Tuesday, November 9, 2010

చప్పగా నాచోరే... సరిగమప నువ్వా నేనా?

జీ తెలుగులో ఒకే వారంలో రెండు షోలు బుల్లితెరపై అరంగేట్రం చేశాయి. వారంలో సోమ, మంగళవారం రోజుల్లో రాత్రి 9 గంటలకు ప్రసారంగా ‘నాచోరే’ డాన్స్ షో వస్తే బుధ, గురు రోజుల్లో రాత్రి 9 గంటలకు ‘సరిగమప’ పాటల ప్రోగ్రాం వస్తుంది. అయితే ఈ ప్రోగ్రాంలపట్ల ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి ఉండదనిపిస్తుంది. ఎందుకంటే డాన్స్ షోలు, పాటల ప్రోగ్రాంలు ఏఛానల్‌కీ కొత్తకాదు. ఊదరగొట్టి వదిలేసాయి. ఒకప్పుడు ఎంతో ఆశక్తి కనబరిచి టెలివిజన్ సెట్ల ముందు టెన్షన్‌గా బైఠాయించే ప్రేక్షకులు ఇప్పుడుఈ షోలకంటే గేమ్ షోలవైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
‘నాచోరే’ ప్రోగ్రాం కాస్త విభిన్నంగా తయారైనా దీనిలో పాల్గొనే తారలందరు మరుగున పడిపోయిన హీరోయినే్ల. పైగా ప్రారంభ ఎపిసోడ్‌లో చూస్తే చాలా ఆచప్పగా వీళ్లు సినిమాల్లో హీరోయిన్లుగా ఎలా నటించారనిపించక మానదు. మా టీవీలో ఈ తరహా డాన్స్ షో గతంలో నడిచింది. దాంట్లో పూనమ్‌బజ్వా వంటి అప్పటికి లేటెస్ట్ హీరోయిన్లు నటించారు. కానీ నాచోరేలో పాపులర్ హీరోయిన్లుగా పేరొందిన వారితోపాటు సరైన గ్లామర్ హీరోయిన్లు లేకపోవడం గమనార్హం ఈ ప్రోగ్రాంకి బలం కాస్త నటి రోజా రూపంలో కనిపిస్తుంది. ఈమె ఈ షోకి జడ్జి. ఇక యాంకరింగ్ చేసే హేమంత్ స్టయిల్ డబ్బాలో గులకరాళ్ల మాదిరి ఉంది. రింగ రింగా డాన్స్‌మాస్టర్ నోవాకు ఇదో స్క్రీన్‌టెస్టులా మారింది.
ప్రోగ్రాం ఓపెనింగ్ సాంగ్ నాచోరే...నాచోరే అతి బలహీనపడిపోయి అది హీరోయిన్ కీర్తిచావ్లా అభినయంలో కనిపించడంతోనే ప్రేక్షకులు ఈ ప్రోగ్రాంపట్ల ఓ అంచనాకు వచ్చేసారు. పైగా ఈ హీరోయిన్లకు కొరియోగ్రాఫ్ చేసేవారు కూడా అన్ ఎక్స్‌పీరియన్స్‌గా వారి డాన్స్‌లో కనిపించారు. నాచోరే ప్రోగ్రాం డిజైన్‌పరంగా కొత్తగా అనిపించినా ఓపెనింగ్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచాయి. మొదట్లోనే ఓ హీరోయిన్ స్టేజిపై అనారోగ్యంతో కుప్పకూలిపోవడం ప్రోమో షాట్స్‌కి శుభారంభంగా నిలిచినట్లయింది. ‘పన్నెండుమంది రాణులు ఒకటే కిరీటం’ అనే క్యాప్షన్‌తో వచ్చిన నాచోరే ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ ఇంకా బలాన్ని పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేక్షకుల్లో ఓపెనింగ్ నిరాసక్తను తొలగించడానికి నిర్వాహకులు చాలా కష్టపడాలి సుమా! జీ తెలుగులో సరిగమప ఎపిసోడ్స్ అంటే మిగతా చానల్స్‌ని పక్కన పెట్టేసే స్థితి ఉండేది. కానీ ఓంకార్ నిర్వహణలో రూపొందిన సరిగమప ప్రేక్షకుల్లో గందరగోళాన్ని సృష్టించింది. జడ్జీలు, పెద్దమెంటర్లు, బుల్లిమెంటర్లు, యాంకర్లు వంటి గజిబిజితనంతో సరిగమప మసకబారిపోయింది. మళ్లీ చాన్నాళ్ల తరువాత ఈ కార్యక్రమం మొదలై అలరిస్తుందని అనుకుంటే మూసబాటకు తెరతీసింది.
‘సరిగమప నువ్వా నేనా’ అంటూ మళ్లీపాత పార్టిసిపెంట్స్‌ని తెరపైకి తెచ్చారు. వారితోపాటు కొత్తవారికి పోటీపెట్టే దిశగా జతలు కట్టారు. పాటల ప్రోగ్రాం టాలెంట్ హంట్ అంటే వేలాదిగా వచ్చే గాయనీగాయకులుంటారు. అలాంటి వారిని వెతికిపట్టి ప్రోగ్రాం చేయడం కష్టమనుకుంటారో ఏమిటో? గతంలో పాల్గొన్న వారిని విజేతలను పిలిచి కాస్త పాత కొత్త కలయికల్లో ప్రోగ్రాంని చుట్టేయాలని నిర్వాహకుల ఆలోచన ప్రేక్షకులకు ఖచ్చితంగా నీరసం తెప్పిస్తుంది. ఇలాంటి ప్రక్రియకు మా టీవీ ముందుంటుంది. అందుకే ఆ ఛానల్ నిర్వహించే సూపర్ సింగర్, రేలా..రేలా కార్యక్రమాలు ఎన్ని ఎపిసోడ్‌లు నిర్మించుకున్నా కొత్తదనాన్ని సంతరించుకోలేకపోయాయి. ఈ విషయంలో ఈ టీవీలో పాడుతా తీయగా నిర్వహిస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభినందనీయుడు. ఎప్పుటికప్పుడు ఏ ఛానల్‌లోను పాడని కొత్త టాలెంట్‌ని తెరపైకి తీసుకువచ్చి ఏవిధమైన కమర్షియల్ హంగు ఆర్భాటాలు లేని ప్రోగ్రాంని అందిస్తాడు. అందుకే ఈ ప్రోగ్రాం పట్ల ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌నెస్ ఫీలవుతారు.
ఒకసారి పూర్తిగా వారి టాలెంట్‌ని వడపోసి జీర్ణించుకున్న ప్రేక్షకులకు మళ్లీ అదే టాలెంట్‌ని వడపోయమనడంతోపాటు బోనస్‌గా కొత్త టాలెంట్‌ని జత చేసినా అంతగా రుచించదు. పైగా ఎన్ని ఎపిసోడ్స్ గడిచినా ఒకటే మోత, ఒకటే పాట అన్నట్టు వుండడంవల్ల ప్రోగ్రాం చప్పబడిపోతుంది. రాధాకృష్ణ, ఎల్‌ఆర్‌ఈశ్వరి, ఉష జడ్జిలుగా గతంలో కనిపించడం కూడా బోరే. సరిగమప నువ్వా నేనాకు ఫ్రెషర్‌గా యాంకర్ ప్రదీప్ మాత్రమే కనిపిస్తున్నాడు. మూస కథలతో సినిమాలను చుట్టేసినట్టే టెలివిజన్ ప్రోగ్రాంలను కూడా చుట్టేయాలనుకుంటే ప్రేక్షకులు రేటింగ్‌ని ఇవ్వరనేది భవిష్యత్ నిర్ణయించే సత్యం.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment