ఏ ఛానెల్ చూసినా డాన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నాయి. కొన్నింటిలో మరీ విపరీతమైన కొనసాగింపు. ‘ఢీ’తో మొదలైన కార్యక్రమం ‘ఢీ2’ నుండి ‘ఢీ4’ వరకూ కొనసాగుతూ ఉంది. మరి చివరి నెంబర్ ఎంతో తెలీదు. ఇక ఒక ఛానెల్‌లో నిర్వహించే ఇలాంటి కార్యక్రమం నిర్వహించరాదని, అది చిన్నపిల్లల మానసిక ఆనందానికి ఇబ్బంది కలిగిస్తున్నదని, వారి హక్కుల పరిరక్షణకు భంగకరమని.. ఇంకొన్ని కారణాల మూలంగా కొద్ది రోజులపాటు ఆ కార్యక్రమం నిర్వహించరాదని మానవ హక్కుల సంఘం వారి నుంచి తాఖీదులు కూడా అందాయి. కాని తరువాతి పరిణామాల వల్ల సదరు కార్యక్రమం ఈ రోజు వరకూ కొనసాగుతూనే ఉంది. ఒక ఛానెల్‌లో మొదలైన ఇలాంటి కార్యక్రమం అంటుజాఢ్యంలా ప్రతి ఛానెల్‌కూ వ్యాపించింది. కొన్నింటిలోనయితే జుగుప్సాకరంగా డాన్స్‌లు చేయడం కూడా జరుగుతోంది.
వీటికి భిన్నంగా ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమవుతోన్న ‘భగవద్గీత’ శ్లోకాల పోటీ కార్యక్రమంలో న్యాయనిర్ణేత, పార్టిసిపెంట్స్, యాంకర్స్ కూడా సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి ఉంటారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి చిన్నారి వారి స్తోమతకు తగ్గట్టుగా పట్టు పరికిణీలు లేదా మిగతా సంప్రదాయబద్ధమైన వస్త్రాలు ధరించి ఉంటారు. న్యాయనిర్ణేత వచ్చిన ప్రతి చిన్నారినీ ఫలానా శ్లోకం చెప్పమని అడగటమూ, చెప్పిన తరువాత సదరు శ్లోకానికి అర్థం అడగటం లాంటివన్నీ చూస్తూంటే ఆ పిల్లలకూ న్యాయనిర్ణేతకు శ్లోకాలపై, భగవద్గీతపై గల పట్టును సూచిస్తుంది. యాంకర్ కూడా ఇందులో భాగం వహించడంతో కార్యక్రమానికి మరింత శోభ వచ్చినట్లుగా కనిపిస్తుంది. పైన అనుకున్న ఏ డాన్స్ కార్యక్రమాన్ని చూసినా న్యాయనిర్ణేత, పార్టిసిపెంట్స్, యాంకర్స్‌తో మొదలుకొని అందరూ ఆనందాన్ని వ్యక్తం చేసే ఉద్దేశంతో విజిల్స్ (ఆడ మగ తేడాల్లేకుండా) వేదిక మీద వేయడం, మార్కులు చెప్పమంటే ‘నీ పాట అదుర్స్’ అంటూ తెలుగులో లేని పదాలను వాడి భాషను ఖూనీ చేయడం లేదా చేత్తో పేపర్‌ని పట్టుకుని చించివేయడం లాంటివి చేస్తూ కనిపిస్తారు. కాని ఇక్కడ అలాంటివేవీ కనిపించవు. వినిపించవు. ప్రతి మాటలోనూ సభ్యత, సంస్కారమూ కనిపిస్తాయి. ఈ రోజున ఏ పిల్లాడికీ, తెలుగులో సక్రమంగా (ఆంగ్ల పదాన్ని వాడకుండా) పది నిమిషాలు కూడా మాట్లాడలేని స్థితిలో ఉండి ఇంటి ముందరకు వచ్చిన బిచ్చగాడితో (అడుక్కునే అంకుల్ వచ్చాడని ఇంటిలోని వారికి చెప్పడం) మొదలుకొని ప్రతి వాడినీ అంకుల్ అని పిలవడంతో మొదలయ్యే దనచర్యలో ఎక్కడా కూడా శ్లోకాలు, పద్యాలు లాంటివి కనిపించవు. వినిపించవు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం వారు ఏకంగా శ్లోకం, దాని అర్థం కూడా చెప్పగలిగేలా వారడిగిన మరో శ్లోకాన్ని చెప్పగలిగేలా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భవిష్యత్తులో వాటిని కొనసాగించేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటే మంచిది.
ఇక దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న ‘అమ్మ’ కార్యక్రమంలో తల్లిని గురించి కొంతమంది పంపే కవితలను చదివి వాటిని విశ్లేస్తుంటారు. ఈ రోజున తల్లిదండ్రులను గౌరవించాలన్న స్పృహే లేకుండా, ప్రేమ పేరుతో తల్లిదండ్రుల మనసులను బాధలకు గురిచేస్తూ ఉంటూ ఆ విధమైన శాడిజానికి మోడల్‌గా ఉంటున్న ఈ రోజుల్లో తల్లిని గురించి కవితలు చెప్పడం, రాయడం, తల్లికి ఒక గొప్ప గౌరవం.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment