Tuesday, May 10, 2011

సొంత డబ్బా కొంత మానుకుంటే...

ప్రసిద్ధ నటుల పార్ట్‌టైమ్ వ్యాపకం టీవీ షోలకి వ్యాఖ్యాతలుగా ఉండడం కూడా అని మరోసారి ప్రముఖ గుణ చిత్రనటుడు (కేరెక్టర్ ఆర్టిస్టు) ప్రకాష్‌రాజ్ ‘ఇట్స్ మై షో’ (మాటీవీలో సోమ, మంగళ వారాల్లో రాత్రి 9 గంటలకు వస్తున్నది) ద్వారా విశదమైంది. తన ఇమేజ్‌కి తగ్గట్లే ప్రకాష్‌రాజ్ తన షోను చాకచక్యంగా నిర్వహించడానికే ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఉన్న గంట సమయం మరింతగా సద్వినియోగమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదో వైవిధ్యం..
సాధారణంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకి పాల్గొనే అభ్యర్థి సమాధానం చెప్పడం జరుగుతుంది. వారు చెప్పలేకపోతే, షోలో ఉండే ముఖ్య అతిథులు సమాధానం చెప్పడం లేదా మరొక స్నేహితుని సహకారం తీసుకోవడం గతంలో అమితాబ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణకు నోచుకున్న ‘కౌన్ బనేగా..’ నుంచి చూస్తున్న విషయమే. కానీ ఇందులో అడిగిన ప్రశ్నలకి సమాధానాలు షోలో అభ్యర్థులెంచుకున్న ముఖ్య అతిథుల్లోని ఒకరు సమాధానాలిస్తారు. దానిని క్యాండిడేట్స్ ఒప్పుకోవడమో లేదా తప్పులో చెప్పాలి. రైటైన సమాధానం చెప్పాలి. ఇది ట్రెండ్‌లో కొంత వెరైటీయే. అయితే దీన్లో అంతర్లీనంగా దాగి వున్న సంగతేమిటంటే ఒక ప్రశ్నకు సమాధానం మనకి కచ్చితంగా తెలిస్తేనే గానీ, సదరు ప్రముఖుడు చెప్పింది తప్పో, ఒప్పో తెలుస్తుంది. అంటే అడిగిన ప్రశ్నకి ఏదో గెస్సింగ్ విధానంలో కాక ప్రాథమిక అవగాహన వుంటే కానీ ముందుకు వెళ్లలేం. ఆ రకంగా పాల్గొనబోయే అభ్యర్థులు కొంత కసరత్తు ముందుగా చేయాల్సి ఉంటుంది.

సినిమాల ప్రశ్నలకే మొగ్గా?
సరే.. ప్రశ్నలంటే అన్ని విభాగాలకు చెందిన ప్రశ్నలుండాలన్న ఆకాంక్ష జనరల్ వీక్షకులకున్నా, సినిమాకు చెందిన ప్రశ్నలే అధికంగా ఇప్పుడొచ్చే టీవీ షోల్లో వున్నట్లే ఇందులోనూ ఉన్నాయి. ‘కృష్ణ, రజనీకాంత్ కలిసి నటించిన చిత్రం పేరు’ ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి’ చిత్ర నిర్మాత ఎవరు?’ ‘మణిరత్నం దర్శకత్వంలో తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం?’ ఇలా ఇలా ఈ కోవలో సాగుతుంది. అయితే ఇందులోనూ కాస్త వెసులుబాటు కావాలంటూ పాల్గొన్న ఓ అభ్యర్థిని అడగడం గమనార్హం. అదెలాగంటే ‘జగదీకవీరుడు - అతిలోక వీరుడు’ చిత్ర నిర్మాత పేరు చెప్పమని కార్యక్రమ నిర్వాహకుడు ప్రకాష్‌రాజ్ అడిగితే - ‘అదేమిటండీ అందులో హీరో హీరోయిన్ల పేరు చెప్పమంటే ఓకే గానీ అలా నిర్మాత పేరడిగితే ఎలా?’ అంటూ క్యాండిడేట్ అడిగారు. దీన్నిబట్టి ప్రశ్నలకు ఎలాంటి ఫోకస్‌ను ఆశిస్తున్నారో తెలుస్తోంది. కానీ విషయ విస్తరణకు అన్ని కోణాలూ స్పృశించడం అవసరమని షో గుర్తించడం అభినందనీయం.

ఒక సెలబ్రిటీకే డిమాండా?
సెలబ్రిటీ (ప్రముఖ వ్యక్తి (ముఖ్య అతిథి)లను నిర్ణయించుకోడం తదితరాలు షో నిర్వాహకులు అప్పటి సమయంలో వారి అందుబాటుతనం వగైరాలపై ఆధారపడినా రప్పించే ఇద్దరూ ప్రజాకర్షణలో దగ్గర దగ్గరగా వుండే వారినే ఎంచుకుంటే బావుంటుంది. ఉదాహరణకు మే 2,3 తేదీల్లో ఇలా అభ్యర్థులను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి వారెంచుకునే అతిథులుగా దర్శకుడు శేఖర్ కమ్ముల, మరో రంగంలో నిష్ణాతుడైన ఇంకో వ్యక్తినీ ప్రవేశపెట్టారు. ఇలాంటి సందర్భాలలో పాల్గొనే కేండిడేట్స్ అందరూ సహజంగా శేఖర్ కమ్ములనే తమకు సమాధానాలు చెప్పే అతిథిగా ఎంచుకుంటారు. ఇందులోనూ అదే జరిగింది. ఈ డిమాండు చూసే ప్రకాష్‌రాజ్ ‘శేఖర్‌కి చాలా డిమాండుంది’ అంటూ ఓ చమత్కార వ్యాఖ్య చేశారు. వాస్తవానికి శేఖర్‌తోపాటు పాల్గొన్న మరో వ్యక్తీ సినీ రంగంలో కాకపోయినా వారు కృషి చేసిన సంబంధిత రంగంలో ఎన్నతగిన ప్రమాణాలు అందుకున్నవారే. కానీ సినీ రంగం పట్ల ఉన్న గ్లామర్ వల్ల ఇది సంభవించింది.

అనుభవాల వివరణా ఓకె!
ఏ కార్యక్రమానికైనా ఇలా సెలబ్రిటీల్ని తీసుకురావడం, ప్రముఖుల్ని వ్యాఖ్యతలుగా వ్యవహరింపజేయడంలో ఆంతర్యం స్థూలంగా ఒకటే. అది వారికుండే అపార అనుభవంలో ఎదుర్కొన్న ఆణిముత్యాల్లాంటి సంఘటనల సారాన్ని తెలియజేస్తారనే. అదే పరంపరనీ ఇందులో శేఖర్ కమ్ముల, ప్రకాష్‌రాజ్ కొనసాగించారు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ తాను కాలేజీలో చదువుతున్నప్పుడు తాను లేందే నాటకం జరగదన్న అభిప్రాయంతో ఉంటే, అది తప్పు, ఈ ప్రపంచంలో ఎవరున్నా ఎవరు లేకున్నా జరిగేవి, జరుగుతూనే ఉంటాయి అని తెలియపర్చిన వారి లెక్చరర్ ఉదంతాన్ని చెప్పారు. దీనివల్ల ‘మనమే అందరికన్నా అధికులం..’ అన్న భావం వుండకూడదన్న సంగతి తెలుపుతోంది.

ఇవి అవసరమా?
ఇక తప్పనిసరిగా పరిహరించాల్సిన అంశాలు ఇందులో కొన్ని ఉన్నాయి. ప్రకాష్‌రాజ్ ఇప్పటికే తెలుగు, తమిళ తదితర భాషా చిత్రాల ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు. అలాంటి నటుడ్ని ప్రత్యేకంగా, ఇదీ తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొన్న అభ్యర్థి, అభ్యర్థినుల ద్వారా ప్రశంసింపజేయడం (ఆస్కార్‌కి ఆస్కారమున్న వ్యక్తివి నీవు అంటూ ఒకరు, మరొకరు ప్రకాష్‌రాజ్ నటించిన చిత్రాల కూర్పుతో పొగడ్తల జల్లు కురిపించారు) ఎంతవరకూ అవసరం? కనక ఇలాంటివి తప్పక పరిహరింపజేయాలి. అలాగే ఇంకో అభ్యర్థి, ప్రకాష్‌రాజ్ ద్వారా బహుమానం అందుకుంటూ ఇలా నేనో ప్రొడ్యూసర్ ద్వారా (ప్రకాష్‌రాజ్ తెలుగులో ఇటీవల నాగార్జున నాయకుడిగా వచ్చిన ‘గగనం’ తమిళ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు) అందుకోవడం ఆనందంగా ఉందంటాడు. ఇవన్నీ కార్యక్రమ నిర్దేశిత లక్ష్యానికి సంబంధించినవి కావు. ప్రశ్నల విభాగాల విస్తరణతోనూ, అనవసరపు అంశాల ప్రస్తావన తగ్గించడం ద్వారానూ ‘ఇట్స్ మై షో’ను అందరి షోగానూ మార్చవచ్చు.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment