Tuesday, November 16, 2010

జయెహో! సక్సెస్ మంత్ర!

‘నాకస్సలు టైమ్ లేదండీ..’ అంటూ అలా ఎందుకు టైమ్ లేదో అన్న దానిపై బోలెడంత సేపు సమయం వెచ్చించేస్తూ ఉంటారు చాలామంది. అలా అనుపయోగ కార్యక్రమాలపై అంతులేని సమయం కేటాయిస్తూ పోయే వాళ్లు గుర్తెరిగేలా అనుకుంటా ‘జయహో సక్సెస్ మంత్ర’ (హెచ్‌ఎంటివిలో రోజూ ఉదయం 7.30కి వస్తుంది)లో వ్యక్తిత్వ వికాస నిపుణుడు జవహర్‌లాల్ నెహ్రూ సోదాహరణంగా మాట్లాడారు. మామూలుగా ఛానల్స్ ఈ సమయం (ఉ.7.30) ఆ రోజు పేపర్ల వార్తలపై వ్యాఖ్యలూ వగైరా ప్రసారం చేయడానికి ఆసక్తి చూపిస్తే హెచ్‌ఎంటివి మాత్రం ఇలా వైవిధ్యభరితమైన అంశాన్ని ఎంచుకుని ప్రసారం చేయడం అభినందనీయం. ఇలా రోజుకో పనికి వచ్చే అంశంపై నిష్ణాతులైన నిపుణులతో చర్చింపజేయడమూ జనావళికి ప్రయోజనకరమే. అయితే చర్చించే సమస్యల్ని అధిగమించడానికి ఆచరణ సాధ్యంకాని సలహాలూ, సూత్రాలూ కొన్ని సందర్భాలలో ఇవ్వడమే కొంత ఇబ్బందనిపిస్తోంది. ఎందుకంటే ‘ఈ ప్రాబ్లమ్‌ని ఎదుర్కోడానికి ఇలాంటి పంథాను అవలంబించాలి’ అని చెప్పడం వరకూ ఓకే. కానీ క్షేత్ర స్థాయిలో వాటి నాచరించే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యల మాటేమిటో ప్రస్తావించడం జరగడంలేదు. కానీ ప్రసంగించే వ్యక్తులకున్న అపార అనుభవం తద్వారా వారు వెల్లడించే కొన్ని అభిప్రాయాలూ మాత్రం తప్పనిసరిగా యువతకు సహాయకారే అవుతాయి. ఈ చర్చల ద్వారా మనకు బాగా తెలిసున్న పద సముదాయాలకే కొన్ని కొత్త కోణాలూ అవిష్కృతమవుతున్నాయి. ఉదాహరణకు అక్టోబర్ 27న చర్చించిన దాంట్లో స్వార్థం లేకపోతే మనిషి మరణించినట్లే లెక్క అని ధృవీకరిస్తే దానినే మరో రకంగా ‘స్వార్థాన్ని ఆ పేరుతో పిలవద్దు - ‘నిర్మాణాత్మక భౌతిక వాదం (కనస్ట్రక్టివ్ మెటీరియలిజమ్) అందాం అని నవంబర్ 13న ప్రసారమైన ‘నాయకత్వం’ అంశంపై చెప్తూ మరో నిపుణుడు అన్నారు. తన వరకూ తనకు కావలసిన దానికి ఆశ పడటం అందుకు ప్రయత్నించడం తప్పు కాదు. కానీ అంతా తనకే కావాలనుకున్నప్పుడే పేచీ అంతా వస్తుంది అన్నది దీని అంతరార్థం. అలాగే మరో రోజు ఇంకో టాపిక్‌ని స్పృశిస్తూ ‘అర్హతకు మించిన అహంకారం’ ‘అర్హతకు మించిన లక్ష్య నిర్దేశం చేసుకోవడం వల్లే సమస్య వస్తోంది’ అని తెగేసి చెప్పడం బావుంది. (నవంబర్ 8న ప్రసారమైనది) అదే విధంగా ‘పిల్లల్ని పెంచడం ఎంత గొప్ప కళో మరో రోజు వివరిస్తే, ఇంకో రోజు పని మీద ఏకాగ్రత కావాలంటే ఏం చేయాలో అన్న దానిపై చక్కటి సూచనలిచ్చారు.
పదాడంబరం అనవసరం
ఇవన్నీ వస్తు ఆధారిత, వాస్తవ అంశాల కార్యక్రమాలు కనుక వీటిలో అనవసర పదాడంబరం కోసం ప్రయాస పడనక్కరలేదు. కానీ విచిత్రంగా ఈ ప్రోగ్రామ్‌లో అదే ఎక్కువగా చోటు చేసుకుంటోంది. నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో వివరిస్తూ ఓ సందర్భంలో నిర్వేదం, నిరుత్సాహం.. అంటూనో, ఉత్సాహం, ఉల్లాసం.. అంటూ ఇంకోసారి చెప్పేశారు. ఈ పద దట్టింపు అనవసరం. అలాగే ఇంకో కార్యక్రమంలో.. ‘చేయలేని’ చేయించుకోలేని’ ‘చేసుకోలేని’ పరిస్థితి అంటూ భాషాడంబరానికీ పోయారు.
సరళీ మార్చాలి..
ముందుగా అనుకున్న అంశాన్ని యాంకర్ నిపుణున్ని అడగడం, ఆయన వివరించడం, అనంతరం ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విద్యార్థులు ప్రశ్నలడగడం, వాటికి జవాబులు చెప్పించడం పద్ధతిలో సాగుతోంది. విషయ వివరణకు, ఉన్న సమయంలో అందరూ అవలంబించే సులభ శైలి ఇదే అయినా రోజువారీగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వైనం వల్ల ఈ పోకడలో మార్పు రావాలి. ముఖ్యంగా కొన్ని కార్యక్రమాల్లో స్టూడెంట్స్ ప్రశ్నలడిగే తీరు చాలా కృతకంగా ఉంటోంది. కార్యక్రమానికి తగినంత ముందుగా చర్చించబోయే అంశం పట్ల నిర్వాహకులు సరైన అవగాహన కల్పించినట్లైతే ఇంకా మెరుగైన విధంగా ప్రోగ్రామ్ రూపొందే అవకాశం ఉంది. అలాగే అడిగే ప్రశ్నల్లో కొన్నిచోట్ల స్పష్టత లోపిస్తోంది. దాన్ని కవర్ చేయడానికి, మీరడిగింది అర్థమైంది. అది.. ఇది కదా.. అంటూ రెండింటినీ సమన్వయపరుస్తూ శ్రమ పడాల్సిన బాధ్యత జవాబులిచ్చేవారు వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా చిన్నచిన్న పొరపాట్లున్నప్పటికీ, టివి సమయాన్ని సద్వినియోగ పరుద్దామనే తలంపుతో తలపెట్టిన కార్యక్రమంగా జయహో సక్సెస్ మంత్రని నిరభ్యంతరంగా పరిగణించవచ్చు.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment