Tuesday, May 3, 2011

బ్రాండ్‌ని పెంచుకోవడానికే సరికొత్త ఛానళ్లు ....?!

ప్రతి ఏడాది పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్న ఛానెళ్లు వీక్షకులను ఎంత వరకు సక్సెస్‌గా చేరగలుగుతున్నాయనేది ప్రశే్న. చాలా ప్రాంతాల్లో కొన్ని ఛానళ్లు అసలు వున్నాయా? అనిపించే విధంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. వందకు పైబడి రిమోట్‌లో ఛానళ్లు ఫిట్ అవుతున్నా వీక్షకులు చూసేవి మాత్రం వేళ్ల మీదే ఉంటాయన్నది సత్యం. పురుషులు, పిల్లలు అయితే ఛానెళ్ల అనే్వషణతో రిమోట్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అదే మహిళలయితే సింగిల్ డిజిట్‌తోనే ఛానళ్లు చూడటంతో సరిపెట్టుకుంటారు. ఎందుకంటే మహిళల్లో ఎక్కువ శాతం సీరియళ్లని ఫాలో అవుతూ ఉండటమే. అలాంటప్పుడు కొత్త ఛానళ్లు ఎన్ని పుట్టుకొచ్చినా అంత త్వరగా ఎట్రాక్ట్ కారు. అందుకే కొత్త ఛానళ్లు స్త్రీలను ఆకర్షించటానికి బంగారం, పట్టుచీరలు వంటి వారికిష్టమైన బహుమతులను ఎరవేసి వారివైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ స్ర్తిలు అంత త్వరగా ఛానల్ మార్పుని కోరుకోవడం జరగదు.

కొత్తగా పుట్టుకొచ్చే ఛానళ్లు పురుషులను, పిల్లలను ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుంది. అందుకే మూవీ ఛానెళ్లు, మ్యూజిక్ ఛానెళ్లు, చిల్డ్రన్ ఛానళ్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. నేషనల్ ఛానళ్లు సైతం పిల్లల కోసం రీజినల్ లాంగ్వేజ్‌లో తమ ప్రసారాలను కొనసాగిస్తూ పిల్లలను ఆకర్షిస్తున్నాయి. ఈ పరంపరలో కార్టూన్ నెట్‌వర్క్, పోగో ముందున్నాయి. ఈ ఛానళ్లని వీక్షించడంలో పెద్దలు సైతం ఆసక్తి చూపుతారు. ఎందుకంటే లేనిపోని ఛానల్ కథనాల బాధలను వొంటికి పూసుకునే కంటే మనసుకు హాయిగొలిపే కార్టూన్లు, మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయడం బెటరని ఎక్కువమంది భావించడం వల్ల తెలుగు ఛానళ్లు సైతం రెండు మూడు రకాల ప్రత్యేక ఛానళ్లని లాంచ్ చేస్తున్నాయి.

ఛానళ్లు అధికంగా పుట్టుకొచ్చినా తంటాయే. ఎందుకంటే ఒక కుటుంబంలో వారందరూ ఒకే సమయంలో వివిధ ఛానళ్లని చూడలేరు. అలాంటప్పుడు ఛానల్ ప్రసారాలు నిరుపయోగమే అవుతుంది. కాని ఒక ఛానల్ కుటుంబంలోని స్త్రీలకు, పిల్లలకు, పురుషులకు వివిధ రకాల ఛానళ్లు పెట్టడంవల్ల ఎవరు ఏది చూసినా ఆ ఛానల్ బ్రాండ్‌ని దాటిపోలేరు. కాబట్టి ఆ ఛానెల్‌కి రేటింగ్ కూడా టోటల్‌గా బావుంటుందనే భావన. అయితే క్వాలిటీ ప్రసారాలు ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. క్రమేపీ ఇంటిలో టీవీ సంఖ్య పెరిగే అవకాశాలు కూడా రానున్నాయి. 

పేరు మోసిన, రేటింగ్ ఉన్న ఛానళ్లు సబ్ ఛానళ్లని పెట్టడం వల్ల ఆ ఛానెల్ ఖాతాలోకి వీక్షకులు చూసినా చూడకపోయినా కేబుల్ ఆపరేటర్ లెక్క ప్రకారం లెక్కలోకి వచ్చేస్తారు. రేటింగ్ ఛానళ్లు, ప్రముఖ ఛానళ్ల సబ్ ఛానళ్లని పెట్టినపుడు కేబుల్ ఆపరేటర్ వాటిని తప్పనిసరిగా ప్యాకేజ్ సిస్టమ్‌లో తీసుకోక తప్పదు. అలా ఒప్పుకోని పరిస్థితుల్లో మొదట పాపులర్ ఛానల్‌ని కోల్పోవలసి వస్తుంది. దీనివల్ల ప్రేక్షకుల వత్తిడి ఎదుర్కోక తప్పదు. ఛానళ్ల సంఖ్య ఎక్కువగా వున్నప్పుడు ఛానళ్ల వారు ప్రత్యేక నెట్‌వర్క్ ప్యాకేజీ ద్వారా కూడా వీక్షకులను ఎట్రాక్ట్ చేసుకోడానికి ఎక్కువగా వీలుంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీలో సన్‌నెట్ వర్క్ ఉండనే ఉంది.  

తెలుగు ఛానళ్ల విషయానికి వస్తే ఈటీవీ ఛానల్ ఈటీవీ-2ని కలిగి ఉంది. జీ తెలుగు జీ 24 గంటలనే వార్తా ఛానల్, జీ ఛానెల్‌కి నేషనల్ సబ్ ఛానళ్లు చాలానే ఉన్నాయి. ఎన్‌టీవీ ఏకంగా వనిత అంటూ ప్రత్యేకంగా స్త్రీల కోసం, భక్తి అంటూ భక్తుల కోసం ప్రత్యేకంగా నెలకొల్పడం విశేషం. జెమిని వారు జెమినీ మూవీస్, జెమినీ కామెడీ, జెమినీ మ్యూజిక్, జెమిని అంటూ ఏకంగా నాలుగు ఛానళ్లతో హవా కొనసాగిస్తోంది. మాటీవీ ఈ మధ్యనే ‘మా’ మ్యూజిక్‌తోపాటు మా జూనియర్స్, మా మూవీస్‌ని ప్రారంభించారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లకి ఏ మాత్రం తీసిపోని విధంగా టీవీ-9 వారు టీవీ 1ని నడుపుతున్నారు. ఇవికాక ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, మహా, హెచ్‌ఎం, ఐ న్యూస్, రాజ్, టిటిడి, టీవీ-5, విస్సా, లోకల్ వంటి ఎన్నో ఛానళ్లు నగరాల్లో హల్‌చల్ చేస్తున్నా పట్టణ గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి ప్రధానమైనవే కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు, మూలంగా సప్తగిరి కూడా ఉన్నాననిపిస్తుంది.

ఇన్ని ఛానళ్లు తెలుగులో హల్‌చల్ చేస్తున్నా ప్రేక్షకులు, డిస్కవరీ, ఎంటివి, ఎన్‌డిటివి, కలర్స్, స్టార్‌ప్లస్ అంటూ నేషనల్ ఛానళ్ల వైపు ఓ లుక్ వేయడం జరుగుతుంది. ఛానళ్లు ఎన్ని పెట్టినా సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను కట్టి పడేయగలిగితేనే ఎడ్వర్‌టైజ్‌మెంట్లని శ్లాట్స్ లెక్క ప్రసారం చేసి కోట్లు కొల్లగొట్టవచ్చునన్నది సత్యం. లేకపోతే కేబుల్ ఆపరేటర్ చెప్పే లెక్కలపైన ఆధారపడే ఛానల్‌ని నడపాల్సి ఉంటుంది. ఈ పరంపరలో నెగ్గుకురాలేని చాలా ఛానళ్లు మూత పడిన సందర్భాలు కూడా లేకపోలేదు. భక్తి ప్రచారం కోసం కూడా అనేక ఛానళ్లు తమ ప్రసారాలను ప్రసారం చేస్తూ నడుస్తున్నా అవి భారంగానే నడుస్తున్నాయన్నది ఒప్పుకోక తప్పని సత్యం. నిత్యం పుట్టుకొస్తున్న ఛానళ్ల వల్ల ఉద్యోగావకాశాల రేటు పెరిగిందనే చెప్పాలి. అంతేకాక ఛానల్‌లో యాంకర్, రిపోర్టర్, రీడర్ వంటి వగైరా పాత్రల్లో స్పెషాలిటీని చూపగలిగితే ఆఫర్లతో వారిని లాక్కునే అవకాశాలు కూడా లేకపోలేదు. పెరుగుతున్న ఛానళ్లు ఎంతవరకు ఉపయోగకరం అనేది ప్రేక్షకుడి రిమోట్ చెబుతుంది.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment