Tuesday, November 16, 2010

న్యూస్ ఛానెల్స్‌కి దొంగల భయం?!

ప్రతి న్యూస్ ఛానల్‌లో కనిపించే పదం ఎక్స్‌క్లూజివ్. న్యూస్ చిన్నదైనా, పెద్దదైనా.. పట్టున్నదైనా, పటుత్వం లేనిదైనా మేమే ముందు మీకు చూపిస్తున్నాం సుమా..! అని చెప్పడానికన్నట్లు ఎక్స్‌క్లూజివ్ అనే ముక్క స్క్రీన్‌పై అలా కనిపిస్తూనే ఉంటుంది. ప్రేక్షకుడు పక్క ఛానల్ ఏం చేస్తుందా? అని రిమోట్ నొక్కితే అక్కడా ఇదే చిత్రం అదే మాట కనిపిస్తుంది. ఈ విషయంలో ఏ ఛానల్ ముందు ప్రసారం చేసిందో అర్థంకాక తానే రిమోట్ నొక్కడంలో వెనుకబడి పోయానని తనను తానే నిందించుకునే పరిస్థితిలో పడిపోతున్నాడు. న్యూస్‌కి విలువ ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమాని గణనీయంగా తగ్గిపోయింది. న్యూస్ చూసి బాధపడటం, న్యూస్ చూసి జాలి పడటం ప్రేక్షకుల్లో నశించిపోయాయి. న్యూస్‌ని ఇట్టే చూసి ఆట్టే మరిచిపోయే స్థితికి ప్రేక్షకులను న్యూస్ ఛానల్స్ తెచ్చేసాయి. అందుకే న్యూస్‌కి విలువ న్యూస్‌కి ఆదరణ తగ్గిపోయి టేకిట్ ఈజీ పాలసీలోకి న్యూస్ వెళ్లిపోయింది. అలాంటి న్యూస్‌కి మసాలా బాగా దట్టించి కమింగ్ అప్‌లుగా వేసి రంజుగా వంటకం చేసి వీక్షకుడికి అందించడంలో న్యూస్ ఛానల్స్ పరిగెడుతున్నాయి. 24 గంటల న్యూస్ వంటకం కోసం సమాజ మార్కెట్‌కి వెళ్లి న్యూస్ ఛానల్స్ వెదుకులాట చేస్తున్నాయి. అవసరం వున్నా లేకున్నా ప్రముఖుల పర్సనల్ లైఫ్‌ను కూడా న్యూస్ చేసేస్తున్నాయి. దీనివల్ల న్యూస్ ఛానల్‌కి టైం ఖర్చయినా వీక్షకుడికి మాత్రం వీసమెత్తు ఉపయోగం ఉండదు. ఎటొచ్చి న్యూస్‌లో పడ్డావోడే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. దీనికో పెద్ద ఉదాహరణగా అల్లు అర్జున్ వివాహంపై ప్రసారమైన కథనాలే నిదర్శనం. ఈ న్యూస్ వల్ల ప్రేక్షకుడికి ఒరిగేదేమీ ఉండదన్న సంగతి ఛానల్ వారికి తెలియంది కాదు. కానీ ఈ న్యూస్‌ని వంటకం చేయడంలో కూడా మేమేముందని ఎక్స్‌క్లూజివ్ అంటూ ఓ ఛానల్ వారు వేస్తే మరొక ఛానల్ కమింగ్ అప్‌లో ఇంకాస్త రుచిగా వంట చేస్తున్నాం చూడండన్నట్లుగా వేస్తూ వచ్చారు. మొత్తానికి సదరు న్యూస్‌కి అల్లు అరవింద్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిప్పు లేనిదే పొగరాదు అన్నది సత్యమే అయినా ఇలాంటి న్యూస్‌లను వండటం వల్ల వీక్షకుడికి ఏ మాత్రం ఉపయోగం ఉండదు. పైగా ఇలాంటి కథనాలతోనే ఛానల్ పరిగెట్టాలని ఆశ పడితే ప్రేక్షకులు రిమోట్‌కి ఎక్కువగా పని చెబుతారనేది నిత్య సత్యం. ప్రతి విషయంపైనా ఎస్‌ఎంఎస్ కంటెస్ట్‌లు, చర్చా కార్యక్రమాలు ఛానళ్లకు కాలక్షేప అంశాలుగా మారాయి. 24 గంటలూ ప్రసారమయ్యే వార్తా ఛానళ్ల సంఖ్య గణనీయంగా పెరిగినా ఏ ఛానల్ కూడా మరో ఛానల్‌కి భిన్నంగా ఉండటం లేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్నట్లు రేటింగ్ బాగున్న ఛానల్స్ అనుసరిస్తున్న ప్రోగ్రాంలను పోలిన ప్రోగ్రాంలను చేయడంలో ప్రతి ఛానల్ నిస్సిగ్గుగా పని చేస్తున్నాయి. అందుకే ఏ ఛానల్ చూసినా వీక్షకుడికి కొత్తదనం కనిపించడంలేదు. సినిమా విశేషాలు, రహస్యాలను ఛేదించడం, ఇంటర్వ్యూలు, మినిట్ న్యూస్‌లు, వంట ప్రోగ్రాంలు, కార్టూన్ ఐటమ్స్ ఇలా ఎన్నో ప్రోగ్రాంలు అన్ని ఛానల్స్‌లోనూ కనిపిస్తున్నాయి. పైగా ఇలాంటివి ప్రసారమయ్యేటప్పుడు ఛానల్ లోగోలను సైతం స్క్రీన్‌పై తిప్పుతూ తమ విశ్వసనీయత చాటుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో సినిమా అంశాలే ప్రధానం సినిమా స్టార్సే లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించడంలో ఛానల్స్ ఎక్కువగా పని చేస్తున్నాయి. గ్యాసిప్ కబుర్లు శృంగార భరితంగా చూపిస్తూ అందించడానికి బాలీవుడ్, హాలీవుడ్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. కుటుంబంతో చూడడానికి వీక్షకుడికి సిగ్గేస్తుంటే నిస్సిగ్గుగా యాంకరమ్మ వాటిని వలిచి వలిచి మరీ చెప్పడం గమనార్హం!
మంద ఎక్కువయితే మజ్జిగ పలచనైనట్లు వార్తా ఛానల్స్ ఎక్కువయ్యే కొద్దీ వాళ్లకి ‘చోర భయం’ (వార్తల దొంగతనం) పట్టుకుంది. అందుకే అనుక్షణం ఎక్స్‌క్లూజివ్ అంటూ తమ లోగోలను పిసరంత వార్తపై కూడా అటు ఇటు తిప్పుకునే పరిస్థితికి వచ్చేశాయి. కమింగ్ అప్‌లో చూపించినంత హడావిడి వార్తా ప్రసారంలోకి వచ్చేసరికి కనిపించకపోవడం వీక్షకుడు గమనిస్తూనే ఉన్నాడు. దొరికిన పిసరంత క్లిప్పింగ్‌ని పట్టుకుని సోదెక్కువ సారం తక్కువ అన్నట్లు అటు తిప్పి ఇటు తిప్పి లాగిలాగి పీకి పీకి చూపించడం వీక్షకుడికి అసహనం తెప్పించే మరో విషయం. ఏదైనా వార్త దొరికితే చాలు ప్రస్తుత పరిస్తితి ఏంటని? విలేఖరిని, స్టూడియోలో చర్చా కార్యక్రమాన్ని, ఓ పక్క ఎస్‌ఎంఎస్‌ల శాతాన్ని నిర్వహించడంలో అన్ని ఛానళ్లూ ఒకే తీరులో నడుస్తున్నాయి. ఛానళ్ల నుండి ఛానళ్లకు ప్రోగ్రాంలతో సహా మారిపోయేవారిది ఒకెత్తయితే క్లిప్పింగ్‌లను కథనాలను కాపీ కొట్టేయడం ఒకెత్తు. దాంతో పాపం ఛానళ్ల వారు కూడా చోరభయంతో లోగోలను స్క్రీన్‌పై ప్రదర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్య ఓ ఛానల్‌లో చంద్రముఖి స్వీకెల్‌పై (నాగవల్లి) సెంటిమెంట్‌లను చెబుతూ కార్యక్రమం చేస్తే మరొక ఛానల్ వారు అదే కథనాన్ని ఇంకో కోణంలో చూపించి అతి జాగ్రత్తగా కార్యక్రమంపై లోగోను కూడా అటు ఇటు తిప్పారు. రోజులో ఎక్కువ శాతం ఎక్స్‌క్లూజివ్ అంటూ వార్తలపై కార్యక్రమాలపై లోగోలు కనిపించడం చూస్తుంటే ఛానళ్లకు చోర భయం ఎక్కువయ్యిందేమోననిపిస్తుంది.

www.andhrabhoomi.net

1 comment:

  1. ur poll survey is good,why bcz..the channels wth o% indirectly indicating to reporters,that they r not paying salaries correctly.gd.job blogger.

    ReplyDelete