Tuesday, November 23, 2010

వీక్షకుల తీర్పు

ఉత్తరాల కార్యక్రమం
అప్పట్లో జెమిని టీవీవారు ‘పోస్ట్‌బాక్స్’ పేరిట టీవీ వీక్షకుల అభిప్రాయాలు ఉత్తరాల ప్రోగ్రాం ప్రసారం చేసేవారు. ఇప్పుడా ఊసే లేదు. తమతమ ఛానల్ ప్రోగ్రాంలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి గాను అన్ని ఛానల్స్ వారు వీక్షకుల అభిప్రాయాల పేరిట ఉత్తరాలు ఆహ్వానించి వారంవారం ప్రసారం చేస్తే బావుంటుంది. అలా చేయడంవల్ల తమ తప్పులు సరిదిద్దుకోవచ్చు కదా.
-ఎల్.ప్రఫుల్లచంద్ర (ధర్మవరం)
‘మా దుర్గమ్మ’
మాటీవీలో వస్తున్న ‘మా దుర్గమ్మ’ (సా.6 గంటలకు) సాంకేతికంగా గొప్పగా లేకపోయినా దుర్గమ్మగా నటించిన శాలిని కపూర్ దేవతా కళ ఉట్టిపడే ప్రసన్న వదనంతో అద్భుతంగా ఉంది. రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు రౌద్రం కూడా చక్కగా ప్రదర్శిస్తోంది. ఎపిసోడ్ అంతా పూర్తిగా చూడకపోయినా దుర్గమ్మ కనిపించే ఘట్టాలు చూస్తే చాలు తృప్తిగా ఉంటుంది. సంగీతం గానీ.. కథనం గానీ బాగోలేవు. యుద్ధ దృశ్యాలు, పోరాట దృశ్యాలు నాసిరకంగా ఉన్నాయి.
-చంద్ర (కాకినాడ)
ఓ రాణిగారి కథ
మాటీవీ ప్రసారం చేస్తున్న ‘ఓ రాణిగారి కథ’ సీరియల్ బావుంటోంది. ముందు ముందు కూడా ఇదే మొరాలిటీతో.. ఇంతకు ఏ మాత్రం విలువలను మార్చకుండా కథను నడిపిస్తే ‘క్లిక్’ అవుతుంది. ఇలా ఏదైనా సమాజానికి మంచి చేయాలన్నా, పదిమంది హర్షించాలన్నా, కొంతమందికైనా మార్గదర్శకత్వం కావాలన్నా ఇలాంటి సీరియల్స్ ప్రస్తుత సమాజానికి ఎంతైనా అవసరం. కత్తులు, కటారులు, కుళ్లు కుతంత్రాలు, ఎత్తులు పైఎత్తులు ఇలాంటి విష సంస్కృతులను ఇంజెక్ట్ చేస్తూ ఎపిసోడ్లుగా నానా చెత్తా చెదారాన్ని ప్రేక్షకులపై గుమ్మరిస్తూ చేతులు దులిపేసుకునే మగానుభావులారా ఒక్కసారి ఆలోచించండి.
ఏ మాత్రం పొసగని రెండు మతాల మధ్య జరిగే జీవన మాధుర్యాన్నీ, వైవిధ్యాన్నీ ఎంచక్కా ఎవరినీ నొప్పించకుండా ఎక్కడా కించపరచకుండా కించిత్ పొరపాటును సైతం చేయకుండా వీక్షించే ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న ఈ సీరియల్ ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరం.
-కొంగర ఉమామహేశ్వరరావు (తెనాలి)
ఆపండి..?!
ఇటీవల ప్రసారమైన ‘బాలికా వధు’ ఎపిసోడ్‌లో ర్యాగింగ్ సంస్కృతిని అంతగా చూపించాల్సిన అవసరం లేదేమో?! ఒక అమ్మాయిని పీకల్లోతు నీటిలో ముంచి ర్యాగింగ్ చేయటం యువతకు సరికొత్త పాఠాలు నేర్పినట్టవుతుంది. ఈ సమస్య ఇప్పటికే ఎన్నో జీవితాలను నాశనం చేసింది. మళ్లీమళ్లీ ఆ సంస్కృతిని తెరపై చూపాల్సిన పనిలేదు. అలాగే - ‘సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం’ అంటూ సబ్ టైటిల్స్ వేసినట్టు వేస్తూ - తెరపై సిగరెట్ తాగే దృశ్యాలను తెర మరుగు చేస్తే మరింత మంచిది. ఇటువంటి రెచ్చగొట్టే సన్నివేశాలు ఉన్నంత మాత్రాన సీరియల్‌కి వొరిగే ప్రయోజనం ఏమీ లేదు.
-పి.బాబ్జీ (కోడిపర్రు)

Souce: www.andhrabhoomi.net

No comments:

Post a Comment