లోగడయితే కళాకారుడిలో ఉన్న ప్రతిభ చూపడానికి ఓ స్పష్టమైన వేదిక లేక నానా ఇబ్బందులూ పడేవాడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మనలో ఓ మాదిరి సృజనాత్మకత ఉన్నా దాన్ని బహిర్గతపరచుకోడానికి ఛానెళ్ల రూపంలో ఉన్న ప్లాట్‌ఫారాలెన్నో. అలాంటి ప్రతిభాశాలులకు మరో విలువైన వేదిక ‘అదుర్స్’ (ప్రతి బుధవారం ఈటీవీలో రాత్రి 9.30కి వస్తున్నది)
వైవిధ్యం..
ఈ శీర్షిక పేరులో (అదుర్స్) ఉన్న పరాకాష్ఠ తత్వమే, ఇందులో చూపబోయే అంశాలూ ఆ దిశలోనే ఉంటాయన్న సంకేతాన్ని సామాన్య ప్రేక్షకులకు కలుగుతోంది. ఆ తలంపునకు తగ్గట్లే ఇందులో చూసే ఐటెమ్స్ అన్నీ ఓ మాదిరి కృషి చేస్తే ప్రదర్శించే బాపతు కానే కావు. నిరంతర అభ్యాసం, మొక్కవోని దీక్ష సమ్మేళనపరిస్తేనే కానీ సంభవించే అవకాశం లేదు. మిగతా టాలెంట్ షోల్లో ఇంతవరకూ ఎక్కువగా ఆట (డాన్స్) పాట తప్పితే మిమిక్రీ తరహావి ఎక్కువ కన్పడితే ఇందులో సాహస విన్యాసాలూ వగైరా కూడా దర్శనమివ్వడం వెరైటీ. అయితే ఈ కార్యక్రమం ‘కలర్స్’ ఛానెల్‌లో వచ్చిన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ స్ఫూర్తితో తయారైనదిగానూ అనిపిస్తోంది.
సకలాంగులకే సాధ్యం కానిది..
అన్ని అవయవాలూ ఉన్నా, దీక్షాలేమితోనో, మరో రకపు లోపభూయిష్టపు చర్యల వల్లో ప్రదర్శించే కళలో పరిపూర్ణత కనపర్చడం ప్రతీ సందర్భాలలోనూ జరిగే వ్యవహారం కాదు. కానీ ‘అదుర్స్’లో ప్రదర్శితమైన తొలి అంశంగా ‘ఎబిలిటీ అన్ లిమిటెడ్’ (అపరిమిత సామర్థ్యం) గ్రూప్ - ఢిల్లీ వారు ప్రదర్శించిన నృత్యం వచ్చింది. ఇందులో పాల్గొన్న నృత్య కళాకారులు వికలాంగులు. వీరు వీల్‌ఛైర్‌లో కూర్చిన నృత్య భంగిమలు చూపారు. వీరి వెనుక నర్తించిన నృత్య కళాకారిణులు వినికిడి, మాట్లాడే శక్తిలేనివారు. అలా వెనుక వినిపించే సంగీతం వినిపించకపోయినా సాధనతో అంచనా వేసి అనుగుణంగా నర్తించే సామర్థ్యం వీరి పరమైంది. ఇది నిజంగా దైవదత్తమైన అమూల్యాంశం. అందుకే వీరి ప్రదర్శన అనంతరం కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వచ్చిన తరుణ్ మాస్టర్ (డాన్స్ మాస్టర్), మహేశ్వరి (నటి), నందినీరెడ్డి (‘అలా.. మొదలైంది’ చిత్ర దర్శకురాలు) అద్భుత ఆనంద పరవశంతో వారుంటున్న ప్రదే శం నుంచి డయాస్ మీదికి వచ్చి కళాకారుల్నీ, వారికి ఆ స్థాయి ప్రదర్శనను నేర్పిన గురువునీ సాదరంగా ప్రశంసించారు. తర్వాత ప్రదర్శనలుగా ఫిక్టేసియస్ గ్రూప్ రెప్పపాటు కాలంలో ఒక చోట నుంచి మరో చోటకి ఎగరడం పనులూ, ఇల్యూమినేటింగ్ దళం (రెండు గ్రూపులూ ముంబై నుంచి వచ్చాయి) మెరుపుల నేపథ్యంలో విన్యాసాలూ చేశారు. అన్నింటికంటె ఎక్కువ ఆకర్షించినది కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చిన బంజారా డాన్స్ గ్రూప్ ద్వారా చిన్నారులు ప్రదర్శించిన జానపద నృత్యం. ఈ ఐటెమ్‌లో ఉన్న ప్రత్యేకతేమిటంటే, లైవ్ మ్యూజిక్‌తో నృత్యం చేయడం. ఇప్పుడు నృత్యాలు ఎక్కువగా ఏవో ముందుగా రికార్డయిన వాటితోనే జరుగుతున్నాయి. ఆ శైలికి భిన్నంగా ప్రత్యక్ష ప్రసారంలా.. అప్పటికప్పుడు వినిపిస్తున్న పాట, సంగీతానికి అనుగుణంగా నృత్యం చేయడం. ఇలా చేయాలంటే ఈ ముగ్గురి (పాట, ఆట, సంగీతం) మధ్య కచ్చితమైన సమన్వయం ఉండాలి. అది బాగా కుదిరిందిందులో.
ఆశ్చర్యపరచిన గ్వాలియర్ గ్రూప్..
ఇక తొంభై కేజీల చొప్పునున్న పెద్దపెద్ద బండరాళ్లని బంతుల్లా ఆటలాడేసి.. ఏమిటీ టాలెంట్ అని సగటు ప్రేక్షకుణ్ణి విస్మయపరిచారు గ్వాలియర్ దళం వారు. అంతటి భారీ బరువు వున్న రాళ్లని కావడి రూపంలో ఓ కర్రకేసుకుని అటూ ఇటూ అవలీలగా ఊపడమే కాక పైన తనంత బరువున్న మరో వ్యక్తిని భుజాలపై నిలబెట్టుకోడం, గుండె మీద ఆ బరువుల్ని మోయడం వంటి ప్రమాదకర విన్యాసాల్నీ ఇందులోని ఓ వ్యక్తి చేశాడు. ఇవి చూసి ‘అమ్మో...’ అన్న భయాందోళనా భావాల్ని జడ్జెస్ స్థానాల్లో ఉన్నవారు చూపారు. దాదాపు అవే భావాలు ప్రేక్షకులకీ కలిగాయి.
..ఇది భావ్యం కాదు
ఇక ప్రదర్శనల నంతరం ఏది బావుందో అన్న న్యాయనిర్ణేతల ప్రకటన అన్నిట్లోనూ ఉన్నట్లే ఇందులోనూ ఉంది. సరే... ఎవరికి ఫస్ట్ ఇచ్చారు? ఎవరిని సెమీ ఫైనల్స్‌కు ఎంపిక చేశారు అన్నది ప్రమాణాల్ని పరిశీలించి న్యాయనిర్ణేతలు నిర్ణయించే విషయం కనక దానిపై వ్యాఖ్యలనవసరం. కానీ బావున్న కేటగిరీలో గ్వాలియర్ గ్రూప్ ప్రదర్శించి అత్యంత సాహసోపేత ప్రదర్శన (రాళ్లను మోయడం) చేర్చకపోతే పోయే, కనీసం వారిలా ప్రమాదకర విన్యాసాన్ని విజయవంతంగా ప్రదర్శించడాన్ని ప్రస్తావించకపోవడం సరిగా అనిపించలేదు. అది పోగా ఎందుకివి చేయడం అన్నట్లు జడ్జెస్ ముగ్గురూ మాట్లాడడమూ కొంత బాధ కలిగించే అంశం. కళారూపాలు అన్నీ సున్నితంగానే ఉండవు. కొన్ని ఇలా ప్రమాదభరితంగానూ ఉంటాయి. అలా అయితే సర్కస్ కళలోని కొన్ని అంశాలూ ప్రమాదభరితమైనవి (పులి నోట్లో తల పెట్టడం..తదితరాలు) అయితే వాటిలో కూడా తమ ప్రతిభ చూపించే సాహసవంతులూ మనకున్నారు. మీరిలాంటి కళ నెందుకెంచుకున్నారు అని ఓ న్యాయనిర్ణేత అడిగిన ప్రశ్నకు, ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి వారభినయించి ప్రశంసలు పొందినది కనుక, ఆ సంస్కృతినీ, వారసత్వాన్నీ కొనసాగించడానికి మేం దీన్ని ఎంచుకున్నాం అని వారిలో ఒకరు చెప్పిన సమాధానం సముచితంగా ఉంది. బహుశా న్యాయనిర్ణేతలు ఈ అంశం పట్ల అంతగా దృష్టి పెట్టి ఆలోచించక పోడానికి కారణం ఆ ముగ్గురిలో ఎవరికీ ఈ తరహా వాటి పట్ల అంతగా పరిచయం లేకపోవడం కావచ్చు. కనుక మల్టీ టాలెంటెడ్ షోగా దీన్ని చెప్పుకొస్తున్నారు కనుక కేవలం నృత్య, అభినయ, గాన రంగాల్లో పరిణితి చెందిన వారిని ఎంపిక చేసే సిద్ధహస్తుల్నే కాక ఇతర రంగాల్లోని కళాకారుల నిగ్గు తేల్చగల సామర్థ్యం ఉన్న వారినీ జతపరిస్తే బావుంటుంది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment