Tuesday, May 10, 2011

జీటీవీలో వినోద ప్రభంజనం

ఒకేరోజు ముచ్చటగా మూడు సరికొత్త కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది జీ తెలుగు. మే 9 సా-6.30 గంటలకు ప్రసారమైన ‘కలవారి కోడళ్లు’ మెగా సీరియల్‌లో - అత్తగారి దర్పానికి దర్పణంగా, అహంకారాన్ని అలంకారంగా చేసుకున్న కోటీశ్వరురాలైన జగదీశ్వరికి అణకువ కలిగి అణిగిమణిగి ఉండే కోడలు తన కనుసన్నలలో నిలవాలన్న కోరిక. అందుకు తగ్గట్టే తన కొడుకు శ్రీరామ్‌కి ఓ మధ్యతరగతిలో పుట్టిన రేఖతో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది. అయితే, రేఖకి తలపొగరు అని గ్రహించి ఆమె సోదరి, అమాయకురాలైన లేఖని కోడలుగా తెచ్చుకుంటుంది. మొదట్లో జగదీశ్వరి దర్పాన్ని చూసి ఏవగించుకున్న రేఖ ఆ తర్వాత లేఖని చూసి అసూయ పడుతుంది. తల్లిదండ్రులతో కలిసి లేఖ అన్యాయం చేసిందని భావిస్తుంది. ఆ జమీందారీ కుటుంబానికి తనూ కోడలుగా వెళ్లాలని ఎత్తులు వేస్తుంది. రేఖ పథకాల్లో ఆమె సోదరి లేఖ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది? జగదీశ్వరీ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంది? అన్నది ప్రధాన కథాంశం.

రా.9.00 గంటలకు ‘కన్యాదానం’ మరో మెగా సీరియల్ కథాంశం. మగువ జీవితంలో మధురమైన స్మృతిగా మిగిలిపోయే కన్యాదానానికి పురాణకాలం నుంచే ఎంతో ప్రత్యేకత, ప్రాధాన్యత ఉన్నాయి. ఆడపిల్ల కలిగిన తల్లిదండ్రులు ఆ కన్యాదాన ఘట్టం కోసం, అపూర్వమైన ఆ ఘడియల కోసం ఆశగా, ఆతృతగా ఎదురు చూస్తూంటారు. తమ కూతురిని లక్ష్మీదేవిగా, కాబోయే అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి ఆమెని అతడికి అప్పగించే మహోన్నతమైన ఘట్టం ‘కన్యాదానం’.
 
ఇక - రా.9.30 సోమ, మంగళ వారాల్లో టాలెంట్‌తో ప్రేక్షకులను మైమరపింపచేయడానికి ‘అద్భుతం మల్టీ టాలెంట్ రియాలిటీ షో’. హీరోగా, కేరెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు చిరపరిచితులైన యాక్షన్ హీరో భానుచందర్ ‘అద్భుతం’ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. జీ తెలుగు ‘ఆట’ కార్యక్రమంతో ప్రేక్షకుల మన్ననలు పొందిన శ్రీవిద్య ఈ కార్యక్రమంతో మరోసారి మెంటర్‌గా ముందుకు రాబోతోంది.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment