ఆనందమె జీవిత మకరందం అన్నాడో సినిమా కవి.ఆనందం అవసరమే కానీ, అందుకోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఎంత మాత్రం తగదంటున్నారు శాస్త్రవేత్తలు. బుల్లితెరగా పిలవబడుతున్న టెలివిజన్ సెట్లు లేని ఇళ్ళు, మొబైల్ ఫోన్‌లు లేని మనుషులు ఇప్పుడు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. తిన్నా తినకపోయినా టెలివిజన్ సీరియల్స్ చూడటం మనలో చాలా మందికి అలవాటుగా మారింది. నాలుగు గోడల మధ్య కాలక్షేపం చేసే మగువల సంగతి ఇక చెప్పనవసరం లేదు. టెలివిజన్ చానల్స్‌లో ఉత్కంఠ రేపే సీరియల్స్, కార్యక్రమాలు మహిళలను టీవీ సెట్లకు కట్టివేస్తున్నాయి. ఫలానా సీరియల్ ప్రసారం అయ్యే సమయానికి పనులన్నీ పూర్తి చేసుకోవడమో, లేక వాయిదా వేసుకోవడమో, అదీ కుదరకపోతే పనులు చేసుకుంటూ ఆ సీరియల్స్‌ని వీక్షించడమో నేటి గృహిణుల దినచర్యగా మారింది. టీవీ కార్యక్రమాలను వీక్షిస్తూ అన్నం తినడం కూడా అలవాటుగా మారింది. సాధారణ, మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించే ఉమ్మడి దృశ్యం ఇది. ఇది ఒక రకంగా మంచిదే కానీ, అలా టీవీ చూస్తూ తినే తిండి అతి స్వల్ప కాలంలోనే అరిగి పోతుందట. ముఖ్యంగా, రాత్రి వేళల్లో టీవీ కార్యక్రమాలను వీక్షిస్తూ భోజనం చేసే మహిళలకు అతి స్వల్ప వ్యవధిలోనే ఆకలి పుట్టుకుని వచ్చి ఏదో ఒకటి తినాలనిపించడం, తినుబండారాలను లాగించేయడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని సిడ్నీలోని మెక్‌ఖ్వైర్ యూనివర్శిటీలో పరిశోధకులు పేర్కొన్నారు.
భోజనం చేసేటప్పుడు మాట్లాడటం, కసురుకోవడం, కోపతాపాలు ప్రదర్శించడం మంచిది కాదని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే, ఇతర ధ్యాస పెట్టుకోవడం కూడా మంచిది కాదు.కొంత మంది కబుర్లు చెప్పుకుంటూ గంటల తరబడి కంచాల వద్ద కూర్చుంటారు, మరి కొందరు తిరిగి వెళ్ళిపోవాలన్న తొందరలో నిలబడే ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలా నిలబడే అన్నం తింటూ టెలివిజన్ కార్యక్రమాలను తిలకించడం ఆడవారిలో అధికంగా కనిపిస్తున్న ఉమ్మడి లక్షణం. అలా టీవీ చూస్తూ అన్నం తినే వారిలో సగం శక్తి వెంటనే హరించుకుని పోతుందట. దీని వల్ల మనిషిలో నీరసం, నిస్సత్తువ వ్యాపిస్తుంది. ముఖ్యంగా,సీరియల్స్, ఇతర కార్యక్రమాల ప్రభావం మనిషి మస్తిష్కం మీద బాగా పని చేస్తుంది. ఆ ధ్యాస నుంచి బయట పడటానికి ఎంతో వ్యవధి పడుతుంది. అన్నం తినేటప్పుడు టెలివిజన్ కార్యక్రమాలను వీక్షించని వారిలో శక్తి వృధా కాదు, కనుక వారిలో చిరాకులూ, విసుక్కోవడాలు ఉండవని శాస్త్రజ్ఞలు చెబుతున్నారు.అంతేకాక, వేళకాని వేళలో ఆకలిదంచేస్తే ఏదో ఒకటి లాగించేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనీ, అకాల భోజనం వల్ల గ్యాస్ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు ప్రబలుతాయనీ,ఇవి కూడా మనిషి ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.
మన పీల్చే గాలిలో,తాగే నీటిలో కాలుష్యం ఉంది. మనకు తెలియకుండానే ఈ కాలుష్యం అంతా మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. దీని వల్ల ఆనారోగ్యం పాలయ్యే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గతంలో ఐదు పదులు దాటేవారికి వచ్చే గుండెపోటు, రక్తపోటు, మధు మేహం వంటి రోగాలు నేడు ఇరవై ఐదేళ్ళ యవ్వనులకే వస్తున్నాయి. ఇదే విషయాన్ని గురించి ఎవరినైనా కదిపితే, గతంలో మన పూర్వీకులు బలవర్ధక ఆహారాన్ని సేవించే వారనీ, ఇప్పుడందరూ తింటున్నది నిస్సారమైన ఆహారమని ఉపన్యాసాలు ప్రారంభిస్తారు. ఇందులో కొంత నిజం ఉంది. కాలుష్య సమస్యలతో పాటి నిస్సారమైన ఆహారాన్ని సేవించడం వల్ల మనిషిలో రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతోంది.రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మనిషి ఉత్తమ అభ్యాసాలను అలవర్చుకోవాలి. ఎంతో అవసరం ఉంటే తప్ప తెల్లవార్లూ మెలుకువగా ఉండకూడదు. ఒక వేళ నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తే ఆ మేరకు శరీరానికి విశ్రాంతిని ఇస్తూ ఉండాలి, మన శరీరంలో మార్పులు మనకు తెలియకుండానే చోటు చేసుకుంటాయి, కాఫీ,తేనీరులను ఎక్కువసార్లు తాగడం,రాత్రి అంతా నిద్ర లేకుండా గడపడం వంటి దుర్లక్షణాల వల్ల మనిషి తన ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ఆరోగ్య సూత్రాలనూ, నియమాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారానే మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. బుల్లి తెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలు మన ప్రజల్లో వివేకాన్నీ, విజ్ఞానాన్ని పెంచాలి, కానీ, కేవలం వినోదాన్ని మాత్రమే అవి పెంపొందిస్తున్నాయి. మనిషిలో విచక్షణాజ్ఞానాన్ని, సహనాన్నీ, సంయమనాన్ని పెంచే కార్యక్రమాలను మాత్రమే వీక్షించాలి, మనిషిలో కోపం, పగ,ప్రతీకారం పెంచే కార్యక్రమాలను వీక్షించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది,మనిషిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక ప్రసార సాధనాలు మనిషికి తోడ్పడేట్టు ఉండాలే తప్ప మనిషి ఆరోగ్యాన్ని చెడగొట్టకూడదు. మన పెద్దలు నియమబద్దమైన జీవనాన్ని గడపడం వల్లనే తుది శ్వాస వరకూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండేవారు. మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ విషయం ప్రాథమికమైనదిగా కనిపించినా,ఎందరికో అనుభవంలోకి వచ్చినా, టెలివిజన్ కార్యక్రమాలను వీక్షించనిదే ఆధునిక మానవుడు ఉండలేకపోతున్నాడు.వినోదాన్నీ, విజ్ఞానాన్ని ఇచ్చే కార్యక్రమాలను వీక్షించడం ఎంత ముఖ్యమో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమన్న ఇంగితాన్ని తెలుసుకుని మసలాలి.టీవీ చూస్తూ అన్నం తింటే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ముఖ్య విషయం.
Source: www.andhraprabhaonline.com
No comments:
Post a Comment