Monday, November 22, 2010

“సాక్షి”లో సోనియా ఇమేజ్ డామేజ్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా సాక్షి దినపత్రికలో, టీవీ చానెల్లో వార్తాకథనం ఇవ్వడంతో రాష్ట్ర కాంగ్రెసు నాయకులు కొంత మంది వైయస్ జగన్ పై ప్రత్యక్ష సమరానికి దిగారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా సాక్షి వార్తాకథనాన్ని వ్యతిరేకించారు. వైయస్సార్ ఎప్పుడు కూడా సోనియాపై, రాజీవ్ పై విమర్శలు చేయలేదని చెప్పారు. వైయస్సార్ ఏనాడూ కాంగ్రెసు జెండాను వీడలేదని చెప్పారు. తద్వారా ఆయన వైయస్ జగన్ పై పరోక్షంగా విమర్శలు చేశారనే అనుకోవాలి. కాంగ్రెసు నాయకుడు వి. హనుమంతరావు, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యక్షంగానే జగన్ పై విమర్శలు చేశారు. సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకర్ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. సాక్షిని నిషేధించాలని శంకరరావు డిమాండ్ చేశారు. సోనియాకు వ్యతిరేకంగా వార్తాకథనం ఇచ్చినందుకు 24 గంటలలోగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే సాక్షి కార్యాలయం ముందు ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కూడా అన్నారు. వైయస్ జగన్ అహంభావానికి ఆ వార్తాకథనం నిదర్శనమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైయస్ జగన్ పై పార్టీ అధిష్ఠానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తె జగన్ కొత్త పార్టీ కోసం అన్ని ఏర్పాట్లు దాదాపుగా సిద్ధం చేసుకున్నట్లే కనబడుతోంది. జగన్ అనుసరిస్తున్న మార్గాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, సోనియానే టార్గెట్ చేస్తూ తన సొంత మీడియాలో ప్రసారం, ఎప్పటి నుంచో ప్రచురిస్తున్న కొన్ని కథనాలు ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నాయని అంటున్నారు. అదును చూసి రోశయ్య సర్కారును కూల్చి ముందస్తు ఎన్నికలకు కూడా సిద్ధం కావాలన్న ఏకైక అజెండా, వ్యూహరచనతో ఆయన అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Source: www.teluguone.com

1 comment:

  1. సోనియను అల అనడం లో జగన్ను యెంత వరుకు హక్కు వుంది హై కమాండ్ కరెక్ట్ గ వుంటే స్టేట్ బాగుంటుంది పార్టీ లో కలతలు రాకుండా వుండాలంటే జగన్ అదుపులో వుండాలి

    ReplyDelete