ఏ రంగంలో ప్రముఖులైన వారు వారి తర్వాతి తరాన్ని అదే విభాగాల్లోకి చేర్చడం, అందులో వారివారి కృషి, దీక్షా దక్షతల్ని బట్టి ఫలితాలుండటం చాలాకాలంగా చూస్తున్నాం. అలా నటుడు మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న కూడా సంబంధిత రంగంలోకి వచ్చారు. అయితే కేవలం కుటుంబ నేపథ్యం కారణంగానే నేరుగా ఇందులో ఎంటరై పోకుండా, రావడానికి ముందు ఆయా విభాగాల్లో సుశిక్షితురాలు కావడం లక్ష్మి ప్రత్యేకత. ఇది వరకటికీ ఇప్పటికీ ఇంకో గణనీయమైన తేడా ఏమిటంటే సినీ రంగ ప్రముఖుల సంతానం వారసత్వం తీసుకోవాలంటే ఫిలిం ఫీల్డే వుండేది. కానీ నేడు అనుషంగికంగా టీవీ మాధ్యమం కూడా రావడంతోటి పరిధి పెరిగింది. అవకాశాలకూ విస్తృతి వచ్చింది. ఇక లక్ష్మీప్రసన్న విషయానికొస్తే గతంలోనే ఈమె మరో చానెల్‌లో చెప్పుకోతగ్గ కాలంపాటు వచ్చిన ఓ టాక్ షోతో చిరపరిచితురాలే. అలాగే ఇటీవల తాను పోషించిన ఐరేంధ్రి (‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం ద్వారా ప్రేక్షకావళికి మరింత చేరువయ్యారు) ఈ నేపథ్యంలో ‘ప్రేమతో మీ లక్ష్మీ..’ కార్యక్రమం ఫిబ్రవరి 10న రాత్రి 9.30కి ఈటీవీలో తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. పేరుకి ఉపనామంగా ఉన్న.. (సెనే్సషనల్ టాక్ షో).. దానికి న్యాయం చెయ్యాలన్న భావనతో అనుకుంటా మొదటి భాగంలో నారా చంద్రబాబు నాయుడుతో టాక్‌షో ప్రసారం చేశారు.
పరిశోధన ప్రశంసనీయం
ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు, అందులో పాల్గొనే ప్రముఖుడి గురించి కావల్సిన రీతి పరిశోధన చేసి ప్రశ్నలు కూర్చడం, వాటి నుంచి మరింత ఆసక్తికర సమాధానాలు రప్పించటం జరుగుతుంది. ఇందులో అది చాలా వరకూ కచ్చితంగా జరిగింది. అందుకు వ్యాఖ్యాత్రి లక్ష్మి ప్రశంసనీయురాలు. బాబు విశ్వవిద్యాలయంలో చదువుకున్నప్పుడు ఉన్న హాస్టల్ రూం నెంబర్ నుంచి అనేకానేకమైనవి చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేసిన సంగతి ఆయన చెబుతున్నప్పుడు మాత్రమే తొలిసారి తెలిసినట్లు వ్యాఖ్యాత్రి భావ ప్రకటన చేయడం మరి మిస్సయిన రీసెర్చి అంశంగా పరిగణించాలా?
ఎక్కువమందికి చేరిక
సందర్భవశాత్తూ వ్యాఖ్యాత్రి ఓ చోట ప్రస్తావించినట్లు రాజకీయ నాయకుడు తమ ప్రణాళికల్ని, ఆశయాల్ని ఏవో సభలలో చెప్తే దాని సారం అక్కడికొచ్చిన భావసారూప్యం గల వ్యక్తులకు మాత్రమే చేరే అవకాశం ఉంది. అంతకంటే ఇలా టీవీల్లో - అందునా వినోద ప్రధాన చానల్స్‌లో ఓ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ద్వారా చెప్పడం వల్ల సునాయాసంగా అన్ని వర్గాలకు చేరుతుంది. అదే ఈ కార్యక్రమం విషయంలో జరిగింది. బాబు పాలనలో ఉన్నప్పుడు అమలు చేసిన అంశాల సారం (మొదట సంపద సృష్టించాలి, అనంతరం అది క్రింది స్థాయి వరకూ చేరేలా చేయాలి, దారిద్య్రం తొలగాలంటే అక్షరాస్యత శాతం పెరగాలి. ముఖ్యంగా స్ర్తి విద్య పెరగాలి. ఐటి పురోభివృద్ధి.. తదితరాలు) అందరికీ బాగా అర్థమైంది. అయితే వాటి ఆచరణలో ఏర్పడిన అవరోధాలూ, అనంతర ఫలితాలూ వేరే సంగతి. ఇక ఇందులో అందరూ చర్చించుకునే అంశం (చంద్రబాబు అరుదైన నవ్వు గురించి..) మీరు చెప్పేది బావున్నా, అది కాస్త హ్యూమరస్ టచ్‌లో చెప్తే ఇంకా ఎక్కువ మందికి వెంటనే చేరే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించారు. దీనికి బదులుగా బాబు అలా వుంటే ఎక్కువ మందికి మెసేజ్ వెళ్తుంది కదా అన్న దానికి సంబంధం లేదు అంటూనే హ్యూమరస్ టచ్ వుంటే బావుంటుందన్నది మాత్రం స్థూలంగా అంగీకరించడం వ్యాఖ్యాత్రి విజయమే. అలాగే ఇంజనీరింగ్ కళాశాలలకు అవసరమైనవి లోపించడం, నాణ్యతా ప్రమాణాల లేమి మొదలైనవి బాబు బాగా స్పృశించారు. అదే విధంగా నిరంతర ప్రజాసేవలో తాను కోల్పోయిన కుటుంబ జీవితం, అందుకు అనుగుణంగా అర్థం చేసుకుని మెలగిన అర్ధాంగి వైనాన్నీ వివరంగా చెప్పారు. కొన్ని అంశాల విషయంలో మాత్రం తన కలవాటైన అస్పష్టతనే ఇందులోనూ కొనసాగించారు.
ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది..
ప్రణాళికాబద్ధంగా తయారుచేసుకున్న ఈ టాక్‌షోలో వ్యాఖ్యాత్రి భాష విషయంలో ఎప్పటిలాగే ఇంకా సాధన చేయాలి. ముఖ్యంగా భాషకి, తదితర ప్రమాణాలకి ఇతోధిక సహకారాన్నందించే ఈటీవీలో ప్రసారమవుతోంది కనుక ప్రేక్షకులింకా క్వాలిటీని కోరుకుంటారు. స్వవిషయాల ప్రస్తావన శాతాన్ని, మాటిమాటికీ ఉపయోగిస్తున్న ‘అంకుల్’ లాంటి సంబోధనలూ పరిహరించడం చేస్తే బావుంటుంది. అలాగే వాణిజ్య ప్రకటనల సమయాన్ని కుదించి కార్యక్రమ ప్రసార సమయాన్ని అరగంటకు కుదిస్తే ప్రోగ్రాం ఇంకా పటిష్టంగా తయారవుతుంది. కావాలంటే పాల్గొంటున్న వ్యక్తి వెలువరించే విషయ ప్రాధాన్యాన్ని బట్టి ప్రసారంచేసే భాగాల సంఖ్య పెంచుకోవచ్చు.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment