Thursday, May 19, 2011

రొటీన్ కాన్సెప్ట్

రియాలిటీ షోల హవా చిన్న తెరకు ప్రధాన ముడి సరుకైన సీరియల్స్‌ని పక్కకు పెట్టేస్తుందేమోనన్న ఆలోచన వస్తున్న సమయంలో కొత్త సీరియల్స్ ప్రారంభించడంతో జీ తెలుగు ఛానెల్ మళ్లీ ఆ దిశగా వీక్షకుణ్ణి ఆసక్తిగా చూసేలా చేసింది. ఆ క్రమంలో జీ తెలుగు టీవీలో మే 9 నుంచి రాత్రి 9 గంటలకు ‘కన్యాదానం’ ధారావాహిక ప్రారంభమైంది.


అలవాటైన పంథా
పెళ్లికెదిగిన అమ్మాయిలు, పెళ్లి చేయడానికి వారి తల్లిదండ్రులు పడే తపన, కట్నాలు రాబట్టుకోవాలని అబ్బాయిల తరఫు వారు చూపించే ఆత్రం.. మొదలైన వాటిలో ఎన్ని చెప్పుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. ఆ కోణం ఆసరా చేసుకుని తయారైన కథగా తొలి భాగాల్లో కన్యాదానం కన్పడింది. దీనికి తోడు పెళ్లి కావలసిన అమ్మాయి ‘రంగు’ తక్కువ అంశం కూడా ప్రధానంగా ఉంది ఇందులో. పెళ్లి కావల్సిన అమ్మాయి అర్చన నల్లగా ఉంటుంది. ఆ కారణంగా ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతుంటాయి. ఆమె తల్లిదండ్రులు జమీందారు వంశీకులైనా ఆస్తి కోర్టు తగాదాల్లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. అయినా డాంబికానికి లోటు లేకుండా అందిన చోట్లంతా అప్పులు చేస్తూ పైకి పరువు నిలుపుకుంటూంటారు. రంగు తక్కువైనా పెళ్లికి ఓకే అంటూ అందుకు ప్రతిగా భారీ మొత్తం కట్నంగా అడుగుతుంది అబ్బాయి తల్లి. ఆ డబ్బు సర్దుబాటు చేయలేక సతమతమవుతూంటే, ఈ పెళ్లి కుదిర్చిన పెళ్లిళ్ల పేరమ్మ రమాదేవి, మీ అబ్బాయికి పెళ్లి చేసి ఆ కట్నంలో అమ్మాయి పెళ్లి చేసేయండని సమయోచిత సలహా వదిలేస్తుంది. అది తప్ప మరో దారిలేక ఆ పనికీ ఉపక్రమిస్తారు అమ్మాయి కుటుంబం వారు. అయితే ఇక్కడో మెలికుంది. నల్లగా వుండే అర్చన, వాళ్లన్నయ్య కూడా వేర్వేరుగా ప్రేమలో పడతారు. కానీ ఈ సంగతి అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వెల్లడి చేయలేక పోతారు. ఇప్పటివరకూ స్థూలంగా జరిగిన కథ ఇది.

కాలదోషం పట్టిన కాన్సెప్ట్..
అసలు ఈ ధారావాహికకెన్నుకున్న మూల బిందువే అంతగా అందరూ ఒప్పుకునేది కాదు. ‘నలుపు కన్నయ్యకు అందం - నాకు శాపమా?’ అన్నది అప్పుడెప్పుడో అరవై దశకాల్లో ‘నాదీ ఆడజన్మ’ చిత్రం నాటి సంగతి. అప్పుడే నలుపులో ఉన్న నాణ్యతను ఫోకస్ చేస్తూ చెప్పుకొచ్చేవారు. రానురాను అసలు నలుపుపై చిన్న చూపు ఉండటం లేదు కూడా. పైగా ‘బ్లాక్ బ్యూటీ’ అంటూ మంచి విశేషణాలు కూడా జోడించే ఆరాధనా భావం కూడా పెరిగింది. మరి ఇలాంటి సందర్భాలలో ‘నలుపు’ పెద్ద అవరోధంగా కథాక్రమం సాగడం అసమంజసంగా ఉంది. ఇంక అర్చన - మురళి మధ్య అనురాగం పెరుగుతూంటే దాన్ని వ్యక్తపరచుకోడానికి పడిన సంకోచంలోనూ సమంజసత కన్పడలేదు. అలాగే రాజా (అర్చన సోదరుడు) మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు వెల్లడి చేయకపోవడానికి కనపర్చిన కారణం (కట్నం రాకపోతే తన చెల్లెలి పెళ్లి కాదు) కొనసాగింపునకూ కేవలం కథలో పెట్టుకున్న ట్విస్టే మూలం అనుకోవాలి తప్ప మరే సమర్థనీయ కారణమూ కన్పడటం లేదు. అన్నిటికన్నా విచిత్రమేమిటంటే ‘ఇదిలా సరికాదు’ అని మనమిప్పుడేవైతే చెప్పుకున్నామో అని అన్నీ ఆయా పాత్రధారుల పక్క పాత్రల ద్వారా చెప్పించడం జరిగినా రైట్ ట్రాక్‌లోకి కథ రానివ్వలేదు. అలా వస్తే కథ నడవడం ఎలా అంటారా? అది వేరే సంగతి. అదే విధంగా లేని జమీందారీతనం కోసం లేనిపోని గొప్పలు పోవడం, అందుకుగానూ తలకు మించిన అప్పులు చేయడమూ లాంటివి కూడా ఇప్పటి కాలంలో అంతగా పొసగని సంగతులు.

మరీ అంత దట్టింపు అవసరమా?
ఇందులో సంభాషణా రచయిత చాలా పెద్ద పాత్ర వహించారు. చాలా చోట్ల సందేశాత్మక సంభాషణలూ, ఉదాహరణ పూర్వక మాటలూ దట్టిం చేశారు. ‘వంద అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయమనడం అప్పటి ట్రెండు. వంద నిజాలు చెప్పి ఒప్పించి పెళ్లి చేయడం ఇప్పటి ట్రెండు’. ‘ఆడపిల్ల ఎంత అందం తక్కువగా ఉంటే అంత ఎక్కువ కట్నం పిండచ్చు’ ‘నిన్ను మర్చిపోవడమంటే, నన్ను నేను మర్చిపోవడమే’ ‘ఆ పాట అలసిపోయిన గుండెలను నిద్రపుచ్చేదిలా ఉంటుంది’ ‘మనసులోని ప్రేమ దాచుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్లంటే నాకిష్టం లేదు..’ ఇంత స్థాయి దట్టింపులు అవసరం లేదు. ఇవే భావాలు చిన్నచిన్న మాటలతో పలికించవచ్చు. కొన్నిచోట్ల ఉపయోగించిన (మనుషులకి తప్ప మనసులకి పేదా గొప్పా తేడా తెలియదేమో! ‘మనిషిలో నిరాశ పెరిగినప్పుడు ప్రతి చిన్న విషయం సమస్యగానే ఉంటుంది’ లాంటివి) వాక్యాలు అర్థవంతంగా, సన్నివేశానికి పుష్టినిచ్చేవిగానూ ఉన్నాయి. బంగారానికీ, రాగికీ తేడా తెలుపుతూ రమాదేవితో పలికించిన పదాలూ బాగున్నాయి. అన్ని సీరియల్స్‌లోలా ఇందులో టైటిల్ సాంగ్ అంటూ పెట్టక, మధ్యలో మురళి (సీరియల్‌లో గాయకుని పాత్ర - అర్చన ప్రేమికుడు) పాత్రపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ ‘ఓ ప్రియతమా..’ అంటూ పాట పెట్టడం, అది కూడా పెద్ద ఇబ్బందేమీ పెట్టనిదిగా ఉండటం అభినందనీయం.

మేకప్స్‌లో శ్రద్ధ వహించాలి..
మేకప్‌ని ఎంత తక్కువగా చేస్తే అంత సహజంగా ఉంటుంది. దాన్ని లైటింగ్ పరంగా, ఇతరేతర విధానాల ద్వారా సహజంగా చెయ్యచ్చు. కానీ ఇందులో పద్మజా రాణి కారీతి దట్టమైన మేకప్పు అవసరం లేదనిపించింది. .కనీసం రమాదేవి పాత్రకు వేసిన పెదాల రంగు విషయంలోనూ నిర్లక్ష్యం వహించడం వల్ల అది తెరపై వీక్షకులు చూడడానికి ఇబ్బంది పెట్టేసింది.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment