Tuesday, February 15, 2011

వీక్షకుల తీర్పు

మొగలి రేకులు

క్రమం తప్పకుండా టైంకి టీవీ ముందు హాజరయ్యేలా చేస్తున్న సీరియల్స్‌లో జెమినిలో రాత్రి ప్రసారమవుతున్న ‘మొగలి రేకులు’ని చెప్పుకోవాలి. డైలాగ్స్‌లో, సన్నివేశాల్లో, నటనలో ఏ మాత్రం అతి కనిపించదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మున్నా, దేవిల ప్రేమ సన్నివేశాల ఎపిసోడ్స్‌ని ఇబ్బంది కలిగించని విధంగా అందంగా చిత్రీకరించారు. మధ్యలో ప్రకటనలు ఎక్కువై చాలా అసహనాన్ని కలిగిస్తున్నాయి.
-డి.రమేష్ (అనపర్తి)


కమాన్ ఇండియా
హెచ్‌ఎంటీవీ న్యూస్ ఛానెల్ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటున్నాయి. ఇటీవల ప్రసారం చేసిన ఆంధ్ర-తెలంగాణ వేర్పాటువాద ఉద్యమం సందర్భంగా దశ-దిశ కార్యక్రమం ప్రజలు, ప్రముఖుల మనోభావాలకు దర్పణం పట్టింది. తరువాత సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సినీ దర్శకుడు రాజవౌళి వ్యాఖ్యాతగా ‘కమాన్ ఇండియా’ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రసారమవుతోంది. ఇందులో వ్యవసాయం, పేదరికం, విద్య, వైద్యం, అవినీతి మొదలైన అంశాల మీద అభివృద్ధి చెందిన దేశాలకి, మనకి ఉన్న తేడాలను, ఆచరణలోని లోపాలను, తీసుకోవాల్సిన చర్యలను, సూచనలను, ప్రముఖులు, రాజనీతిజ్ఞుల సలహాలను వీక్షకుల దృష్టికి తీసుకుని వచ్చి సమస్యలపై చక్కగా విశే్లషిస్తూ ప్రేక్షకులకి అవగాహన కలిగిస్తున్న హెచ్‌ఎంటీవీకి అభినందనలు. అదే ఛానల్‌లో ప్రసారమైన ‘మండుతున్న మంచు కాశ్మీర్’ కార్యక్రమం విశే్లషణాత్మకంగా ఉంది. అరుంధతీరాయ్ లాంటి వారి వ్యాఖ్యలను నిరసించి కాశ్మీర్‌ను ఒంటరిగా పాకిస్తాన్ మననివ్వదని భారత్ సార్వభౌమత్వం కింద ఉండటమే క్షేమమని కాశ్మీరీలకు, మిగతా భారత ప్రజానీకానికి మేధోవర్గం ద్వారా ఉద్బోధించాలి.
-తాళ్లూరి మణి (కాకినాడ)


మార్పు రావాలి
ఈ మధ్య టీవీ ఛానల్స్ పూర్తిగా వ్యాపారమయమయ్యాయి. అనవసర ప్రకటనలు, యువతను చెడగొట్టే సీరియల్స్, ప్రజలను చిరాకు పరిచే చర్చా వేదికలు, ముందుగానే ఊహించి ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ చిరాకు కలిగిస్తున్నాయి. డబ్బే ప్రధానంగా ప్రసారాలు జరుగుతున్నాయి. రియాలిటీ షోలని పది లక్షలు, 5 లక్షలు బహుమతులు పెట్టి, చిన్నపిల్లలతో మత్తెక్కించే డాన్సులు, కొన్ని సమయాలలో వారికి ప్రమాదాలు కలిగించే కార్యక్రమాలు సైతం చేయిస్తున్నారు. ఈ మధ్య సినిమా వారి గోల ఎక్కువైంది. ఏ ప్రోగ్రామ్‌లో చూసినా, రియాలిటీ షోలలో చూసినా సినిమా ఆర్టిస్టులను, టీవీ ఆర్టిస్టులను మాత్రమే బహుమతులకు అర్హులుగా ఎంచుకుంటున్నారు. ఇక యాంకర్లు చేసే పిచ్చిచేష్టలు వెర్రెక్కిస్తున్నాయి. యాంకర్‌కు కొన్ని హద్దులుంటే మంచిది. పిచ్చి డైలాగులు, డాన్సులు, డ్రెస్ కోడ్‌ను పూర్తిగా విస్మరించి ప్రవర్తిస్తున్నారు. టీవీ అంటే ఇంటిల్లిపాది చూసేది కాబట్టి చెడు దారి పట్టించే ప్రకటనలు మానేస్తే మంచిది. ఇక వార్తల విషయానికి వస్తే ప్రకటనలతో విసిగించి, చివరికి హడావిడిగా పది మాటలు చెప్పడం జరుగుతోంది.
-ఈశ్వరీ (ప్రొద్దుటూరు)


హేట్సాఫ్
సోమ, మంగళ వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతున్న జీ తెలుగులో ‘నాచోరే’కి హేట్సాఫ్ చెప్పాల్సిందే. అందమైన భామల సంగతి ఏమో కాని దాన్నలా పక్కన ఉంచేస్తే అందాల అద్భుత అభినయాలతో స్టేజినీ అదరగొట్టేశారు. ఇప్పుడిలా ముగ్గురు భామలు సెమీ ఫైనల్స్ చేరుకున్నారు. సెమీఫైనల్స్‌లో ఎలిమినేట్ అయిన చిత్రలేఖను చూస్తే బాధేసింది. గమ్మత్తు ఏమిటంటే తాను మాత్రం ఏ మాత్రం కంటతడి పెట్టకుండా వీక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది.
-కె.ఉమామహేశ్వరరావు (తెనాలి)


శూర్పణఖలు
సీరియల్స్‌లో మహిళలను క్రూరులుగా, కుట్రదారులుగా, డబ్బు కోసం నీచమైన పనులు చేయించేవారిగా, హంతకురాండ్రు లేదా హత్యలు చేయించే వారిగా చూపిస్తుండటంవల్ల స్త్రీలలో సహజంగా ఉండే సున్నితమైన భావాలు దెబ్బ తింటున్నాయి. మంచివారుగా కొందరిని చూపిస్తున్నప్పటికీ, చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు. కాబట్టి దుష్ట స్ర్తి పాత్రలను ఎంత ఘోరంగా చూపిస్తే వీక్షకులకు అంతగా ఆసక్తి కలిగి క్రమం తప్పక చూడటానికి అలవాటు పడుతూ వారికి వారే హాని చేసుకుంటున్నారు. అటువంటి సీరియల్స్‌ని చూడకుండా ఉండటమే సరైన విరుగుడు.
-ఎన్.రామారావు (హైదరాబాద్)


హాయి గొలిపే..
‘పాడుతా తీయగా’ నిజంగా ఒక హాయిగొలిపే కార్యక్రమం. రణగొణ ధ్వనులకు ప్రాధాన్యత ఇవ్వక హాయిని, ఆనందాన్ని పంచే కార్యక్రమం.
-ఎస్.శేష సాయికుమార్ (రాయచోటి)


ఎలా నమ్మాలి?
హిందీ ఛానెల్స్ జీటీవీ, స్టార్ ప్లస్, స్టార్ వన్‌లలో ప్రసారమవుతున్న సీరియల్స్ కథ, కొన్ని సన్నివేశాలు నమ్మలేని విధంగా ఉంటున్నాయి. ప్రేక్షకులను ఫూల్స్ కింద జమ కడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటివి ఏక్తాకపూర్ సీరియల్స్‌లో ఈ లోపాలు జరుగుతున్నాయి. ‘సంగిని’ సీరియల్‌లో శూద్, గౌరీ హీరో హీరోయిన్లు. హీరో తల్లిదండ్రులు అన్న వదినలు ధనవంతులు. కాని పెద్ద కొడుకు మాత్రం విలన్. వాళ్లుంటున్న భవంతి అమ్మడానికి చూస్తాడు. తల్లి, భార్య అడ్డం రావటంతో వాళ్ల ఇంటి ఆవరణలో ఒక్కడే పెద్ద గోరీ తవ్వి తల్లిని, భార్యను చేతులు కట్టేసి ఆ గోరీలో పడేసి చేతులతోనే మట్టి కప్పి సమాధి చేస్తాడు. కొన్ని గంటల తరువాత రెండో కొడుకు శూద్ గౌరీ వచ్చి, తమ చేతులతో ఆ సమాధిని తవ్వి వాళ్లను బయటికి తీస్తారు. వాళ్లు సజీవంగానే ఉంటారు. గడ్డపారా లేకుండా అంత లోతు గోరీని ఎలా తవ్వగలిగాడు. ఎలా సమాధి చేశాడు. వాళ్లు సమాధిలో చావకుండా ప్రాణాలతో ఎలా ఉన్నారు? ప్రేక్షకులు ఎలా నమ్మాలి?
-మహమ్మద్ యూసుఫ్ (కాజీపేట)


గడగడ
ఈటీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే వార్తలలో ఈ మధ్య ప్రకటనలు ఎక్కువయ్యాయి. చివరలో వార్తలు చదివే వారు ఎవరో తరుముకు వస్తున్నట్లు గబగబా వార్తలు చదివేస్తున్నారు. చివరలో వార్తల ముఖ్యాంశాలు అయినా చెప్పకుండా సమాప్తం చేసేస్తున్నారు. ఈటీవీ-2లో ప్రసారమయ్యే ‘తీర్థయాత్ర’ కార్యక్రమం మొదట్లో వచ్చే గీతం ఎంతో వినసొంపుగా ఉండేది. ఆ పాట కూడా తీసేసి కార్యక్రమాన్ని డైరెక్టుగా ప్రసారం చేసేస్తున్నారు. కార్యక్రమాలు పూర్వం లాగానే, నిదానంగా ప్రసారం చేస్తే బాగుండేది.
-యం.రాజేంద్రప్రసాద్ (వౌలాలి)


ఆడ విలన్లు
ఈ మధ్య ప్రతి సీరియల్‌లోనూ ఆడ విలన్లు ఎక్కువై పోతున్నారు. చూడలేక పోతున్నాం. ఆడ విలన్లు లేకుండా సీరియల్స్‌ని ప్రసారం చేయలేరా?
-వెంకటలక్ష్మి (గుంతకల్లు)


వెర్రిమొర్రి వేషాలు
కక్కిన కూడు కనీసం కుక్కైనా ముడుతుందా? ముట్టదు అని ఎవరైనా ఠకీమని చెప్తారు. కానీ స్టార్ మహిళ కావాలన్న దుగ్ధతో యాంకరమ్మ చెప్పిన వెర్రిమొర్రి వేషాలేసే మహిళలు ఫిబ్రవరి 4న ‘స్టార్ మహిళ’ సాక్షిగా వారు ఉమిసిన చెర్రిపండ్లను వారే ఏరి లెక్కించారు. ఈ ఆటకు మహిళలు ఎలా సమ్మతించారు? వారిచ్చే వెధవ గిఫ్ట్‌ల కోసం ఇప్పటికే ఎన్నో వేషాలు, డాన్సులు వేసే మహిళలు భవిష్యత్తులో ఇంకేం చేస్తారో?
-పి.అన్నపూర్ణ (జగ్గయ్యపేట)


సోర్సు: www.andhrabhoomi.net

No comments:

Post a Comment