కొత్తగా ఛానల్స్ ప్రారంభిస్తామంటారు.. ఇందుకు లైసెన్స్ కావాలంటారు.. లైసెన్సులు వచ్చాక సైలెన్స్ అయిపోతారు. ఎందుకిలా! అంటూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ కొన్ని ఛానల్స్ యాజమాన్యాల మీద మండిపడింది.
లైసెన్సులు ఇచ్చాక ఉలకని పలకని ఛానల్స్ వైనంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇలా దాదాపు రెండు డజన్ల ఛానల్స్ యాజమాన్యాలు టీవీ లైసెన్సులు పొంది కూడా వాటిని ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నాయి. ఇదొక పిల్లలాటలా తయారయిందని సమాచార ప్రసారశాఖ వర్గాలు అంటున్నాయి. ఈ తీరును ఆషామాషీగా వదలరాదని భావించిన ఈ శాఖ – ప్రతి ఛానల్ యాజమాన్యం కోటిరూపాయల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ రకమైన పెనాల్టీ విధిస్తే గానీ దిగిరావని అంటోంది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిందంటే ఇక ఈ ఛానల్స్ తప్పనిసరిగా మేల్కొనాల్సిందే! తమ లైసెన్సులను సార్థకత చేసుకోవలసిందే! ఆయా సంస్థలు తమ కొత్త అనుబంధ ఛానల్‍ను ప్రారంభించకపోతే డిపాజిట్‍ను పోగొట్టుకుంటాయి. ఒకవేళ డిపాజిట్ చెల్లించకపోతే ఈ మీడియా కంపెనీలు అన్నీ తక్షణమే తమ టీవీ లైసెన్స్ పర్మిషన్‌ను కోల్పోతాయి. ‘ఈనాడు’, ‘రిలయన్స్ బ్రాడ్‌కాస్టింగ్’, ‘సంస్కార్ టీవీ’, ‘ఫోకస్ టీవీ’ వంటి పలు సంస్థలు లైసెన్స్‌లు పొంది కూడా ఛానల్స్‍ను ప్రారంభించకుండా దిక్కులు చూస్తూన్నాయి. తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఇలాంటి ఛానల్స్ నుంచి దాదాపు వంద కోట్ల రూపాయల మేర బ్యాంక్ గ్యారంటీలు వస్తాయని సమాచార ప్రసారశాఖ భావిస్తోంది. సో! లైసెన్సులు పొంది కూడా జాప్యం చేస్తున్న మీడియా సంస్థలూ! ఛానల్స్ ప్రారంభిస్తారో, లేక కోటిరూపాయలు చెల్లించడానికే సిద్ధపడతారో మీ ఇష్టం!!!
Source: medianx.tv
No comments:
Post a Comment