హమ్మయ్య!... కుంభకర్ణ నిద్ర పోతోందనుకున్న కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు ఒక్క కన్నైనా కాస్త తెరిచి చూసింది. జనాన్ని పెడదోవ పట్టిస్తున్న అశ్లీల కార్యక్రమాలను కట్టడి చేసేందుకు ప్రయత్నాన్ని తీవ్ర స్థాయిలో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఎన్నో వివాదాలకు తెరతీసిన ‘బిగ్ బాస్’ రియాల్టీ షోని, ‘రాఖీ కా ఇన్సాఫ్’ ప్రోగ్రాంలపై కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ కొరడా ఝళిపించింది. అశ్లీల, అభ్యంతరకర అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పేర్కొంటూ, ‘ప్రైమ్ టైమ్ స్లాట్’లో ప్రసారమవుతున్న ఈ షోలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రసారం చేయాలని ఆయా ఛానెళ్లకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా - వీటిని పునః ప్రసారం చేయకూడదన్న నిషేదాజ్ఞలు విధించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న అభ్యంతరాలనూ, మహిళా సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆయా అంశాలను పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకండా - ఎస్‌ఎస్ మ్యూజిక్ తెలుగు ఛానెల్‌పై వారం రోజులపాటు నిషేధాన్ని విధించినట్టు జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. తాజాగా ‘బిగ్ బాస్’ రియాల్టీ షోలో హాలీవుడ్ తార ‘బేవాచ్’ ఫేమ్ పమిలా ఆండర్సన్ ప్రత్యేక అతిథిగా ప్రవేశించటంతో ప్రజల్లో అలజడి మొదలయింది. ముఖ్యంగా యువతని ఆకట్టుకునే రీతిలో ఉంటున్న ఈ కార్యక్రమాల పట్ల పలు మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరాలను వెలిబుచ్చుతూ వీటిని నిషేధించాలని పోరాటాలకు దిగాయి. ‘రాఖీ కా ఇన్సాఫ్’ మరో కేసులో చిక్కుకుని రాఖీని ముప్పుతిప్పలు పెడుతోంది. ఆ షోలో రాఖీ ప్రయోగించిన పరుష పదజాలాన్ని తట్టుకోలేని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం వెనుక - రాఖీ పరోక్ష ప్రేరణ ఉన్నట్టు కేసు దాఖలైంది. నేరారోపణ రుజువైతే - రాఖీ ఎంచక్కా ఊచలు లెక్కపెట్టుకుంటూ పదేళ్లు శ్రీకృష్ణ జన్మస్థానంలో మగ్గాల్సిందే.
అసలు కథ..
కలర్స్ ఛానెల్ - విభిన్న తరహా కార్యక్రమాలను రూపొందించటంలో దిట్ట. ఇందుకుగాను ఛానెళ్ల సెలబ్రిటీలనూ -
బాలీవుడ్ నటీ నటులను తెర మీదికి తెస్తుంది. దీంతో ప్రేక్షకుల్లో సహజంగానే ఉత్సుకత నెలకొంది. ఏదో ఒక ఫాంహౌస్‌ని తీసుకోవటం.. చుట్టూ కెమెరాలతో ప్రతి సన్నివేశం దృశ్యీకరించటం.. ఇదీ తతంగం.
ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ సెలబ్రిటీలకు బోలెడంత ఈగో. ఉన్నదానికి లేని దానికి కొట్టేసుకోవటం... రక్కేసుకోవటం - బూతు పురాణాల్ని విప్పేసుకోవటం.. - ఇలా అట్టడుగు స్థాయికి దిగజారిపోతారు. అణువణువుని ఛానెల్ కెమెరా ‘స్కాన్’ చేస్తుందన్న విషయాన్ని సైతం మర్చిపోయి - విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి.. విచక్షణా రహితంగా బూతులు తిట్టుకోవటం ఒక ప్రహసనం. చెంప దెబ్బలూ - బూటు దెబ్బలూ సహజాతి సహజం. ఈ నేపథ్యంలోనే ఆంతరంగిక పొరల్లోకి సైతం వెళ్లిపోయి ఒకరినొకరు దూషించుకోవటం - తమతమ పర్సనల్ బాగోతాల చిట్టాని విప్పటం - ఇదంతా ‘రూం’లో జరిగే ఒక కోణం. మరో కోణంలోంచి చూస్తే - అశ్లీలత.. అసభ్యకర ప్రవర్తన. జనం చూస్తున్నారన్న (?) మాటని మర్చిపోయి వారికి వారే ఒంటరిగా ఉన్నామన్న భావనలోకి వెళ్లి - విచ్చలవిడితనాన్ని ప్రదర్శించటం. ‘బిగ్ బాస్’ హౌస్‌లో డాలీ బింద్రా - సమీర్ సోనీల తిట్ల దండకాన్ని మళ్లీమళ్లీ చూపిస్తూ.. ప్రేక్షకుల్లో ఉత్కంఠని రేకెత్తించటం ఒక సంగతైతే - ఈ హౌస్‌లో ప్రవేశించిన సారా ఖాన్ - అలీ మర్చంట్‌లు అత్యంత సన్నిహితంగా మెలగి.. ఆ తర్వాత వారిలో ప్రేమ అంకురించి పెళ్లికి దారి తీసింది. ఇంతవరకూ ఓకే. కానీ ఆ తర్వాతి ‘హాట్‌హాట్’ సన్నివేశాలను ‘స్పై’ కెమెరాతో చిత్రీకరించి ప్రసారం చేయటం ఏ ‘టిఆర్‌పి’ కిందికి వస్తాయో తెలీదు. ఇక పాకిస్తాన్ నటీమణి వీణా మాలిక్ - అస్మిత్ పటేల్‌ల ప్రేమాయాణం విశృంఖలత్వాన్ని దాటి విర్రవీగింది. మధ్యలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో ప్రవేశించిన డాలీ బింద్రా మధ్య రాద్ధాంతం - ఈ అసలు కథ వెనుక ఎనె్నన్నో మలుపులు. మరెన్నో తిరకాసులు.
టిఆర్‌పి సెన్సెక్స్..
పమెలా ఆండర్సన్ అనే హాలీవుడ్ భామ రియాల్టీ షోలో ‘తెల్ల చీర’ కట్టుకునే వచ్చేప్పటికి ఒక్కసారిగా టిఆర్‌పి న్యూ రికార్డు సృష్టించింది. సారా ఖాన్ - అలీ మర్చంట్ వెడ్డింగ్ ఎపిసోడ్‌తో 4.4 పాయింట్లకు చేరుకున్న టిఆర్‌పి ఏకంగా 4.9కి వచ్చేసింది. భారతీయులు మనీ గేమ్‌ని ఇష్టపడతారని ఒక సర్వే చెప్పిన దాన్ని తు.చ తప్పకుండా పాటింపజేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రస్తుతం 4.8 రేటింగ్ వద్ద ఆగిపోయింది. ఇంతాచేస్తే - హాలీవుడ్ భామ బాలీవుడ్‌కి బోలెడన్ని ఆఫర్లు ఇచ్చేసి - మూడు రోజుల ప్రయాణానికి 2.5 కోట్లు వసూలు చేసి మరీ వెళ్లిపోయింది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment