Tuesday, March 1, 2011

ఎల్లలెరుగని నృత్యం

ఇది వరకైతే సినిమా వాళ్ళు టీవీల్లోకి వస్తే ‘అక్కడ కనుమరుగవుతుంటే ఇక్కడ ప్రత్యక్షమవుతున్నార’నే అపవాదొకటి ఆర్టిస్టులకొచ్చేవి. కానీ నేడు పరిస్థితి మారింది. సినిమాతో సమాంతరంగా చిన్న తెర రాజ్యమేలుతోంది. కొన్నికొన్ని సందర్భాలలో నటీనటుల సుదీర్ఘ చలనచిత్ర కాలంలో రానంత పేరు టీవీల్లో వారు పాల్గొనే ఒకటో, రెండో షోలకు వచ్చేస్తోంది. అందుకెన్నో ఉదాహరణలు. ఇప్పుడా మాదిరి ప్రయత్నాన్ని నటుడు హృతిక్ రోషన్ స్టార్ టీవీలో రానున్న ‘జస్ట్ డాన్స్’ నృత్య కార్యక్రమం ద్వారా చేయనున్నారు. ‘జస్ట్ డాన్స్’ కార్యక్రమానికి న్యాయనిర్ణేతల్లో ఒకరుగా హృతిక్ వ్యవహరిస్తున్నారు. ఈ కొత్త అవతారపు అనుభవాలు ఆయన మాటల్లోనే..

ఎందుకొప్పుకున్నానంటే..

ఒక ఆర్టిస్టుగా నిరంతరం నవ్యత కోసం అన్వేషిస్తూ వుంటా. ఆ అన్వేషణలో భాగంగానే స్టార్ చానల్ వారు ‘జస్ట్ డాన్స్’ కాన్సెప్ట్‌ని నా ముందుంచి నన్ను కూడా సహకరించమన్నప్పుడు ఇంకో ఆలోచన లేకుండా యస్ చెప్పేశా.

నేనేం పెద్ద గొప్ప డాన్సర్‌ని కాను
చాలామంది అంటున్నారు. నాకు డాన్స్‌పట్ల ఉన్న ఇష్టం వల్లే ఈ షో ఒప్పుకున్నానని. కానీ నా దృష్టిలో నేనేం పెద్ద నెంబర్ వన్ డాన్సర్నేం కాదు. నిజానికి నా కన్నా అనేక మంది ఉత్తమోత్తమ డాన్సర్లు ఉన్నారు. నన్నడిగితే పాత తరం నటుడు షమీకపూర్ బెస్ట్ డాన్సర్. ఇప్పుడు తరచు మనం అనుకునే ‘గాడ్ ఆఫ్ డాన్స్’ పదానికి సరిపోతారు. ఆయన నృత్యం చేస్తే హృదయం నుంచి ఆవిష్కరించుకుని నృత్యం చేసినట్లు ఉంటుంది. ఇంక ఈ కార్యక్రమం విషయానికొస్తే బెస్ట్ డాన్సర్‌ని గుర్తించే ప్రక్రియలో ఇదో భాగం. ఒక్కమాటలో చెప్పాలంటే నృత్యానికి ఎల్లలు లేవు. ఎంత నేర్చుకున్నా, చేసినా ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది.

అందరూ స్ఫూర్తిదాయకులే!

నాకీ ప్రోగ్రాం చేయడానికి అంటే.. న్యాయనిర్ణేతగా, సంధానకర్తగా.. ఉండడానికి ప్రత్యేకించి ఫలానా వారు స్ఫూర్తి అని వర్గీకరించలేను కానీ, చాలా షోలు చూసిన నేపథ్యంలో అందరూ నాకు మార్గదర్శకులే అని మాత్రం చెప్పగలను. ఎక్కువగా నేను అమితాబ్ షోలు టీవీలో చూశాను. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం మరొకటుంది. నాకెక్కువ ఇష్టమైన డాన్స్‌లో నాకు గురువుల తగ్గ ఫర్హాఖాన్, వైభవీ మర్చెంట్‌తో పాటు నేనూ జడ్జ్‌గా ఈ షోకు వ్యవహరిస్తున్నాను.

వైఫల్యం వెనుకే విజయం

ఇటీవల నేను నటించిన రెండు చిత్రాలూ అంతగా విజయం పొందలేదు. అంత మాత్రాన దిగులు లేదు. ఎప్పుడూ చీకటి వెంట వెలుగున్నట్లే, ఫెయిల్యూర్‌ల వెన్నంటే సక్సెస్ కాచుకుని ఉంటుందని నేను నమ్ముతాను. ఆ తీరులోనే వాటి వెనుక వచ్చే ‘జస్ట్ డాన్స్’ తప్పక అందరి ఆదరణా పొందుతుంది’ అంటాడు హృతిక్.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment