యాంకర్‌గా మొదలై ప్రోగ్రామ్ మేకర్‌గా ముద్రపడి అందరిచేతా బుల్లితెర అన్నయ్యగా పిలవబడే ఓంకార్ జీనియస్? అని ప్రశ్నించుకుంటే కొంతవరకు ఔననే చెప్పాలి. జెమిని ఛానల్‌లో సాధారణంగా యాంకర్‌గా వుండే ఓంకార్‌కి జీ తెలుగు మంచి ప్లాట్‌ఫారమ్‌గా దొరికింది. వెనుదిరిగి చూసుకోలేనంతగా క్రేజ్‌ని ఇచ్చింది. ఆట ప్రోగ్రాంను స్టార్ట్ చేసి వరసగా ఐదు సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించినా ‘ఆట జూనియర్స్’ ఎంత క్రేజ్‌ను తెచ్చిపెట్టిందో అంతే వివాదాలను అంటగట్టింది. మొత్తానికి ఆట-5 జూనియర్స్ అయ్యిందనిపించి చేతులు దులుపుకున్నాడు.
ఆట ప్రోగ్రాంతోపాటు ‘మాయాద్వీపం’ కూడా కొంతకాలం నడిపించాడు. మా టీవీలోకి ప్రవేశించి ‘ఛాలెంజ్’ అంటూ టాన్స్ షోను ‘అదృష్టం’ అంటూ గేమ్ షోను ప్రారంభించాడు. అనతికాలంలోనే అదృష్టం దురదృష్టంగా ముగించాల్సి వచ్చింది. కోడి కోడిపిల్లలు కథలా ఇప్పటివరకు తన షోలలో పాల్గొన్న వారిని వెంటబెట్టుకుని మాయాద్వీపం, అదృష్టం, ఆట, ఛాలెంజ్‌లను నడిపించిన ఓంకార్ కొత్త టాలెంట్‌ని సెర్చ్ చేస్తూ ‘జీనియస్’ అనే సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో కోడిపిల్లలకు అవకాశం మాట ఎలా వున్నా కొత్త టాలెంట్ హంట్ మాత్రం పూర్తి చేసి బుల్లితెరపై వెండితెర స్క్రీన్ టెస్ట్ ప్రారంభించాడు.
ఏడుపులు, పెడబొబ్బలు, ఓదార్పులు, వార్నింగ్‌లు, నిష్క్రమణలు, పునఃప్రవేశాలు వంటివి ఓంకార్ షోలలో కామన్‌సీన్లు. ఇది నిజమా? అనేంతగా ప్రోమోలలో చూపించడం ఓంకార్ సక్సెస్‌కి కారణం. ఒకటిరెండుసార్లు ప్రేక్షకులు ప్రోమోలు చూసి నివ్వెరబోయి ఎప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని కాచుకుకూర్చున్నా రానురాను ఇదంతా స్టంట్ అనే స్థాయికి రావడంతో ఆట-5 కాసంత ప్రేక్షకాదరణలో నీరుగారింది. ఇప్పుడు మళ్లీఇలాంటి స్టంట్ టీవీ-9 మీడియా పార్టనర్ సాక్షిగా జీనియస్ సినిమా నటుల సెలక్షన్ విషయంలో ఓంకార్ చేస్తున్నాడు. ఎపిసోడ్‌లుగా చేసి మరీ ప్రేక్షకులకు అందిస్తున్నాడు. బుల్లితెరనుండి వెండి తెరకు ప్రమోట్ కావడమనేది అందరికీ తెలిసిందే! అందుకే బుల్లితెరపై తనకున్న ఇమేజ్‌ని ఉపయోగించుకుని అదేపంథాలో జీనియస్ సెలక్షన్స్ కూడా చేస్తున్నాడు.
నరసింహా, ఇంద్ర వంటి అగ్ర హీరోల చిత్రాలకు కథలు అందించిన చిన్నికృష్ణ జీనియస్ సినిమాకు కథను అందించడం చెప్పుకోదగ్గ విషయం. ఇక బుల్లితెర అన్నయ్య వెండితెరపై ఇదే హైపుతో విజయాన్ని అందుకోవాలని ఆరాటపడడం జీనియస్ స్పెషల్ ఎపిసోడ్స్‌లో కనిపిస్తుంది. అయితేఈ ప్రక్రియ కొత్తదేమీ కాదు. గతంలో ఓ ఛానల్‌లో దర్శకుడు తేజ ఇలాంటి ప్రక్రియనే వారాల తరబడి నడిపాడు. ఫ్లాపులను మూటగట్టుకున్న తరుణంలో విజయంకోసం ఈ పంథాను అనుసరించి నటీనటులను సెలక్టు చేసి వారిని వెండితరకు ‘విచిత్రం’ సినిమాతో పరిచయం చేసినా ఫలితం దక్కలేదు.
ఇంకాస్త ముందుకి పోతే రాఘవేంద్రరావు ‘పరదేశి’ సినిమాకోసం ఈ విధమైన సెలక్షన్లనే జరిపాడు.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment