురాలు అని తెలుస్తుంది. ఇలాంటి ‘క్లూస్’ ఈ సిఐడి కార్యక్రమాలు తెలుపుతున్నాయి. ఈ తెలివిని ఉపయోగించి క్లూస్‌ను దొరకనీయకండి అని నేరస్థులకు పాఠాలు చెబుతున్నట్టా?
-శ్రీమతి ఈషికాదేవి (మల్కాజ్‌గిరి)


పసుపు-కుంకుమ

జీ తెలుగు ‘పసుపు-కుంకుమ’ సీరియల్‌లో దిష్టి తీసే సీనొకటి చూపారు. వయసులో చిన్నవారు తమకంటె పెద్దవారికి దిష్టి తీయకూడదు. ఆ అమ్మాయి ఇంట్లో పెద్దవారికి విషయం చెప్పి వారితో దిష్టి తీయించినట్లు చూపించి ఉంటే బాగుండేది.
-ఆర్.ఘంటప్ప (తాడిపత్రి)


ఘోరాతి ఘోరం
11.2.2011 ఘంటసాల వర్థంతి సందర్భంగా జీ తెలుగు ఛానెల్‌లో ‘చిరంజీవులు’ పేరిట ఘంటసాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసి ఘంటసాల 46 చిత్రాల్లో పాడినట్లు 52 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినట్లు స్క్రోలింగ్ వేశారు. ఇది పరమ దారుణం. ఘంటసాల 650 చిత్రాలకు పైగా పాటలు పాడారు. వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. నిజానిజాలను తెలుసుకోకుండా వీక్షకులకు తప్పుడు సమాచారం ఇవ్వటం ఘోరం. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరక్కుండా చూసుకోవటం మంచిది.
-ఎస్.వి.రామారావు
హైదరాబాద్


నల చరిత్రయా? నాలా చరిత్రయా?
ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో (ముంబైలో కాబోలు) సాంస్కృతిక కార్యక్రమాలు చూపించారు. ఒక నృత్య కళాకారిణి ‘నల చరిత్ర’ (నల దమయంతి గాథ)లో భాగాలను నృత్యం చేసి చూపారు. కాని ఆ కార్యక్రమాన్ని పరిచయం చేసే యాంకర్ ‘ఫ్రం నాలా చరిత్ర’ అంది ఆంగ్లంలో. నాలాలకు నలులకు వ్యత్యాసం ఎంతో కదా. మరో తెలుగు యాంకర్ ‘శారీ’ (చీర) అనేందుకు బదులు ప్రతిసారి ‘సారీ’ అంటోంది. సారీకి శారీకి ఎంతో దూరం కదా.
-శ్రీమతి సుజాత నాగరాజారావు, కావలి


ఇవేం సీరియల్స్?
ఈ మధ్య హిందీ తెలుగు సీరియల్స్‌ని వివిధ ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి. ముగింపు లేని సీరియళ్లను అనవసరంగా పొడిగిస్తూ పోతూ ప్రేక్షకులు బోర్ చెందుతున్నారని గ్రహించి ఈ మధ్య ఏక్తాకపూర్ సీరియల్స్‌లోనూ, ఇతర సీరియల్స్‌లోనూ ప్రేమ దృశ్యాలు, కౌగిలింతలు, ముద్దు సీన్లు చిత్రీకరిస్తున్నారు. ‘సంగిని’ ‘దిల్ సే దియా వచన్’ లాంటి సీరియల్స్‌లో లవ్ సీన్లు మితిమీరిపోతున్నాయి. సినిమాల కంటే సీరియల్స్‌లో కూడా లవ్ దృశ్యాలు, కౌగిలింతలు, ఒకరిపై ఒకరు పడుతూ చూపిస్తున్న దృశ్యాలు ఇంట్లో కూర్చుని కుటుంబంతో కలిసి చూట్టానికి ఇబ్బంది పడుతున్నారు. టీవీ సీరియల్స్‌కు కూడా సెన్సార్ అవసరం.
-మహ్మద్ యూసుఫ్, కాజీపేట
 

చంద్రముఖి
ద్వేషాలు, మోసాలు, రోషాలు చూపించి/ బీభత్సములతోడ భీతి గొలుపు/ ఒకరితో ప్రేమ వేరొకరితో పెళ్లికి/ సిగ్గు విడిచి తాము సిద్ధపడుచు/ కిడ్నాపు డ్రామాలు కీలక దృశ్యాలు/ హింసించు టెంతయు హేయవౌను/ మనసులో ఒక రీతి మసలు పద్ధతి వేరు/ దొంగ నాటకమాడు దుష్టులగుచు/ పెక్కు ఎపిసోడ్లు పొడిగించి పెంచుచుండ/ చంద్రముఖి సీరియల్ గాంచి చకితులగుచు/ జిడ్డు సీరియలిదనుచు ఛీత్కరింప/ ఎపుడు ముగియింప జూతురో ఎరుక గాదు.
-కరణం రాజేశ్వరరావు, హిందూపురం
 

క్రికెట్ పండుగ
వచ్చేసింది.. వచ్చేసింది క్రికెట్ పండుగ. ఆనందమే ఆనందం. ఇక సీరియళ్ల బెడద ఉండదు. ఇడియట్ బాక్స్ నుంచీ అసందర్భపు సీన్లు, డైలాగులు, నిర్వాకాలు, జనాల్ని ఇబ్బంది పెట్టే వెర్రిమొర్రి వేషాలు, దరిద్రపు సీరియల్స్‌కు ఇక చెక్ పెట్టేయ్యొచ్చు.
-కొంగర ఉమామహేశ్వరరావు, తెనాలి


పునర్జన్మ
మాటీవీలో ప్రసారమవుతున్న ‘గత జన్మ రహస్యం’లో - ఒకామె ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి తాను లంబాడీల ఇంట్లో పుట్టి బాధలనుభవించి ఓ కొడుక్కి తల్లయి ఆఖరికి చనిపోయినట్టు.. ఆ కొడుకే మరుజన్మలో భర్త అయినట్లు చెప్పారు. ఆమె జీవిత చరిత్ర తెలుసుకోగలిగాం. కాని ఆ కొడుకే భర్త (ఈ జన్మలో) అయినట్టు తెలుసుకునేందుకు దాఖలాలేవీ? ఈ కార్యక్రమంలో ఇటువంటి సందేహ నివృత్తి చేస్తే ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది.
-శివాని, శృంగవరపుకోట


చిన్నారి పెళ్లికూతురు
మా టీవీలో రాత్రి 7 గంటలకు ప్రసారమవుతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’ అద్భుతంగా ఉంది. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను చూపుతూ రాజస్థానీ నేపథ్యంలో నిర్మించిన ఈ సీరియల్ చూసి మన సీరియల్ నిర్మాతలు, దర్శకులు నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది.
-శుభ, కాకినాడ


Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment