Monday, May 30, 2011

వన్నె తగ్గిన ఐపిఎల్‌

  • పడిపోయిన టివి రేటింగ్‌
  • మితిమీరిన షెడ్యూల్‌ ఆటగాళ్ల అలసట
అంతర్జాతీయ క్రికెట్‌ స్టార్‌ ఆటగాళ్ళు, బాలీవుడ్‌ గ్లామర్‌ కలగలసి అభిమానులకు కనువిందు చేస్తూ భారత మార్కెట్‌ను ప్రభావితం చేస్తూ 2008లో ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) టి20 ఫార్మాట్‌కు ఈ సంవత్సరం వన్నె తగ్గింది. టివి రేటింగ్స్‌ గత సంవత్సరం కంటే దారుణంగా పడిపోయాయి. ప్రపంచకప్‌ ముగిసిన ఆరు రోజులకే ఈ టోర్నమెంట్‌ ప్రారంభం కావడం కూడా దీనికి కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మితి మీరిన షెడ్యూల్‌ వల్ల అటు క్రికెటర్లకు, ఇటు అభిమానులకు ఆసక్తి తగ్గినట్లయిందని చెపుతున్నారు. లీగ్‌ మ్యాచ్‌లతో కలిపి, ఈ టోర్నీలో శనివారం నాడు జరగనున్న ఫైనల్‌తో మొత్తం 74 మ్యాచ్‌లు అవుతాయి. ఐపిఎల్‌ బ్రాండ్‌ విలువ గత సంవత్సరం కంటే 11 శాతం తగ్గిందని ఇటీవల దీనిపై అధ్యయం నిర్వహించిన బ్రిటన్‌ కన్సల్టెన్సీ బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ పేర్కొంది. గత సంవత్సరం ఐపిఎల్‌ బ్రాండ్‌ విలువ 413 కోట్ల డాలర్లు కాగా ఈ సంవత్సరం 367 కోట్ల డాలర్లు మాత్రమే. టోర్నీలో మొదటి 26 మ్యాచ్‌లకు టివి వీక్షకుల సంఖ్య 22 శాతం తగ్గిందని టిఎఎం మీడియా పరిశోధనలో వెల్లడైంది. ఏప్రిల్‌ 2న భారత్‌ విశ్వవిజేతగా ఆవిర్భవించడంతో దేశవ్యాప్తంగా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. వెంటనే ఐపిఎల్‌ టోర్నీ ప్రారంభం కావడంతో టివి రేటింగ్‌ పడిపోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచకప్‌లో రాణించిన యువరాజ్‌సింగ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఐపిఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అలసటే కారణమని అంటున్నారు. ఈ రేటింగ్స్‌పై అధికారికంగా ఎలాంటి వివరణలు వెలువడకపోయినా చాలా స్టేడియాల్లో టికెట్లు పూర్తిగా అమ్ముడవడం లేదని తెలుస్తోంది. మ్యాచ్‌ల సందర్భంగా ప్రేక్షకులు లేక స్టేడియాలు వెల వెల బోతున్నాయి. ఈ సంవత్సరం టోర్నీలో రెండు కొత్త జట్లను తీసుకోవడంతో మ్యాచ్‌లు పెరగడం కూడా అనాసక్తికి కారణమని తెలుస్తోంది. 'క్రికెట్‌ షెడ్యూల్‌ మితిమీరింది.' అని ముంబయికి చెందిన కార్నర్‌స్టోన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బంటి సాజ్ధే వ్యాఖ్యానించారు.

Source: www.prajasakti.com

No comments:

Post a Comment