ప్రోగ్రామ్‌కూ... ప్రోగ్రామ్‌కూ మధ్యన వచ్చేది... కమర్షియల్ బ్రేక్. అందులో చూపించే యాడ్‌తో పిల్లాడి మౌనమూ బ్రేక్. ఆ బ్రేక్‌తో తల్లిదండ్రుల మనశ్శాంతి కూడా బ్రేక్. ఇలాంటిదే ఉంది కదా అని సముదాయించబోతే ఒక్కోసారి పాత టాయ్ కూడా బ్రేక్ కావచ్చు. నిజానికి చాలా వస్తువుల గురించి తల్లిదండ్రులకు తెలిసేది పిల్లలనుంచే. ఈ నాలెడ్జ్... జేబు గూబను గుయ్యిమనిపిస్తుంది. అందుకే వారి డిమాండ్స్‌కు నొచ్చుకోకుండా నో చెప్పాలి. ఇలా చెప్పడం ఎన్నో బ్రేక్‌లకు అడ్డుకట్ట వేస్తుంది. అదెలాగో తెలియజెప్పడమే ఈవారం మన పేరెంటింగ్.
టీవీలో పిల్లల కార్యక్రమం వస్తోంది. ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు వర్షిల్. మధ్యలో బ్రేక్... అడ్వర్‌టైజ్‌మెంట్ మొదలైంది. అప్పటి వరకూ చూస్తున్న ప్రోగ్రామ్ కంటే అడ్వర్టయిజ్‌మెంటే వర్షిల్‌ను ఎక్కువగా ఆకర్షించింది. వెంటనే ‘త్వరగా రా’ అంటూ అమ్మని హైరానా పెట్టి మరీ లాక్కొచ్చాడు. ‘‘అది చూడు... ఎంత బాగుందో కదా! నాకూ కావాలి’’ అన్నాడు. వర్షిల్ మాట్లాడింది మూడే మాటలు, మొత్తం ఆరు పదాలు. అందులో ‘తన అభిప్రాయం, దాని మీద తల్లి ప్రతిస్పందనను కోరడం, ఆ కోరడంలోనే ఎంత బాగుందో కదా! అంటూ తల్లి అభిప్రాయాన్ని తానే నిర్ధరించేయడం, అది నాకు కావాలి’ అన్న డిమాండ్... అన్నీ కలగలిసి ఉన్నాయి. పిల్లలు టీవీ చూడడం ఎక్కువయ్యే కొద్దీ ఇలాంటి డిమాండ్లు కూడా పెరుగుతుంటాయి. ఇది అంతర్జాతీయ స్థాయిలో నిరూపింపబడిన నిజం. చూసినవన్నీ కావాలన్న ఆసక్తి పిల్లల్లో మూడేళ్ల నుంచి మొదలవుతుంది, అది ఇరవై నుంచి ముప్ఫై ఏళ్ల వరకు కొనసాగుతూనే ఉంటుంది. నియంత్రణ లేకపోతే తమను తాము అదుపు చేసుకోవడం కష్టం. అంటే తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి పిల్లల డిమాండ్స్ ఉంటాయి.
స్కూలుకెళ్లే పిల్లల్లో యాడ్ ప్రభావం మరో రకంగా చూపెడుతుంది. కొత్త ప్రొడక్ట్‌ను ఆ క్లాస్‌లో ఒకరు కొంటే మిగిలిన పిల్లలు తమ దగ్గర ఆ వస్తువు లేనప్పుడు పియర్ ప్రెషర్‌కు లోనవుతుంటారు. అటువంటప్పుడు ఇంట్లో మామూలుగా అడిగే స్థాయి దాటి డిమాండ్స్ పెరిగిపోతుంటాయి. ఇది నిజానికి ప్రెషర్ నుంచి బయటపడడం కోసం పిల్లల్లో వచ్చే రియాక్షన్. అలాగని పిల్లలకు కూడా తెలియదు. ఆ డిమాండ్ వెనుక ఫలానా వస్తువు కావాలన్న బలమైన కోరిక తప్ప మరేమీ ఉండదు. అలా అడిగిన వాటిని కొనివ్వకపోతే ఇంట్లో నాన్ కో ఆపరేషన్ మొదలవుతుంది. ఆ అడ్వర్టయిజ్‌మెంట్‌లోని ఉద్దేశం ‘ఫలానా ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వచ్చింది’ అని తయారీదారులు మనకు తెలియచేయడానికి మాత్రమేనని ఓపిగ్గా వివరించాలి. అలా కాకుండా తన దగ్గర అలాంటిదే ఉన్నా లేదా తనకు అవసరం లేకపోయినా సరే చూసిన ప్రతిదీ కావాలని మారాం చేస్తుంటే మాత్రం తల్లిదండ్రులు దానిని మొదట్లోనే తుంచేయాల్సిందే. అడిగినవన్నీ కొనిస్తూ ఉంటే కొన్నాళ్లకు ప్రతిదీ అడగటం అలవాటయిపోతుంది. ఇది దురలవాట్ల జాబితాలో కొత్తగా చేరుతున్న బ్యాడ్ హ్యాబిట్ అనే చెప్పాలి.
ఈ సంకటం మార్కెట్ స్ట్రాటజీతోనే
ఉత్పత్తిదారులు తమ ప్రొడక్ట్స్‌ను మార్కెట్ చేసుకోవడానికి ప్రధానంగా పిల్లల మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. చాక్లెట్ నుంచి షాంపూలు, సోప్‌ల వరకు చిన్న పిల్లలను టార్గెట్ చేస్తూ యాడ్‌లు తయారవుతున్నాయి. దీంతో ఆ ప్రొడక్ట్ అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇంట్లో చిన్న పిల్లలుంటే చాలు ఆటోమాటిగ్గా అది మార్కెట్ అయిపోతుంది. ఇదో సక్సెస్‌ఫుల్ బిజినెస్ స్ట్రాటజీ. చిప్స్ వంటి వాటితోపాటు ఫ్రీగా ఏదో ఒక విచిత్రమైన ఆటవస్తువును ఎరగా వేయడం మరో టెక్నిక్. ఈ వ్యాపార ఎత్తుల బారిన పడని కుటుంబం దుర్భిణీ వేసి వెతికినా కనిపించదేమో. తల్లిదండ్రుల సహనానికి, సంయమనానికి పరీక్ష పెట్టే జోన్ ఇదేనేమో అని కూడా అనిపిస్తుంది. పిల్లలకు అడగడమే తెలుసు.
వాటి అవసరం తెలియదు. వాటిని కొనడం అవసరమా వద్దా అన్న విచక్షణ తల్లిదండ్రులకే అవసరం అంటారు మానసిక విశ్లేషకులు డాక్టర్ శేఖర్‌రెడ్డి. అడిగినవన్నీ సాధించుకుంటూ పెరగడంలో పిల్లలకు సంతోషం ఉన్న మాట వాస్తవమే అయినా ఇలా పెరిగిన పిల్లల్లో అచీవ్స్‌మెంట్స్‌ని తప్ప ఫెయిల్యూర్‌ని తట్టుకోగలిగిన సామర్థ్యం ఉండదు. ‘హి హూ స్వెల్స్ ఇన్ ప్రాస్పరిటీ విల్ ష్రింక్ ఇన్ ఆడ్వర్సిటీ’ అనేది నిజం కావడానికి అవకాశం ఎక్కువ. ఈ తరం పిల్లలు అలా తయారు కావడానికి తల్లిదండ్రుల ధోరణి కూడా కారణమే. తాము అన్నింటికీ రాజీపడుతూ పెరిగారు కాబట్టి పిల్లల్ని అసంతృప్తికిగురి కానివ్వకూడదనుకుంటూ అడగడమే ఆలస్యం అన్నట్లు అన్నీ కొనివ్వడం కూడా జరుగుతోంది. ‘నో’ అనకుండా పెంచాలను కోవడం, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండడం మంచిదే కానీ, అలా పెంచినప్పుడు సమాజంలో ఎదురయ్యే ‘నో’ లను ఎలా ఎదుర్కోగలరు? ఈ విషయంలో పిల్లలకంటే తల్లిదండ్రుల ఆలోచన తీరులోనే మార్పు రావాలి. అలా రానప్పుడు భవిష్యత్తులో పిల్లలు, తల్లిదండ్రులు కూడ విచారించాల్సి రావచ్చు.
- వాకా మంజులారెడ్డి
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
సూడోనమ్మకాలు...
మా అబ్బాయి అడ్వర్టయిజ్ మెంట్‌లు చూసి ‘ఒక చాక్లెట్ తింటే రెండు కప్పుల పాలతో సమానం కదా నేను పాలు తాగను, చాక్లెట్ తింటాను’ అంటాడు. మా పాప షాంపూలతో తన జుట్టు కూడా అలాగే వస్తుందనుకుంటుంది. ప్రొడక్ట్‌ను మార్కెట్ చేసుకోవడానికి అందమైన జుట్టు ఉన్న వాళ్లతో చిత్రీకరించిన యాడ్ అని నచ్చచెబుతుంటాను.
- పి.పద్మజ, పేరెంట్
అన్నిటికీ ‘నో’ అన్నా కష్టమే!
నో అనే తారక మంత్రంతోటే క్రమశిక్షణతో పెరుగుతారనుకోవడమూ తప్పేనంటారు విశ్లేషకులు. అలాగని అమ్మాయి స్కూటీ కావాలంటే వెంటనే కొనేయడమూ తప్పే, గట్టిగా కోప్పడి నో అనడమూ తప్పే అవుతుంది. స్కూటీ అవసరం ఎంత? ఏ పరిస్థితుల్లో అడుగుతోంది. తోటి పిల్లల ముందు తన స్థాయిని పెంచుకోవడానికి లేదా స్థాయి తగ్గకుండా చూసుకోవడానికి అడుగుతోందా లేక కాలేజ్‌కు వెళ్లడానికి టైమ్ సేవ్ అవడానికా, బైక్ నడపాలన్న సరదా కోసమా? అని ఆలోచించాలి. ఇంటికి, కాలేజ్‌కు మధ్య దూరాన్ని, ట్రాఫిక్, యాక్సిడెంట్‌లను చర్చించండి. పిల్లలకు ఏడేళ్ల వయసు నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయవచ్చు. అలాగని ఏడేళ్లు వచ్చే వరకు అడిగినవన్నీ కొనిస్తూ పోయి ఏడేళ్ల నుంచి అన్నింటికీ వివరణలు ఇచ్చుకుంటూ పోతే పిల్లలు ఏ మాత్రం అంగీకరించరు. కాబట్టి డిసిప్లిన్ మొదటి నుంచి ఉండాలి.
అమ్మానాన్నలు ఏం చేయాలి?
టీవీలో వచ్చిన ప్రతి ప్రొడక్ట్‌నీ అడుగుతూ ఉండే పిల్లలకు తల్లిదండ్రులే మొదటి కౌన్సెలర్లు కావాలి. పేదరికంలో ఉన్న వాళ్ల పిల్లలకు సమకూరుస్తున్న అవసరాలను గురించి చెప్పాలి. అలాంటి వాళ్లను చూపించి బేరీజు వేసుకోవడం అలవాటు చేయాలి. నువ్వు ఒక ఫైవ్‌స్టార్ చాక్లెట్ కోసం ఖర్చు చేసే డబ్బుతో ఆ కుటుంబం రోజంతా భోజనం చేస్తుంది తెలుసా? నువ్వు చాక్లెట్ తినడం మానేసి ఆ డబ్బును ఆకలితో ఉన్న వాళ్లకు భోజనం చేయడానికి ఇస్తే ఎలా ఉంటుంది? కొత్త బొమ్మను కొనుక్కునే డబ్బుతో పేద పిల్లలకు ఒక డ్రస్ కొనివ్వడం వంటివి ప్రయోగాత్మకంగా చేసి అప్పుడు కలిగే ఆనందాన్ని పిల్లలకు అనుభవంలోకి తీసుకురావాలి. ఇది పూర్తిగా తల్లిదండ్రుల శ్రద్ధతోనే సాధ్యం.
సున్నితత్వమే సమస్య
ప్రతిదీ సాగిస్తూ ఉంటే ‘నో’ అన్న మాటను విన్నప్పుడు అది అశనిపాతంగా అనిపిస్తుంటుంది. ఈ తరహా సున్నితత్వం పిల్లల భవిష్యత్తును సమస్యాత్మకం చేస్తుంది. సమాజంలో ఎదురయ్యే యాసిడ్ దాడులు, తన ప్రేమను నో అన్నందుకు అమ్మాయిని వేధించడం వంటి అగ్రెసివ్ నేచర్ డెవలప్ కావడానికి పెంపకంలో ‘నో’ అన్నమాట లేకపోవడం మూలకారణం. మంచి సమాజం తయారుకావాలంటే అందుకు ప్రతి ఇంట్లో బీజం పడాలి.
- డా॥శేఖర్ రెడ్డి, సైకియాట్రిస్ట్
Source: www.sakshi.com
No comments:
Post a Comment