టీవీ అనేది ఏదో రోజంతా చేసిన శ్రమకు లేదా చికాకు, అన్య మనస్కత పోయి తిరిగి రీఛార్జ్ చేసుకోడానికి అనే రోజులు రాన్రాను పోతున్నాయనిపిస్తోంది. అలా అనడానికి బలమైన ఉదాహరణ ఎంటీవీలో ప్రతి శని, ఆదివారాలు రాత్రి 7 గంటలకు వస్తున్న ‘రోడీస్’ కార్యక్రమం అని చెప్పడానికి బాధగా ఉన్నా అనివార్యమే అనిపిస్తోంది. ఏ కార్యక్రమం చూసినా ఓ రకమైన ఆహ్లాదం, ఉత్సాహం వచ్చి కొత్త ఆలోచనలకు ఉపకరించాలి తప్ప ఇలా భావోద్వేగాలనో, భాషతో ఏ రకంగా మరొకరిని కించపరచవచ్చో అన్నది తెలియని వారికి సైతం లేని ఆలోచనలు వచ్చేలా చేసే ఈ ధోరణి వల్ల ఒక్కసారిగా సదాలోచనా పరులందరికీ ‘ఎక్కడికెళ్తున్నాం మనం’ అన్న భావన తప్పక కలుగుతుంది.
ప్రశ్నల ధోరణి ఇలాగా?
ఇప్పటి వరకూ ఏడు సీజన్ల కార్యక్రమం పూర్తి చేసుకున్న ‘రోడీస్’ ఎనిమిదవ సీజన్ ప్రోగ్రామ్స్ ఇటీవల ఆరంభమయ్యాయి. బెంగుళూరులో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అర్హత సంపాదించే వ్యక్తుల ఎంపిక పోటీలు గత శనివారం, ఆదివారాలలో ప్రసారం చేశారు. ఇందులో అభ్యర్థులుగా అర్హత పొందగోరే వారిని అడిగే ప్రశ్నల విషయంలో ఏమి ఆశించి వాటిని అడిగారో అన్నది కాస్త ప్రశ్నార్థకంగా మారింది. ‘వివాహానికి పూర్వమే శారీరక సంబంధం అన్న దానిపై నీ అభిప్రాయం’ అన్న ప్రశ్నను సంధించారు. వారు దానికి ఎలా స్పందించారో అన్నది పక్కన పెడితే ఈ ప్రశ్న ఔచిత్యం లేదా ఏ స్థాయికిది సంకేతమో తెలియాలి. ఇందులో పాల్గొంటున్న వారంతా దాదాపు యవ్వన దశలో ఉన్నవారు కనుక అలా అడిగారా? లేదా ఈ తరం ఆలోచించేది ఇదేనని కార్యక్రమ నిర్వాహకులు డిసైడై పోయారా? అన్నది ఆలోచించాలి. ఈ ప్రశ్నకు సమాధానంగా ‘ఇద్దరికీ ఇష్టమైతే ఓకే.. అని ఒకరంటే, ఏది సక్రమం కాదో దానిలో మజా అనుభవిస్తాడు మనిషి అని మరొకరు సమాధానమిస్తారు. ఈ సమాధానాలకు ప్రమాణాలు దిగజారిపోతున్న పరిసరాలు అనుకోవాలి. అసలింతకంటే మంచి ప్రశ్నలు తట్టలేదా అన్న ఆవేదనా చూపరులకు కలిగింది.
రెచ్చగొట్టడమే లక్ష్యమా?..
ఇక ప్రశ్నల సంగతి అలా ఉంటే, ప్రశ్నల అడిగే వారి ధోరణీ కాస్త తేడాగానే ఉంది. అంతగా సంబంధిత అంశంలో అడిగిన దానికి అవగాహనా లోపమో, మరే కారణం వల్లో కొద్దిగా ఉద్రేకానికి లోనయినా, దాన్ని తగ్గించేలా చేయాల్సిన అవసరం నిర్వాహక పీఠంపై కూర్చున్న ప్రశ్నలడిగే పానెల్ సభ్యులపై ఉంది. ఈ కనీస ధర్మాన్ని సైతం విస్మరించి వారూ పెద్దగా అరవడం, అనవసర పదజాలం (ఇది మనకు వినిపించదనుకోండి!) ఉపయోగించడం వంటివి చూసి విస్తుపోవడం మన వంతైంది. అయితే ఇదంతా ప్రోగ్రామ్ డిజైనింగ్‌లో భాగం, దాని అంతరార్థం వేరు అని చెప్పే ప్రయత్నం తర్వాత చేసినా దీని దుష్ప్రభావం పోదు. ఇదెలా ఉందంటే సినిమాలో మొత్తం ఏవైతే చూపకూడదో అవి చూపించి చిత్రాంతాన ఇది తప్పు అని ఏకవాక్య సంభాషణతో శుభం కార్డు వేసినట్లుంది.
దీన్ని అతిశయోక్తి అనచ్చా?
ఇందులో పాల్గొనే క్యాండిడేట్స్ దీనిపై చూపే స్పందన, అనుభవాలూ పరిశీలిద్దాం. ఒక అభ్యర్థైతే నేను ఇంతవరకూ ఇందులో ఆరుసార్లు పాల్గొన్నా. ఇది ఏడోసారి అంటూ నా జీవిత లక్ష్యం అన్న టైప్‌లో మాట్లాడాడు. అలాగే తక్కినవారు. నేనిందులో పాల్గోడానికి ఎంతైనా కష్టపడతా. ఇష్టపడతా అన్న తరహాలో ఈ వాక్పటిమ సాగిపోయింది. అయితే అలా నా జీవితేచ్ఛ అని చెప్పిన వ్యక్తి రోడీస్‌లో ఎంపికయ్యారు. ఎంపిక చేస్తూ వ్యాఖ్యాత్రి చెప్పిన వ్యాఖ్యానం (నిన్నింక ఆడిషన్ చేసే అదృష్టం మాకు లేదు - అంటే ప్రస్తుత సీజన్‌లో ఆ వ్యక్తి సెలెక్ట్ అయినట్లు..) బాగుంది.
సూత్రాలు ఏవైనా..
మనిషిలో తెగింపు నేర్పడానికీ, భయాన్ని పారద్రోలడానికీ, జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోడానికీ ఈ మాదిరి షోలు ప్రేరకాలు అవుతాయని ఎంతగా సూత్రీకరించినా, అందుకు అనువైన ఆహ్లాదమైన, అపాయకర ధోరణిలోకి తీసుకువెళ్లని పంథాలో ‘రోడీస్’ని డిజైన్ చేస్తే బాగుంటుంది. లేకుంటే ఈ కార్యక్రమానికి ఉపనామంగా (షార్ట్ కట్ టు హెల్) పెట్టినది పదేపదే గుర్తుకొచ్చేలా ఉంది.
Source: www.andhrabhoomi.net