Saturday, February 26, 2011

గత జన్మలున్నాయా, చానెళ్ల గోల

పూర్వ జన్మలకు సంబంధించిన సినిమాలను మనం చాలానే చూశాం. వాటిని అలా చూసేసి వదిలేస్తాం. గత జన్మలున్నాయా, లేదా అనే ఆలోచన, మీమాంస అప్పుడు పెద్దగా పనిచేయదు. దాని అవసరం కూడా ఉండదు. గత జన్మలున్నాయా, లేదా అని మీమాంసలోకి వెళ్లాల్సిన అవసరం సినిమాలు కల్పించవు. సినిమాను ఓ ఊహా ప్రపంచంగానే పరిగణిస్తాం కాబట్టి ఆ అవసరం ఏర్పడదు. కానీ ఇటీవల తెలుగు టీవీ చానెళ్లకు పూర్వజన్మ రోగం పట్టుకుంది.

గత జన్మలున్నాయని, ఈ లోకంలోని మనుషులు గత జన్మల్లోకి వెళ్లి తాము ఎదుర్కున్న పరిణామాలను చూడవచ్చునని తెలుగు టీవీ చానెళ్లు ఇటీవల పెద్ద యెత్తున ఊదరగొడుతున్నాయి. అది వాస్తవమైనప్పటికీ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. మా టీవీ చానెల్‌లో ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ యాంకర్‌గా వ్యవహరిస్తూ గత జన్మ రహస్యం అనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. వారానికి ఒక రోజు ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఓ వైద్యుడు తన వద్దకు వచ్చిన వ్యక్తిని హిప్నటైజ్ చేసి గత జన్మలోకి తీసుకుని వెళ్తున్నాడు. దాన్ని చిత్రీకరించి ప్రసారం చేస్తున్నారు.

అతను దాదాపు లక్ష మందికి పూర్వజన్మలు చూపించినట్లు అతను ఢంకా బజాయించి చెప్పుకుంటున్నాడు. ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్‌లు ప్రసారమయ్యాయి. ఇందులో హీరో రాజాను కూడా ఆ వైద్యుడు గత జన్మలోకి తీసుకుని వెళ్లాడు. మూడు వేల ఏళ్ల క్రితం రాజా ఓ పోరాట యోధుడట. ఆ కథనాన్ని హిప్నటైజ్ అయిన రాజాను చూపిస్తూ దృశ్యాలుగా చిత్రీకరించి ప్రసారం చేశారు. గత జన్మలు ఉన్నాయని తాను నమ్ముతున్నానని యాంకర్‌గా వ్యవహరిస్తున్న సాయి కుమార్ పదే పదే చెప్పడం కార్యక్రమంలోని ప్రధానాంశం.

మా టీవీలో ఈ కార్యక్రమం ప్రారంభమైన వెంటనే మరో రెండు టీవీ చానెళ్లు రంగంలోకి దిగాయి. ఎన్టీవీ ఓనాడు దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. గత జన్మలోకి తీసుకుని వెళ్లే ఈ కార్యక్రమం ఏ మేరకు నమ్మదగిందో అర్థం కాదు. అలాగే, మహా టీవీలో కూడా యాంకర్‌ను గత జన్మలోకి తీసుకుని వెళ్లినట్లు ఓ కార్యక్రమం ప్రసారమైంది. ఇవన్నీ చూసిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ రంగంలోకి దిగింది.

ఓ వైద్యుడిని, ఇద్దరు వైద్యులను పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. వైద్యుడు టీవీ యాంకర్, జర్నలిస్టు మూర్తిని వైద్యుడు గత జన్మలోకి తీసుకుని వెళ్లే ప్రయత్నాన్ని లైవ్‌గా చూపించారు. అయితే, అలా వెళ్లడం తనకు సాధ్యం కాలేదని మూర్తి చెప్పారు. తనకు ఏ వెలుగు మాత్రమే కనిపించిందని, అయితే శరీరమూ మనసూ చాలా విశ్రాంతిని పొందినట్లుగా ఉందని మూర్తి చెప్పారు.

అయితే, అవసరం ఉన్నవారు గత జన్మలోకి వెళ్తారని ఆ వైద్యుడు తప్పించుకున్నారు. మనిషి మరణించిన తర్వాత జన్మలుంటాయని శాస్త్రీయంగా నిరూపితం కానప్పుడు, అలాంటి జన్మలు ఉండనప్పుడు గత జన్మలోకి వెళ్లడం సాధ్యం కాదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కె. లింగా రెడ్డి చెప్పారు. కానీ, ఆయనతో వైద్యుడు ఏకీభవించలేదు. ఏమైనా, గత జన్మ రహస్యం ఎపిసోడ్ మాత్రం మాటీవీలో సాయి కుమార్ యాంకర్‌గా వారం వారం ప్రసారమవుతూనే ఉన్నది.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment