Monday, May 23, 2011

ఢిల్లీ ఈటీవీ విలేకరిపై దాడి

న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: తెలంగాణపాత్రికేయుల వేదిక దేశ రాజధానిలో చేపట్టిన ధర్నాకు వచ్చిన కొందరు వ్యక్తులు ఈటీవీ ఢిల్లీ ప్రతినిధి బి.ఎల్‌.ఎస్‌.వి.ప్రసాద్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. గురువారం ఇక్కడి పార్లమెంటు వీధిలో ధర్నాను ప్రసాద్‌ కవర్‌ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన సాయిలు అనే వ్యక్తి వచ్చి.. ధర్నాకు కేవలం రెండు వందల మందే వచ్చారని ఎన్‌టీవీలో ఎలా ఇస్తారని ఈటీవీ ప్రతినిధిని ప్రశ్నించారు. తాను ఈటీవీ రిపోర్టర్‌నని ప్రసాద్‌ చెబుతూ.. పక్కనే ఉన్న ఎన్‌టీవీ రిపోర్టర్‌ను చూపి అతన్ని అడగండి అని సూచించారు. సదరు వ్యక్తి ఏ రిపోర్టర్‌ అయితేనేం, ఏ ఛానల్‌ అయితేనేం అని గట్టిగా అరుస్తూ ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నంచేశారు. చుట్టూ 30, 40 మంది వ్యక్తులు గుమికూడారు. ఆ గుంపులో నుంచే ఓ వ్యక్తి ముందుకొచ్చి తెలంగాణ గురించి నువ్వేందో అంటున్నావంటూ గట్టిగా అరుస్తూ చేయి చేసుకొన్నాడు. అక్కడే ఉన్న కొందరు పాత్రికేయులు వచ్చి సర్దిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రసాద్‌ను కోరారు. ప్రసాద్‌ ఈటీవీ వ్యాన్‌ వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి కేకలు వేసుకుంటూ తరిమే ప్రయత్నం చేశారు. వ్యాన్‌ ఎక్కి వెళ్తుండగా దాన్ని చుట్టుముట్టి అద్దాలపై బాదుతూ అడ్డుకున్నారు. ఇంతలో ధర్నా కార్యక్రమానికి నేతృత్వం వహించిన క్రాంతి, పి.వి.శ్రీనివాస్‌ అనే పాత్రికేయులు అక్కడికొచ్చి సర్దిచెప్పి, ప్రసాద్‌ను వ్యాన్‌ ఎక్కించి వెళ్లాలని కోరారు. ఈ ఘటనను తెలంగాణ పాత్రికేయుల వేదిక అధ్యక్షుడు అల్లం నారాయణ దృష్టికి పాత్రికేయులు తీసుకెళ్లినప్పుడు ఆయన విచారం వ్యక్తంచేశారు. దాడికి పాల్పడిన వారిని విచారించి, మళ్లీ మాట్లాడతానని బాధిత పాత్రికేయుడు ప్రసాద్‌కు హామీ ఇచ్చారు. ఈ ఘటన పట్ల తెరాస ఎమ్మెల్యేలు హరీష్‌రావు, ెకేటీఆర్‌లు విచారం వ్యక్తంచేశారు.

Source: www.eenadu.net

No comments:

Post a Comment